*Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!*
*ప్రియమైన భారతదేశ ప్రవాసి పాఠక భక్తులారా,*
*సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం...*
*సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 14వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.*
*ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, యావత్ భారత దేశ ప్రవాసి* *Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.*
*🌸|| ఓం వ్యాసదేవాయ నమః ||🌸*
*పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో*
*🌹శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి🌹*
14. *ఓం పరమ ధర్మ స్వరూపిణ్యై నమః*
*అర్థం: పరమ ధర్మం అంటే సర్వ శ్రేష్ఠమైన ధర్మం. ‘ధరతి విశ్వమితి ధర్మః’. జగత్తును ధరించేది ధర్మమే. అనగా ధర్మంపైనే జగత్తు ఆధారపడి ఉంది. మహాభారతంలో యక్ష ప్రశ్నల సందర్భంలో ధర్మరాజు యక్షుడితో ఇలా చెపుతాడు.*
*ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః ।*
- *మహాభారతము, వనపర్వము, అ-313, శ్లో-128*
*ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది. ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది.*
*అర్థం: సత్యం, అహింస, శుచిత్వం మొదలైన బాహ్య ధర్మాలెన్నో గీతామాత మనకు నేర్పిస్తుంది. అంతకు మించి స్వధర్మాచరణ గూర్చి తెలియజేస్తుంది. స్వధర్మం అంటే ఆత్మధర్మం. ఆత్మ స్వరూపునిగా నన్ను నేను స్థిరపరచుకోవటమే ఆత్మధర్మం. అది ఎన్నటికీ మారని పరమ ధర్మం. కనుకనే అర్జునుడు పరమాత్మను ‘త్వమవ్యయ శ్శాశ్వత ధర్మ గోప్తా’ (నీవు నిత్యుడవు, శాశ్వతమైన ధర్మమును కాపాడువాడవు) అని విశ్వరూప సందర్శన యోగంలో వర్ణించాడు. ‘నేను తెలిపిన ఈ ధర్మ స్వరూపమైన అమృతాన్ని ఎవరు సేవిస్తున్నారో వారు నాకు అత్యంత ప్రియులు’ అని భగవాన్ ఉవాచ. అది గీతామృతమే కదా!*
*ఇంతటి పరమధర్మ స్వరూపిణి అయిన నా తల్లి గీతామాతకు ఆచరణభావంతో కైమోడ్పు చేస్తున్నాను.*
*ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం గీతామాతను గుర్తు చేసుకొంటూ, ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించిన సాక్షాత్తు విష్ణు స్వరూపులైన వ్యాసదేవులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.*
*మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ*
*📿🌹|| జై గురుదేవ్ ||🌹📿*
🌺🍁🌺 🙏🕉️🙏 🌺🍁🌺
No comments:
Post a Comment