🙏🏻 ఓం నమో భగవతే శ్రీ రమణాయ 🙏🏻
🙏🏻భగవాన్ శ్రీరమణుల జయంతి🙏🏻
నీ గురించి నీకు తెలిస్తే నువ్వు జ్ఞానివే…
నాకు జ్ఞానోదయం కావాలి స్వామీ! నేను అజ్ఞానిని’ అని ఓ భక్తుడు రమణుల్ని ఆశ్రయించాడు. ‘నువ్వు అజ్ఞానివా, ఆ విషయం నీకు నిజంగా తెలుసా?’ అని రమణులు అతణ్ని ప్రశ్నించారు. ‘తెలుసు స్వామీ! నేను పరమ అజ్ఞానిని’ అన్నాడు భక్తుడు. ‘నీ గురించి నీకు తెలిసింది కదా! నువ్వు జ్ఞానివే. ఇక నీకు నాతో పని లేదు’ అన్నారు మహర్షి. ‘ ఆత్మ విచారం ద్వారా ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి. జీవన్ముక్తి అంటే జీవితం నుంచి ముక్తులు అని కాదు. ఈ జీవితంలోనే ముక్తిని పొందాలి. ముక్తి అంటే మరణానంతరం పొందేది కాదు. పరంజ్యోతి గుండె గూటిలో ప్రకాశిస్తున్నప్పుడు ఆ వెలుగులో నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి. నీ లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకోవాలి’ అని రమణులు సూచించారు.
మన భారతదేశం ఆధ్యాత్మికంగా ప్రపంచానికే తలమానికం. మన మహర్షులు సూక్ష్మంగానూ, స్థూలంగానూ, జన్మరాహిత్యాన్ని పొందే ముక్తి మార్గం చూపే దీపస్థoభాల వంటివారు. మానవులు పూర్వజన్మల పుణ్య చారిత్రకత వల్ల అటువంటి మునుల శిష్యులై ఆదర్శవంతంగా జీవించి మార్గదర్శకులైనారు. భారతదేశ చరిత్రలో 20వ శతాబ్దంలో కూడా ప్రపంచ ఖ్యాతిని పొందిన వారిలో భగవాన్ రమణ మహర్షి. ఒక సామాన్య మానవుడిగానే తనంత తాను ప్రకటితమవుతూ ఎందరికో మార్గదర్శకులైన రమణ మహర్షి వంటివారు యావత్ భారతావనిలో అత్యంత అరుదు. తోటి భక్తులకు మాత్రం చాలా చిత్రంగా ఆయన గొప్పయోగిలానే కనిపించే వారు.
దేవుడంటే నమ్మకం లేని అనేకమంది సైతం రమణులను, వారి తత్వాన్ని, తాను పాటించిన జీవితపు విలువలను ఇష్టపడి ఆరాధించడం మొదలుపెట్టారు. చాదస్తపు భావాలు, మూర్ఖ భక్తిని ఆయన స్పష్టంగా వ్యతిరేకించారు. మౌనాన్నే ఎక్కువగా ఆశ్రయించే వారు. చాలా ఆశ్చర్యకరంగా అనేకమంది దృష్టిలో ఆయన ‘దేవుడ’య్యారు. వారి శిష్యులు సూరి నాగమ్మ, సుందరం (సాధు త్రివేణిగిరి) వంటి ఎందరికో రమణులు సాక్షాత్ భగవత్ అవతారంగానే దర్శనమిచ్చారు. లేకపోతే, మనలాంటి సామాన్య మానవుడే తానైతే, అంతటి కఠోరనిష్ఠతో కూడిన జీవితం వారికెలా సాధ్యమవుతుంది.
భగవాన్ శ్రీరమణులు తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలోని తిరుచ్చుళిలో 1879 డిశంబరు 30వ తేదీ ‘ఆరుద్ర దర్శనం (పునర్వసు నక్షత్రం) ‘ నాడు అళగమ్మాళ్, సుందరేశం అయ్యర్లు దంపతులకు జన్మించారు. తల్లి తండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్. భక్తులు భగవాన్ అని కూడా సంభోదిస్తారు. వీరికి ఇద్దరు సోదరులు (నాగస్వామి, నాగ సుందరం) ఒక సోదరి (అలమేలు). సుందరేశ అయ్యర్ అక్కడ ప్లీడరుగా గా పనిచేసేవారు. 16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానం పొంది తిరువణ్ణామలైలోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డారు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిననూ మోక్షజ్ఞానం పొందిన తరువాత తనను “అతియాశ్రమి”గా ప్రకటించుకున్నారు. అరుణాచలేశ్వరుడిపై అమితమైన వ్యాకులతే వెంకటరామన్ అనే పదహారేళ్ల కుర్రాడిని అరుణాచలానికి రప్పించింది. రమణమహర్షిగా మార్చేసింది. పదహారేళ్ల వయసులో అరుణాచలం అన్న పేరు చెవిన పడగానే వెంకటరామన్ మనసులో ఏదో స్ఫురించింది. తనకి, ఆ అరుణగిరికి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లు అనిపించింది. అతని అంతరంగమంతా ఆ పేరే ఆవరించింది. ‘అరుణాచలం’, ‘అరుణాచలం’, ‘అరుణాచలం’ అన్న నామమే అంతర్ధ్వనిగా ప్రతిధ్వనించసాగింది. ఆ తపనతోనే అరుణాచలం వెళ్లిపోయారు. అరుణాచలం ఆలయంలోకి అడుగుపెట్టగానే, పరుగెత్తుకొని వెళ్లి.. ఆ స్వయంభూలింగాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆనంద పారవశ్యంతో కన్నీటి పర్యంతం అయ్యారు.
తమ 16వ ఏట ఆయన అపూర్వానుభవం పొందారు. ఇంట్లో తానొక్కడే ఉన్న సమయంలో, తను చనిపోతున్నాననే భయంతో మనస్సు అంతర్ముఖమైనపుడు, దేహానికి చావు ఉంటుంది కానీ, నేను దేహాతీతమైన ఆత్మని, ఆ ఆత్మకు చావు లేదనే’ స్ఫురణ కలిగింది వారికి. బహుశా, పెరియపురాణం’ (శివయోగుల చరిత్ర) చదవడం వల్లనో, లేక ఇంటికి వచ్చే సాధువుల ద్వారానో, వారు అరుణాచలం, శ్రీ అరుణాచలేశ్వరుడు గురించి తెలుసుకున్నారు. మనసు అయస్కాంత శక్తి లాగా ఆయనను అరుణాచలం వైపు లాగింది. అద్భుతమైన అత్మజ్ఞానం కలగడం కూడా తోడై, ఆ 16సం. బాలుడు ఇల్లు విడిచి, బహు కష్టపడి పట్టుదలతో తిరువణామలై చేరారు. అప్పటినుండి తన గురించి చెప్పేటప్పుడు ఇది’ అనే పదం శరీరానికి వాడేవారు. ఆ క్షణం నుంచి ఆయనకు గురువైనా, తండ్రైనా శ్రీ అరుణాచలేశ్వరుడే అన్నీ.
రమణ మహర్షి జీవితం పూర్తిగా తెరిచిన పుస్తకం. భారతీయ ధార్మికబద్ధమైన జీవన విధానాన్నే వారు అవలంభించారు. పదిహేనేండ్ల వయసు నుంచి అయిదు దశాబ్దాలకు పైగా కాలాన్ని (తాను తనువు చాలించే దాకా) అత్యంత నిరాడంబరంగా, లౌకిక సౌకర్యాలు, భౌతిక సుఖాలకు అన్నింటికీ అతీతంగానే గడిపారు. మానవత్వానికి, ఆత్మాన్వేషణా తత్వానికే వారు పూర్తిగా, ప్రగాఢంగా అంకితమైనారు. చిన్నతనంలోనే మానవ జీవిత పరమార్థాన్ని గ్రహించగలిగారు. తినే తిండి నుంచి కట్టుకొనే బట్టలదాకా అతి సామాన్యతనే పాటించారు. పదహారేళ్ల వయసులోనే మృత్యువు చేరువకు వెళ్లారు. కేవలం కొద్ది వారాలపాటు దైవసన్నిధిలో గడిపి, తనను తానే మరిచిపోయేంత దీర్ఘ సమాధి స్థితికి చేరుకొన్నారు. అప్పుడే యోగ జ్ఞాన సాధనకు కావలసిన పునాది పడింది.
భగవాన్ రమణ మహర్షి తన మాతృ మూర్తి అళగమ్మాళ్ తో
ఆలయంలో శివదర్శనం అనంతరం ఆ బాలుడు, తన శరీరంపై వస్త్రాలు, వస్తువులు విసర్జించి, కౌపీనధారియై, ఆలయ వెనుకభాగంలో నిశ్చలంగా కూర్చుని తపస్సు చేసాడు. చుట్టుపక్కల సందడి కోలాహలం వద్దని, ఆలయ పరిసరాలలోని పాతాళలింగం వద్దకు చేరి ఎన్నో నెలలు సమాధి స్థితిలో ఉండిపోయారు. జుట్టు అట్టలు కట్టి, తొడలు పురుగులు కీటకాలు కోరికివేయడంతో రక్తం గడ్డకట్టేసినా, స్వామికి ఇవేమీ తెలియలేదు. కొందరు భక్తులు ఆయనను ఆ స్థితిలో చూసి, అక్కడినుంచి బయటకు చేర్చి, స్నానపానాలు అమర్చారు. అప్పటినుంచీ గురుమూర్తమ’నే మఠంలో అయన ఉండగా, ఉద్దండ నాయనార్, అన్నామలై తంబిరాన్ అనే సాధువులు సంరక్షించారు.
తరువాత అరుణాచలం కొండపైనున్న పవళకుండ్రు’కి బస మార్చారు. తల్లికి సంగతి తెలిసి తీసుకెళ్ళడానికి వస్తే ఏది ఎలా జరగాలో అట్లా జరుగుతుంది’ అని వ్రాసి ఇచ్చారు ఆ మౌనస్వామి. 1899లో అనుచరుడైన పళనిస్వామితో విరూపాక్ష గుహకి మారారు. పాటవం కలిగిన వారి మౌనోపదేశమే వచ్చేవారికి ప్రయోజనకారి అయింది. ఆ తరువాతి కాలంలో ఆయన, ఒక భక్తుని విన్నపం మీద అరుణాచలేశ్వరునికి ఐదు స్తోత్రాలు’ కృతిగానం చేసారు. అవి అక్షర మణిమలై, నవ మణిమలై, అరుణాచల పటికం, అరుణాచల అష్టకం, అరుణాచల పంచరత్న’. శ్రీ రమణ మహర్షి వాక్కులు, ప్రసంగాల గురించి భక్తులు వ్రాసిన మరెన్నో గ్రంథాలు ఉన్నాయి.
ఒక ఆధునిక ఋషికి ఉండవలసిన లక్షణాలన్నింటినీ రమణ మహర్షి పుణికి పుచ్చుకొన్నారు. వ్యక్తిగత జీవితంలో ఎంతగా వేదాంతనిష్ఠను పాటించారో అంతేస్థాయిలో నిర్మల, నిశ్చలమైన ఆత్మాన్వేషణా మార్గంలోనే వారు జీవిత పర్యంతం కొనసాగారు. ఆయన స్థిత ప్రజ్ఞత ఆశ్రమంలోని భక్తులందరికీ తెలిసిందే. అనేకమంది కళ్ళారా చూసినవారే. ఐతే, ‘దేవుడి’లా తానెప్పుడూ అద్భుతాలు చేయలేదు. అసలు తనను దేవుడిలా చూడవద్దని ఆయన అనేకమందికి ఆయా సందర్భాలలో కరాఖండిగా చెప్పేసినట్లు ఆయా రచనలు చదివితే అర్థమవుతుంది.
కనిపించేదంతా భగవత్ స్వరూపమే అయినప్పుడు అంతటిపై భక్తి ఉండాల్సిందే… సాటి మనుషులైనా, సర్వ ప్రాణులైనా… అన్నీ ఆత్మ స్వరూపాలే… నీలో ఉన్నదే ఆ జీవుల్లోనూ ఉంది. అందుకే నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావో, అన్నిటినీ అలాగే ప్రేమించాలి. పూజించాలి. ఇదే రమణులు చెప్పిన భక్తి తత్త్వం. ఆయన దైవానికి, భక్తికి ఇచ్చిన నిర్వచనాలు ఆసక్తికరం, అనుసరణీయం ఆ విషయాలను ఆయన అనుభవ పూర్వకంగా వివరించారు…‘భక్తి లేకుండా జ్ఞానం కలగడం అసంభవం. పరిపూర్ణమైన .భక్తి పరమజ్ఞానంతో ముగుస్తుంది. రమణ మహర్షి బోధనలలో ప్రధానమైంది “మౌనం” లేదా “మౌనముద్ర”. శ్రీరమణులు చాలా తక్కువగా ప్రసంగించేవారు. తన మౌనంతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవారు. రమణుల బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా వుండేది. ఎవరైనా ఉపదేశించమని కోరితే, “స్వీయ శోధన” ఉత్తమమని, ఇది సూటి మార్గమని తద్వారా మోక్షం సులభ సాధ్యమని బోధించేవారు. ఆయన అనుభవం అద్వైతం, జ్ఞానయోగాలతో ముడిపడి ఉన్నా కూడా అడిగినవారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గాలని బోధించేవారు. ఆర్ద్రా నక్షత్రం లో పుట్టిన ఆయన దక్షిణామూర్తి స్వరూపం అని, కేవలం కౌపీనం మాత్రమే ధరిస్తారు కాబట్టి ఆయన్ని కుమారస్వామి స్వరూపం అని శిష్యులు కొలిచేవారు. పశు పక్ష్యాదులతో కూడా ఆయన సఖ్యతతో మెలిగే వారు. అలాంటి వారికి కావ్య కంఠగణపతి ముని కూడా శిష్యుడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా వంటి వారు ఆయన్ని, ఆయన భోధనలు అనుసరిస్తూ ఉన్నారు. భగవాన్ రమణుల గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సింది చాలా ఉంటుంది.
సంస్కృత విద్వాంసుడు, ఆసుకవి, తపస్వి అయిన శ్రీ కావ్యకంఠ గణపతి ముని, భగవాన్ శ్రీ రమణులను గురువుగా స్వీకరించి, ఎన్నో సందేహాలను తీర్చుకున్నారు, అవే రమణగీత’గా రూపొందాయి. అందులోని ఒక శ్లోకం విశేష ప్రాముఖ్యత పొందింది. ఆత్మ స్వరూపం నిర్దేశించే ప్రశ్నకు సమాధానంగా శ్రీ రమణ మహర్షి తెలిపినది. దేశ జాతి కుల మతభేదాలు లేకుండా అందరూ మహర్షిని దర్శించుకునేవారు. వచ్చిన వారందరినీ అత్యంత ప్రేమాదరణలతో చూసేవారు. అక్కడి ప్రశాంతత అందరినీ ఆకర్షించేది. వారివద్దకు వచ్చిన వారినందరినీ, భక్తి పరమార్థాల వైపు తిప్పేవారు. వారి ఒక దృష్టి మాత్రంగానే ఇదంతా జరిగేది. ఫోటో చూసినా వారి చూపు సూదంటురాయి వలె భక్తులను ఆకర్షించేది. ఎఫ్.హెచ్. హంఫ్రీస్ 1911లో స్వామిని వేసే ప్రశ్నకు సమాధానంగా నీవు లోకానికి భిన్నం కాదు, నిన్ను నీవు తెలుసుకో’ అని తెలిపారు.
కాలక్రమేణా దేశవిదేశాలనుంచి ఎంతోమంది పండితులు, పరమహంస యోగానంద వంటి యోగులు, పాల్ బ్రాంటన్ మరియు సోమర్సెట్ మాఉమ్ వంటి ప్రఖ్యాత రచయితలు వచ్చి శ్రీ రమణ మహర్షిని కలిసేవారు. మౌనంగానే తమ దృక్కులతో మహర్షి వారి సందేహాలను తీర్చేవారు. స్వమీ రామదాస్ వంటి మహాయోగి కూడా శ్రీ రమణ మహర్షిని దర్శించుకుని అక్కడి అరుణాచల గుహలో కొంత కాలం ధ్యానంలో గడిపారు. ప్రఖ్యాత రచయిత శ్రీ గుడిపాటి వెంకటాచలం, రమణ మహర్షి శిష్యుడై తమ జీవితం చాలాకాలం అంతిమ దశ వరకు అరుణాచలంలోనే గడిపారు.

వారు సాక్షాత్ సుభ్రమణ్యస్వామి అవతారమని కొందరు, శ్రీ దక్షిణామూర్తి అవతారమని మరి కొందరు భక్తులు భావించేవారు, ఎన్నో అద్భుత సంఘటనలు జరిగినా తమ ప్రమేయమేమీ లేదని ఆయన అనేవారు. ఒక రోజు ఒక వస్తువు లేకపోతే, మరునాడే ఎవరో ఆ వస్తువు పంపడం జరిగేది. ఆయన తల్లి ఆశ్రమంలో వచ్చి ఉన్నా, మిగతా అందరిలాగే చూసేవారు. ఆమె ఆఖరి ఘడియల్లో తన హస్త స్పర్శతో ముక్తినిచ్చిన సంఘటన ఎంతో విశేషం. శ్రీ రమణ మహర్షి చివరి రోజుల్లో, ఎడమ చేతిపై వ్రణం పెరిగి, శస్త్ర చికిత్స చేసినా తగ్గలేదు. డాక్టర్లు మత్తుమందు ఇస్తామన్నా నిరాకరించారు. ఎందరో భక్తులు ఆయనని తమ అంతర్గత శక్తితో ఆరోగ్యం బాగు చేసుకోమని కోరగా, `భోజనానంతరం విస్తరిని ఉంచుకుంటామా?’ అని అడిగారు. 14, ఏప్రిల్ 1950 రాత్రి 8.47ని.లకు శ్రీ రమణ మహర్షి దేహాన్ని వదిలేసినప్పుడు, ఒక నక్షత్రం గిరి శిఖరం మీదుగా అంతరిక్షంలో అదృశ్యమైంది. మహితాత్మ స్వస్థలానికి చేరుకుంది..🙏🏻
No comments:
Post a Comment