030323c1536. 040323-3.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀288.
శ్రీ మహాభారతం
➖➖➖✍️
288 వ భాగం
శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:
#ముక్తిమార్గం:
ధర్మరాజు… “పితామహా ! నాకు మోక్ష మార్గము ఉపదేశించు” అని కోరాడు.
భీష్ముడు “ధర్మనందనా ! వార్ణేయ అధ్యాత్మము అను కథ ఒకటి ఉన్నది. అందులో నీకు తగిన సమాధానము దొరుకుతుంది. పూర్వము వార్ణేయుడు అనే పేరుగల ఒక మాన్యుడైన మునీశ్వరుడు ఉండే వాడు. ఒక రోజు అతడిని అతడి శిష్యుడు నమస్కరించి ‘గురువర్యా ! మీరు నాకు మోక్షమార్గము ఉపదేశించండి’ అని అడిగాడు. అందుకు వార్ణేయుడు ‘కుమారా ! నీకు భక్తి, జ్ఞానము సమృద్ధిగా ఉన్నాయి. నీవు మోక్షమార్గము ఉపదేశము పొందుటకు అర్హుడవు. కనుక సావధానముగా విను… ఈ కాలచక్రము నిరంతరము తిరుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడు ఆరంభము అయిందో ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఆగి పోతుందో తెలియదు. ఈ కాలప్రవాహములో సృష్టి, లయము జరుగుతుంటుంది. ప్రళయకాలములో సమస్తప్రకృతి లయమైనా పరమాత్మ మాత్రము మిగిలి ఉంటాడు. తిరిగి సృష్టి ప్రారంభమై తిరిగి జీవజాలసృష్టి జరుగుతుంది. పరమాత్మ నుండి ముని శ్రేష్టులు సకల శాస్త్రములు, సర్వవేదములు పొందుతారు. అలా పొందిన జ్ఞానులు దానిని విపులంగా అనేక శాస్త్రములుగా విడదీసి లోకులకు అందిస్తారు. ఈ పరిజ్ఞానము దేతలకైనా దుర్లభము. మునులకు సాధ్యము కూడా కానిది. పరమాత్మకు మాత్రమే అది అవగతము. సకల దుఃఖాలకు ఔషధమైన ఈ పరిజ్ఞానాన్ని పరమాత్మ కరుణించి లోకాలకు అందజేస్తాడు. క్రమక్రమముగా గురు శిష్యపరంపరగా ఆ జ్ఞానము లోకములో విస్తరించినది. ప్రకృతి పురుషుల సమ్మేళనంగా చైతన్యము ఉద్భవించింది. ఆ చైతన్యము నుండి బుద్ధి, బుద్ధి నుండి అహంకారము, అహంకారము చిత్తమును ఆశ్రయించి ఉంటుంది. అహంకారము నుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి తేజస్సు, తేజస్సు నుండి జలము, జలము నుండి భూమి పుట్టాయి. బుద్ధిని మహత్వము అంటారు. మహత్వము నుండి ఐదు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఐదు, వీటితో శబ్ధ, స్పర్శ, రూపము, రుచి, గంధము అను అయిదు వాటితో మనస్సును చేర్చి పదహారు వికృతులు ఏర్పడినాయి. కుమారా ! శరీరము తొమ్మిది ద్వారములు కలిగిన పుణ్యనగరము. ఈ నగరంలో ఊహకందని రీతిలో పరమాత్మ వ్యాపించి ఉంటాడు. ఆ పరమాత్మను పురుషుడు అంటారు. ఆ పురుషుడు అమరుడు, అవ్యయుడు, అజరుడు, అమేయుడు, అమలుడు. చెట్టునందు దాగి ఉన్న అగ్నిలా పురుషుడు జీవులలో అవ్యక్తంగా ఉన్నాడు. ఎండిన చెట్లు రాచుకున్నప్పుడు చెట్టు నుండి నిప్పు పుట్టిన విధంగా జ్ఞానాగ్నిలో ధగ్ధుడైన మానవుడు యోగముతో మనస్సును మధించిన పరమాత్మను కనుగొనగలడు. ఈ పురుషుని ఉనికివలననే ప్రాణులు చూచుట, వాసన చూచుట, స్పర్శజ్ఞానము, రుచి తెలుసుకొనుట వంటివి తెలుసుకుంటాయి. కుమారా ! ఈ భూతకోటి అవ్యక్తము నుండి వ్యక్తము ఔతాయి, జీవిస్తున్నాయి, నశిస్తున్నాయి. పుట్టడము, పెరగడము, నశించడము వీటికి పురుషుడు సాక్షీభూతుడు. ఈ కాలచక్రముకు అంచులు ఏడు. దానికి అవ్యక్తము కేంద్రము. ఆ చక్రము చుట్టూ పదహారు వలయాలు ఆవరించి ఉంటాయి. వాటి మీద పురుషుడు అధిష్టించి ఉంటాడు. మానవుడు త్రిగుణములకు లోబడి నడుచుకుంటాడు. విజ్ఞుడు వాటికి లోబడక వివేకంతో నడచుకుంటాడు. ఈ లోకములో వేదాంత విధులు అరుదుగా ఉంటారు. వారు ప్రవృత్తి లక్షణముతో ధర్మాచరణ చేస్తుంటారు. సాధారణ మానవులు సుఖములలో తేలుతుంటారు. అందువలన వారు పుణ్యాత్ములు కాలేరు. ప్రవృత్తి కార్యములు చేస్తూ ఉన్న దేహాభిమానము వదలని వారు కామ క్రోధమును