అమృతంగమయ - జ్ఞానయోగం
దీక్ష - జీవిత రక్ష
శ్రీ భగవానువాచ ।
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ ।
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే ।।
భగవద్గీత 6వ అధ్యాయం 35వ శ్లోకం
శ్రీ కృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు: ఓ మహా బాహువులుగల కుంతీ పుత్రుడా, నీవు చెప్పింది నిజమే; మనస్సు అనేది నిగ్రహించటానికి నిజముగా చాలా కష్టమైనది. కానీ, అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చు.
అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః - యోగ దర్శనం
‘నిరంతర అభ్యాసము, వైరాగ్యముల ద్వారా మనస్సు యొక్క ఆందోళనలను నియంత్రించవచ్చు.’
పుట్టుకతోనే ఏ మనిషీ సర్వోన్నతుడు కాలేడు. సర్వోన్నతమైన స్థానాన్నీ అందుకోలేడు. దీనికై నిరంతర సాధన అవసరం. తనను తాను ఉద్ధరించుకోవాలన్న ఆలోచన ఏ క్షణమైతే మనిషికి కలుగుతుందో ఆ క్షణం నుంచే అతడిలో పరివర్తనకు శ్రీకారం చుట్టుకుంటుంది. లౌకిక జీవనంలో అనేక మాయల వలలో చిక్కుకున్న మనిషి క్రమంగా తెలివి తెచ్చుకుంటూ వాటి నుంచి క్రమంగా బయటపడి శాశ్వతమైన సత్యాన్ని అన్వేషించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తాడు. వీటన్నిటిలో మనిషి అన్ని రకాల లౌకిక బంధాల నుంచి విడిపడేలా చేసి, దైవత్వానికి దగ్గర చేసేందుకు మేలైన మార్గం 'దీక్ష'.
దీక్ష అంటే నియమాల సమాహారం. పట్టుదల అనే పేరు కూడా దీనికి ఉంది. ఒక ఆచారాన్ని లేదా నియమాన్ని పాటించాలని సంకల్పించడం, దాన్ని పట్టుదలగా కొనసాగించడం దీక్ష అని చెప్పుకోవచ్చు. ఇంద్రియాలను నిగ్రహంలో ఉంచుకొని, దైహికంగా, మానసికంగా మండల కాలం పాటు నిష్ఠాపూరితమైన జీవనాన్ని నిరాడంబరంగా గడపడం దీక్షలోని ప్రధానమైన అంశం. దీనివల్ల భౌతికమైన క్రమశిక్షణతోపాటు మానసికమైన నిబద్ధత ఏర్పడుతుంది. అది ఆదర్శప్రాయమైన జీవనానికి మార్గదర్శకమవుతుంది.
ఏమిటి ఈ దీక్ష
దీయతే జ్ఞానం విజ్ఞానం క్షీయంతే పాప నాశనం
తేన దీక్షా ఇతి ప్రోక్తా ప్రాప్తాచ్చేత్ సద్గురోర్ముఖః ||
దీ - అంటే జ్ఞానం, క్ష - అంటే పాపక్షయం అని అర్థం. జ్ఞానాన్ని ఇచ్చి పాపాన్ని పోగొట్టేది దీక్ష అవుతుంది. దీక్షకు ఇదమిత్థంగా ఇదీ భౌతిక స్వరూపం అంటూ ఏదీ ఉండదు. మనసులో దర్శించిన అనుభూతి, ఎంచుకున్న లక్ష్యం, కలిగిన ప్రేరణ బట్టి దీక్ష ఆచరించే విధానం మారుతుంది. బయటకు ఇదంతా విభిన్నమైన పద్ధతులు అనిపించినా అన్ని దీక్షలూ చేరే గమ్యం పరమాత్మ పాదాలు మాత్రమే.
దీక్ష అనే పదం - ద, ఇ, క, ష, అ అనే ఐదు అక్షరాల కలయికతో ఏర్పడింది. 'ద' అంటే ఇచ్చేది, 'ఇ' అంటే లక్ష్మి లేదా సంపద. 'క' అంటే బ్రహ్మానందం. 'ష' అంటే సమృద్ధి. 'అ' అంటే పరమాత్మ లేదా పరబ్రహ్మ. ఇలా బ్రహ్మానందం, సంపద, సమృద్ధి, పరమాత్మని ఇచ్చేది దీక్ష అవుతుంది. దీక్షను ఆచరిస్తే పరమ జ్ఞానం కలుగుతుంది. పాప పరంపరలను పోగొట్టి సంసార పాశ బంధాలను ఛేదించి, తత్త్వ చింతనను కలిగిస్తుంది. దీక్ష అంటే నియమబద్ధ ప్రవృత్తి. మనస్సు, శరీరం, వాక్కుతో సహా అన్ని అవయవాలు, అన్ని ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకుని పరమాత్మ ఆరాధనకు అనుగుణంగా ప్రవర్తించటాన్ని దీక్ష అంటారు. దీక్షకు మించిన పవిత్రమైన వస్తువు, జ్ఞానం, తపస్సు ప్రపంచంలో మరెక్కడా లేవు.
మరోవిధంగా చెప్పాలంటే నిశ్చలమైన మనస్సుతో సంకల్పించడాన్ని దీక్ష అంటారు. మనస్సు, వాక్కు, శరీరము ఈ మూడింటిని త్రికరణాలు అంటారు. ఈ మూడింటిని సమన్వయం చేసి నిర్వహించే పనుల్నే 'మనోవాక్కాయకర్మలు' అంటారు. అహింస (హింస చెయ్యకుండా ఉండటం), సత్యం (దేవుని మీద నిజమైన భక్తి కలిగి ఉండటం), ఆస్తేయం (అవలంబించేందుకు తగిన విధానాన్ని ఎంచుకోవటం), బ్రహ్మచర్యం (శారీరక వ్యామోహాలు లేకపోవటం), అపరిగ్రహం (తన భోగాల కోసం ఇతరుల నుంచి ధనాన్ని స్వీకరించకపోవటం) అనే మహావ్రతాలను మనోవాక్కాయ కర్మల ద్వారా ఆచరించటాన్ని కూడా దీక్ష అంటారు.
దీక్షలో రకాలు
దీక్షల్లో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. అవి ఆణవీ, శాక్తేయీ, వైష్ణవి. మంత్రం, అర్చన, ఆసనం, ధ్యానం, స్థాపన, ఉపాసన అనే ఆరు అంగాలు కలిగిన దీక్ష అణవి అవుతుంది. శక్తిని ఆరాధించే దీక్ష శాక్తం లేదా శాక్తేయం అవుతుంది. చివరిది వైష్ణవీ దీక్ష. గురుశిష్యులిద్దరూ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రవర్తించటం వైష్ణవీ దీక్ష అవుతుంది. శిష్యుడిని మంచి దారిలో ప్రవర్తింపజేయటం, తత్త్వం, హితం, పరమార్థం మొదలైన విషయాల్ని బోధించటం మొదలైనవన్నీ ఇందులోకి వస్తాయి. గురువునే పరమాత్మగా ఆరాధించటం, ధన, మాన, ప్రాణాల్ని కూడా గురువుకే అర్పించటం ఈ దీక్షలో ప్రధానమైన అంశంగా ఉంటుంది. గురువు గారిని దర్శించటం, స్పృశించడం, మాట్లాడటం వల్లనే తత్త్వ జ్ఞానము కలుగుతుంది. గురువు జ్ఞాన మార్గంతో శిష్యదేహంలో ప్రవేశించి శిష్యుడి జ్ఞాన నేత్రాన్ని తెరిపించి పరమాత్మ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేయటం వైష్ణవి దీక్ష అవుతుంది. దీన్నే జ్ఞానదీక్ష లేదా బ్రహ్మచర్య దీక్ష అని కూడా అంటారు
ప్రతి దీక్షలోను కలశ స్థాపన ప్రధానమైన అంశంగా ఉంటుంంది. 'క' అనగా పరబ్రహ్మ, 'ల' అంటే లక్ష్మీ, 'శ' అంటే శాంతి, శక్తి అని అర్థం. కలశం బ్రహ్మాండానికి, అందులో ఉన్న జలం సకల దేవతలకు, ఆకులు సకల ప్రాణులకు ప్రతీకలుగా ఉంటాయి. కొబ్బరికాయ మనం ఏర్పరచుకునే స్థిరమైన సంకల్పానికి, దానిపై వేసిన వస్త్రం మన శరీరానికి ప్రతిరూపాలుగా ఉంటాయి. ఈవిధంగా త్రికరణాలతో త్రిమూర్తుల్ని, త్రిలోకాలని, తత్త్వ త్రయాన్ని ఆరాధించటమే కలశస్థాపన అవుతుంది. మొత్తంగా దీక్షలో ప్రధానంగా స్థాపించే కలశం మనల్ని తత్త్వాతీతులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పునాది వేస్తుందని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా కలశస్థాపనతో స్వీకరించే దీక్షను క్రియావతి అని, మంత్రములతో చేస్తే మాంత్రి అని అంటారు.
దీక్షలు క్రియావతి, కళావతి, వర్ణమయి, బోధమయి అని నాలుగురకాలుగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కలశ స్థాపన చేసే విధానం క్రియావతి అవుతుంది. కలశంలో దేవతాకళలను ఆవాహన చెయ్యటం కళావతి. మంత్రాలు చదువటం, ఉపదేశించటం వర్ణమయి. తత్త్వ జ్ఞానాన్ని బోధించటం బోధమయి అవుతాయి. ఈవిధమైన దీక్షానియమాలతో దేవతల్ని ఆరాధించాలని, వారికి సంబంధించిన దీక్షావిధానాల్ని పాటించాలని వివిధ శాస్త్రాలతో పాటు ఆచార సంప్రదాయాలు కూడా చెబుతున్నాయి
దీక్ష ఎందుకు?
పేరేదైనా సరే దీక్ష స్వీకరించగానే ఒక పవిత్ర స్పహ మనసులోకి ప్రవేశిస్తుంది. వికృత పద్ధతులు, పాశవిక స్థితులు దూరమై, ఆధ్యాత్మిక అభ్యున్నతి వైపు అడుగులు కదుపుతాం. ఆత్మవికాసాన్ని పెంచుకోగలుగుతాం. భౌతికమైన ఎదుగుదలను కట్టడి చేసి, ఎదుటివారిని మన ఇష్టదైవంగా భావించి ఆ పేరుతోనే పలుకరిస్తాం. ఇంకా మరెన్నో పద్ధతుల ద్వారా మానసిక పరిణతిని పెంపొందించుకోవడానికి కృషి చేస్తాం. ఇదంతా జరగటానికి దీక్షకు సంబంధించిన నియమాలు దోహదపడతాయి. అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ప్రతి క్షణం మనల్ని మనం నియంత్రించుకోవడానికి ప్రయత్నించుకోవటం ద్వారా దీక్ష తీసుకున్న లక్ష్యాన్ని చేరుకోవటం సులభమవుతుంది.
దీక్ష అంటే కేవలం కొన్ని కఠినమైన నియమాల్ని పాటించటం మాత్రమే కాదు. అందుకు ఆంతరిక శుద్ధి తప్పనిసరి. దీక్ష ఇచ్చే వ్యక్తి, తీసుకునే వ్యక్తి ఇద్దరూ పరిశుద్ధమైన మనస్సు కలిగిఉండాలి. లేదంటే దీక్ష అనే మాటకే అర్థం మారిపోతుంది.
పాలను ఏదైనా గిన్నెలో పొయ్యాలనకున్నప్పుడు ముందుగా ఆ గిన్నె శుభ్రంగా ఉందో లేదో చూస్తాం. శుభ్రంగా ఉంటే సరి. లేదంటే గిన్నెను శుభ్రపరిచిన తర్వాతనే పాలను అందులోకి పోస్తాం. లేదంటే పాలు విరిగిపోతాయి. దీక్ష కూడా పాలవంటిదే. ఇక్కడ శరీరం గిన్నె వంటిది. శుభ్రమైన శరీరం (బాహ్యంగాను, మానసికంగాను) లేకపోతే అందులోకి పోసే (స్వీకరించే) దీక్ష కూడా మలినమవుతుంది. కాబట్టి, ఏవిధమైన దీక్ష చెయ్యాలని నిశ్చయించుకున్నా ముందుగా మన శరీరాన్ని మానసికంగాను, శారీరకంగాను ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత సద్గురువును ఆశ్రయించి, ఆయన సూచనల ప్రకారం దీక్ష తీసుకోవాలి. అంతేకానీ ఏ వ్యక్తీ తనకు తానుగా దీక్ష తీసుకుంటున్నానని ప్రకటించకూడదు. ఆచరించకూడదు. ప్రత్యేకించి మంత్ర దీక్షల విషయంలో గురు అనుగ్రహం తప్పనిసరి.
కార్యసాధనకు దీక్ష తప్పనిసరి అనే అంశాన్ని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత ఆరో అధ్యాయంలో చెబుతాడు.
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ |
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గహ్యతే ||
అర్జునా! మనస్సును నిగ్రహించటం చాలా కష్టసాధ్యం. అయినప్పటికీ అభ్యాసం చేత, వైరాగ్యం చేత దాన్ని సాధించవచ్చంటాడు పరమాత్మ. ఇక్కడ అభ్యాసం అంటే దీక్ష. మనస్సును స్వాధీనం చేసుకోవాలంటే సాధారణ దీక్ష సరిపోదు. అకుంఠితమైన దీక్ష కావాలి. అకుంఠితం అంటే ఏ ఒక్కరోజూ కుంటుపడనిది అని అర్థం. దీక్ష తీసుకున్న తర్వాత మన నిర్ణయం మారకూడదు. మరో ఆలోచనకు తావు ఇవ్వకూడదు. అలాచేసినప్పుడే స్వీకరించిన దీక్ష కోరుకున్న ఫలితాన్ని ఇస్తుంది.
'దేహో దేవాలయః ప్రోక్తో జీవోదేవస్సనాతనః'. దేహమే దేవాలయం. జీవుడే పరమేశ్వరుడని ఉపనిషత్తులు చెబుతున్నాయి. తనలో ఉన్న పరమేశ్వరతత్త్వాన్ని మనిషి గుర్తించటం కోసం దీక్ష తీసుకుంటాడు కాబట్టే ఆ క్షణం నుంచి జీవుడు దేవుడుగా మారుతాడు. దేవాలయాన్ని ఎలాగైతే అత్యంత శుచిగా ఉంచుతారో దేహాన్ని కూడా అలాగే ఉంచుకుంటారు. భూశయనం ఆత్మ నిగ్రహాన్ని, శీతలస్నానం శారీరక శక్తిని ఇస్తాయి. కఠిన నియమాలు దీక్షాధారులు పాటించడం వెనుక ఉన్న ఆధ్మాత్మిక సందేశం ఇది.
దీక్షను స్వీకరించిన వారు స్వయంగా దైవ భావన కలిగి నిరాడంబరులై అరుణోదయ, తపనోదయ, సంగమ, మధ్యాహ్న, సాయం, అర్థనిశా సమయాల్లో పూజలు ఆచరించాలి. వీటినే షట్కాలార్చన అంటారు. (ఆరు కాలాల్లో అర్చన చేయలేని వారు కనీసం ఉదయం, సాయంత్రం వేళల్లో తప్పనిసరిగా అర్చన చెయ్యాలి). దీక్ష పూర్తయ్యేవరకు సాధ్యమైనంత సేపు మౌనం వహించాలి. ఏ దీక్షనైతే స్వీకరిస్తారో దానికి సంబంధించినటువంటి అన్ని నియమాలను పాటించాలి.
No comments:
Post a Comment