Thursday, November 30, 2023

******మనిషి వాటికి మించినవాటిలో ఆనందం వెతుక్కుంటాడు....ఆనందాన్ని ప్రాపంచికంగా వెతుక్కున్నంత కాలమూ....ఆధ్యాత్మికత అంతా ....

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝*ప్రాణికోటియావత్తూ ఆనందం కోసమే తపిస్తుంది. మానవేతర ప్రాణులకు ఆహారం, నిద్ర, సంపర్కాల్లో ఆనందం లభిస్తుంది. మనిషి వాటికి మించినవాటిలో ఆనందం వెతుక్కుంటాడు. ప్రధానంగా సుఖసంపదల పట్ల మోహితుడై వాటిలోనే ఆనందం ఉన్నదని అనుకుంటాడు.* 
💖 *జీవితంలో అధిక భాగాన్ని ఆర్జన, సుఖసౌకర్యాలను సమకూర్చుకోవడంలోనే గడిపేస్తాడు. తనకే కాకుండా తనవారికి,తరవాతి తరాలవారికీ సిరిసంపదలు, సుఖసౌఖ్యాలు కొనసాగేందుకు అన్ని ఏర్పాట్లూ చేసే ప్రయత్నాలతో కూడా తృప్తిచెందడు.*
❤️ *తేనెటీగలు ఆర్జించిన మధు సంపదంతా పరులపాలే కదా. మనుషులు పలు విధాలుగా ఆర్జించిందంతాఅప్రయోజకులు, అసమర్థులైన వారసులపాలై దుర్వినియోగం అవుతుంది.*
💕 *మహాసామ్రాజ్యాలు స్థాపించిన సమ్రాట్టులూ తమ వంశీకుల అసమర్థతవల్ల రాజ్యశ్రీని కోల్పోయారు. కేవలం కల్యాణ చక్రవర్తి అయిన పరమాత్మ ప్రభుత్వం ఒక్కటే భువిమీద శాశ్వతంగా ఉంటుంది. మిగిలినవన్నీ కాలవాహినిలో కలిసిపోయేవే.*
💞 *ఆనందాన్ని ప్రాపంచికంగా వెతుక్కున్నంత కాలమూ అది తృణబిందువులా మురిపించి మట్టిలో కరిగిపోతుంది. పట్టుకోవాలని అనుకుంటే పాదరసంలా జారిపోతుంది. ఆనందం సహజంగానే లభించాలంటే ఆధ్యాత్మికసాధన మార్గమే శరణ్యం.*
💓 *ఆధ్యాత్మికత అంతా ఆత్మజ్ఞానానికి సంబంధించినదే. అతికొద్దిమందికే ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి, అనురక్తి కలుగుతాయి. వారిలో కొందరే ఆత్మను నమ్ముతారు. అలా నమ్మి సాధన చేసినవారికే ఆత్మమందిరం మెట్లు అగుపిస్తాయి. పట్టుదలగా ముందుకు సాగినకొద్దీ చీకటిలోంచి వెలుగువైపు వెళ్తున్న అనుభూతి కలుగుతుంది. అది వెన్నెల లాంటి వెలుగు. మనసు ప్రసన్నమవుతుంది.*

💖 *ఒక్కసారి మనలో ఈ అనుభూతి మందిరం నిర్మితమైతే, అందులోంచి బయటకు రావాలనిపించదు. ఇది తొలిదశ. ఆ మందిరంలో స్థిరపడితే, బయటకు రావడం అసాధ్యం. మనలోని చలన శక్తులన్నీ జడమైపోతాయి. అటువంటి సమాధిస్థితిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి నిర్వికల్ప సమాధి. కాగా రెండవది సహజ సమాధి.* 
❤️ *శ్రీరామకృష్ణులు తన ప్రియశిష్యుడైన వివేకానందుడికి నిర్వికల్ప సమాధినే అనుగ్రహించారు. ఆయన ఎప్పుడూ సహజ సమాధిస్థితిలో ఉండేవారు. చూసేవారికి వారు అందరిలాగే కనిపించేవారు. కానీ, భౌతికస్థితికి అతీతంగా ఉండేవారు. శ్రీరమణులూ అంతే. క్యాన్సరు బాధ ఆయనలో ఏనాడూ వ్యక్తమయ్యేది కాదు. మత్తుమందు లేకుండా శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన సహజ సమాధిస్థితి ఎలాంటిదో మనకు తెలిపే ఉదంతమిది. గంగాతీరంలో మిట్టమధ్యాహ్నం, నిప్పులుచెరిగే ఎండలో, బొబ్బలు పుట్టించే వేడి ఇసుకమీద రామకృష్ణులు సహజ సమాధిస్థితిలో శయనించేవారు. శరీరం బొబ్బలెక్కిపోతున్నా మొహంలో మందహాసం అలాగే ఉండేది.*
💕 *గురు అర్జునదేవ్‌ ఎర్రటి పెనంమీద కూర్చుని, కాలే ఇసుకను శరీరం మీద పోస్తుంటే, ఎలాంటి బాధనూ వ్యక్తం చెయ్యకుండా దైవధ్యానం చేస్తుండిపోయారు. ఇవన్నీ కాకమ్మ కథలు కావు. చారిత్రక అంశాలు. పరమసత్యాలు.*
💞 *గురునానక్‌ చెరసాలలో సైతం దైవసంకీర్తన చేస్తూ ఆనందంగా ఉండటం బాబర్‌ను అబ్బురపరచింది. ఆయన మహనీయత్వాన్ని గుర్తింపజేసింది. మన ఆనంద మందిరం అంతర్యామి నిలయమే. మనలోనే ఉన్న మహత్తరమైన దివ్యమందిరాన్ని గుర్తిస్తే చాలు. ఆనందంకోసం వెతుకులాట విరమిస్తాం. కళ్లు తెరిస్తే కనిపించేది మాయలోకం. కళ్లు మూసి చూడగలిగేదే ఆనందమందిరం. మన సాధనలక్ష్యం అదే అయితే “సాధనమున పనులు సమకూరు ధరలోన.”*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment