Tuesday, November 7, 2023

*****శ్రీ మహాభారతంలో చిన్ని కథలు: #పాప_పరిహారం:

 ఈ రోజు మహాభారతం చాలా బాగుంది…
తప్పకుండా చదవండి…👇


270223c1640.   280223-3.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀284.

                   శ్రీ మహాభారతం 
                   ➖➖➖✍️
                   284 వ భాగం
      శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:

#పాప_పరిహారం:

#చనిపోయిన బాలునిపై కృప చూపిస్తున్న శివుడు…

ధర్మరాజు…. “పితామహా ! తన బుద్ధిపూర్వకంగా చేయని పాపానికి పరిహారం ఎలా చెయ్యాలి?” అని అడిగాడు. 

భీష్ముడు… “ధర్మనందనా! పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. జనమేజయునకు పూర్వజన్మ అందు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. అతడికి శౌనకుడు అనే ముని పశ్చాత్తాపంతో, పరితపించినా ఎంతటి పాపమైనా పరిహారం చేసుకోవచ్చని చెప్పాడు. జనమేజయుడు శౌనకుడి మాట అనుసరించి తీర్ధయాత్రలు చేసి, అశ్వమేధయాగం చేసి తన పాపములను పోగొట్టుకుని రాజ్యపాలన చేసాడు. ధర్మరాజా ! నీకు ఒక కథ చెప్తాను విను… “విదిశాపట్టణంలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఒక బాలుడు చనిపోయాడు. ఆ బాలుడి శవాన్ని అతడి తండ్రి బంధుమిత్రులతో శ్మశానానికి తీసుకు వెళ్ళాడు. ఆ బాలుడి శవాన్ని శ్మశానంలో పెట్టి తనివి తీరాఏడ్చారు. అక్కడకు వచ్చిన గద్ద వారిని చూసి ‘అయ్యలారా ! ఎంత సేపు ఏడిస్తే మాత్రం పోయిన వాడు వస్తాడా ! చీకటి పడితే భూతప్రేత పిశాచాలు ఈ రుద్రభూమికి వస్తాయి. అవి మిమ్ములను పీక్కు తింటాయి. కనుక మీరు ఇళ్ళకు చేరండి’ అని చెప్పింది. 

పక్కనే ఉన్న నక్క గద్దకు చీకటి పడితే కళ్ళు కనిపించవు. కనుక వాళ్ళను పంపి శవాన్ని ఆరగించాలని గద్ద చూస్తుంది అని నక్కకు అర్ధం అయింది. నక్క వాళ్ళను చీకటి పడేదాకా వాళ్ళను ఆపగలిగితే ఆ శవాన్ని తాను ఒక్కటే తినవచ్చు అనుకుని వాళ్ళ వద్దకు వెళ్ళి … ‘అయ్యో! ఏమిటీ వెర్రి గద్ద మాటలకు భయపడకండి. అయినా ఇంత అందమైన బాలుడిని వదిలి పోవడానికి మీకు మనసెలా ఒప్పుతుంది. మీ ఏడుపులు ఆలకించి ఏదేవుడైనా మీ పిల్లాడికి ప్రాణదానం చేయ వచ్చు. ఇంకా సూర్యుడు అస్తమించ లేదు కదా ! భయమెందుకు?’ అన్నది. 

అప్పుడు గద్ద…  ‘అయ్యా ! ఇంతటి వెర్రి ఎందుకు. ఇప్పటికే ఈ పీనుగ వికృతంగా మారి పోయింది. ఇక ఏం బ్రతుకుతాడు బుద్ది మాలిన ఈ నక్క మాటలు వినకండి. దయా హీనుడైన యముడు ఇతడి ప్రాణములు హరించాడు. త్వరగా ఈ బాలుడికి ఉత్తరక్రియలు చేసి దానధర్మము చేసి ఉత్తమ గతులు కలిగించండి’ అని త్వరపెట్టింది. 

గద్ద మాటలకు వారు తిరిగి వెళ్ళబోయారు. నక్క అడ్డుపడి… 
‘గద్ద మనసు క్రూరం. ఈ బిడ్డను చూస్తుంటే నా మనసు కలుక్కుమంటుంది. మీరు గట్టిగా ఏడవండి ఏ దేవతైనా కరుణించ వచ్చు’ అన్నది. 

గద్ద… ‘నేను పుట్టి పదిహేను వందల సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు చచ్చిన వాడు బ్రతికి రావడం నేను చూడ లేదు. చచ్చిన వాడు మరుజన్మ ఎత్తుతాడు, కాని బ్రతుకుతాడని నమ్మడం చాదస్తం కాదా!’ అన్నది. 

గద్ద మాటలకు వెనుతిరిగిన వారితో నక్క… ‘అయ్యలారా ! నా మాట వినండి పూర్వము శ్రీరాముడు ఒక బ్రాహ్మణుడి కుమారుడిని బ్రతికించి ఇవ్వలేదా! నారదుడు సృంజయుడి కుమారుడిని బ్రతికించలేదా ! అలాగే ఏ సిద్ధుడో, రాక్షసుడో దయ తలచి మీ బిడ్డను బ్రతికించ వచ్చు’ అన్నది. 

ఇంతలో సూర్యాస్థమయం అయింది మహాశివుడు స్మశానవిహారార్ధం అక్కడకు వచ్చి వారిని చూసి… 
‘మీ కేమి కావాలి?’ అని అడిగాడు. 

వారు శివుడిని చూసి సాష్టాంగ పడి బాలుడిని బ్రతికించమని వేడుకున్నారు. 

వారి ప్రార్ధనలను ఆలకించిన శివుడు ఆ బాలుడిని బ్రతికించాడు. అతడిని శతాయువుగా దీవించి గద్దకు నక్కకు ఆకలి లేకుండా వరమిచ్చాడు. 

కనుక ధర్మరాజా ! ఆర్తుల కన్నీళ్ళు తుడవడం రాజు బాధ్యత. తమ పనులను చక్కబెట్టుకోవడానికి కపటంగా మాట్లాడే వారి మాటల నేర్పు గ్రహించి ప్రవర్తించాలి.


#మహావృక్షం:

“ధర్మనందనా నీకు మరొక కథ చెప్తాను శ్రద్ధగా ఆలకించు.. ‘హిమాలయ పర్వత శ్రేణువులలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. అది చాలా కాలం నుండి ఉంది కనుక శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది. ఒక రోజు నారదుడు ఆ వృక్షముతో ‘వృక్షరాజమా ! ఇంత విశాలంగా విస్తరించి అనేక పక్షులకు ఆశ్రయం ఇస్తున్నావు. నీవు ప్రచంఢగాలులకు తట్టుకుని ఎలా నిలిచావు?’ అని అడిగాడు. ఆ మాటలకు ఆ వృక్షం గర్వపడి… “మహాత్మా ! నా కున్న బలంలో పద్దెనిమిదో వంతు కూడా లేని వాయుదేవుడు నన్ను ఏమి చేయగలడు?” అన్నది. 

నారదుడ… “వాయు దేవుడి బలానికి పర్వతాలే విరిగిపడతాయి కదా ! ఈ లోకంలో వాయుదేవుడి మీద ఆధారపడని జీవులు ఎవరున్నారు”అన్నాడు. 

వృక్షం “ఇంతగా విస్తరించిన నన్ను ఎదుర్కొనడం వాయుదేవుడికి సాధ్యం కాని పని” అన్నది బూరుగ చెట్టు. 

ఈ విషయం నారదుడి ద్వారా విన్న వాయుదేవుడు వృక్షంతో..  “నా కంటే బలవంతుడివి అన్నావట నిజమేనా?” అన్నాడు. 

వృక్షం… “ నిజమే నేను నీ కంటే బలవంతుడినే” అన్నది. 

వాయుదేవుడు నవ్వి “ఒక నాడు 
నీ నీడన బ్రహ్మదేవుడు విశ్రాంతి తీసుకుని నీకు కృతజ్ఞతలు చెప్పాడని నీవు విర్రవీగు తున్నావు. నా బలం ఏమిటో నీకు రేపు రుచిచూపిస్తాను” అని వెళ్ళాడు. 

బూరుగు ఆలోచనలోపడి అనవసరంగా నారదుడితో వివాదపడి చిక్కుల్లో పడ్డాను. వాయుదేవుడి బలం ముందు నేనెంత? అనుకుని రాత్రికి రాత్రి కొమ్మలను విరుగ కొట్టుకుని మోడులా నిలబడింది. 

మరునాడు అక్కడకు వచ్చిన వాయుదేవుడు నేను చేయవలసిన పని నీకు నువ్వే చేసుకున్నావు అని వెళ్ళి పోయాడు. 

కనుక ధర్మనందనా తనకంటే బలవంతుడితో పోటీ పడితే బలహీనుడు చెడిపోగలడు” అని భీష్ముడు చెప్పాడు.


#ధర్మజుని సందేహాలు:

ధర్మరాజు.. “పితామహా! పాపమునకు మూలం ఏది ? పాపం ఎక్కడ పుడుతుంది ? పాపం ఎలా ఉంటుంది ?” అని అడిగాడు. 

భీష్ముడు… “ధర్మరాజా ! అన్ని పాపములకు మూలము లోభము. లోభానికి మూలం కోరికలు, కామవాంఛలు, కోపం, అసూయ, ద్రోహ చింతన, ప్రర స్త్రీ వ్యామోహం, అత్యాశ, సిగ్గు లేమి, ఓర్పు లేమి మొదలైనవి లోభానికి కారణం. కనుక పాపం రాకుండా ఉండాలంటే లోభానికి దూరంగా ఊండాలి” అన్నాడు.  

ధర్మరాజు … “పితామహా ! అన్ని ఆపదలకు, దుర్గతులకు మూలమైన అజ్ఞానం ఎలా ఉంటుంది “ అని అడిగాడు. 

భీష్ముడు “ధర్మజా ! లోభం వలన అజ్ఞానం పుడుతుంది. అజ్ఞానం అన్ని ఆపదలకు మూలం కనుక లోభం వదిలితే అజ్ఞానం దానంతట అదే పోతుంది” అని చెప్పాడు. 

“ధర్మనందనా ! ధర్మములన్నింటికీ మూలం ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహానికి జ్ఞానం తోడైతే ఉత్తమ గతులు లభిస్తాయి. ఇంద్రియ నిగ్రహంతో కామ, క్రోధ, మద, మాత్సర్యాలను జయంచి బ్రహ్మపదం చేరుకుంటాడు. సర్వ ధర్మాలకు తపస్సు మూలం, నియమ నిబద్ధతతో చేయబడే తపస్సు వలన పాపములు హరించి సత్యము, శుచిత్వం కలిగి సకల కార్యములు సిద్ధిస్తాయి” అని భీష్ముడు చెప్పాడు. 

“పితామహా ! దేవగణములు, పితృగణములు, బ్రాహ్మణులు సత్యవ్రతమును ప్రశంసిస్తుంటారు కదా ! ఆ సత్యవ్రతమును గురించి చెప్పండి” అని అడిగాడు. 

భీష్ముడు “ధర్మనందనా ! అన్ని ప్రాణులయందు సమానత్వం కలిగి ఉండడం, ఇంద్రియ నిగ్రహం, ఓర్పు, ధైర్యము, నిజాయితీ కలిగి ఉండడం, యజ్ఞ యాగములు దాన ధర్మములు చెయ్యడం, పరోపకారం చెయ్యడం, ఈర్ష్య, ద్వేషం లేకపోవడం, అహింస ఇవన్నీ సత్వగుణాలు సత్యరూపాలు. సత్యవ్రతాచరణ వలన యోగము, మోక్షము లభిస్తాయి. సత్యవ్రతానికి వేయి అశ్వమేధయాగాలు సాటిరావు” అని చెప్పాడు భీష్ముడు.


#అరిషడ్వర్గాలు:

ధర్మరాజు.. “పితామహా ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అవి ఎలాపుడతాయి వాటిని జయించే మార్గం ఏమిటి శలవివ్వండి” అని అడిగాడు. 

