Tuesday, November 7, 2023

****శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:

 2802223c1559. 010323-3.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀285.

                శ్రీ మహాభారతం 
                 ➖➖➖✍️
                 285 వ భాగం
   శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:
         
#శాంతి పర్వము చతుర్థాశ్వాసము

వైశంపాయనుడు జనమేజయునకు మహాభారత కథను చెప్పసాగాడు… భీష్ముడు ధర్మరాజుతో.. “నాకు తెలిసిన అన్ని విషయాలు చెప్పాను. నీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే అడుగు. నాకు తెలిసినంత వరకు నీకు అన్ని విషయాలు చెప్పాను.” అన్నాడు.

#ఉత్తమ_ధర్మము:
ధర్మరాజు… “పితామహా ! ఇప్పటి వరకు రాజోచితప్రవర్తన, ధర్మాలు తెలియ చెప్పారు. ఇక ప్రజల మంచిచెడులు వారి ధర్మాలు వివరించండి” అని అడిగాడు. 

భీష్ముడు… “ధర్మనందనా! లోకంలో ధర్మం పలువిధముల విస్తరించి ఉంది. అన్ని ధర్మములు అనుసరించ తగినవే అయినా తత్వం తెలిసినవారు మాత్రమే మోక్షమే ఉత్తమమార్గమని చెప్తారు. ఇష్టం, అయిష్టం మరచి ద్వందాతీతంగా సంపదను అనుసరించడమే మోక్షమార్గం. ఇందుకు ఉదాహరణగా నీకొక కథ చెప్తాను… ‘పూర్వం సేనజిత్తుడు అనే మహారాజుకు పుత్ర వియోగం కలిగింది. అతడి వద్దకు ఒక ఆప్తుడైన బ్రాహ్మణుడు వచ్చి… ‘మహారాజా! చింతించడం ఎందుకు పుట్టిన వారికి మరణం తప్పదు. నీ కుమారుడికి మాత్రమే మరణం సంప్రాప్తించిందా! మూర్ఖత్వంతో ఇలా ఎందుకు చింతిస్తున్నావు?’ అని పలికాడు. 

మహారాజు… ‘మరి ఈ దుఃఖం పోవాలంటే ఏమి చేయాలి?’అని అడిగాడు. 

బ్రాహ్మణుడు… ‘మహారాజా ! నదీప్రవాహములో ఎన్నో దుంగలు కొట్టుకుని పోతున్నాయి. వాటిలో రెండు దగ్గరకు చేరుతాయి. కొంచెం దూరం పోగానే తిరిగి విడిపోతాయి. భార్యా, పుత్రులు, బంధువులు కూడా అంతే!   జీవితంలోకి వస్తుంటారు, పోతుంటారు. కనుక శాశ్వతంకాని ఈ శరీరాల కొరకు చింతించడం మూర్ఖత్వంకాదా! నీ శరీరమే నీ స్వాధీనంలో ఉండదు. ఏది ఎప్పుడు రోగగ్రస్థమౌతుందో నీకు తెలియదు. ఎప్పుడు శాశ్వతంగా పోతుందో నీకు తెలియదు. ఇక భార్యా, పుత్రుల గురించి మోహం ఎందుకు? మోహం లేనప్పుడు చింత లేదు. మానవునికి సుఖం, దుఃఖం ఒక దాని వెంట ఒకటి వస్తూపోతూ ఉంటాయి. సుఖమూ నిలువదు దుఃఖం నిలువదు. వివేకులు సుఖం వచ్చినప్పుడు పొంగి పోరు. దుఃఖం వచ్చినప్పుడు కుంగి పోరు. మనిషి నాది అనుకున్న వస్తువు దూరమైనప్పుడు దుఃఖిస్తాడు. నాది అన్న సంగం వదిలినప్పుడు దుఃఖం లేదు కదా! పూర్వజన్మ సంస్కారం అనుసరించి సంయోగ వియోగములు సంభవిస్తాయి. పండితుడికి, పామరుడికి కర్మఫలములు ఒకటిగానే సంభవించినా పండితుడు వాటికి కలతచెందడు. పామరుడు దానిలో లీనమౌతాడు. కనుక ద్వందాతీతంగా ఇష్టం, అయిష్టం వదిలి సుఖదుఃఖాలకు చలించక ప్రవర్తించినచో  చింతలు ఉండవు. దీని గురించి పింగళ అనేవేశ్య ఇలా చెప్పింది… ‘పింగళ ఒక సారి తన ప్రియుడి కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఎంతకీ అతడు రాకపోయేసరికి తనలో నేను ప్రియుడి కొరకు ఎదురు చూస్తూ పిచ్చిదాన్ని అయ్యాను. కాని అతడు ఇలా పిచ్చి వాడు కాలేదుకదా ! అలాంటి వాడికొరకు నేను ఎందుకు బాధపడాలి. కనుక నేనిక కళ్ళుమూసుకుని నిద్రపోతాను. నా వద్దకు రాని వాడికొరకు బాధపడే కంటే వచ్చిన వాడే ప్రియుడను కోవడం మంచిది. రానివాడి మీద ఆశపెట్టుకుని కుంగిపోతూ పిచ్చిదానినై సర్వనాశనం అయ్యేదాని కంటే ఆశవదులుకుని, ఉన్న దానితో తృప్తిపడుతుంటాను.’ 
కనుక మహారాజా! లేని దాని కొరకు బాధపడక ఉన్న దానితో సుఖంగా జీవించు.’ 
ధర్మనందనా! ఈ కథలోని అంతరార్ధం గ్రహించి ఉన్నదానితో తృప్తిపడడం నేర్చుకో! తృప్తిని మించిన సుఖం, సంపద మరొకటి లేదు.”


#ప్రళయం:

ధర్మరాజు… ‘పితామహా ! ఈ లోకంలోని జీవజాలం అంతా నశిస్తుందని అనిపిస్తుంది. అలాంటి సమయంలో జనులు ఏమి చేయాలి?’ అని అడిగాడు. 

భీష్ముడు… “ధర్మనందనా ! ఇందు కొరకు నీకు ఒక కథ చెప్తాను విను… ‘ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడికి మేధావి అనే కుమారుడు ఉన్నాడు. అతడు వేదవేదాంగములు అభ్యసించాడు. ఒక రోజు మేధావి తండ్రితో… ‘తండ్రీ వయసు పెరిగే కొద్దీ జనులకు ఆయుష్షు తగ్గుతుంది కదా ! ఈ విషయంలో జనులు ఎలా ప్రవర్తించాలి?’ అని అడిగాడు. 
ఆ బ్రాహ్మణుడు… ‘కుమారా ! తరుణ వయసులో వివాహం చేసుకుని సంతానం పొంది యజ్ఞ యాగాదులు చేయాలి. తరువాత వానప్రస్థం స్వీకరించి తుదకు మోక్షం పొంద వచ్చు. జనులు ఇలా ప్రవర్తించి మృత్యువును జయించాలి.’  అని చెప్పాడు. 
కుమారుడు… ‘తండ్రీ ! నీవు .. మృత్యువు  నీ ఆధీనంలో ఉన్నట్లు మాట్లాడుతున్నావు. మానవుడు తల్లిగర్భం నుండి బయట పడిన నాటి నుండి మృత్యువు నిత్యమూ వెన్నంటి ఉంటూ ఎప్పుడు కబళించాలా అని ఎదురుచూస్తూ ఉంటుంది. మానవుడి ఆయుషు సదా ఎండపడి మడుగులోని నీరు ఆవిరై పోతున్నట్లు తరుగుతూ ఉంటుంది. ఇక భార్యాబిడ్డల వ్యామోహంలో ఉన్న వాడికి మృత్యువు ఎప్పుడు కబళిస్తుందో ఎరుగజాలడు. జరిగింది తలుస్తూ జరగబోయే దానికి ప్రణాళికలు వేసే వాడికి మృత్యువు జాడ తెలియనే తెలియనిది. మనిషి కాలం ఆధీనంలో ఉన్నాడు కాని,  కాలం మనిషి ఆధీనంలో లేదు. మృత్యువుకు స్వపరబేధాలు ఉండవు. బాలుడా, ముదుసలా, స్త్రీయా, పురుషుడా, మేధా, మూర్ఖుడా, ధనికుడా, పేదవాడా అన్న భేదం లేదు. మృత్యువు అందరినీ సమానంగా కబళిస్తుంది. లోకంలో జీవిస్తున్న ప్రతి జీవిని కబళించడానికి ప్రయత్నిస్తున్న మృత్యువుని చూసి జంకక మోహంవదిలి సంసార బంధాలను తెంచి వేయాలి. కనుక నాదన్నది త్యజించి ‘లోకం అసత్యం’   అని గ్రహించి మృత్యువును జయించాలి.

అంతే కాని పెళ్ళి చేసుకుని పిల్లలను కని యజ్ఞయాగాదులు చేసి వానప్రస్థం స్వీకరించి మోక్షపదం చేరవలసిన అవసరం లేదు. యజ్ఞ, యాగాదులలో జీవహింస ఉంటుంది. నేను యజ్ఞం చేస్తున్నాను అన్న అహంకారం ఉంటుంది కనుక అది మోక్షమార్గం కాదు. మనస్సు, వాక్కును శరీరాన్ని నియమబద్ధంగా నిగ్రహించి మోక్షాన్ని పొందాలి. అమృత తుల్యమైన ఆనందం పొందాలంటే అరిష్డ్వర్గాలను వదిలి ప్రాంపంచిక వ్యవహారాలను మరచి ధ్యాననిమగ్నుడై నిన్ను గురించి నువ్వు తెలుసుకో!’ అని మేధావి తండ్రికి చెప్పాడు. కనుక ధర్మనందనా ! ఈ తండ్రి కుమారుల సంవాదం నుండి నీకు నీవుగా ధర్మ సూక్ష్మం గ్రహించి మోక్షాన్ని పొందు” అని చెప్పాడు.


#సంపద_సుఖం:

ధర్మరాజు భీష్ముడితో.. “పితామహా ! లోకంలో ధనికులు, పేదవారు ఉన్నారు కదా ! ఎవరు ఎక్కువగా సుఖపడుతున్నారు?” అని అడిగాడు. 

భీష్ముడు… “ధర్మనందనా ధనవంతులు-పేదవాళ్ళను త్రాసులో ఉంచి తూచినప్పుడు ముల్లు పేదవారి వైపే మొగ్గుతుంది. సంపన్నులకు పేదవారికి ఉన్న గుణదోషాలు చెప్తాను విను… ‘ధనము, సంపద, ఆస్తులు కలిగిన వాడు ఎప్పుడూ తనసంపదను ఎవరు దోచుకుంటారో అని కలతచెందుతూ ఉంటాడు. ఎప్పుడూ మృత్యు ముఖంలో ఉన్నట్లు అశాంతిగా ఉంటాడు. ధనవంతుడు ఉన్నది చాలక అత్యాశకు పోయి మనసు వికలం చేసుకుంటాడు. ధనాన్ని కాపాడు కోవడానికి నిరంతరం చింతింస్తుంటాడు. ధనకారణంగా ఎప్పుడూ ఆగ్రహానికి గురి ఔతాడు. కనుక ధనవంతులకు సుఖం దొరకడం కఠినమే. ధనంలేని వాడు స్వతంత్రుడు, నిర్భీతికలవాడు, ఆగ్రహం రానివాడు, సకల ప్రదేశములలో సంచరించ గలవాడు. మోసం చేయాలన్న ఆశలేక, అత్యాశలకుపోక ప్రశాంత చిత్తతంతో ఉండగలడు. కనుక పేదవాడే సుఖవంతుడు. 
ధనం చంచలమైనది కనుక తరిగి పోతూ ఉంటుంది. కనుక అది దుఃఖ కారకం. ధనం శాశ్వతం కాదని తెలుసుకుని దాని మీద వ్యామోహం విడిచిన వాడు సుఖవంతుడు.


#ధనతృష్ణ:

ధర్మరాజు.. “పితామహా ! ధనతృష్ణతో కొట్టుకులాడే జీవి ఎప్పుడు సుఖాన్ని పొందగలడు?” 

భీష్ముడు… “ధర్మజా ! ధనము సంపాదించి సంపాదించి విసుగుపుట్టి ధనంసంపాదించడం మానుకున్నప్పుడే మానవుడికి సుఖం కలుగుతుంది. ఈ సందర్భంలో నీకు ఒకకథ చెప్తాను…  ‘ఒక ఊరిలో మంకి అనే బ్రాహ్మణుడు ఉండే వాడు. అతడికి ధనాపేక్ష అధికం. అందు వలన అతడు రెండు కోడెదూడలను కొని వాటిని తాళ్ళతోబంధించాడు. ఒక రోజు అవి తాళ్ళతో కలిసి పారిపోయాయి. అవి పడుకుని ఉన్న ఒంటెను దాటబోయే సమయానికి అది పైకిలేచి నిలబడిన కారణంగా కోడెదూడలు వాటిమెడకు కట్టిన తాళ్ళకారణంగా దూడలు చనిపోయి ఒంటె మెడకు రెండు వైపులా వేలాడసాగాయి. అది చూసిన బ్రాహ్మణుడు హడలిపోయి తాను ప్రేమగా పెంచుకున్న దూడలు చనిపోవడం చూసి అక్కడ చేరిన జనులతో.. ‘అయ్యలారా ! నేను నా ప్రతిభతో ధనం సంపాదించాలి అనుకున్నాను అది సాధ్యంకానిదని  అని తేలి పోయింది. మానవుని ఉన్నతికి దైవానుగ్రహం ఉండాలికాని మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా అవివ్యర్ధమేకదా ! కనుక దైవం మీద భారంవేసి మన ప్రయత్నాలు చేయాలి. కోరికవదలక ఉన్నచో సుఖం ఉండదు. కోరికలకు మూలం మనస్సంకల్పం. మనస్సులో సంకల్పం లేకుండా ఉండాలంటే ఇంద్రియ నిగ్రహం కావాలి. కోరికలు లేకున్న ధనంతో పని లేదు. కనుక ధనాపేక్ష లేని వాడు ప్రశాంత మనస్కుడై ఉంటాడు. ధనం సంపాదించే కొలదీ తృష్ణ పెరుగుతుంది, దానిని దాచాలన్న తాపత్రయం కలుగుతుంది. కనుక అంతు లేని కోరికలను వదిలిన శాశ్వత ప్రశాంతత పొందగలడు.    నేను ధన సంపాదనాపేక్షతో తెచ్చిన దూడలు చనిపోగానే నా లోని   ధనాపేక్ష తగ్గింది.   నాలో ధనతృష్ణ తగ్గింది, ఇంద్రియ నిగ్రహం కలిగింది, నాలో సహనం కలిగింది, ఇక నాకు లోభం అంటదని సమాధానపడి శేషజీవితం ప్రశాంతంగా గడిపాడు.✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment