*అవసరాల కోసం మాత్రమే మనుషులు.... మానవ సంబంధాలు... ప్రేమలు... అభిమానాలు... ఆప్యాయతలు... అన్నీ నాన్సెన్స్.... నేనే తెలివైన వాడిని అవతలి వారికి ఏమీ తెలియదు... వారిని నా అవసరానికి వాడేసుకోవచ్చు.... వారికి అవసరమైనప్పుడు వారివైపు కూడా చూడనక్కర లేదు ఎందుకంటే మన దృష్టిలో వాళ్ళు చాలా తింగరివాళ్ళు.... ఇదే ఈనాటి తరం తెలివి తేటలు.... కానీ, వీళ్లకు తెలియని విషయం ఏమిటంటే... వాళ్ళు తెలివిలేని తింగరివాళ్ళు కాదు ""మంచివాళ్ళు"'.... మనం చేసే స్వార్ధపు పనుల వాళ్ళ ఆ మంచి మనుషుల మనసునుండి "'శాశ్వతంగా"' తొలగి పోతాము... ఈ విషయాన్ని చక్కని ఉదాహరణలతో వివరించిన వ్యాసం... మనస్సుతో చదవండి... మంచి మనుస్యులను చేజారనివ్వకండి.... సర్వే జనా సుఖినోభావంతు....*
*మనుషులు చేజారుతారు*
‘హమ్ తుమ్ ఏక్ కమరే మే బంద్ హో’.... భారత సినీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూపిన ‘బాబీ’ మొన్నటి సెప్టెంబర్ 28కి యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇవాళ్టికీ దేశంలోని అన్ని భాషల్లో ఏదైనా టీనేజ్ ప్రేమకథ తీస్తూంటే గనక అది ఏదో ఒక మేరకు ‘బాబీ’కి కాపీ. ఆ సినిమా ఇచ్చిన ఫార్ములాతో వందలాది కథలు వచ్చాయి. వస్తాయి. ‘మేరా నామ్ జోకర్’ తీసి నిండా మునిగిన రాజ్‌కపూర్‌ను కుబేరుణ్ణి చేసిన సినిమా అది. ఆ సంపద వచ్చిన సందర్భంలోనే రాజ్‌కపూర్ ఒక మనిషిని చేజార్చుకున్నాడు. తెలిశా.. తెలియకనా?
‘బాబీ’ని కనీస ఖర్చుతో తీద్దామనుకున్నాడు రాజ్‌కపూర్. హీరో తన కొడుకే రిషికపూర్. హీరోయిన్ కొత్తమ్మాయి డింపుల్ కపాడియా. ముఖ్య పాత్రలు ప్రేమ్‌నాథ్, ప్రేమ్చోప్రా భార్య తరఫు బంధువులు. లక్ష్మీకాంత్– ప్యారేలాల్ ఇంకా కెరీర్ ప్రారంభంలో ఉండి రాజ్‌కపూర్‌తో మొదటి సినిమా చేయడమే వరం అనుకునే రకం. ఖర్చేముంది? ఒక్కటి ఉంది... ప్రాణ్ రెమ్యూనరేషన్. ఆ రోజుల్లో ప్రాణ్ సినిమాకు రెండు, మూడు లక్షలు తీసుకుంటున్నాడు. రాజ్‌కపూర్‌తో అప్పటికి నలభై ఏళ్లుగా ప్రాణస్నేహం. ‘ఒక్కరూపాయి తీసుకొని చేస్తా. సినిమా ఆడితే ఇవ్వు. ఆడకపోతే మర్చిపో’ అన్నాడు ప్రాణ్. అన్నమాట ప్రకారం ఒక్క రూపాయికే చేశాడు. సినిమా రిలీజ్ అయ్యింది. ఇరవై పాతిక లక్షలు పెట్టి తీస్తే దేశంలో, బయట కలిపి 30 కోట్లు వచ్చాయి. నేటి లెక్కల ప్రకారం 1200 కోట్లు! రాజ్‌కపూర్ ప్రాణ్‌ని పిలిచి మంచి పార్టీ ఇస్తే బాగుండేది. థ్యాంక్స్ చెప్పి అడిగినంత ఇచ్చి ఉంటే బాగుండేది. ఇవ్వకపోయినా బాగుండేది. కాని రాజ్‌కపూర్ లక్ష రూపాయల చెక్ పంపాడు. లక్ష? తను అడగలేదే? పోనీ తాను అందరి దగ్గరా తీసుకునేంత కూడా కాదే. ప్రాణ్ ఆ చెక్ వెనక్కు పంపాడు. మళ్లీ జీవితంలో రాజ్కపూర్ని కలవలేదు. జారిపోయాడు.
‘షోలే’ రిలీజ్ అయితే మొదటి రెండు వారాలు ఫ్లాప్‌టాక్. రాసిన సలీమ్–జావేద్ ఆందోళన చెందారు. ఫ్లాప్ కావడానికి స్క్రిప్ట్ కారణమనే చెడ్డపేరు ఎక్కడ వస్తుందోనని బెంబేలెత్తారు. మాటల్లో మాటగా దర్శకుడు రమేష్ సిప్పీతో ‘గబ్బర్‌సింగ్ వేషం వేసిన అంజాద్‌ఖాన్ వల్లే సినిమా పోయింది. అతడు ఆనలేదు’ అన్నారు. అప్పటికే తన తొలి సినిమాకు ఇలాంటి టాక్ రావడం ఏమిటా అని చాలా వర్రీగా ఉన్న అంజాద్‌ఖాన్ బ్లేమ్ గేమ్‌లో తనను బలి చేయబోతున్నారని తెలిసి హతాశుడయ్యాడు. తీవ్రంగా కలత చెందాడు. కాని సినిమా కోలుకుంది. ఎలా? అలాంటి కలెక్షన్లు ఇప్పటికీ లేవు. అతి గొప్ప విలన్‌గా అంజాద్‌ఖాన్ ఎన్నో సినిమాలు చేశారు. కాని ఒకనాటి మిత్రులైన సలీమ్–జావేద్ రాసిన ఏ స్క్రిప్ట్‌లోనూ మళ్లీ యాక్ట్ చేయలేదు. చేజారిపోయాడు.