భీష్ముడు… “ధర్మనందనా ! మన మనసులో మెదిలే భావాల నుండి కామం పుడుతుంది. కామస్వరూపం తెలుసుకుంటే కామం నశిస్తుంది. ఇతరులు మనపట్ల ప్రవర్తంచిన తీరుకు ఒక్కోచో కోపం ఉద్భవిస్తుంది. వారి ప్రవర్తన పట్ల ఓర్పువహించి కోపమును జయించాలి. మనకున్నది ఎదీ శాశ్వతంకాదు అని దృఢంగా అనుకుంటే లోభం మాయమౌతుంది. ధర్మప్రవర్తన వలన మోహం నశిస్తుంది, తోటివారంతా సమానమే అనుకుంటే మదం పోతుంది, సత్వగుణం వృద్ధి చేసుకున్న కొద్దీ రజో, తమో గుణాలు నశిస్తాయి. అరిషడ్వర్గాల జోలికి పోని మనుష్యుడికి శుభం కలుగుతుంది. మనుషులలో ధైర్యం లోపించినప్పుడు అరిష్డ్వర్గాలు పట్టి పీడిస్తాయి. వాటిని ధైర్యంగా ఎదిరించినచో  దరిచేర లేవు”  అన్నాడు. భీష్ముడు తిరిగి … “ధర్మనందనా ! ధృతరాష్ట్రుడిపై ఆరు గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే సర్వనాశనం అయ్యాడు. నీకు ఆ ఆరుగుణాలు లేనందున్న నీకు విజయం ప్రాప్తించింది. ఇతరులను హింసించే వాడు పైగుణాలు కలిగిన వారికంటే హీనుడు, నలుగురికి పెట్టి తినేవాడు ఈ లోకం లోను పైలోకం లోను పూజింపబడతాడు. తనకు తన కుటుంబముకు మూడు సంవత్సరాలకు సరిపడా ధనమును సేకరించిన వాడు యజ్ఞములు చేసిన ఫలము పొందుతాడు. ధనధాన్యములు, సిరిసంపదలు కలిగిన వైశ్యుడు యజ్ఞ యాగములు చేయకున్న రాజు ఆ ధనమును గ్రహించి బ్రాహ్మణుల చేత యజ్ఞములు చేయించాలి. తను తినక వేరొకరికి పెట్టక ఉన్న శూద్రుడి సంపదలోని సగ భాగమును పుణ్యకార్యములకు వినియోగించాలి. ఏ రాజ్యములోనైనా బ్రాహ్మణుడు పేద అయిన అది రాజు తప్పే! కనుక రాజు బ్రాహ్మణులను కంటికి రెప్పలా కాపాడాలి. ఒక మంచివాడు చెడ్డ వాడితో కొంతదూరం పయనించినా, ఒక చోటకూర్చున్నా, భోజనంచేసినా, పానీయంసేవించినా మంచివాడు కూడా పతితుడు ఔతాడు. అబద్ధం చెప్పడం మహాపాపం అయినా ఆడువారి సమయంలో, వివాహ విషయంలో, పరిహాసంగా, మరణవార్త చెప్పడంలో, ధన, మాన, ప్రాణ రక్షణ కొరకు అబద్ధం చెప్పవలసి వస్తే దోషం ఉండదు. అమాయకుడి మీద నింద వేసిన వాడికి అ నిందకు వచ్చేఫలితం అనుభవించక తప్పదు. అకారణంగా తల్లి తండ్రులను వెడులగొట్టిన వాడు పాపాత్ముడు ఔతాడు” అని చెప్పాడు.


#నకులుని సందేహం:

అప్పటికి వరకు అన్ని విషయములు శ్రద్ధగా వింటున్న ఖడ్గవిద్యా విశారదుడైన నకులుడు భీష్ముడిని కొన్ని ప్రశ్నలు అడిగాడు…“పితామహా ! ఆయుధములలో ధనస్సు ఉత్తమం కాని యుద్ధంలో ధనస్సు విరిగినప్పుడు ఖడ్గం ప్రశస్థం అంటారు. ఆ ఖడ్గవిద్యా ప్రశస్థం వివరించండి” అని అడిగాడు. 

భీష్ముడు “నకులా! బ్రహ్మదేవుడు సృష్టించిన జీవులు బ్రహ్మదేవుడు నిర్ధేశించిన మార్గంలో జీవించసాగారు. కాని దైత్యులు దేవతలను, సాధువులను హింసించసాగారు. అప్పుడు బ్రహ్మదేవుడు వేయి సంవత్సరాలు తపస్సు చేసి ఆ పైన యాగం చేసాడు. ఆ యాగాగ్ని నుండి ఒక భయంకర భూతం ఆవిర్భవించింది. దేవతలు, మునులు ఆ భూతాన్ని చూసి భయపడుతుండగా ఆ భూతం ఒక భయంకర ఖడ్గంగా మారిపోయింది. బ్రహ్మదేవుడు మనసులో శివుని తలుచుకోగానే ఈశ్వరుడు ప్రత్యక్షం కాగానే బ్రహ్మదేవుడా ఖడ్గాన్ని ఈశ్వరుడికి ఇచ్చాడు. ఈశ్వరుడు ఆ ఖడ్గంతో దైత్యులను సంహరించాడు. ఆ తరువాత ఈశ్వరుడు ఆ ఖడ్గమును, ఖడ్గవిద్యను విష్ణుమూర్తికి ఇచ్చాడు.
ఆ ఖడ్గవిద్య అటు తరువాత విష్ణువు నుండి మారీచికి, మారీచి నుండి పరశురాముడికి, పరశురాముడి నుండి మునులకు, మునుల నుండి ఇంద్రుడు, ఇంద్రుడు దిక్పాలకులకు, దిక్పాలకులు మనువుకు ఉపదేశించ బడింది. మనువు నుండి ఆ విద్య వంశాను గతంగా దుష్యంతునకు, దుష్యంతుడి నుండి భరతుడికి వంశాను గతంగా వస్తూ చివరికి ద్రోణుడికి ఉపదేశించ బడింది. ద్రోణుడు మీ అందరికీ సమానంగా నేర్పినా ఆ విద్యలో నువ్వు ప్రావీణ్యం సంపాదించావు” అని చెప్పాడు.


#విదురుడు:

అంతలో సూర్యుడు అస్తమించాడు. శ్రీకృష్ణుడు, ధర్మరాజాదులు భీష్ముడి వద్ద శలవు తీసుకుని తమ నివాసములకు వెళ్ళారు. రాజప్రసాదంలో విశ్రాంతిగా ఉన్న సమయంలో ధర్మ, అర్ధ, కామ, మోక్షములలో ఉత్తమము, మధ్యమము,ఆయుధములు ఏవి ? నాకు వివరించండి” అని విదురుడిని చూసి అడిగాడు. 

విదురుడు ఇలా చెప్పసాగాడు.. “ధర్మనందనా ! ధర్మంగా ధనం సంపాదించాలి. ఆ ధనంతో కోరికలు తీర్చుకోవాలి కనుక ఉత్తమమైనది ధర్మం. మధ్యము అర్ధము. అధమం కామము” అని చెప్పాడు. 

అప్పుడు అర్జునుడు “విదురా ! ధర్మ, కామములకు ధనం అవసరమని చెప్పారు కదా ! సన్యాసులకు కూడా తమ యజ్ఞయాగాది కార్యక్రమాలు నిర్వ హించడానికి అవసరమైన ధనం ఉత్తమమైనది కాదా?” అని అడిగాడు. 

ఆ మాటలకు నకుల సహదేవులు “ధనము, ధర్మము ఒక దాని మీద ఒకటి ఆధార పడి ఉన్నాయి కనుక ఏ ఒక్కటి ఉన్నా లాభం లేదు. ధనం లేని వాడికి కామం తీరదు కదా !” అని అడిగారు. 

విదురుడ.. “ధర్మము, అర్ధము వేటికదే సాటి. ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ధనం ధర్మమార్గంలో సంపాదించాలి కనుక ధర్మమే ఉత్తమమైనది. పెరుగులో దాగి ఉన్న వెన్న మాదిరి కామము ధర్మ, అర్ధములలో దాగి ఉంటుంది. సుఖజీవనానికి కామము హేతువు. తుమ్మెద పూవులోని తేనె స్వీకరించిన విధంగా మానవుడు కామం వలన సుఖము పొందుతాడు. కనుక మూడూ ముఖ్యమైనవే అయినా కేవలం కామమును కోరుకునేవాడు అధముడు, అర్ధకామములతో జీవించే వాడు మధ్యముడు. ధర్మంగా ధనం సంపాదించి తద్వారా సుఖం పొందే వాడు ఉత్తముడు” అని చెప్పాడు. 

తరువాత ధర్మరాజు విదురుడిని, తన తమ్ములను చూసి “పుట్టిన ప్రతి వాడికి వార్ధక్యం తప్పదు. ఈ ధర్మార్ధ కామములు మొదట సంతోషం కలిగించినా తరువాత దుఃఖాన్ని కలిగిస్తాయి. కనుక మనిషి నాలుగవదైన మోక్షాన్ని కోరుకోవడం మంచింది. కాని మోక్షం లభించడం సులువు కాదు. కనుక మానవుడు ధర్మార్ధకామములను ఎక్కువ కాలం మనసున నిలుపక అంటీ ముట్టనట్లుండి మోక్షం కొరకు ప్రయత్నించాలి. సుఖాలతో మదము, దుఃఖత్వంతో దీనత్వం వస్తాయి. మానవుడు వీటికి లోను కాక మోక్షం కొరకు ప్రయత్నించాలి” అని ధర్మరాజు చెప్పాడు. 

ఆ గోష్టి అంతటితో చాలించి మర్నాడు యధా విధిగా భీష్ముని వద్దకు వెళ్ళారు.


#రాజుకు కావలసిన వారు:

ధర్మరాజు… “పితామహా ! రాజుకు కావలసిన వాళ్ళు ఎవరు అక్కరలేని వాళ్ళు ఎవరు ? వివరించండి”అని అడిగాడు. 

భీష్ముడు … “ధర్మనందనా ! ఓర్పుగలవారు, ధర్మపరులు, సత్యంపలికే వారు, చంచల బుద్ధిలేని వారు, మదము, కోపం, లోభం లేనివారు, చతురతగా మాట్లాడి కార్యమును సాధించే వారు, తమ రాజుకు సకలసంపదలు చేకూర్చుతుంటారు. వీళ్ళంతా రాజుకు కావలసిన వాళ్ళు. క్రూరుడు, లోభి, ఆశపోతు, చాడీలు చెప్పేగుణం కలవాడు, మందబుద్ధులు, చేసినమేలు మరిచేవారు, అబద్ధాలు చెప్పేవారు, ఒకరితో నిందింపబడిన వారు, పిరికివారు, ధైర్యం లేనివారు, అవినీతిపరులు, దురలవాట్లకు బానిస అయినవారు రాజుకు నష్టం కలిగిస్తారు. వీరు అందరిలో చేసినమేలు మరిచేవారు పరమనీచులు. ఈ సందర్భంలో నీకు ఒక కథ చెప్తాను… ‘ఒక బ్రాహ్మణుడు తన కులధర్మాన్ని వదిలి ఒక బోయవనితను వివాహం చేసుకున్నాడు. బోయవాళ్ళతో చేరి వేటసాగించి మాంసం తినడం లాంటి భోగములు అనుభవించ సాగాడు. మరింత ధనం సంపాదించవలెనన్న కోరికతో వైశ్యులతో చేరి పయనించసాగాడు. ఇంతలో ఒక ఏనుగు వారిని తరిమింది. వర్తకులంతా పారిపోయారు. ఆ బ్రాహ్మణుడు కూడా పరిగెత్తి ఒక మర్రిచెట్టు కిందకు చేరుకున్నాడు. ఆ చెట్టుకింద నాడీజంఘుడు అనే కొంగ నివసిస్తూ ఉంది. ఆ కొంగ బ్రాహ్మణుడితో …  ‘భూసురోత్తమా ! ఎక్కడి నుండి వస్తున్నారు. ఏ పనిమీద పోతున్నారు’ అని అడిగాడు. 

అతడు…. ‘నేను గౌతముడి కుమారుడను నేను బ్రాహ్మణోచితమైన వేదాధ్యయనం చెయ్యకుండా వ్యామోహంతో ఒక బోయవనితను వివాహం చేసుకుని జీవిస్తున్నాను. అధికంగా ధనం సంపాదించాలని వర్తకులతో కలిసి పోతున్న సమయంలో ఏనుగు చేత తరమబడి ఈ చెట్టుకింద చేరాను’ అని చెప్పాడు. 

నాడీజంఘుడు.. ‘బ్రాహ్మణోత్తమా ! బాధపడకు నేను నీ దారిద్యాన్ని పోగొట్టగలను. ముందు నా ఆతిధ్యం నీవు స్వీకరించు!’ అని పక్కనే ఉన్న నదిలోనుండి చేపలు పట్టుకు వచ్చి కాల్చి పెట్టింది. 

బ్రాహ్మణుడికి అలవాటైన ఆహారం కనుక అవితిని తనఆకలి తీర్చుకున్నాడు. 

అప్పుడు నాడీజంఘుడు… ‘మంచి స్నేహితుడు, వెండి, బంగారం, మంచి బుద్ధి ఈ నాలుగూ దారిద్యమును పోగొడతాయి. ఈ నాలుగింటిలో మంచిమిత్రుడు గొప్ప వాడు. నేను కశ్యపు కుమారుడను. నాతో మైత్రి కావించు నీకు ఐశ్వైర్యం కలుగుతుంది. ఇక్కడకు మూడు యోజనముల దూరంలో మధువ్రజపురం ఉంది. అక్కడ నా మిత్రుడు విరూపాక్షుడు అనే రాక్షస రాజు ఉన్నాడు. అతడి వద్దకు వెళ్ళి నేను పంపానని చెప్పు అతడు నీకు కావలసిన బంగారం, రత్నములు ఇస్తాడు.” అని చెప్పింది. 

ఆ బ్రాహ్మణుడు విరూపాక్షుడి వద్దకు వెళ్ళి తనను నాడీజంఘుడు పంపాడని చెప్పి తనకు ధనసంపద కావాలని అడిగాడు. 

అతడిని చూడగానే అతడు నీచుడని గ్రహించిన విరూపాక్షుడు “మిత్రమా ! నీవు ఎవరవు? నీకుల మేమిటి “ అని అడిగాడు. 

ఆ బ్రాహ్మణుడు తనను గురించి చెప్పుకున్నాడు. 

విరూపాక్షుడు మనసులో ఇతడు ఎలాంటి వాడైతే నా కేమి ఇతడు నాడీజంఘుని మిత్రుడు అదే ఇతడి అర్హత. ఇతడికి కావలసిన ధనం ఇస్తాను. అని అనుకున్నాడు. ఆ మరునాడు కార్తిక పౌర్ణమి. వేల కొలది బ్రాహ్మణులు విరూపాక్షుడి వద్దకు వచ్చారు. విరూపాక్షుడు వారికి భోజనం పెట్టి బంగారం, వెండి కానుకలు ఇచ్చి పంపాడు. వారితో చేర్చి ఆ బ్రాహ్మణుడికి కూడా భోజనం పెట్టి ఎన్నోకానుకలు ఇచ్చాడు. ఆ కానుకలను మోయ లేక మోస్తూ అతడు నాడీజంఘుడి వద్దకు వచ్చాడు. 

అతడి మాటలు విని నాడీజంఘుడు తన మాట మన్నించి బ్రాహ్మణుడి దారిద్ర్యాన్ని పోగొట్టిన విరూపాక్షుడిని తలచుకుని సంతోషించాడు. 

ఆ రాత్రికి ఆ బ్రాహ్మణుడు అక్కడే నిదురించాడు. సగంరాత్రిలో బ్రాహ్మణుడు తనలో నా వద్ద ధనం ఉంది కానీ రేపటికి ఆహారం లేదు అనుకుని ఒక కర్ర తీసుకుని అక్కడే నిద్రిస్తున్న నాడీజంఘుడి తల పగుల కొట్టి ముక్కలుగా నరికి మూట కట్టాడు. ఇంతలో తెల్లవారింది విరూపాక్షుడి మనసులో కలత రేగింది. ప్రతి రోజూ తన వద్దకు వచ్చే నాడీజంఘుడు ఈ రోజు రాలేదు ఆ నీచుడైన బ్రాహ్మణుడు నాడీజంఘుడికి ఏదైనా అపకారం తలపెట్టాడేమో ? అనుకుని నాడీజంఘుడి వద్దకు భటులను పంపాడు. 

ఆ భటులు అడవిలో ఉన్న బ్రాహ్మణుడిని అతడి చేతిలోని మాంసపు మూటను చూసారు. వారు ఆ బ్రాహ్మణుడిని పట్టుకుని విరూపాక్షుడి ముందు నిలబెట్టారు. విరూపాక్షుడి మూటలో ఉన్నది నాడీజంఘుడి శరీరానికి చెందినవి అని తెలుసుకుని కోపించి “చేసిన మేలు మరచిన ఈ విశ్వాసఘాతకుడిని భక్షించండి!”అని ఆజ్ఞాపించాడు. 

భటులు “అయ్యా ! ఈ పాపాత్ముడిని చంపి తిన్న మాకు పాపం చుట్టు కుంటుంది” అన్నారు. 

విరూపాక్షుడు “తింటే తినండి లేకున్న లేదు చంపిపారేయండి”అన్నాడు. 

భటులు ఆ బ్రాహ్మణుడిని కొట్టిచంపి శరీరాన్ని పారవేశారు. అతడి మాంసం ముట్టడానికి కుక్కలు కూడా దగ్గరకు రాలేదు. విరూపాక్షుడు నాడీజంఘుడి శరీరానికి అంత్యక్రియలు నిర్వహించాడు. ఇంతలో అక్కడకు వచ్చిన ఇంద్రుడిని చూసి  విరూపాక్షుడు నాడీజంఘుడిని బ్రతికించమని కోరాడు. 

ఇంద్రుడు… “విరూపాక్షా ! నాడీజంఘుడు నీకే కాదు బ్రహ్మదేవుడికి కూడా స్నేహితుడే! నీవే కాదు బ్రహ్మదేవుడు కూడా అతడి కొరకు విచారిస్తున్నాడు. అటుచూడు నాడీజంఘుడి చితాభస్మం మీద ఒక ఆవు తన దూడకు పాలను ఇస్తోంది. అప్పుడు చిందిన పాలనే అమృతధారలకు నాడీజంఘుడు తిరిగి జీవించాడు చూడు” అన్నాడు. 

ఇంతలో అక్కడకు వచ్చిన నాడీజంఘుడు చావు బ్రతుకుల్లో ఉన్న బ్రాహ్మణుడిని చూసి అతడిని విడిపించమని విరూపాక్షుడిని కోరాడు. అతడిని విడిచిపెట్టి అతడి బంగారాన్ని కానుకలను అతడికి ఇచ్చి పంపాడు విరూపాక్షుడు. 

కనుక బ్రహ్మహత్య చేసిన వాడికైనా విముక్తి ఉంటుంది కాని మిత్రుడికి చేసే విశ్వాసఘాతుకానికి నిష్కృతి లేదు. మంచిమిత్రుడు ఈ లోకానికే కాదు పరలోకానికి కూడా సహకరిస్తాడు. ధనము, మిత్రులలో మిత్రుడే గొప్పవాడు. కనుక ఉత్తమ గుణసంపన్నుడు, ఉత్తమకులజుడైన మిత్రుడు అన్ని విధాలా శ్రేష్టుడు” అని చెప్పాడు. ✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment