Friday, September 26, 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
           *ఆలోచనల ప్రవాహం*

*సృష్టిలో మనిషి ప్రత్యేకమే కాదు సర్వోన్నతుడు కూడా. సహనం, ధైర్యం, తేరుకునే గుణం లాంటి వాటితో ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కోగల సామర్థ్యం మనిషి సొంతం. దానికి కారణం- అతడి ఆలోచనాశక్తి.*

*ఆలోచన, మాట, పని- ఈ మూడింటిలో ఆలోచన మహా శక్తిమంతమైంది. మిగతా రెండింటికన్నా ముందు పుడుతుంది. దానివల్ల విజయం రెండుసార్లు ప్రాప్తిస్తుంది. మనసులో ఒకసారి, వాస్తవంలో మరోసారి. ఆలోచన ఎవరి మనసులో పుట్టిందనేది ముఖ్యం కాదు. దాని శక్తి లక్ష్యాన్ని వెతుకుతుంది. అందుకే మనం ఆవాహనకు అంత ప్రాధాన్యం ఇస్తాం. ఏదైనా సంకల్పించే ముందు దైవం ఆశీర్వాదాలు కోరుకుంటాం. సానుకూలమైన ఆలోచనలు సంక్షేమానికి, విజయానికి అవసరమైన శక్తినిస్తాయి. ఒత్తిళ్లను తగ్గిస్తాయి. మంచి హార్మోన్లను విడుదల చేసి శారీరక, మానసిక* *ఆరోగ్యాలకు దోహదం చేస్తాయి. ప్రతికూలమైన ఆలోచనలు అనారోగ్యంపాలు చేస్తాయని శాస్త్రీయంగా రుజువైంది. అందుకే, గొప్పగా ఆలోచించాలి. పెద్ద పెద్ద కలలు కనాలని పిల్లలను ప్రోత్సహించాలి. ఉన్నత లక్ష్యాలను వారి మనసులో నాటాలి.*

*మన చర్యలు, భావాలు, ప్రవర్తన... అన్నింటినీ నియంత్రించేది మనసని చెబుతుంది గీత. కాస్త తీరిగ్గా కూర్చున్నప్పుడు చుట్టూ కనిపించే వస్తువుల గురించి, వ్యక్తుల గురించి ఆలోచిస్తాం. ఒక్కోసారి ఆ ఆలోచనలు మన లోలోపలికి కూడా వెళ్తాయి. మనల్ని మనం తెలుసుకోవడానికి కూడా కారణమవుతాయి. కొత్త ఆలోచనలు సమాజాన్ని కొత్త కోణంలో చూసేలా చేస్తాయి, మనదైన గుర్తింపునిస్తాయి.*

*సంకల్పం అంటే... కోరుకున్నది సాధించే వరకూ ఆ ఆలోచనను మనసులోంచి పోనివ్వకుండా చూసుకోవడం. ఆలోచనల నాణ్యత జీవిత నాణ్యతను నిర్ణయిస్తుంది. సానుకూలంగా ఆలోచించే వ్యక్తులు చుట్టూ ఉంటే మన ఆలోచనలు మరింత సానుకూలంగా మారతాయి. కైకేయికి నిజానికి భరతుడికన్నా రాముడంటేనే ఎక్కువ ప్రేమ. కానీ కాసేపు మంధర మాటలు విన్న ఫలితం- ఆమె మనసు మారిపోయింది. రాముణ్ని భరతుడికి ప్రత్యర్థిగా భావించింది. కఠినమైన నిర్ణయాలు తీసేసుకుంది. హృదయానికి అనేక ముఖద్వారాలుంటాయి. ఏ పక్కనుంచి ఏ భావం లోనికి ప్రసరిస్తుందో కనిపెట్టుకోవాల్సిందీ మనమే. శకుని సాహచర్యం దుర్యోధనుడి పతనానికి కారణమైతే, శ్రీకృష్ణుడి స్నేహం అర్జునుణ్ని విజేతను చేసింది. మనకూ రకరకాల మనుషులు తారసపడతారు. ఎవరితో కొనసాగాలన్న నిర్ణయం మన చేతిలోనే ఉంటుంది. ముఖ్యంగా జీవితం సందిగ్ధంలో పడిన ప్రతిసారీ చుట్టుపక్కల ఉండాల్సినవారిని జాగ్రత్తగా ఎంచుకోవాలి. మంచి మాటలతో చేయూతనిచ్చి పైకి లాగుతారా, నీరసపు మాటలు చెప్పి మరింత కిందికి నెడతారా అన్నది వారిమీదే ఆధారపడి ఉంటుంది.*

*ఎలాంటి ఆలోచనలూ లేకుండా మనసు ఖాళీగా ఉండటమనేది జరగదు. దాని మానాన దాన్ని వదిలేయకుండా వరద నీటిని కాలువలోకి మళ్లించినట్లు ఆలోచనల ప్రవాహాన్ని మనకు అవసరమైన విషయం మీద కేంద్రీకరించేలా మళ్లించాలి. అప్పుడే ఆలోచనలు ఆచరణాత్మకం అవుతాయి. జీవితాన్ని అర్థవంతం చేస్తాయి.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినోభవంతు🙏*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴

No comments:

Post a Comment