విడువ లేరు. కనుక విజ్ఞులు దేహముపై అభిమానమును వదిలివేయాలి. అరణ్యము వంటి ఈ సంసారములో మానవుడు అత్యంత కుతూహలముతో తిరుగుతూ ఉంటాడు. ఎంత ప్రయాణించినా అవతలి ఒడ్డు చేరలేడు. శరీరానికి వచ్చిన రోగమును ఔషధ సేవనముతో నయము చేసుకున్నట్లు దేహాభిమానము పోవడానికి సత్యము, శౌచము, శమము, దమము పాటించాలి. పంచభూతములకు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, ఈ భూమిని ఏలే అధిపతులకు అహంకారము నివాసస్థలము. స్మృతి, సంప్రీతి, ప్రసన్నత మొదలైనవి సత్వగుణము వలన జనిస్తాయి. రాగము, ద్వేషము, మోహము, లోభము రజోగుణ ఉత్పన్నములు. దర్పము, శోకము తామసగుణ ఉత్పన్నములు. జ్ఞానసముపార్జనకు ఈ మూడు గుణములు అవరోధములే అయినా మానవుడు ముందు రజో, తామస గుణములను విడిచి వేసి మనస్సును సత్వగుణ ప్రధానము చేయాలి. సత్వగుణము జ్ఞానసముపార్జనకు తోడ్పడుతుంది. మానవుడు అహంకారముతో చేసే పనులవలన మానవుడికి వెలుపలి ప్రపంచబంధము ఏర్పడుతుంది. అది పునర్జన్మకు కారణ మౌతుంది. స్త్రీగర్భములో రూపుదిద్దుకున్న పిండము నవమాసములు పొర్లుతూ బయట ప్రపంచానికి వచ్చి ఈ సంసారబంధాలలో చిక్కుకుని దు:ఖసాగరంలో మునిగి పోతున్నాడు. ఈ సంసార బంధానికి మూలము ఆశ తీగ. ఆ తీగ స్త్రీ అనే కొయ్యకు చుట్టుకుని పాకుతూ ఉంటుంది. ఆశ అనే తీగను ఆదిలోనే తుంచి మోక్షమును పొందాలి. జ్ఞానముకు అజ్ఞానముకు మూలము బుద్ధి. అందు నేను అనే భావమే జీవుడు. ఆ జీవుడు మనసుకు లోబడి కర్మబద్ధుడౌతాడు. మనసును రంజింపజేయడానికి ఇంద్రియములతో కర్మలు చేస్తుంటాడు. రాగద్వేషములను విడిచినగాని సంసారము నుండి విముక్తి కలుగదు.
#ఉత్తముడు:
ఈ చరాచర జగత్తులో మానవుడు ఉత్తముడు,
మానవులలో బ్రాహ్మణుడు ఉత్తముడు, బ్రాహ్మణులలో వేదాధ్యయనము చేసిన వారు ఉత్తములు, వారిలో జ్ఞానము కల వారు ఉత్తమోత్తములు. జ్ఞానము మానవుడికి కన్ను వంటిది. అజ్ఞాని గుడ్డి వాడితో సమానుడు. మానవునకు క్షమ, సత్యము, శౌచము ధర్మము. బ్రహ్మచర్యము ఉత్తమధర్మము. అందమైన యువతులతో సంభాషించడము, నిరీక్షించడము చేయకూడదు. అలా చేసిన స్త్రీ పురుషులు ఒకరి మనసులో ఒకరు తిష్ట వేస్తారు. ఈ శరీరము రక్తము, మాంసము, ఎముకల మయమని భావించిన ఆకర్షణ పోతుంది. ఇంద్రియ నిగ్రహము, నాడీశుద్ధి ముఖ్యము. దేహములో పది నాడులు, ఐదు జ్ఞానేంద్రియములు పని చేస్తుంటాయి. అన్ని నాడులకు కేంద్రమైన హృదయ స్థానమున దృష్టిని అంతరము లోకి పంపి మనసు నిలిపిన సుఖముల మీద నుండి మరలి పరబ్రహ్మ సాక్షాత్కారం పొందగలడు. ఇంద్రియ సుఖములు సంకల్ప జనితములు, మానవుడు మనసులో కూడా ఇంద్రియ లోలుడు కారాదు. మనసు కూడా ఇంద్రియమే దానికి అధిపతి ఇంద్రుడు. యువకులైనా, ముసలివారైనా అజ్ఞానము చేత మూర్ఖులై ఇంద్రియవసులై వర్తిస్తారు. కనుక మానవుడు యమ, నియమాలతో ఇంద్రియములను నిగ్రహించాలి. విషయవాంఛలు బహుచెడ్డవి. వాటికి లోను అయిన మనషుడు మోక్షము పొందలేడు. వాటిన అధిగమించిన కాని పరమపదము చేర లేడు. చావు పుట్టుకల మధ్య రోగములు దుఃఖకారణాలు. వివేక వంతుడు జననమరణ చక్రములో బంధించ బడక మోక్షముకై ప్రయత్నిస్తాడు. వివేకి మనస్సును, వాక్కును, శరీరమును పరిశుభ్రపరచుకుని అహంకారమును వదిలి శాంతము వహించి రాగద్వేషములు వదిలి సాటి జీవులమీద కరుణ కలిగి ఉంటాడు. కపటసన్యాసులు ఇంద్రియనిగ్రహము, త్రికరణశుద్ధి నటిస్తూ ధనసంపాదనకు పాటు పడతాడు కనుక సాధకులు మోక్షగాములు వారిపట్ల జాగరూకత వహించాలి. మంచిబుద్ధి , ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము కలిగిన వారికి దేవతలు ప్రసన్నులౌతారు. దైవానుగ్రహము వలన మానవుడికి నిర్మలమైన యోగతంత్రములు అలవడతాయి. అప్పుడు మానవుడు నిశ్చల మనస్కుడై అన్నపానాదుల అందు అనాసక్తి కలిగి శారీరక సుఖములకు దూరముగా ఉండాలి . ఆకుకూరలు, కాయకూరలు, కందమూలములు, బిక్షాటనద్వారా లభించిన ఆహారమును సుఖమునందు అనాసక్తుడై ఈ లోకములో నిశ్చలమనస్కుడై మెలగాలి. సాధకుడు జ్ఞానాగ్నితో విజ్ఞానమును ప్రజ్వలింప చేసి జరామరణ దుఃఖము లేని పర బ్రహ్మతత్వము పొందగలడు. నిద్రావస్థలో త్రిగుణాత్మకమైన గుణమువలన స్వప్నములు కని తాను సంపాదించిన జ్ఞానము మరచిపోగలడు కనుక యోగి నిద్ర అందు జాగరూకుడై ఉండాలి. నిద్రావస్థలో కర్మేంద్రియాలు విశ్రాంతి తీసుకుంటాయి. స్వప్నావస్తలో మనసు పనిచేసి అప్పటి వరకు అనుభవించిన విషయాలను స్వప్నములో కూడా అనుభవిస్తుంటాడు. స్వాప్నికావస్థలో మనసు మిధ్యాసుఖములను అనుభవిస్తుంది. ఆత్మమాత్రము సాక్షీభూతముగా ఉంటుంది. త్రిగుణాలవలన, వాయువుతో కూడిన దోషమువలన నిజరూపములో చూసిన వాటిని మానవుడు మిధ్యారూపములో అనుభవిస్తాడు. స్వప్నావస్థలో వెలుపలి ప్రపంచం ప్రకాశించక పోయినా ఆత్మ మాత్రము ప్రకాశిస్తూనే ఉంటుంది. కనుక స్వప్నావస్థలో మానవుడు అత్యంత తెలివిగా ఉంటాడు. జ్ఞాని త్రిగుణాలకు అతీతుడై నిశ్చల ఆనందం అనుభవిస్తాడు. మృత్యురూపమైన వ్యక్త, అమృతరూపమైన అవ్యక్తము తెలుసుకోకుండా సాధకుడు మోక్షము పొంద లేడు. అవ్యక్తము మూడు లోకాలకు ఆధారభూతము. అది నివృత్తి మార్గము శాస్త్రప్రమాణము. ఈ ప్రకృతి ధర్మము భూత, భవిష్యత్తు, వర్తమాన కాలము బ్రహ్మచేత సృష్టించబడ్డాయని ఆగమ శాస్త్రము చెప్తుంది. దేహములో నివసించే వాడు దేహి త్రిగుణాలు అతడు కట్టుకునే వస్త్రము. ఆ వస్త్రముల చేత కప్పిఉన్న పరమాత్మ ఎవరికి గోచరము కాడు. త్రిగుణాతీతముగా ప్రకాశించే నాల్గవ తత్వమే పరమాత్మ అని వేదములు ఘోషిస్తున్నాయి. మనోవాక్కాయ కర్మలతో ఏకత్వము సాధిస్తూ అత్యంత శౌచముతో నిష్టతో తపమాచరించిన సాధకుడికి మోక్షము ప్రాప్తిస్తుంది. అన్ని తపస్సులలో ఉత్తమమైనది బ్రహ్మచర్యము, అహింసా వ్రతము. ఇవి రెండు పరమధర్మములు. వీటిని ఆచరించిన సాధకుడు నిర్మలజ్ఞానంతో వెలుగొందగలడు. ఈ సంసారము ఆశాపాశములతో దృఢంగా బంధింపబడి ఉంది. దృఢంగా పెరిగిన ఆశాలతను తపస్సు అనే కత్తితో నరకాలి. అప్పుడే మానవుడు జ్ఞాని కాగలడు అని ముని తన శిష్యునకు బోధించాడు. ధర్మరాజా ! నీవు కూడా ఆ ముని పలుకులలోని సత్యమును గ్రహించి కృతార్ధుడివి కమ్ము” అని భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు.
#జనకుడు:
ధర్మరాజు భీష్ముడితో.. “పితామహ! మిధిలా నగరాధీశుడు జనకమహారాజు ఏవిధంగా మోక్షము పొందాడో వివరించండి!” అని అడిగాడు.
భీష్ముడు… “ధర్మనందనా! జనకుని వద్ద నూరుమంది ఆచార్యులు ఉన్నారు. జనకమహారాజు సతతము వారు చేసే తత్వ బోధలను శ్రద్ధతో ఆలకించే వాడు. ఆ సమయంలో కపిల అనే స్త్రీకి జనించిన పంచశిఖుడు అనే ముని భూలోకసంచారము చేస్తూ మిధిలా నగరానికి వచ్చాడు. అతడు జనకుడి నూరుమంది ఆచార్యులను తన అతీత తత్వశాస్త్రములో ఓడించాడు. అతడి ప్రతిభకు అచ్చెరువందిన జనకమహారాజు తనకు మోక్షమార్గమును బోధించమని అతడిని కోరాడు. పంచశిఖుడు “మహారాజా ! అజ్ఞానము కోరికలకు మూలము. కోరికలు కర్మలకు మూలము.
అవిద్య అనే భూమిలో మోహము, లోభము పెనవేసుకుని అవిద్యా భూమిలో కర్మబీజాలను నాటి అంకురింప చేస్తాయి. ఇది నాకు ఇష్టము ఇది నాకు అయిష్టము అనే భావములు మానవుడి మనసులో చిక్కు బడి అనేక విధములైన కర్మలు చేయడానికి అతడిని పురికొల్పుతాయి. కర్మ బంధములలో చిక్కుకున్న మానవుడు తనను జరా మరణములు కబళిస్తున్న విషయము గమనించ లేడు. మానవుడు బంధువులు, భోగములు, ధనము అస్థిరమైనవని తెలుసుకుని వాటిని దూరము చేసిన మనసుకు శాంతి కలిగి తుదకు మోక్షము కలుగుతుంది “ అన్నాడు పంచశిఖుడు.
జనకుడు “మహానుభావా ! కేవలము వైరాగ్యము వలనే మోక్షము ప్రాప్తిస్తుందని అన్నారు కదా ! విషయవాంఛల మీద విరక్తుడైన మానవుడికి మోక్షము లభిస్తుందా!” అని అడిగాడు.
పంచశిఖుడు “మహారాజా ! సత్వగుణము అలవరచుకున్న వాడికి సంతోషము, ఇష్టము, సుఖము, ఆనందము, శాంతికలుగుతాయి. రజోగుణ ప్రభావితుడకు ఎల్లప్పుడూ దుఃఖం, కలత, ఏడుస్తుండడమూ, అసహనము, అసంతృప్తి, దేనికో వెంపర్లాడడము అలవడతాయి. తామసగుణ ప్రభావితుడికి విపరీతమైన ఉద్వేగభరితమైన ఆలోచనలు, కలలలో చరించడమూ సోమరితనము, భ్రమలో విహరించడము, ఏమరిపాటు, అన్నిటికీ విజృంభించడమూ, ఉద్రేకపడడము, అలసత్వము, ఆలస్యము అనే గుణాలు అలవడతాయి. త్రిగుణాలు కారణ సహితముగానూ ఒక్కొక్క తరి అకారణముగానూ ఏర్పడి ఒక్కొక్క తరి మానవుడి మీద తిరగబడతాయి. మానవుడు ప్రశాంతముగా ఉన్నప్పుడు అది సాత్వికస్వభామని దుఃఖభరితుడై ఉన్న సమయాన రాజసగుణమని ఏమి చేయాలని లేక స్థబ్ధుగా ఉన్న అది తామసగుణమని ఎరిగి వాటికి దూరముగా ఉండి మనసును నిర్మలము చేసిన మానవుడు మోక్షమును పొందగలడు. మనసును ఆ స్థితిలోకి వైరాగ్యము మాత్రమే తీసుకురాగలదు. త్రిగుణాలను ఆత్మలో లీనముచేసి మనసును తన్మయపరచిన త్రిగుణాలు సముద్రములో కలిసిన నదిలా తమ రూపమును కోల్పోతాయి. త్రిగుణ రాహిత్యముతో మానవుడు కుబుసము విడిచిన పాములా ఆత్మప్రకాశముతో వెలుగొందగలడు” అని వివరించాడు పంచముఖుడు.
అలా పంచశిఖుని బోధల వలన వైరాగ్యము చెందిన జనకుడు ఒక సారి మిధిలా నగరము తగులబడి పోతున్నా ధుఃఖించక వైరాగ్యంతో నిశ్చలంగా ఉన్నాడు.
#చతుర్వర్ణాలు:
ధర్మరాజు భీష్ముడిని “పితామహా ! ఎట్టివాడు నిర్భయంగా మంగళకరంగా ఉంటాడో వివరించండి” అని అడిగాడు.
భీష్ముడు “ధర్మనందనా ! చతుర్వర్ణాల వారికి శాంతి, ఇంద్రియనిగ్రహము అవసరము. అందునా, బ్రాహ్మణుడికి ఇంద్రియనిగ్రహము అత్యావశ్యము. శుచిత్వము, కోపము లేకుండా ప్రవర్తించుట, అసూయపడకుండుట, దుఃఖము దైన్యములేక ఉండుట, దురభిమానము, ప్రమాదరహితుడై ఉండుట, వితండవాదము లేకుండుట, సకలప్రాణుల అందు దయకలిగి ఉండుట, గురువులను పూజించుట, తనను తాను పొగడకుండా ఉండడము, ఇతరులను నిందించకఉండుట, సత్యము మాత్రమే పలుకుట, సత్సంగము, అహింస, నిరాశనిస్పృహలకు లోను కాకుండా ఉండడము, మంచిభావనలు, ఇంద్రియ నిగ్రహము వీటిని దమములు అంటారు. పై గుణములు సాధించిన పుణ్యమూర్తికి ఇహలోకములోనే కాదు పరలోకసుఖములు కలుగుతాయి” అని భీష్ముడు చెప్పాడు.
#వ్రత విధానములు:
ధర్మరాజు “పితామహా ! కొంత మంది యజ్ఞాలు చేసే సమయంలో వ్రతము మధ్యలో భోజనం చేసిన వ్రతభంగము కాదా?“ అని అడిగాడు.
భీష్ముడు “కుమారా ! బ్రాహ్మణుడి కోరిక ప్రకారము చేయు భోజనము వేదోక్త ప్రకారము చేయు భోజనం వలన వ్రత భంగము కాదు. కాని ఎల్ల వేళలా ఉపవసించడం, సదా బ్రహ్మచర్యము పాటించడము, మాంసభక్షణ చేయక పోవడము, దేవతలను పూజించి తృప్తి పరచిన తరువాత భుజించిన, అమృతసమానమైన భోజనం చేసిన, కలత నిద్ర లేకుండా ఉండుట మంచి లక్షణములు. వాటి స్వరూపము వివరిస్తాను. రోజుకు రెండు మార్లు మాత్రమే భుజించి మధ్యలో ఏమీ తినక ఉన్న వాడు సదా ఉపవాసి. సంతానార్ధమై రుతుకాలంలో మాత్రమే భార్యతో కూడిన వాడు సదా బ్రహ్మచారి. మాంసాహారమైనా పితరులకు, దేవతలకు అతిథులకు పెట్టి భుజించే వాడు మాంసాహారి కాడు. సహపంక్తి భోజనము చేసే వాడు దేవతలను, పితృదేవతలను, అతిథులను తృప్తి పరచిన తరువాత భుజించిన వాడితో సమానము. సేవకులకు పెట్టిన తరువాత భుజించే వాడు తినే అన్నము అమృతముతో సమానము. పగలు నిద్ర పోని వాడు కలత నిద్ర పోని వాడితో సమానము” అని భీష్ముడు చెప్పాడు.
#కర్మసిద్ధాంతం:
ధర్మరాజు “పితామహా ! నరుడు చేసే కర్మలకు అతడి పూర్వజన్మ సుకృతాన్ని అనుసరించి సుఖదుఃఖములు, శుభశుభములు ఉంటాయి కదా ఆ కర్మల కర్త అతడేనా ! కాదా ! అని నాకు అనుమానంగా ఉంది దానిని వివరించండి” అని అడిగాడు.
భీష్ముడు… ”ధర్మనందనా! ఒక సారి ఇంద్రుడు ప్రహ్లాదుడి మధ్య జరిగిన సంవాదము వింటే నీ సందేహము తీరుతుంది. సత్వగుణ సంపన్నుడు, ఎల్లప్పుడూ సంయమనం పాటించే వాడు, అహంకారము లేని వాడు, కోపమంటే తెలియనివాడు, నిందను స్తుతిని సమానంగా పరిగణించేవాడు, ఇనుమును బంగారమును సమానంగా విలువ కట్టేవాడు అయిన ప్రహ్లాదుడు తన మందిరములో కూర్చుని ఉండగా ఇంద్రుడు అతడి అంతరంగం తెలుసుకోవాలని అక్కడకు వచ్చి.. ‘ప్రహ్లాదా ! నీవు సంపద లేకున్నా దుఃఖించవు, శత్రువుల చేతికి చిక్కుతానన్న భయము లేదు, అసలు ఏమీ చేయవు ఇంతటి బేలగా ఉంటే ఎలా’ అని అడిగాడు.
ప్రహ్లాదుడు ‘ఇంద్రా ! కలిమి-లేమి పక్క పక్కనే ఉంటాయి.
సంపదలు ప్రయత్నిస్తే వస్తాయి లేకున్న రావు అనుకోవడము నీ బేలతనమే ! సంపదలు సంపాదించనవసరం లేదు విధి అనుకూలిస్తే వచ్చి పడతాయి ప్రతికూలించిన హారతికర్పూరంలా కరిగి పోతాయి. దీనికి మానవ ప్రయత్నముతో పని లేదు. శత్రువులు ఓడించడం, మిత్రులు కాపాడడము, సంపదల రాకపోక అంతా విధిలిఖితమే. మానవుడి మనసును అనుసరించి భావాలుపుడతాయి, పోతాయి. చంచలమైన మనసులోని భావాలు చంచలమైనవే అని తెలుసుకుని మనసుని నిగ్రహించాలి. తన పనులన్నిటికీ తానేకర్తను అనుకోవడము అవివేకము. అలా అయితే మానవులు చేసే కర్మలన్నిటికీ సమ ఫలితాలు ఉండాలి కదా ! అఖిలకర్మలకు కర్త ఆ పరమేశ్వరుడే కాని మానవుడు కాదు. తాను చేసే కర్మలకు తానేకర్తను అన్న అహంకారంతో కర్మలు చేసే వాడికి కర్మఫలం అంటుకుటుంది. ఫలాపేక్ష లేక కర్మలను చేస్తూ సుఖదుఃఖాలకు లోను కాక మనసు నిలకడగా ఉంచుకున్న వాడు మహనీయుడు. కనుక దేవేంద్రా ! నేను ఈ లోకములో ఉన్న సకల ప్రాణులకూ అనిత్యములే అని అసత్యములని తెలుసుకుని సంసార బంధములో చిక్కక సంతోషముతో ఉంటాను. శాంతితోను ఇంద్రియనిగ్రహముతో ఉండే వాడికి చింతలు దరిచేరవు. నేను అలా నిశ్చింతగా జీవిస్తున్నాను’ అని ప్రహ్లాదుడు అన్నాడు.
ఇంద్రుడు… ’దానవేంద్రా ! నీకు ఇంతటి ప్రశాంతచిత్తము ఎలా అలవడింది చెప్పవా !’ అని అడిగాడు.
ప్రహ్లాదుడు… ‘దేవేంద్రా ! ఆత్మావలోకనము, మంచిప్రవర్తన, మనసును ప్రసన్నంగా ఉంచుకోవడము, అప్రమత్తత, పెద్దలను, వృద్ధులను గౌరవించుట లాంటి ఉత్తమ లక్షణాలు మానవులకు మేలుచేసి మానవుడికి ప్రజ్ఞా శాంతి ఇస్తాయి.’
ఇది విన్న ఇంద్రుడు ఆశ్చర్యముతో తిరిగి స్వర్గానికి వెళ్ళాడు” అని చెప్పాడు.
#సిరి సంపదలు:
ధర్మరాజు… “పితామహా ! రాజు తన సిరిసంపదలు ఎలా పోగొట్టుకుంటాడో వివరించండి” అని అడిగాడు.
భీష్ముడు “ధర్మనందనా ! ఇంద్రుడికి బలికి మధ్య జరిన సంవాదము చెపితే ఈ విషయము నీకు అవగతము ఔతుంది” అన్నాడు.
“ఒక సారి ఇంద్రుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ‘బ్రహ్మదేవా ! ఒకప్పుడు బలి సిరిసంపదలతో తుల తూగాడు కదా ! ఆ బలి చక్రవర్తి ఇప్పుడేమి చేస్తున్నాడు ?’ అని అడిగాడు.
బ్రహ్మదేవుడు… ‘మహేంద్రా ! నీ దుష్టతలపు నాకు తెలిసినా నీవు అడిగావు కనుక చెప్తాను విను… ఒంటె, గాడిద, ఆవు, గుర్రము వీటిలో ఏదో ఒకదానిలో ఉంటాడు. అతడిని చంపడము ఉచితము కాదు. అతడిని చంపనని నాకు మాట ఇచ్చి అసత్యదోషము కలగ కుండా చేసుకో!’ అన్నాడు.
ఇంద్రుడు ‘అలాగే మాట ఇస్తాను అతడిని చంపనుకాని అతడితో మాట్లాడుతాన’ అని స్వర్గానికివెళ్ళాడు. తరువాత అతడు గాలించి బలిని పట్టుకుని… ‘బలీ ! ఆనాడు అనేక గజములు నీ వెంట రాగా భద్రగజము మీద ఊరేగిన నీవు ఇప్పుడిలా గాడిద రూపంలో ఊరేగుతున్నావా!’ అని హేణన చేసి, ‘ఓ బలీ నాడు బంగారపు ఊపస్థంభాను నిర్మించి యాగము చేసిన నిన్నిలాచూస్తే జాలి వేస్తుంది. ఇప్పుడు నీవు గడ్డి, పొట్టు తింటూ నీ పూర్వపు వైభవము తలచుకుని దుఃఖిస్తున్నావు కదా ! ఉన్న మాటచెప్ప’ అని హేళన చేసాడు.
బలి… ‘మహేంద్రా ! నీకు నా వైభము కనిపించదులే వాటినిప్పుడు ఒక కొండగుహలో దాచాను. నాకు తోచినప్పుడు వెళ్ళి అనుభవించి వస్తుంటాను. నీవిప్పుడు పెద్దవాడివి కదా మాబోటి పిన్నలసంగతి నీకెందుకు చెప్పు’ అన్నాడు.
ఇంద్రుడు ‘అది కాదు బలీ ! అఖిల భూతకోటి సూర్యరశ్మికి కరిగి పోయే మంచులా ఇలా కనపడి అలా వెళ్ళి పోతుంటారు కదా ! చావు పుట్టకలంటే అంతే కదా ! నీ లాంటి బుద్ధిమంతులు వాటికి అతీతులు కదా !’ అన్నాడు.
బలి… ‘మహేంద్రా ! వస్తూ పోతూ ఉండే జననమరణాలకు, సుఖదుఃఖాలకు, లాభనష్టాలకు నేను అతీతంగా ఉంటాను. ఇంద్రా ! బుద్ధిమంతులను, బుద్ధిహీనులను, ధనవంతులను, పేదవారిని తారతమ్యము లేకుండా యమధర్మరాజు ప్రాణములు సంహరిస్తుంటాడన్న విషయం తెలిసినవాడు సుఖదుఃఖాలకు తావివ్వక వాటికి అతీతంగా ఉంటాడు. దేవేంద్రా ! నేను ఈ గాడిదరూపంలో పొట్టు, గడ్డి తిన్నా నా మనసు ప్రశాంతిగా ఉంది కనుక నీవెంత హేళనచేసినా నాకు కోపము రాదు. నేను చక్రవర్తిగా ఉన్నప్పుడు నా ముందు నిలబడడానికి భయపడేవాడివి. కనుక నేనెవరో తెలుసుకుని ప్రవర్తించడము మంచిది. వికసించుట వాడిపోవుట విధికృతం. నీలాంటి పెద్దవాడు ఇలా అహంకరించి మాట్లాడడము నీచమైనది. అలా తుళ్ళిపడడము మాని ఎక్కడకు పోతావో పో. నాకు కోపం వస్తే నీవెంత? నీ వజ్రాయుధము ఎంత? తుళ్ళిపడక’ అని కోపంతో చెప్పి అంతలో తమాయించుకుని ‘నా మనసులో కోపము అహంకారము లేవు కేవలము పరిహాసానికి అన్నాను. విధాత ముందు మనమేపాటి. పోయి శాంతచిత్తుడవై జీవించు!’ అన్నాడు. ఈ సమయంలో బలిశరీరం నుండి ఒక అందమైన వనిత వెలుపలకు పోతూ ఉంది.
ఇంద్రుడు… ‘బలీ ఈమె ఎవరు ?’ అని అడిగాడు.
బలి ‘ఆమెను అడిగి తెలుసుకో’ అన్నాడు బలి.
మహేంద్రుడు ‘అమ్మా! నీవు ఎవరు?’ అని అడిగాడు.
ఆ స్త్రీ ‘ఇంద్రా! నా పేరు లక్ష్మీ , శ్రీ అంటారు. మీ ఇరువురికి నేను ఎవరో తెలియక పోవడంలో ఆశ్చర్యం లేదు. ఎందు కంటే ముల్లోకాలలో ఇంత వరకు ఎవరూ నన్ను గురించి తెలుసుకొలేదు’ అన్నది.
ఇంద్రుడు ‘అది సరే ఇప్పుడు ఈ రాక్షసచక్రవర్తి నుండి ఎందుకు తొలగి పోతున్నావు?’ అని అడిగాడు.
లక్ష్మి ‘ఇంద్రా! సత్యము, ధర్మము, ఇంద్రియ నిగ్రహము, దానగుణము నా నివాస స్థానములు. పై లక్షణములు ఉన్న పరాక్రమవంతుడైన పురుషుడి వద్ద నేను ఉంటాను. బలిచక్రవర్తి వద్ద ఇప్పటి వరకు అవి అన్నీఉన్నాయి కనుక నేను అతడి అందు ఉన్నాను. కాలక్రమేణా అతడిలో అవినీతి, బ్రాహ్మణులపట్ల అసూయ పెరిగాయి. మంచి లక్షణములను వదిలిన బలిని ఇప్పుడు నేను వదిలివేస్తున్నాను. నీ వద్ద నేను పైన చెప్పిన గుణములే కాక వేదములు, శాస్త్రములు చెప్పిన ఆచారములు, నీ వద్ద పుష్కలంగా ఉన్నాయి. అందుకని నీ వద్ద ఉండడానికి నేను నిశ్చయించుకున్నాను. కాని నువ్వు బలి మాదిరి కాకుండా ఏమరుపాటు లేకుండా సచ్చరిత్రుడవై ఉండాలి’ అన్నది లక్ష్మి.
తనను లక్ష్మి వదిలివెళ్ళిన తరువాత బలి… ‘మహేంద్రా ! సూర్యుడు పశ్చిమాన అంతరించినంత మాత్రాన తన తేజస్సు కోల్పోడు తిరిగి తూర్పున ఉదయించక మానడు. అలాగే నేను గాడిద శరీరంలో ఉన్నంత మాత్రాన నా పరాక్రమము కోల్పోలేదు. నేను తిరిగి వచ్చి దేవాసుర యుద్ధములో నిన్ను గెలుస్తాను’ అన్నాడు.
ఇంద్రుడు… ‘అప్పుడు చూడవచ్చు ప్రస్తుతము నీతో వ్యర్ధ ప్రసంగం చేసే సమయం లేదు. బ్రహ్మదేవుడికి ఇచ్చిన మాట ప్రకారము నిన్ను చంపక వదిలి వెళుతున్నాను’ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళాడు.
బలి కూడా అక్కడ నుండి దక్షిణం దిక్కుగా వెళ్ళాడు.
#నముచి:
భీష్ముడు “ధర్మనందనా! నముచిని గురించి వినిపిస్తాను. పూర్వము నముచి అనే రాక్షసుడు ఉండే వాడు. అతడికి ఉన్నసంపద అంతా పోయింది. అయినా అతడు చింతపడక ఏకాంత స్థలంలో సంతోషంగా ఉన్నాడు. అతడి వద్దకు ఇంద్రుడు వచ్చాడు. అతడి వద్దకు ఇంద్రుడు వచ్చి ‘దానవరాజా ! ఉన్న సంపద పోగొట్టుకుని ఆదరించే వాళ్ళులేక పేదరికంలో మగ్గుతున్నందుకు ఎంత చింతిస్తున్నావో కదా!’ అని అన్నాడు.
నముచి… ‘దేవేంద్రా ! పోయిన సంపదకొరకు చింత ఎందుకు? చింతపడితే పోగొట్టుకున్నది వస్తుందా? విచారించడము నిరర్ధకము కాదా ! అలారాక పోగా చింత, దుఃఖము మిగులుతాయి. ఇదంతా తెలుసు కనుక నేను పోయిన వాటి కొరకు దుఃఖించడం లేదు. దేవేంద్రా ! ముల్లోకాలనూ శాసించే వాడు ఒకడు ఉన్నాడు. నీరు పల్లముకు పారినట్లు మనము కోరుకున్నవన్నీ మన వద్దకు వస్తాయి. అయినా ఇది నాకు జరగవలసినది అందుకే ఇలా జరిగింది అనుకుంటే దిగులు, చింత, సంతోషము ఆనందము ఎందుకు వస్తాయి’ అన్నాడు.
‘మనకు ప్రాప్తము లేని దానిని మనము మన పరాక్రమముతోనూ , ధైర్యముతోనూ, వీరత్వముతోనూ, ప్రజ్ఞతోనూ, శౌర్యముతోనూ సాధించ లేము. ఈ విషయము తెలుసుకున్న బుద్ధిమంతుడు ఈ విషయం ఎరిగి లేని దానికొరకు చింతించడు. దేవేంద్రా ! మేలు కీడు అనేవి మనము కోరుకుంటే రావు వద్దంటే పోవు. కనుక వాటి కొరకు ఆరాటపడడం తగదు’ అన్నాడు.
#ధైర్యము:
ధర్మరాజు “పితామహా ! మానవుడికి దుర్దశ కలిగినప్పుడు ఎలా ఉంటాడు దానిని ఎలా ఎదుర్కొంటాడో వివరించండి” అని అడిగాడు.
భీష్ముడు “ధర్మనందనా ! అన్ని రకముల దుర్దశలకు ధైర్యమేమందు. ధైర్యంతో మాత్రమే మనసు గట్టిపడుతుంది. మానవుడు దృఢనిశ్చయంతో ఆ దుర్దశ నుండి బయట పడతాడు. ఒకసారి ఇంద్రుడు బలితో చేసిన సంవాదము గురించి చెప్తాను… “దేవాసురయుద్ధంలో దేవతలకు మహావిష్ణువు అండదండలతో విజయం లభించింది. అప్పుడు దేవేంద్రుడు, రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు, వసువులు, గంధర్వులు, సిద్ధులు మొదలైన వారు పర్యవేష్టించి ఉండగా ఐరావతము ఎక్కి మూడు లోకములలో పర్యటిస్తున్నాడు. అలా విహరిస్తూ ఒక కొండగుహలో దాగి ఉన్న బలిని చూసాడు. అత్యంత వైభవంతో వెలిగి పోతున్న దేవేంద్రుడిని చూసినా బలి చలించక నిబ్బరంగా ధైర్యంగా ఉన్న బలిని చూసి ‘బలీ ! ఉన్న వైభవమంతా పోగొట్టుకుని దీనావస్థలో ఉన్నా శత్రువునైన నా వైభవము చూసి కూడా చలించక ఉన్నావు. నీకు ఈ నిర్వికారము ఎలా కలిగింది. నీ శౌర్యము వలనా ! పెద్దలకు సేవ చేసిన ఫలమా ! లేక నీవు చేసిన తపో మహిమా నాకు తెలియకున్నది. దేవేంద్రుడినైన నన్ను కూడా లక్ష్యపెట్టక ఉండుటకు కలకారణం ఏమి ?’ అన్నాడు.
బలి ‘నేను నిన్ను లక్ష్యపెట్ట లేదని అడుగుతున్నావు. లక్ష్యపెట్టడం వలన ప్రయోజనమేమి ? ఇప్పుడు నీవు అనుభవిస్తున్న వైభవము ఒక వైభవమా ! దైవవశమున ఇలాంటి దుస్థితి ఎవరికైనా రావచ్చు. దేవేంద్రా ! నేను నిన్ను ఒక సారి ఓడించి నిన్ను హీనావస్థకు తెచ్చాను. కాని అది నేను చేసినది కాదు. విధి విలాసము. అలాగే ఇప్పుడు నేను అనుభ విస్తున్నది విధికృతమే కాని నీ వలన జరిగినది కాదు. వీటిని భరించడానికి ధైర్యమే ముఖ్యము. దానంతట అవే వస్తూపోయే సుఖదుఃఖాలకు సుఖము వచ్చినప్పుడు అంతా నా వలనే సంభవించిందని దుఃఖము కలిగినప్పుడు విలపించడము మంచిది కాదని విజ్ఞులు చెప్ప లేదా ! స్నేహితులు, బంధువులు, ఐశ్వర్యము, కీర్తిప్రతిష్టలు ఎన్ని ఉన్నా మానవుడికి కలిగే దుర్దశను నివారించ లేరు. అది ఎరిగిన కాలవశమున ఐశ్వర్యము, దారిద్యమూ వస్తూ పోతుంటాయని అర్ధము ఔతుంది. ఒకప్పుడు నా కాలం కలిసి వచ్చింది నేను నిన్ను ఓడించాను. ఇప్పుడు నీ కాలం కలిసి వచ్చి నీవు నన్ను ఓడించావు. కనుక శుభాశుభములకు కాలమేకర్త అని తెలియ లేదా దేవేంద్రా ! నీకూనాకూ మధ్య ఉన్న శత్రుత్వమూ కాలవశాన వచ్చినదే ! ప్రస్తుతము నాకాలము బాగా లేదు కనుక నేను ఇప్పుడు నిన్ను ఎదిరించలేను. నీ మీద కోపమూ రాలేదు. నాకు లీలా మాత్రంగా కోపము వచ్చినా చాలు నిన్ను నీగర్వాన్ని ఎడమ చేతితో కాల్చగలను.
నీకు విజయగర్వము తలకెక్కింది కనుక కిందా మీదా తెలియక ప్రవర్తిస్తున్నావు. నీవు ప్రాభవము చెందే కాలము సమీపంలోనే ఉంది. ప్రస్తుతము నీవు ఇంద్రుడివి నీకు ముందు ఎందరో ఇంద్రులు రాలేదా పోలేదా ! ఇంద్రులే కాదు బ్రహ్మలు కూడా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కాలం గడిచే కొద్దీ ఇంద్రులు బ్రహ్మలు వస్తూ పోతున్నప్పుడు ఒక దానవుడు ఓటమి చెందిన ఆశ్చర్యము ఏముంది. దీనికి నీవు నిందించపని లేదు. యజ్ఞయాగములు, వ్రతములు, పూజలు చెయ్యడం, మంచి నడవడి కలిగి ఉండడము పతనముకావడమూ కాల మహిమే’ అన్నాడు బలి.
ఇంద్రుడు కొంత తొట్రుపడి దానిని దాచుకుని ‘ఇంత హీన స్థితిలో కూడా నీ ధైర్యము, వివేకము, వినయము తగ్గలేదు. ఇందుకు కారణమైన నిష్ఠ ఏమిటో చెప్పవా’ అని అడిగాడు.
బలి ‘దేవేంద్రా ఎంత వెర్రి వాడివయ్యా ! నేను ధైర్యము, వినయము, వివేకము, శాంతి నేను ఎక్కడి నుండి తీసుకు రాలేదు అవి నాలో స్వతఃసిద్ధంగా ఏర్పడ్డాయి. మానవులకు కలిగే మహాదశలు దుర్దశలు కాలవశాన వచ్చేవే. ఈ కాలము నదీ ప్రవాహము వంటిది. నది కొంచెం కొంచెంగా కొండనుకూడా ఎలా కోస్తూ తుదకు నామ రూపాలు లేకుండా ఎలా చేస్తుందో అలాగే కాలం మనిషిలోని లోభ, క్రోధ, కామములను పడవేసి క్రమక్రమముగా సమూలంగా నాశనం చేస్తుంది. అజ్ఞాని దీనిని తెలుసుకొన జాలక ఇప్పటి వరకు బాగా ఉన్నవాడికి ఇంతటి దుర్దశ ఎలా దాపురించింది అని ఆశ్చర్యపడతాడే కాని ఎప్పుడో తనకూ దుర్దశ ప్రాప్తిస్తుందని తెలుసుకోలేడు. దేవేంద్రా భావమూ లేక అత్యుత్తమ తపసు చేసే వాడికి కాలగతిలోకలిగే మార్పులు కరతలామలకంగా శోభిస్తాయి. అలా కాలగతిని సాక్షిగా చూస్తున్నప్పుడు మనసుకు శాంతిలభిస్తుంది. తాను ఆత్మే కాని శరీరముకాదు. కాలగతిలో కలిగే కష్టసుఖాలు శరీరానికేగాని ఆత్మకు కాదు అన్న విజ్ఞానము కలుగుతుంది’ అని బలి పలికాడు.
బలికి కలిగిన మానసిక పరిపక్వానికి అచ్చెరువందిన ఇంద్రుడు … ‘రాక్షసరాజా ! ఈ ప్రకారంగా కాలగతిని తెలుసుకుని పవిత్రమైన శీలంతో వెలుగొందుతున్నావు. నీ శీలము ఈ లోకంలో ఎందరికో ఆదర్శం. ఈ లోకమంతా నీ అరచేతిలో దర్శిస్తూ త్రిగుణాతీతుడవై నిర్గుణుడవై వెలుగుతూ ఆత్మావలోకనము చేసుకున్నావు. నీకు నువ్వే సాటి. అతి త్వరలో నీకు కలిగిన దుర్దశతొలగి నీకు మేలుకలిగి సకల సుఖములు పొందగలవు’ అని పలికి అక్కడ నుడి వెళ్ళాడు.
అమృతోపమానమైన బలి పలుకులు దేవేంద్రుడికి అమృతం కంటే రుచిగా అనిపించి ఆనందింప చేసాయి” అని భీష్ముడు చెప్పాడు.✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment