. *🌺 ఏకాగ్రత 🌺*
*🍁ఒకే విషయం మీద దృష్టిని లగ్నం చేయడమే ఏకాగ్రత. ఏ పనిలోనైనా మంచి ఫలితాలు సాధించాలనుకుంటే మనసును సంపూర్ణంగా పనిపైనే లగ్నం చేయాలి. అప్పుడే ఆశించిన విజయాలు పొందగలుగుతాం. సామాన్య మానవుడు సైతం ఏకాగ్రచిత్తుడైనప్పుడు ప్రాపంచిక విషయాల్లో, సాహిత్యంలో, ఆధ్యాత్మిక విషయాల్లో అద్భుతమైన కార్యాలు సాధించగలుగుతాడు.*
*🍁దృఢ సంకల్పానికి ఏకాగ్రత తోడైనప్పుడు ఎలాంటి వారైనా తాము కోరుకున్న లక్ష్యాలు సాధిస్తారు. తండ్రి ఎన్ని హింసలకు గురిచేసినా ప్రహ్లాదుడు తాను నమ్మిన భక్తిమార్గాన్ని వీడలేదు. నమ్మినదైవం పట్ల అచంచలమైన ఏకాగ్రతే దానికి కారణం. వసిష్ఠుడిలాగా బ్రహ్మర్షి కావాలన్నదే విశ్వామిత్రుడి కోరిక. దాన్ని ఆయన ఏకాగ్ర చిత్తం, దృఢ నిశ్చయంతో తపస్సు చేసి సాధించాడు. తన పూర్వీకులకు పుణ్యలోకాలు ప్రాప్తింపజేయాలన్న లక్ష్యం భగీరథుడిది. అకుంఠిత దీక్షతో- దివినుంచి భువికి గంగ దిగివచ్చేలా చేశాడు. ద్రోణుడు చెట్టును చూపించిన వెంటనే దాని కొమ్మమీద గల పక్షి కన్ను అర్జునుడి లక్ష్యమైంది. ఆ ఏకాగ్రత వల్లే అతడు విలుకాడయ్యాడు. విజయుడిగా పేరు తెచ్చుకున్నాడు.*
*🍁ప్రఖ్యాత బౌద్ధ సన్యాసి తిక్ నాటి రచన 'ది మిరకిల్ ఆఫ్ మైండ్ర పుల్ ''నెస్'లో చేస్తున్న ప్రతి పనినీ ఎరుకతో చేయమంటారు. నడుస్తున్నప్పుడు నడుస్తున్నాననే ఎరుకతో ఉండాలి. భోజనం చేస్తున్నప్పుడు భోజనం చేస్తు న్నానన్న ఎరుకతో ఉండాలి. ఇలా ప్రతి పనినీ ఎరుకతో చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ప్రాపంచిక విషయాల్లో మునిగి తేలుతున్న మనసుకు నిశ్చలత ఉండదు. దాన్ని నియంత్రించడానికి ఏకాగ్రత ఒక సాధనమని చెబుతారు విజ్ఞులు.*
*🍁ఏకాగ్రతతో ఏదైనా పనిచేయాలంటే ముందుగా దానిపై ఇష్టం పెంచుకోవాలి. దృఢమైన సంకల్పంతో మనిషి ఎప్పుడైతే సర్వశక్తుల్ని ఒక పనిమీద కేంద్రీకరిస్తాడో దాన్ని అప్పుడే అతడు విజయవంతంగా పూర్తి చేయగలుగుతాడు. వివేకానంద, గాంధీజీ జీవితాలే అందుకు ఉదాహరణలు. ఆధ్యాత్మిక ప్రయాణంలోనూ ఏకాగ్రతకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. భక్తుడు ఎప్పుడైతే భగవంతుడి పట్ల ప్రేమను పెంచుకుంటాడో అప్పుడు అతడి మనసు భగవంతుడి గురించి ఆలోచించడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే, మనం దేన్ని ప్రేమిస్తామో సహజంగా దానిమీదే మనసును ఏకాగ్రం చేస్తాం. మనసు దేనిపై ఏకాగ్రమవుతుందో దాని లక్షణాలే పుణికిపుచ్చుకొంటాం. భగవంతుడిపై మనసును ఏకాగ్రం వేసినప్పుడు భగవంతుడి లక్షణాలే జీర్ణించుకుంటాం. భగవద్గీత వాటినే దైవీ సంపద అని పేర్కొంది. హృదయ పవిత్రత, ఇంద్రియనిగ్రహం, దయ వంటి దైవీ లక్షణాలను భక్తుడు ఎటువంటి శ్రమా లేకుండా పొందుతాడు. అప్పుడు ఆ భగవంతుడి కృప తప్పకుండా భక్తుడిపై వర్షిస్తుంది!*
No comments:
Post a Comment