🌷ఆనందంగారూ... ఆవకాయ...అనసూయమ్మ గారూ... ఫొటోగ్రఫీ🌷
ఆనందం గారి వయసు అరవై దాటింది. ఈ మధ్యే రిటైర్ అయ్యారు. అంతవరకూ మామూలు ఫోన్ వాడేవారు. వాట్సాప్ ఉండేది కాదు అందులో అవసరమైనంత మేర ఫోన్ వాడడం, న్యూస్ పేపర్, రేడియో, ఆఫీస్, టీవీ వార్తలు, సినిమాలు , పాడుతా తీయగా, స్వరాభిషేకాలుతో ఆయనకి టైమ్ సరిపోయేది.
చెప్పాలంటే ఆయన జీవితం కొద్దో గొప్పో ఉన్నంతలో సాఫీగానే జరిగింది. కొడుకూ, కోడలూ మనవరాలు ఇంట్లోనే ఉంటారు. కొడుకు ఐటీ ఉద్యోగం,కోడలు టీచరూనూ!
కూతురు ఓ అరకిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇద్దరు పిల్లలూ, అల్లుడు ఐటీ, మావగారితో ఉంటారు. అత్తగారు పోయి ఐదేళ్ళయింది. కూతురు కి పిల్లలూ, మావగారి ని చూసుకోవడమే సరిపోతుంది. ఉద్యోగం చేయదు.
అనసూయమ్మ గారు ఒళ్ళు దాచుకునే మనిషి కాదు. గట్టి నోరున్న మనిషీ కాదు.నిదానస్తురాలు బాగా! అత్తగారి దగ్గర అన్ని రకాల ఊరగాయలూ నేర్చుకుని, కావాల్సిన వారందరికీ కూడా పెట్టి పెట్టేది. మరుదులు, ఆడబడచులు వేసవి శలవల్లో వచ్చి ఈవిడ చేతే ఊరగాయలు పెట్టించుకుని వెళ్ళేవారు.
ఈ ఆనందం గారికి తన వ్యాపకం ఏదో తనదే. పెద్దగా ఇంటి సంగతులు పట్టవు. అవసరం కూడా రాలేదు ఎప్పుడూ.భార్య సంబాళిస్తుందన్న నమ్మకం అంతే. అనసూయమ్మ గారు కూడా ఎప్పుడూ ఆయనతో ఎవరిమీదా కంప్లైంట్లూ చెప్పలేదు.
ఆవకాయ పెట్టించుకుని మరిది డబ్బు ఎగవేసినా, ఆడబడుచు " ఈ సంవత్సరం ఊరగాయలు ఒద్దు మాకు ఒదినా "అంటూనే తను పెట్టుకున్న వాటిల్లో సగం పట్టుకు పోయినా, ఆనందం గారి వరకూ కూడా రాలేదు ఆ విషయాలు.
కూతురు మాత్రం దెబ్బలాడేది. మరీ ఇంత మెతకేంటమ్మా నువ్వూ అని. కోడలికి ఇంట్లో పెద్ద సమస్యలేమీ లేవు ,అలా అని అత్తగారి మీద పూర్తిగా ఆధారపడిపోనూ లేదు.నాలుగిళ్ళ అవతలే కోడలి పుట్టిల్లు.
ఆనందం గారు రిటైర్ అయినపుడు అల్లుడు మంచి మొబైల్ కొనిచ్చి వాట్సాప్ , ఫేస్ బుక్ ఇన్స్టాల్ చేసి ఇచ్చాడు. మొదట్లో పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ... నెమ్మది నెమ్మదిగా జాయిన్ అని కనిపించిన ప్రతీ గ్రూప్ లోనూ జాయిన్ అయిపోయారు. వాట్సాప్ లలో కూడా అటు పోస్ట్, ఇటూ, ఇటు పోస్ట్ అటూ ఫార్వార్డ్ చేసుకుంటూ, మధ్య మధ్యలో సుడోకూ చేసుకుంటూ ప్రపంచాన్నే మర్చిపోయే స్టేజ్ కి వచ్చారాయన.
ఇందులో ఇందులో ఓ రెండు మూడు ఫుడ్ గ్రూప్స్ లో జాయిన్ అయిపోయారు.ఇక ఆ ఫొటోలేవో చూడడం , వెళ్ళి కూరలు తేవడం, అనసూయమ్మగారిని వండమనడం. నెమ్మదిగా వంటల ఫొటోలు తీయడం,అవి ఫార్వార్డ్ చేయడం నేర్చుకున్నారు.