దాసరి నారాయణరావు తొలి రోజుల్లో నటుడు నాగభూషణాన్ని ఎంతో నమ్ముకున్నాడు. అభిమానించాడు. నాగభూషణం దాసరికి దర్శకుణ్ణి చేస్తానని చెప్పి చాలా పని చేయించుకున్నాడు. చివరి నిమిషంలో వేరొకరిని పెట్టుకున్నాడు. దాసరి ఆ తర్వాత పెద్ద దర్శకుడయ్యి 150 సినిమాలు చేశాడు. వందల పాత్రలు రాశాడు. కాని దాసరి కలం నుంచి ఒక్క పాత్ర కూడా నాగభూషణం కోసం సృజించబడలేదు. దాసరి సినిమాల్లో నాగభూషణం ఎప్పుడూ లేడు.
రామానాయుడు అవకాశం ఇస్తే ఎంతో కష్టం మీద ‘ప్రేమఖైదీ’ సినిమాకు దర్శకత్వం వహించాడు ఇ.వి.వి.సత్యనారాయణ. అప్పటికి అతని మొదటి సినిమా ఫ్లాప్. ఈ సినిమా కూడా పోతే భవిష్యత్తు లేదు. ఫస్ట్ కాపీ చూసిన పరుచూరి బ్రదర్స్ ఏ మూడ్‌లో ఉన్నారో ‘మా స్క్రిప్ట్‌ను చెడగొట్టినట్టున్నాడే’ అనే అర్థంలో రామానాయుడు దగ్గర హడావిడి చేశారు. వారు స్టార్‌రైటర్స్. వారి మాట మీద రామానాయుడుకు గురి. ఇ.వి.వి హడలిపోయాడు. స్క్రిప్ట్‌ను తన బుర్రతో ఆలోచించి మెరుగుపెట్టి తీస్తే ఇలా అంటారేమిటి అని సిగరెట్లు తెగ కాల్చాడు. సినిమాను మూలపడేస్తే ఇంతే సంగతులే అని కుంగిపోయాడు. కాని సినిమా రిలీజయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత 51 సినిమాలు తీశాడు ఇ.వి.వి. ఒక్కదానికీ గురు సమానులైన పరుచూరి సోదరుల స్క్రిప్ట్ వాడాలనుకోలేదు.
బాగా చనువుగా, ఆత్మీయంగా ఉండే మనుషుల పట్ల కొందరికి హటాత్తుగా చిన్నచూపు వస్తుంది. ఆ.. ఏముందిలే అనుకోబుద్ధవుతుంది. వారితో మనం ఎలా వ్యవహరించినా చెల్లుబాటవుతుందిలే అనిపిస్తుంది. వారితో చెప్పకుండా ఫలానా పని చేద్దాం... శుభలేఖ ఆఖరున పంపుదాం... కష్టంలో ఉన్నారని తెలిసినా చూసీ చూడనట్టు ఉందాం... ఇచ్చిన మాటను తేలిగ్గా తీసుకుందాం... వారి వీపు మీద విస్తరి పరిచి భోం చేద్దాం... అనుకుంటే ఆ క్షణంలో ఆ సదరు వారు మనం చెప్పింది విన్నట్టుగా కనపడతారు. నవ్వుతున్నట్టే ఉంటారు. కాని వారి లోపల మనసు చిట్లుతున్న చప్పుడు మన చెవిన పడకుండా జాగ్రత్త పడతారు. ఆ తర్వాత వారు మనకు కనిపించరు. జారిపోతారు. చేజారిపోతారు.
మనుషులు చేజారితే ఏమవుతుంది? వారితో మాత్రమే సాధ్యమయ్యే జీవన సందర్భాలన్నీ నాశనమవుతాయి. వారితో నిర్మించుకున్న గతం తుడిచిపెట్టుకుపోతుంది. వారితో వీలైన భవిష్యత్తు నష్టమవుతుంది. ఉంటే బాగుండు అనుకునే క్షణాల్లో వారు ఉండరు. డబ్బు, దస్కం, పలుకుబడి, క్షమాపణ ఏదీ వారిని మళ్లీ వెనక్కు తీసుకురాదు.
హాయ్, హలో బాపతు సవాలక్ష దొరుకుతారు. ఈ నిజమైన ఆత్మీయులను కాపాడుకుంటున్నారా? అసలు మీరెంత మందిని చేజార్చుకున్నారో ఎప్పుడైనా లెక్క చూసుకున్నారా?
గతంలోకి వెళ్లి ఒకసారి సింహావలోకనం చెయ్యండి మీకే అర్థమవుతుంది 🙏
Source: 2nd oct. సాక్షి ఎడిటోరియల్...
No comments:
Post a Comment