Thursday, April 2, 2020

శ్రీరామచంద్రుడు అంటున్నాం కదా? రాముణ్ణి చంద్రుడితో పోల్చడం ఎందుకు?

ధర్మసందేహం - సమాధానం

సందేహం;- శ్రీరామచంద్రుడు అంటున్నాం కదా? రాముణ్ణి చంద్రుడితో పోల్చడం ఎందుకు?

సమాధానం;- చంద్రుడంత అందంగా ఉన్నాడని కానీ, లేదా చంద్రుడిలా చల్లని గుణాలు కలవాడని గాని రాముణ్ణి చంద్రుడితో పోల్చిఉండవచ్చు. చంద్రుడికి పదహారు కళలుంటాయని పెద్దలు చెప్పారు. అలాగే శ్రీరాముడికి కూడా పదహారు గుణాలుంటాయని నారదుడు వాల్మీకి మహర్షికి చెప్పాడు. అందుకే రాముడు శ్రీరామచంద్రుడయ్యాడు.

ఈ లోకంలో నరుడిగా నడయాడుతున్న దైవం ఎవరు? అని వాల్మీకి ప్రశ్న. పదహారు గుణాలు కలిగిన ఆ ఉత్తమ నరుడు శ్రీరామచంద్రుడే అని నారద మహర్షి సమాధానం. ఈ లోకంలో ఇప్పుడు గుణవంతుడెవడు అని వాల్మీకి ప్రశ్న. పదహారు గుణాలలో గుణం అని చెప్పదగిన గుణం సౌశీల్యం మహతః మందై స్సహనీరంధ్రేణ సంశ్లేషః సౌశీల్యం అని దాని నిర్వచనం. జాతిచేత, విద్యచేత, ఐశ్వర్యంచేత చాలా గొప్పవాడైనా, తనకంటే తక్కువ వారితో అరమరికలు లేక కలిసి ఉండడమే సౌశీల్యం.

రాముని మిత్రులు ముగ్గురు గుహుడు, సుగ్రీవుడు, విభీషణుడు. ఒకడు పడవలు నడుపుకొను పల్లెవాడు. రెండవవాడు వానరుడు. మూడవవాడు రాక్షసుడు. ఉత్తమ నరునికి ఉండవలసిన గుణం వీర్యం. మనసులో వికారం (మార్పు) కలగడానికి కారణాలెన్ని ఉన్నా చలించకపోవడం వీర్యం. అలాగే ఉత్తమ మానవుడు ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యసంధుడు, దృఢవ్రతుడు అనగా స్థిర సంకల్పం కలవాడు, మంచి చారిత్రం (నడవడి) గలవాడు, సర్వప్రాణుల హితాన్ని కోరేవాడు, జ్ఞానం కలవాడు, సామర్ధ్యం కలవాడు, సదైక ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు అంటే ధైర్యము, వ్యక్తిత్వము గలవాడు, జిత క్రోధుడు అంటే కోపాన్ని జయించి (నిగ్రహించి) తన వశంలో ఉంచుకొనేవాడు, ద్యుతిమంతుడు అంటే తాను వెలుగుతూ, ఇతరులకు వెలుగునిచ్చేవాడు, అసూయ లేనివాడు, యుద్దంలో దేవతలనైనా జయించగలవాడు అయి ఉండాలి.

ఈ షోడశగుణ, కళాప్రపూర్ణుడే శ్రీరామచంద్రుడు.

జైశ్రీరామ్

No comments:

Post a Comment