Wednesday, November 8, 2023

శ్రీ మహాభారతంలో చిన్ని కథలు: #శిక్ష:

 090323c1614.    100323-3.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀292.

                 శ్రీ మహాభారతం 
                 ➖➖➖✍️
                 292 వ భాగం
    శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:


#శిక్ష:

ధర్మరాజు భీష్ముడితో… “పితామహా! నాకు శిక్షా విధానము గురించి వివరించండి” అని అడిగాడు. 

భీష్ముడు…  “ధర్మరాజా! పూర్వము ద్యుమత్సేనుడు అతడి కుమారుడు సత్యవంతుడు నడుమ జరిగిన సంవాదము గురించి చెప్తాను విను. వారిద్దరు నేరస్తులకు వేయు శిక్షలగురించి చెప్తాను విను… ద్యుమత్సేనుడు :-నేరము చేసిన వారిని వధించడము ధర్మమని పెద్దలు చెప్పారు. 
సత్యవంతుడు :- హింస కర్మ అయినట్లైతే చేయకూడని కర్మ ఉంటుందా ? 
ద్యుమత్సేనుడు:- దొంగలు, హంతుకుల వంటి వారిని వధించకుంటే లోకంలోని ప్రజలు బాధలు అనుభవించాలి.
సత్యవంతుడు :అందుకు మరణ దండన కంటే వేరు మార్గము లేదా ?
ద్యుమత్సేనుడు:ఉన్నాయి నేరానికి తగిన శిక్షలు ఉంటాయి. నేరము చేసిన వాడిని చూపులతో చంపడము, పరుషమైన మాటలతో బాధించడం, మందలించడం, ధనరూపము(అపరాధ రూపములో ధనము వసూలు చేయుట)లో శిక్షలు విధించడం, శరీరావయవములు తీసి వేయడము వంటివి జరుగుతాయి. కాని చంపతగిన నేరము చేసినప్పుడు మాత్రము చంపడం తప్ప వేరు మార్గంలేదు. నేరస్థుల ఎడ వీడు నా వాడు, వీడు మిత్రుడు, బంధువు అని పక్షపాతము చూపడము కూడా నేరమే ఔతుంది. శిక్షలు విధించే రాజు ముందుగా తాను నీతి మంతుడుగా ఉండాలి. తన పుత్రులను, మంత్రులను, ఉద్యోగులను నీతి మంతులుగా తీర్చిదిద్దాలి. అప్పుడే అతడు ప్రజాపాలనకు అర్హుడౌతాడు. తన దగ్గరకు వచ్చిన అభియోగాన్ని చక్కగా పరిశీలించాలి. నేరస్థుని పట్ల, బాధితుడి పట్ల మమకారము కాని ద్వేషము కాని లేకుండా సమదృష్టి వహించి తీర్పును చెప్పాలి. మరణదండనకు అర్హుడైనప్పుడు మాత్రమే నేరస్థుడికి మరణ శిక్ష వేయాలి. అలా చేసిన రాజుకు ఏ పాపము అంటదు. మనం రోజూహత్యలు చేయడం చూస్తూనే ఉన్నాము. లోభము చేతగాని కామము చేతగాని మనస్సులో ఏ మాత్రము శంకలేక నేరస్థులు హత్యలుచేస్తున్నారు. అలాటి వారి పట్ల అహింసా వృత్తి వహిస్తే హింస ప్రబలి ప్రజలలో భయాందోళనలు చెల రేగగలవు. అహింస బ్రాహ్మణులకే కాని రాజులకు, క్షత్రియులకు కాదు. రాజు దయా హృదయంతో ప్రజలను కన్నబిడ్డలవలె పాలించాలి, అలాగే దుష్టులను శిక్షించాలి. అప్పుడే ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారు. ఈ విధంగా పాలించడం రాజుకు అహింసా వ్రతము పాటించడమే! అని ద్యుమత్సేనుడు తన కుమారుడైన సత్యవంతుడికి బోధించాడు.” అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.


#గృహస్థ ధర్మము సన్యాస ధర్మము:

ధర్మరాజు… “పితామహా ! గృహస్థ ధర్మము, సన్యాస ధర్మము ఈ రెండింటిలో ఆచరించతగిన ధర్మము ఏది ?” అని అడిగాడు. 

భీష్ముడు “ధర్మనందనా! రెండునూ ఆచరణ యోగ్యములే. ఈ సందర్భంలో నీకు కపిలమహర్షికి ఒక గోవుకూ జరిగిన సంవాదము వినిపిస్తాను… “పూర్వకాలంలో కపిలుడు అనే మహాముని ఉన్నాడు. అతడు ఒక ధేనువును చూసి నీవు వేదస్వరూపవు కదా !” అని అన్నాడు. 

అక్కడే అదృశ్యరూపములో ఉన్న స్యూమరశ్మి అనే ముని ఆ మాటలు విన్నాడు. ఆ మాటలతో కపిలుడికి వేదముల మీద గౌరవం లేదని తెలుసుకుని సూక్ష్మరూపంలో ఆ గోవులో ప్రవేశించి కపిలుడితో…  “మహర్షీ ! యతులు వేదములను డాంబికత్వముకు ప్రతి రూపంగా భావిస్తారు. కాని వేదములు ఆచరించతగినవి, గౌరవించ తగినవి. నీ సంగతి చెప్పు. నీకు వేదములు ఆచరించతగినవి కాదా! అని కపిలుడిని అడిగాడు. 

కపిలుడు… “ఓ ధేనువా ! నాకు వేదములు అన్న ఆదరము కానీ అనాదరము కాని లేవు. అసలు నీవు నన్ను ఇలా ఎందుకు అడిగావు. నీ మనసు నాకు అవగతము కాకున్నా నాకు తెలిసినంత వరకు చెప్తాను విను. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము అను నాలుగు ఆశ్రమ ధర్మాలు. ఆ మార్గంలో నడచుట సంసారుల కర్తవ్యము. వేదంలో విధించిన విధులను ఆచరించడం మానవుల ధర్మము. కాని యజ్ఞములో హింస మంచిదో చెడ్డదో నాకు అని నువ్వే చెప్పాలి”. 

స్యూమరశ్మి “బ్రహ్మదేవుడు యజ్ఞము కొరకే ధాన్యమును, పశువులను సృష్టించాడు. అదీ కాక స్వయంగా తానే యజ్ఞాలు చేసాడు. ప్రాజ్ఞుడు, అజ్ఞాని ఇద్దరూ స్వర్గ సుఖాలు కోరుకుంటారు. కాని యజ్ఞము చేస్తే తప్ప స్వర్గలోక ప్రాప్తి కలుగదు. అమలినమైన గృహస్థ ధర్మము లోనే యజ్ఞములు చేయడానికి వీలు ఔతుంది. అలాంటప్పుడు యజ్ఞము హింస అనుకుంటే ఎలాగ ?” అని ధేనువులో ఉన్న ముని పలికాడు. 

కపిలుడు .. “కేవలం ఆత్మ సుఖం కోరుకునే వాడు ఇతరములైన సుఖములకు ఆశపడడు. అతడికి కామము, శోకము, విషయవాంఛ ఉండవు. అటువంటి వాడికి స్వర్గ సుఖములు ఎందుకు? కనుక శాశ్వతమైనమోక్షము కొరకు గృస్థాశ్రమము వదిలి పెడతాడు” అన్నాడు. 

ధేనువులోని ముని… “మహర్షి ! మిగిలిన ఆశ్రమములన్ని గృహస్థాశ్రమాన్ని అనుసరించి వర్ధిల్లుతున్నాయి. గృహస్థు మోక్షముకు అర్హుడు కాదని ఏ శాస్త్రము చెప్ప లేదు. సమస్త ధర్మములకు, సమస్త కార్యములకు గృహస్థ ధర్మము మూలము. దరిద్రులు, సోమరులు చేయవలసిన కర్మలను వదిలి వేస్తారు. దాని వలన వారికి సద్గతి కలుగదు. వేదాధ్యయనము వదిలిన పాపము చుట్టుకుంటుంది. వేదములను విడుచుట ధర్మము కాదు” అని స్యూమరశ్మి చెప్పాడు. 

కపిలుడు.. “అయ్యా! బ్రాహ్మణులు తమ ఆచారవ్యవహారములు పాటించి దేవతలని తృప్తిపరచాలి. బ్రాహ్మణుడు పాటించే ఆచారాలు ఈ విధంగా ఉన్నాయి…
సాధకుడు మోక్షప్రాప్తికై శరీరంలోని ద్వారాలను మూసివేస్తాడు. తన ముందు గుట్టగా పడి ఉన్న
బంగారాన్ని ముట్టుకోడు. తనను హింసించే వాడిని కూడా చేతితో కొట్టక చేతిని కట్టడిచేస్తాడు. పరస్త్రీలను చేరక ఉపస్థు అనే వాకిలిని మూసివేస్తాడు. కేవలము శరీరము జీవించడానికి మాత్రమే ఆహారంభుజిస్తాడు. అంతే కాని రుచికొరకు ఆహారం తీసుకోడు. అలా ఉదరము అనే ద్వారాన్ని బంధిస్తాడు. ఎప్పుడూ అసత్యము పలుకడు, పరుషముగా మాట్లాడడు, అనవసరమైన వాదనకు దిగడు కనుక అలా నోరు అనే ద్వారాన్ని మూసివేస్తాడు. ఈ నాలుగు ద్వారములను మూసి వేసిన బ్రాహ్మణుడికి తపస్సు, యజ్ఞములు, యాగములు, దానములు, వ్రతములు అవసరంలేదు. అతడికి వేదములతో పనిలేదు. ద్వందాతీతుడు పేరు ప్రతిష్టల కొరకు పాకులాడడు. కళ్ళకు కనపడే ప్రకృతిని కనపడని పరమాత్మను సాక్షీభూతంగా చూస్తుంటాడు. అటువంటి వాడు నిజమైన బ్రాహ్మణుడు. అలా కాని వాడు కర్మలు చేస్తూ కర్మలలో మునిగి తేలుతుంటాడు” అని కపిలుడు చెప్పాడు. 

అప్పుడు స్యూమరశ్మి తన ఉనికిని తెలిపి.. “కపిలమహర్షీ! నా పేరు స్యూమరశ్మి. ధర్మ సూక్ష్మములను గ్రహించుట కొరకు ఈ ఆవులలో చేరి మాట్లాడాను. అంతే కాని వేరు కాదు. నేను నిన్ను ఆశ్రయించాను. వేదములు ప్రమాణంగా స్వీకరించిన తరువాత వర్ణాశ్రమధర్మాలను పాటించడమో, పరిత్యజించడమో జరగాలి కదా ! వర్ణాశ్రమధర్మాలను ఆచరించ తగినవా కాదా !” అని అడిగాడు. 

కపిలుడు… “జ్ఞాని అయిన వాడు ఏ పని చేసినా వాడికి కీడువాటిల్లదు. జ్ఞాని కానివాడు కామానికి, కోరికలకు లొంగి కర్మబంధంలో చిక్కుకుంటాడు. అహంకారము, కామము, కోపము లేనివాడు శుభము జరిగినా అశుభము జరిగినా బాధపడడు. త్యాగగుణంతో ఎప్పుడూ ప్రశాంతతో జీవిస్తాడు. మీ మహా ఋషులందరూ జ్ఞానము కలవారే. కాని మీలో ఏ ఒక్కరికో ఏకాత్మ భావన కలుగుతుంది. అలాంటి వాడికి సందేహాలు, కర్మబంధాలు ఉండవు. స్యూమరశ్మి మహాత్మా ! వేదములు శాస్త్రములు చూపిన దోవను వదలడం వలన మోక్షము రాదు. వేదములు నమ్మకపోవడం వలన కీడు జరుగుతుంది అని తెలుసుకున్నాను. నా సందేహము తీర్చండి” అని అడిగాడు. 

కపిలుడు… “శబ్ధబ్రహ్మము, పరబ్రహ్మము అని రెండు. శబ్ధబ్రహ్మమును ఆరాధించిన వాడు పరబ్రహ్మమును పొందుతాడు. అసూయ లేని, శమము, దమము, ఆత్మజ్ఞానము కల వాడు వేదములలో చెప్పబడిన ఆచార వ్యవహారాలను శ్రద్ధగా ఆచరిస్తాడు. అటువంటి గృహస్థు సాటి జీవుల ఎడ దయ కలిగి ఉంటాడు. అతడికి స్వాతిశయము, అహంకారము మచ్చుకైనా ఉండవు. శాంత స్వరూపులైన బ్రాహ్మణులు, క్షత్రియులు గృహస్థాశ్రమంలో ఉండి కూడా మోక్షము పొందుతారు. జ్ఞానము ధర్మముకు అధిష్టానము, పరమ సంతోషము ధర్మానికి మూలము, త్యాగము దాని రూపము. కనుక నాలుగు ఆశ్రమాలు ఆచరించ తగినవే. ప్రశాంతమనస్కులు నిరంతర ఆనందం అనుభవిస్తారు. వేదమును చదివినంతనే ప్రయోజనము చేకూరదు. వేదతత్వమును గ్రహించి ఆచరించిన కాని ఫలితము సిద్ధించదు. వేదము చదువునప్పుడు అర్ధము అయినట్లు కనిపించినా వేదము అర్ధము గ్రహించుట కష్ట తరము. మోక్షముకు మూడే మార్గాలు… మొదటిది కర్మ ఫలత్యాగము, రెండవది ఇంద్రియ నిగ్రహము, మూడవది శాశ్వతానందము. ఇవి ఒక దాని కంటే ఒకటిగొప్పది” అని చెప్పాడు కపిలుడు. 

కపిలుని స్యూమరశ్మి ఎంతో ప్రశంసించాడు. 

ధర్మనందనా ! ఈ సంవాదంలో సూక్ష్మము గ్రహించి నడుచుకో”అన్నాడు భీష్ముడు.


#ధర్మము అర్ధము కామము:

ధర్మరాజు భీష్ముడిని… “పితామహ! ధర్మము, అర్ధము, కామములలో ఏది ఉత్తమమైనది?” అని అడిగాడు. 

భీష్ముడు “ధర్మనందనా! ఈ సందర్భంలో నీకు కండధారుని చరిత్ర చెప్తాను విను… ‘ఒక బ్రాహ్మణుడు యజ్ఞము చేయ తలపెట్టాడు. కాని అతడి వద్ద ధనము లేదు అందుకని అతడు ధనము కొరకు తపస్సు చేయసాగాడు. అప్పుడు కండధారుడు అతడి వద్దకు వచ్చి… ‘విప్రుడా ! నీ కోరిక ఏమిటి’ అని అడిగాడు.  

ఆ విప్రుడు కండధారుడిని ‘దేవా ! నాకు ధనము కావాలి’ అని అడిగాడు. 

కండధారుడు దేవతల అనుచరుడూ కుబేరుడి అనుచరుడైన మణిబద్రుడు అనే వాడిని తలచుకుని ప్రత్యక్షం చేసుకుని… “మణిభద్రా ! ఇతడికి కావలసిన ధనము ఇమ్ము!’ అన్నాడు. 

మణిభద్రుడు… ‘అలాగే ఎంత ధనము కావాలన్నా ఇస్తాను’ అన్నాడు. 

అప్పుడు కండధారుడికి ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడో ఒక సారి చనిపోకతప్పదు. కనుక ఇతడికి ధనముతో పనిఏమిటి? ఇతడి బుద్ధిని చక్కని మార్గమున పెట్టిన సంపదలు ఇతడి వద్దకు వచ్చిచేరుతాయి. అని అనుకుని ఆ విషయము మణిభద్రుడికి చెప్పాడు. ఆ ఆలోచనకు మణిభద్రుడు కూడా సంతోషించాడు. కండధారుడు ఆ విప్రుని ధర్మమార్గమున పెట్టమని దేవతలను ప్రార్ధించాడు. అప్పుడు ఆ విప్రునికి తపమాచరించవలెనన్న సంకల్పము కలిగి కండధారుడితో… ‘ఓ మహాత్మా ! నేను ఇప్పటి వరకు నిన్ను ధనము అడిగాను. కాని ఇప్పుడు నీ దయ వలన నా మనస్సు తపస్సు మీదకు మరలింది. కనుక నాకు ఇక ధనము అక్కర లేదు. నాకు తపస్సు చేసుకోవడానికి అనుమతి ఇవ్వు’ అని ప్రార్ధంచాడు. 

కండధారుడు ఆ బ్రాహ్మణుడికి తపస్సు చేసుకోవడానికి అనుమతి ఇచ్చి వెళ్ళాడు. 

తరువాత ఘోరతపమాచరించిన బ్రాహ్మణుడు తన శరీరమును, మనస్సును , మానవత్వము వదిలి దివ్యత్వము పొంది దివ్య శక్తులను పొందాడు. అతడు మనసులో ఇప్పుడిక నేను కోరిన వారికి ధనము ఇవ్వగలను అనుకున్నాడు.

అప్పుడు విప్రుడు కండధారుడిని తలచుకుని ప్రత్యక్షము చేసుకుని తపోమహిమతో గంధము, పూలు సృష్టించి కండధారుడిని పూజించాడు. కండధారుడు…’విప్రోత్తమా ! నీవు నిరంతరము ధర్మాన్ని ఆశ్రయించి, యోగాభ్యాసము చేసి , ఆత్మను అను సంధానము చేసి తరించ!’అని చెప్పి అక్కడి నుండి వెళ్ళి పోయాడు.


#అహింస:

“ధర్మనందనా ! బ్రాహ్మణుడి కథ విన్నావు కదా నీకిక అహింసావ్రతము గురించి చెప్తాను విను… ‘ఒక బ్రాహ్మణుడు అడవిలో ఆశ్రమము నిర్మించుకుని భార్యతో జీవించ సాగాడు. అతడు పొలములో రాలిన గింజలను ఏరుకుని జీవనము సాగిస్తున్నాడు. అతడు అహింసా వ్రతము ఆచరిస్తూ యజ్ఞములో ఫలములను హవిస్సుగా సమర్పించ సాగాడు. అది వేదవిహిత మార్గము కాదని తెలిసి అతడి శాపానికి భయపడి భార్య ఎదురుచెప్పక ఊరకున్నది. ఇంద్రాది దేవతలు హవిస్సును స్వీకరించ లేదు. అక్కడకు ఒక జింక వచ్చి విషయము తెలిసి చెప్పలేదని మునిపత్నిని నిందించి తనను చంపి ఆ మాంసముతో దేవతలకు హవిస్సులు ఇవ్వమని కోరింది. అందుకు ఆ బ్రాహ్మణుడు అందుకు అంగీకరించ లేదు. ఆ జింక కొంత దూరము పోయి తిరిగి వచ్చి ఓ విప్రోత్తమా ! నీకు నేను దివ్యదృష్టి ఇచ్చాను నీ కొరకు ఎవరు వచ్చారో చూడు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో చూసి అక్కడ ఉన్న అప్సరసలను, గంధర్వులను చూసి ఆ జింక చెప్పినట్లు దానిని హింసించడానికి పూనుకున్నాడు. అంతటితో అతడి తపస్సు భగ్నమైంది. ఆ జింక ఒక దేవతాస్వరూపము దాల్చి .. 
‘విప్రోత్తమా! నేను ధర్మదేవతను నిన్ను పరీక్షించడానికి ఇక్కడకు వచ్చాడు. నీకు ఒక ధర్మసూక్ష్మము చెప్తాను విను. అహింస మహాపాపము. కాని అవసరమైన చోట జీవహింస చేసినా అది ధర్మమే ఔతుంది. యజ్ఞము కొరకు కూడా అనవసర జీవహింస చేయకూడదు. నీవు జీవులను బలి ఇవ్వకుండానే నీ యజ్ఞము పూర్తి అయ్యేలా అనుగ్రహిస్తాను’ అని చెప్పి వెళ్ళింది.


#పాపకార్యముల నుండి విముక్తి:

ధర్మరాజు భీష్ముడిని.. “పితామహా! పురుషుడు పాపకార్యము చేయడానికి కారణమేమిటి ? ధర్మకార్యాలు చేయడానికి కారణమేమిటి? పాపకార్యముల నుండి, పుణ్య కార్యముల నుండి ఎలా విముక్తి చెందుతాడు” అని అడిగాడు. 

భీష్ముడు “ధర్మనందనా ! మానవుడు ఇంద్రియములతో గంధము, రసము మొదలైన వాటిని ఆస్వాదించి లోభము మోహములకు లోనౌతాడు. ఆ కారణంగా అధర్మముగా ప్రవర్తిస్తాడు. అందు వలన పాపకార్యములు చేసి పాపము మూట కట్టుకుంటాడు. ఈ విషయము ముందే గ్రహించి మనసును విషయముల నుండి మరలించి సజ్జన సాంగత్యము చేసిన ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఆ తరువాత పాపచింత తొలగి ధర్మాచరణ అందు ఆసక్తి కలిగి ఆ తరువాత ముక్తి పొందుతాడు” అని భీష్ముడు చెప్పగానే ధర్మరాజు “పితామహా ! మీరు క్లుప్తంగా చెప్తే నేను గ్రహించ లేకున్నాను. కనుక వివరించండి అన్నాడు. 

భీష్ముడు “ధర్మనందనా ! కుండలు చేయడానికి కుమ్మరికి కుండలు చేసే నేర్పరి తనము, కుమ్మరి సారె, మెత్తటి మట్టికావాలి. కనుక ఏపనికైనా నేర్పరితనం అవసరం. ధర్మనందనా! కోపము, క్షమాగుణము తోను, కోరికలు లేక పోవడము, సత్వగుణాన్ని పెంపొందించుకొనడము, మితనిద్ర, ధైర్యము, రాగద్వేషములను వదలి జాగరూకతతో భయాన్ని వదిలి, అభ్యాసముతో వస్తువుల మీద వ్యామోహం భ్రాంతిని వదిలి, మితాహారంతో రోగములను అధిగమించి, శబ్ధ, రూప, రస, గంధములు నిస్సారమని గ్రహించి తృప్తిగా జీవించి లోభత్వమును, దయాగుణము చేత ధర్మాన్ని, విచక్షణా జ్ఞానంతో కర్మలను అరికట్టాలి. పై గుణాలతో కామక్రోధములను జయించి కడు నేర్పుతో ముక్తిని సాధించాలి.”


#ఆశ:

ధర్మరాజు…  “పితామహా ! ఈ మహాభారతయుద్ధములో అన్నలను తమ్ములను, బంధువులను, స్నేహితులను చంపుకోవడము కేవలం ఆశ తోడనే కదా! మరి ఈ ఆశను తొలగించే ఉపాయము చెప్పండి” అని అడిగాడు. 

భీష్ముడు “ధర్మనందనా ! మాండవ్యముని జనకుడితో చెప్పినది వింటే నీకు అది అవగతమౌతుంది. ఒక సారి మాండవ్యుడనే ముని జనకుడి వద్దకు వచ్చి ‘మహారాజా! నా లోని ఆశ చావడానికి నన్ను శిక్షించండి’ అని అడిగాడు. జనక మహారాజు ‘మునీంద్రా! నీకు ఉన్న సంపదలు నీకు దుఃఖమును దోషమును తెచ్చి పెడతాయి. మనకు ఆశ లేకున్న దుఃఖములు, దోషములు దరి చేరవు. అందుకే మిధిలానగరము తగలబడుతున్నా నాకు ఏమీ జరగనట్లే ఉంటుంది. కామసంబంధిత సుఖము ఏదైనా ఆశను, కోరికను విడిచిన తరువాత వచ్చే ఆత్మసుఖముకు సరికాదు. ఆవుకు కొమ్ములు పెరుగుతున్న చందాన మనలో ఆశ దినదిన ప్రవర్ధమానం ఔతుంది. ఆశామోహములు   నా ఇల్లు, నా వాళ్ళు, నా ధనము, నా బంధువులు అనే భావములు కలిగిస్తాయి ఆశామోహాలు విడిచిన ఆశ ఆవిరి అయి ఇంకి పోయి జ్ఞానజ్యోతి వెలుగుతుంది. ఓ మునీంద్రా ! దొరికిన దానిని అనుభవిస్తూ దొరకని దానికి చింతించక ప్రశాంత చిత్తంతో ఉంటే అతడి మనసులోకి ఆశ ప్రవేశించదు. ఈ ఆశను దుర్మార్గులు విడువలేరు. ఈ ఆశకు ముసలితనము, రోగము, చావు లేదు కానీ అది మనిషి ప్రాణంతీస్తుంది. ఆశను జయించిన వాడు ఆనందము పొందుతాడు కనుక మునీంద్రా ! నీవు, సుఖములు, దుఃఖములు అనే ద్వంద్వములకు లోనుకావద్దు. అంతఃకరణలో శాంతిపొందు. అదే నీకు అఖండశాంతిని ఇస్తుంది.’ అని జనకుడు చెప్పాడు కనుక ధర్మనందనా! నీ ప్రశ్నకు జనకుడి మాటలే సమాధానము” అని భీష్ముడు చెప్పాడు.


#అవశాన కాలము:

ధర్మరాజుభీష్ముడిని..  “పితామహా ! మానవుడికి అవసాన కాలము ముంచుకుని వస్తున్నప్పుడు అతడు దేనిని ఆచరించాలి. ఈ విషయము ఇదివరకే మీరు నాకు చెప్పారు. కాని వివరంగా వినవలెనన్న కోరిక కలుగుతుంది” అని అడిగాడు. 

భీష్ముడు… “ధర్మనందనా ! ఒక
బ్రాహ్మణుడికి మేధావి అనే కుమారుడు ఉన్నాడు. అతడికి అపరిమితమైన మేధాసంపత్తి ఉంది. ఒక రోజు మేధావి తన తండ్రితో   ‘తండ్రీ ! మనిషికి దినదినము ఆయువు తరిగిపోతున్నప్పుడు అతడేమి చేయాలి?’ అని అడిగాడు. బ్రాహ్మణుడు… ‘కుమారా ! ప్రతిపురుషుడు తన జీవితంలో బ్రహ్మచర్యము, వేదాభ్యాసము, వివాహము, సంతానము పొందడము, ధనసంపాదన, యజ్ఞయాగములు చెయ్యడము తరువాత వానప్రస్థము గడిపి ఆ పిదప సన్యాసం స్వీకరించడం ఇంతకన్నా ఏమి చేయగలడు’ అని చెప్పాడు. 

అందుకు మేధావి మానవునికి పుట్టినది మొదలు ముసలితనము మరణము వెంటాడుతుంటాయి కదా ! అది ఎరుగక తీరికగా వర్ణాశ్రమధర్మాలు ఆచరించడం ధర్మమా ! మనముచేయవలసిన ధర్మకార్యాలు వెంట వెంటనే చేయకున్న మరణం మన కొరకు ఆగదు కదా ! ఇది చేయతగిన పని, చేయకూడని పని ఆలోచిస్తూ ఉన్న యముడు తరుణం చూసి తనవైపు లాగక ఊరక ఉంటాడా ! తండ్రీ ! మృత్యువు అమృతము రెండు మనలోనే ఉన్నాయి. మనలోని మోహమే మృత్యువు, మనలోని తత్వ విచారమే అమృతము. తండ్రీ ! జీవహింస చేసే యజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞము మేలు కదా! కనుక నేను అహింసాయుతమైన కర్మయజ్ఞము చేస్తాను. యోగమార్గావలంబన, తపస్సు, కర్మఫలములను విడుచుట కాక వేరు కర్మలు మనకు హితము కలిగిస్తాయా! అంతా మనకే కావాలి అన్న అత్యాశ దుఃఖాన్ని కలిగిస్తుంది. విషయ సుఖములను త్యాగము చెయ్యడానికి మించిన సుఖము ఉంటుందా ! నీవు విషయ వాంఛలు శాశ్వతము కాదని తెలుసుకో. నీవు మనసు ప్రశాంతంగా ఉంచుకుని ఆత్మ పరిశీలన చేసుకో’ అని కుమారుడు చెప్పాడు. 

ఆమాటలకు ఆ బ్రాహ్మణుడు ఆనందించి దానిని ఆచరించి ముక్తి పొందాడు. ధర్మనందనా ! మేధావి మాటలలోని అంతరార్ధము గ్రహించిన నీకు సమాధానము దొరుకుతుంది” అని చెప్పాడు.✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment