0101. 2-7. 190223-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*PostMen In The Mountains*
*పర్వతాలలో పోస్ట్ మాన్..!*
➖➖➖✍️
(చైనీస్ సినిమా.)
హూ వో జియాంకి దర్శకత్వం వహించిన ఈ సినిమా 1999 లో నిర్మింపబడి,గోల్డెన్ రూస్టర్ అవార్డ్ పొందింది.
పర్వత ప్రాంతాలలో తపాలా అందించే పోస్ట్ మన్ (టెంగ్ రుజుస్) వృద్దుడై పోయి నందున, ఆ పర్వత ప్రాంతాలలో మోకాళ్ళ నొప్పులతో నడవలేక పోతాడు. అతడు ఉద్యోగ విరమణ చేస్తాడు. ప్రభుత్వం అతని ఉద్యోగాన్ని అతని కొడుకు(లియు యే)కి ఇస్తుంది.
వాళ్ళు ఎంతో ప్రేమగా పెంచుకునే బడ్డీ అనే జర్మన్ షెపర్డ్ కుక్క ప్రయాణ మార్గంలో, తండ్రికి తోడుగా వుంటుంది.
ఈ సినిమా చైనా లోని దక్షిణ హునాన్ ప్రాంతంలోని దట్టమైన అడవులు, కొండలలో, ఆ కొండల్లో వుండే పల్లెల్లో చిత్రీకరించారు.
తండ్రి పోస్ట్ లో వచ్చిన ఉత్తరాలు, పార్శిల్స్, పత్రికలు అన్నీ వీపున మోసే ఒక పెద్ద బాగ్ లో సర్డుతాడు. ఆ పర్వతాలలో వెళ్లాల్సిన 112 కి. మీ. దారిని మాప్ లో కొడుకుకు చూపిస్తూ వివరిస్తాడు.
ఇన్నేళ్ల తన ప్రయాణంలో కుక్క తోడుగా వుందని, దానికి అన్ని మార్గాలు తెలుసునని దాన్ని తోడుగా తీసుకుని ఇక బయలు దేరమని చెప్తాడు.
తండ్రితో వెళ్ళటం అలవాటైన కుక్క, కొడుకుతో వెళ్ళటానికి మొరాయిస్తుంది. తండ్రి ఎంత బుజ్జగించే ప్రయత్నం చేసినా వినదు. ఇక తండ్రి తనే చివరి సారిగా కొడుకు వెంట వెళ్ళి, ఆ మార్గం, ఆ పల్లెలు, అక్కడి ప్రజల్ని పరిచయం చేయాలని బయలు దేరుతాడు.
దట్టమైన అడవిలో తండ్రి, వీపున బరువైన బాగ్ తో కొడుకు, కుక్క బడ్డీ బయలుదేరుతారు.
ఈ ప్రయాణానికి మూడు రోజులు పడుతుంది. పోస్ట్ మాన్ ఉద్యోగం చేస్తూ, ఎప్పుడూ కుటుంబానికి దూరంగా ఈ పర్వత ప్రాంతాలలోనే గడిపిన తండ్రి, బాల్యంలో తన కొడుకు ముద్దు ముచ్చట్లను, అతని పెరుగుదలను చూసే అవకాశం కోల్పోతాడు.
కొడుకు ఇప్పటి వరకూ తండ్రి పట్ల కొంత ఉదాసీనంగానే వుంటాడు. ఈ ప్రయాణంలో తండ్రి, తన కొడుక్కి తన గురించి, కుటుంబం గురించి, తన మనో భావాల గురించి చెప్పే వీలు దొరుకుతుంది.
కొడుక్కి కూడా తండ్రిని గురించి తెలుసుకునే అవకాశం దొరుకుతుంది.
ఎంతో కష్టపడి, అడవుల్లో ప్రయాణిస్తూ, కొండలెక్కి దిగితూ, తమ కోసం పోస్ట్ మోసుకుని వచ్చే ‘టేంగ్ రుజుస్’ పట్ల ఆ కొండ ప్రజలు ఎంతో ప్రేమను కనబరుస్తారు. తమ కష్టసుఖాలను అతనితో ముచ్చటిస్తూ వుంటారు. తమ ఇంట్లో మనిషి లాగా, ఒక స్నేహితుడు లాగా అతన్ని ఆదరిస్తారు. అక్కడి ప్రజలు పోస్ట్ మాన్ కోసం ఆహారం, ఆశ్రయం కల్పిస్తారు.
ఒక పల్లెలో గుడ్డిదైన ఒక ముసలమ్మ వీళ్ళ రాక కోసం ఎదురు చూస్తూ వుంటుంది. కొడుకు,కోడలు చనిపోతే ఆ అవ్వ మనవడిని ఎంతో కష్ట పడి పెంచి వున్నతోద్యోగిని చేస్తుంది.
ఆ మనవడు ప్రతినెలా 20డాలర్స్ మనియార్దర్ పంపు తాడే గానీ, అవ్వ యోగ క్షేమాలు ఏమీ కనుక్కో డు. అవ్వ డబ్బు కన్నా, మనవడి వుత్తరం కోసం ఎక్కువ ఎదురు చూస్తుంది.
పోస్ట్ మాన్ తెంగ్ ఆమె మనవడు రాసినట్లుగా చెబుతూ, తానే రాసిన
ఉత్తరం చదువుతాడు. మనవడే స్వయంగా తనతో మాట్లాడినంత సంతోష పడుతుంది అవ్వ.
కొడుక్కి ‘నువ్వు గూడా ఇలానే చదివి ఆమెను సంతోషపెట్టు!’ అని చెప్తాడు.
మార్గ మధ్యంలో సేద తీరుతున్నపుడు వచ్చిన పెద్ద గాలికి, అప్పుడే విప్పిన సంచిలోని ఉ త్తరాలు ఎగిరి పోతుంటాయి. వాళ్ళు ఎంతో కష్టం మీద వాటిని ఎగిరి పోకుండా కాపాడుతారు. ఒకటి రెండు ఉ త్తరాలను కుక్క గాల్లోకి ఎగిరి పట్టుకుంటుంది.
ఇంకోసారి దారిలో వున్న పెద్ద ఏరును దాటుతున్నపుడు గూడ తపాలా సంచిని నెత్తి మీద పెట్టుకుని, భుజాల లోతు వున్న నీటిని జాగ్రత్తగా దాటుతారు. అప్పుడు తండ్రి, కొడుకుతో “మన ప్రాణాలు పోయినా సరే, తపాలా ను చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఇది ఉద్యోగ ధర్మం!” అని చెబుతాడు.
నడక శ్రమ తెలియకుండా తండ్రి, కొడుకులు పాటలు పాడుకుంటూ, వెళ్తారు. తండ్రి ఆ పల్లెల ఆచారాలు, పండుగలు, సంప్రదాయాల గురించి వివరిస్తాడు.
ఈ పల్లెల్లో తనకు తారసపడిన ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నానని, ఆమె తన నమ్మకాన్ని వమ్ము చేయలేదని, తనని ఎంతగానో ప్రేమించినదని, కుటుంబాన్ని చక్కగా నిర్వహించినదని, ఉద్యోగ రీత్యా తాను దూరంగా వున్నా, కొడుకైన నిన్ను చక్కని పౌరునిగా తీర్చి దిద్దిందని చెబుతాడు.
కొడుకుతో నువ్వు గూడ ఈ కొండ ప్రాంతం అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని తన కోరిక అని చెప్తాడు.
ఇక్కడి అమ్మాయిలు అందగత్తెలు, నిజాయితీ పరులు, కష్టించి పని చేస్తారు అని వివరిస్తాడు..
దారిలోని ఒక పల్లెలో జరుగుతున్న జాతరలో పాల్గొంటారు. చైనీయుల లుషెంగ్ డాన్స్ ఇక్కడ మనం చూడొచ్చు.
మార్గమధ్యంలో అనేక విషయాలతో పాటు, చైనా తపాలా వ్యవస్థ తీరు, అధికారుల వైనం విడమరుస్తాడు. చేసే ఉద్యోగాన్ని ఇష్టంగా చేయాలని, ఉద్యోగాన్ని ప్రేమిస్తే ఏదీ కష్టం అనిపించదు’ అని చెప్తాడు. దానికి నేనే ఉదాహరణ, ఈ ప్రజల ప్రేమే ఉదాహరణ అనిచెబుతాడు.
ఈ మూడు రోజుల ప్రయాణం ముగిసే లోపు కొడుకు, తండ్రిని గురించి అర్ధం చేసుకుంటాడు. పల్లె ప్రజలు తన తండ్రి పట్ల చూపించిన ప్రేమ, ఆదరణకు పొంగి పోతాడు.
మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతూ, కూర్చున్న ప్రతి సారి కుక్క బడ్డీ వచ్చి, తేంగ్ మోకాళ్ళ కింద దూరి నిలబడుతుంది. తేంగ్ దాన్ని నిమురుతూ, తన మోకాళ్ళను కాస్త రుద్దుకుంటూ ఉపశమనం పొందుతాడు.
మూడు రోజుల తర్వాత ముగ్గురూ ఇంటికి తిరిగి వస్తారు. ఆ పల్లెల్లో పోస్ట్ బాక్స్ లలో వేసిన వుత్త రాలతో సహా!
ఉద్యోగ నిర్వహణలో భాగంగా తిరిగి పోస్ట్ తో బయలు దేరుతున్న కొడుకు వెంట, ఒకసారి చెప్పగానే సంతోషంగా కుక్క బడ్డీ అనుసరిస్తుంది.
ఈ సినిమాలో మూడు ప్రధాన పాత్ర లైన తండ్రి, కొడుకు, కుక్క అద్భుతంగా నటించారు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే అందమైన హునాన్ అటవీ ప్రాంతంలో తండ్రి, కొడుకు, కుక్క ఎలా ప్రయాణించారన్నదే ఈ సినిమా.
అద్భుతమైన ప్రకృతిని చూడాలనుకునే వారికి ఈ సినిమా ఒక వరం అని చెప్పొచ్చు.
యూ ట్యూబ్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో వుంది..సినిమా.
చైనా దేశపు మాండరిన్ భాషలో నడుస్తుంది. సినిమా వ్యవధి గంటన్నర!✍️
…సేక :వల్లూరి సూర్యప్రకాష్.
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment