Monday, November 13, 2023

యోగసిద్ధికి మార్గం చిత్తశుద్ధి

 🌸 అమృతంగమయ -  జ్ఞానయోగం 🌸

*యోగసిద్ధికి మార్గం చిత్తశుద్ధి*

యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితమ్ ।
యతంతోఽప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః ।।

భగవద్గీత 15వ అధ్యాయం 11వ శ్లోకం. 

దృఢంగా పరిశ్రమించే యోగులు కూడా దేహములోనే స్థితమై ఉన్న ఆత్మను తెలుసుకోగలుగుతారు. కానీ, ఎంత ప్రయత్నించినా, అంతఃకరణ శుద్ధి లేని వారు మాత్రం దానిని తెలుసుకొనలేరు.

జ్ఞానము కోసం ప్రయత్నించటం మాత్రమే సరిపోదు; మన పరిశ్రమ సరియైన దిశలో కూడా ఉండాలి. మనుష్యులు తరచుగా ఈ తప్పు చేస్తుంటారు - ఈ ప్రపంచ విషయాలని తెలుసుకున్న పద్దతి ద్వారానే, దివ్యమైన అస్థిత్వములను తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. వారు తమ భౌతిక ఇంద్రియ గ్రహణశక్తి మరియు తమ బుద్ధి యొక్క శక్తి ఆధారముగా, జ్ఞానములలో ఏది సరియైనదో ఏది తప్పైనదో నిర్ణయిస్తారు. ఏదేని పదార్థమును, తమ ఇంద్రియములు చూడలేకపోతే మరియు తమ బుద్ధి అర్థం చేసుకోలేకపోతే, అప్పుడు ఆ పదార్థము లేదు అని ఊహించుకుంటారు. 'ఆత్మ' అనేది ఇంద్రియములచే గ్రహింపబడలేదు కాబట్టి, వారు అటువంటి పదార్ధమేదీ లేదని నిశ్చయిస్తారు. న్యాయ దర్శనం ఇటువంటి ఆలోచనను కూప-మండూక-న్యాయము ( బావిలో కప్ప యొక్క తర్కము) అని పేర్కొంటుంది. తమ అల్పబుద్ధిచే పరిమితమైపోయి, భౌతిక దృక్పథంలో ఉన్న జనులు, భౌతికము కానటువంటి ఆత్మ ఉన్నది అన్న విషయాన్ని ఒప్పుకోరు. కానీ, ఆధ్యాత్మిక పథంలో ప్రయాణించేవారు, తమ భౌతిక బుద్ధి పరిమితి కంటే పరమైన (అతీతమైన) జ్ఞానము ఉంటుంది అన్న విషయాన్ని అర్థం చేసుకుంటారు. వినయంతో మరియు విశ్వాసంతో ఆధ్యాత్మిక పథాన్ని అనుగమించటం ప్రారంభిస్తారు మరియు తమ అంతఃకరణ (హృదయమును) పవిత్రం చేసుకోవటాన్ని లక్ష్యంగా చేసుకుంటారు. ఎప్పుడైతే మనస్సు శుద్ధి అవుతుందో అప్పుడు వారికి ఆత్మ యొక్క ఉనికి సహజంగానే తెలిసిపోతుంది. ఆ తదుపరి, శాస్త్రముల యొక్క యదార్ధమును, జ్ఞానోదయము ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు.

చిత్తవృత్తులను నిరోధించడమే యోగమని యోగదర్శనం చెబుతుంది. సమత్వమే యోగమని భగవద్గీత చెబుతుంది. ఆత్మలో పరమాత్మను సాక్షాత్కరించుకోవడమే యోగమని వేదాంత దర్శనం చెబుతుంది. ఏ గ్రంథం ఏం చెప్పినా యోగసిద్ధికి చిత్తవృత్తుల నిరోధమే, అట్టి చిత్తవృత్తుల నిరోధానికి చిత్తశుద్ధి అవసరమని తెలుస్తుంది. ఆత్మకు సమీపంలో ఉండటం వల్ల చిత్తం జ్ఞానవంతం అవుతుంది.  చిత్తాన్ని వస్తు రూపం పొందకుండా చూడటమే యోగం. 

యోగంలో శాస్త్రజ్ఞానం కాని, విపర్యయ జ్ఞానం గాని, వికల్ప జ్ఞానం గాని ఉండరాదు. వేదాది శాస్త్రాల వల్ల కలిగిన జ్ఞానమే శాస్త్రజ్ఞానం. ఒకదాన్ని మరొక దానిగా భావించడమే విపర్యయ జ్ఞానం.  లేనిదాన్ని ఉన్నట్లుగా, ఉన్నదాన్ని లేనట్లుగా భావించడమే కల్పజ్ఞానం. శాస్త్ర, విపర్యయ, వికల్ప జ్ఞానాలతోపాటు నిద్రను, స్మృతిని లేకుండా చేసుకోవడమే యోగం. ఇదే సమాధి స్థితి. యోగంలో చిత్తవృత్తులకు తావు లేదు. లౌకిక జగత్తులోని ఏ వస్తురూపాన్ని కూడా చిత్తం ప్రతిబింబించరాదు. కేవలం ఆత్మ చిత్తవృత్తులకు దూరమై, పరిశుద్ధమై ఉన్నప్పుడే ఆత్మలో పరమాత్మ ప్రకాశిస్తాడు.

చిత్తంలో కొన్ని మాలిన్యాలుంటాయి. ఇవి- ఈర్ష్య,
జుగుప్స, అసూయ, అసహనం. ఈ నాలుగింటినీ పోగొట్టుకుంటే చిత్తం పరిశుభ్రమవుతుంది. 
సుఖంగా ఉన్నవారిని చూసినప్పుడు మనకు ఈర్ష్య కలుగుతుంది. ఈ ఈర్ష్య అనే మాలిన్యం తొలగిపోవడానికి మైత్రీభావాన్ని అలవరచుకోవాలి. దుఃఖంలో ఉన్నవారిని చూసినప్పుడు జుగుప్స కలుగుతుంది. ఈ జుగుప్స అనే మాలిన్యాన్ని తొలగించుకోవడానికి దయాగుణాన్ని పెంపొందించుకోవాలి. పుణ్యాత్ములను చూసినప్పుడు అసూయ కలుగుతుంది. ఈ అసూయ అనే మాలిన్యాన్ని కడిగి వేయాలనుకున్నప్పుడు సంతోషపడటం నేర్చుకోవాలి. పాపాత్ములను చూసినప్పుడు మనకు అసహ్యం కలుగుతుంది. ఈ అసహ్యమనే మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి ఉపేక్షాభావాన్ని కలిగి ఉండాలి.

ఈ నాలుగు మాలిన్యాలు ఎప్పుడైతే తొలగిపోతాయో. అప్పుడు చిత్తం ప్రసన్నమవుతుంది. తద్వారా సత్వగుణం వృద్ధి చెందుతుంది. సత్వగుణం వల్ల ఈశ్వర సాక్షాత్కారం సులభమవుతుంది. ఈశ్వర సాక్షాత్కారానికి మహర్షి పతంజలి క్రియాయోగాన్ని ప్రతిపాదించాడు. క్రియాయోగానికి ప్రాథమిక సాధనలు తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం.

స్థూలంగా చెప్పుకొంటే శమదమాదులే తపస్సు. వేదశాస్త్రాధ్యయనమే స్వాధ్యాయం.  భక్తి కలిగి ఉండటమే ఈశ్వర ప్రణిధానం. శీతోష్టాలు, లాభనష్టాలు, మానవమానాలు మొదలైన ద్వంద్వాలను సహించడమే తపస్సు. 

ఈ తపస్సు శారీరక, వాచిక, మానసిక తపస్సులని మూడు విధాలు. శీతోష్టాలను సహించడం శారీరక తపస్సు, వాక్కు సత్యంగా, మధురంగా, హితకరంగా మార్చుకోవడం వాచిక తపస్సు, రాగద్వేషాలను, మానావమానాలను జయించడం మానసిక తపస్సు.

శ్రవణ మనన నిదిధ్యాసనాదుల ద్వారా పరమేశ్వరుడి తత్వాన్ని జపించడం స్వాధ్యాయం. 

లౌకిక ఫలాలను కోరకుండా, మనోవాక్కాయాలతో జరిగే కర్మలన్నింటినీ, ఈశ్వరుడి పట్ల అనన్య భక్తితో సమర్పించడమే ఈశ్వరప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం వల్లనే చిత్తశుద్ధి కలిగి యోగసిద్ధికి మార్గం సుగమమవుతుంది.

శుభం

No comments:

Post a Comment