ఏవైనా వంటలు ఆవిడకి రావంటే సణగడం, నేను చదువుతాను చెయ్యి అనడం, అవి కుదరక, బాగాలేకపోతే విసుక్కోవడం మొదలెట్టారు.ఆవిడకి ఈ నస భరించడం కష్టంగా ఉంది.
సరే ఏప్రిల్, మే నెలలు వస్తున్నాయి. అందరూ రకరకాల ఊరగాయల పోస్ట్ లతో ఊరించేస్తున్నారు. అనసూయమ్మ గారు పెట్టడం లేదనీ, ఆవిడకి బధ్ధకం వచ్చేసిందనీ, తెగ అందరితో చెప్పీ చెప్పీ ఆవిడని వీధిలో పెడుతున్నారు.
శలవలని మనవరాల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళింది కోడలు. కొడుకు ఎప్పుడూ బిజీ యే. కూతురికి పిల్లల చదువులూ, మావగారూ,చుట్టపు చూపు తప్పితే వచ్చి ఉండడానికి ఉండదు.
ఈయన ఆవకాయ నస ఎక్కువైపోతోంది. ఆవిడ కిమ్మన్నాస్తి. పోనీ కాయ కొని పడేద్దామంటే ఆయనకి అసలు ఆ వివరమే తెలీదు. ఆవిడ నోరు విప్పదూ.
ఒకరోజు ఆయనకి ఇంక తిక్కపుట్టేసింది. మే నెల సగం అయిపోయింది. అసలు ఒక్కొక్కరి ఊరగాయల పోస్ట్లు చూస్తే ఆయనకి మతి పోతోంది. తనూ పోస్ట్ లు పెట్టేయాలని ఉవ్విళ్ళూరిపోతున్నారు...ఇక లాభం లేదని ఆవిడని తిట్టడం మొదలు పెట్టారు. ఆయనకే "తనేనా" అనిపించేటన్ని తిట్లు ఆవిడని.
ఈవిడ రాయిలా కూర్చుంది. ఆవిడ మాట్లాడకపోవడంతో శివాలు వచ్చేసి చెయ్యెత్తి కొట్టడానికి మీద మీదకి వచ్చేసారు.
అంతే ఆవిడ "ఆగండి" అని ఒక్కరుపు అరిచారు. "ఏం నేను ఊరగాయ పెట్టకపోతే అంత కోపమా? ఇన్నాళ్ళూ మీ వాళ్ళంతా నా చేత పెట్టించుకున్నారు. ఇప్పుడు యూ ట్యూబ్ లు వచ్చాక వాళ్ళే పెట్టుకుంటున్నారుగా.
పెద్దవాళ్ళమని వాళ్ళు కొంచెమైనా సాంపిల్ ఇవ్వొచ్చుగా! ఒక్కరంటే ఒక్కరు మన మొహాన ఇంత ఊరగాయ ఇవ్వలేదు.
మీరు కూడా చచ్చీ చెడీ పెడితే తిన్నప్పుడెపుడూ బావుందని మెచ్చుకోలేదు.
ఈ రోజు అందుల్లో ఫొటోల కోసం నా వంటా, నా ఊరగాయా కావాల్సి వచ్చాయా?
చూస్తున్నాను నేనూ ,ఈ వయసులో మీ వేషాలు ఎంతసేపూ ఆ మొబైల్ గోల లో పడి సంధ్యా వందనం, వాకింగూ మానేసారు.
ఇదిగో ఇప్పుడూ ఈ కోపం కూడా!! ఎప్పుడైనా మీరిలా ఉన్నారా? ఈ బీపీ పెరిగే టైంలో మళ్ళీ ఊరగాయలొకటా? నేను పెట్టను. "పోనీ తినేద్దామన్న తాపత్రయమా" అంటే అదీ లేదు. రోజూ రోటి పచ్చడి ఉండాలాయే.
ఇంతోటి మొబైల్ లో గ్రూపుల్లో అందరికీ మేమూ పెట్టుకున్నామహో అని చెప్పుకోవడానికి వేలకి వేలు తగలేసి నేను ఊరగాయలు పెట్టాలా?
ఇంక అక్కడనుంచీ కచ్చాపోసి కట్టుకో, ముడెట్టుకో, రెండు పూవులెట్టుకో... జాడీని,నూనెని ఆ తూర్పు వైపు పెట్టు, కాయలు పడమరగా, ఉప్పూ కారం ఉత్తరంగా, కత్తిపీట దక్షిణంగా... నీ మొహం ఐమూలగా అంటూ నన్ను చంపుకుని తిని ఫొటోలు తీసి, ఎడిట్ చేసీ... ఆఖరికి ఆ తొక్కలూ, టెంకలూ డస్ట్ బిన్ లో వేసే ఫొటో కూడా తీసి దానికో చింకి చీర కట్టుకోమనీ.
ఇక మాగాయ కయితే కుదురుగా ముక్కలు తరుగుతూ, ఉప్పగా ఉప్పూ, పచ్చగా పసుపూ అంటూ తలో సారీ కలిపి, ఆ తర్వాత బకెట్ కెత్తడం అవి స్లో మోషన్ లో ఫొటోలు తీయడం,
ఆ తర్వాత రోలూ, చిల్లుల పళ్ళెం, ముక్కల మూటా విడి విడిగా ఫొటోలు, వీడియో, చాలదన్నట్లు రోటికి పసుపూ కుంకాలు పెట్టమనడం.
ఆ తర్వాత మీరు సెలెక్ట్ చేసిన చీర కట్టుకుని, కాళ్ళకి పసుపూ, పారాణీ, పాంజేబులూ కడియాలు, మెట్టెలూ కనబడేలా ఒక్కో మెట్టే వయ్యారంగా నడవడం, అక్కడ హీరోయిన్ లా కూర్చుని ముక్కలు నెరపడం .
మళ్ళీ ఆ చేతులకి మేచింగ్ పసుపు గాజులు, కాంట్రాస్ట్ గా ఎర్రగాజులూ, ముక్కలెండేకా ఇంకా వయ్యారంగా మెట్లు దిగడం, అప్పుడు నా మొహం కూడా ఒరుగుల్లా ఒరిగిపోయినట్లు పెట్టమనడం, చెమటకి బొట్టు కారినట్లు కుంకుమ పెట్టుకుని చెరుపు కోమనడం...కళ్ళకి ఎన్నడూ లేనిది కాటుక కొసలు తీర్చుకోమనడం.
ఇంక కిందకి వచ్చాక... ఆ నల్ల ఇనుప మూకుడిని తళ తళ లాడిపోయేలా ఎక్సో సబ్బు మనదే అన్నట్లుగా రుద్ది రుద్ది తోమడం, ఆనక ఆవాలూ, మెంతులూ వేయించడం,అవి చల్లారేలోగా మళ్ళీ కాస్ట్యూమ్ ఛేంజింగ్, మ్యాచింగ్లూ, శ్రాధ్ధాలూ,
మళ్ళీ మిక్సీ చప్పుడులూ,మళ్ళీ GIF మోడ్ లో ఆ పిండి తీయడం, పోపూ, AS Brand పప్పునూనె అని ప్యాకెట్ చూపించి సైగలూ, కట్చేయడం, మూకుట్లోకి వంచడం, మిరపకాయలు తుంచడం, ఇంగువని ముక్కు పీల్చుకుంటూ వాసన అమోఘం అని ఎక్స్ప్రెషన్ ఇస్తూ.
మళ్ళీ స్లో మోషన్ లో మాగాయ కలుపుతూ... లాస్ట్ లో మాగాయ ముద్దలు పెట్టడానికి చేతులు కోసం రోడ్ మీద పిల్లలని చాక్లెట్ లిచ్చి బతిమాలి ఇంట్లోకి తీసుకురావడం, వాళ్ళందరిచేతా యమ్మీ అనిపించినందుకు గానూ తలో మావిడిపండూ లంచం...
ఆఖర్న ఊరగాయల కంపెనీ ఎడ్వర్టైజ్ మెంట్ ఇచ్చే దానిలా అన్నీ డిస్ ప్లేలతో నా నడ్డి విరిగి నుంచోలేకపోయినా నవ్వుతూ రెండు వేళ్ళూ దేనికో తెలీకుండా చూపిస్తూ, మేచింగ్ పట్టుచీరా, తల్లో మల్లెపూలూ,పక్కన మావిడిపళ్ళూ, ముంజులూ, వడ్డాణం, వంకీ అన్నీ బ్యాంక్ నించి తెచ్చుకుని దిగేసుకుని,
నా వల్ల కాదు బాబోయ్!
అసలు ఆవకాయలకి దిష్టి తగలకుండా మూడో కంటికి తెలియకుండా పెట్టేసుకోవాలని మీ అమ్మగారు చెప్పి జాడీలకెత్తి వాసెన కట్టాక దిష్టి తీసేవారు కూడానూ! ఆ గదిలోకి ఎవరినీ వెళ్ళనిచ్చే వారే కాదూ, నాకూ అలానే అలవాటు.
ఈ గోల అంతా నా వల్ల కాదు. నేనేమైనా ముఫ్పై ఏళ్ళ పడుచు పిల్లనా? యూ గో టూ హెల్ విత్ యువర్ పికిల్స్, ఫొటోస్ అండ్ యువర్ గ్రూప్స్. కావాలంటే మీరు ఊరగాయలు పెట్టుకోండి. మా మేనల్లుడు ఫొటోగ్రాఫరే కదా,వాడిని పిలిచి ఫొటోలు తీయిస్తా మీకు.
ఇక ఆయాసంతో చారగిలపడిపోయారు అనసూయమ్మ గారు. ఆనందం గారు ఈ ఎదురు చూడని అటాక్ కి అవాక్కైపోయారు. వెనక్కి వెనక్కి అడుగులేసుకుంటూ కుర్చీ లో కూలబడ్డారు.
జీవితంలో ఇంత షాక్ ఆయనెప్పుడూ తినలేదు. అనసూయమ్మ గారు ఇంత మాట్లాడగలరనీ తెలీదు!
కాసేపు సీలింగ్ కేసీ, కాసేపు ఒగరుస్తూ కళ్ళు మూసుకుని కూర్చున్న అనసూయమ్మ గారి వైపూ, కాసేపు మొబైల్ వైపూ, కాసేపు ఎదురుగా ఉన్న వాళ్ళమ్మ గారి ఫొటో వైపూ చూసుకుంటూ గడిపి ,మెల్లగా లేచి... ఫ్రిజ్ లో ఉన్న చల్లని మాజా ని చెరొక గ్లాస్ లో పోసుకొచ్చి ఆవిడ పక్కనే కూర్చుని ఆవిడకొకటి ఇచ్చి తనొకటి తాగీ!
చాలాసేపు ఆవిడ చేయి పట్టుకుని కూర్చుండిపోయారు. ఏం చేయాలో డిసైడ్ చేసుకుని ఆయనా, మనసులో ఉన్నదంతా కక్కేసి ఆవిడా ఫ్రీ అయిపోయారు.
ఆ రాత్రికే ఆనందం గారూ వంటల గ్రూపుల నుంచి లెఫ్ట్ అయిపోయారు. మళ్ళీ మర్నాడు ఇల్లు మామూలుగా ఆయన సంధ్యావందనం, వాకింగూ తో, ఆవిడ వంటతో డే స్టార్ట్ అయింది వాళ్ళకి.
కొద్దిగా చూసుకుని లిమిటెడ్ గ్రూపుల్లో జాయిన్ అయ్యారు ఆయన. నిజమే సుమీ! వంట వస్తే వంటల గ్రూప్ గానీ ఏమీ రాని నాలాంటి వాళ్ళు ఆ జోలికి పోగూడదని లెంపలేసుకున్నారు.
ఎప్పుడు పెట్టారో అనసూయమ్మ గారు మధ్యాహ్నం భోజనంలో ముద్దపప్పూ , ఆనపకాయ పాలు పోసి కూరా,ఇంగువ తో ఘుమ ఘుమ లాడే మాగాయ ఇంత వెన్నపూస వేసి, పెరుగులో చక్కటి నూజివీడు రసం వేసి ఆయనేదో మాట్లాడుతుంటే ఆవిడ వింటూ భోజనాలు చేసారు.
ప్రశాంతంగా భోజనం చేసి ఎన్నాళ్ళయిందో అనుకుంటూ ఆనందంగా ఆనందం గారు పడక్కుర్చీలో వాలారు.
వంటిల్లు సర్దుకుని వచ్చిన అనసూయమ్మ గారి ఎర్రగా గోరింటాకు తో పండిన వేళ్ళకి లేత తమలపాకులతో చుట్టిన ఆకులు, ఆ గాజులు, ఆ ప్రధానపుటుంగరం చూడగానే ఆయనకి ఫొటో తీయాలని కోరిక కలిగింది కానీ...
"హుష్షూ " "హుష్షూ" అనుకుంటూ మెదడులో క్లిక్ మనిపించారు ఆ ఆనంద క్షణాలని.😊😍😊😍
No comments:
Post a Comment