Monday, November 6, 2023

పిచ్చుక తెలివి

 *పిచ్చుక తెలివి*

🐦🐦🐦

ఒక రోజు ఒక వేటగాడి చేతికి ఒక చిన్న పక్షి (పిచ్చుక) దొరికింది. అతడు దానిని చంపబోతుంటే ఆ పక్షి అతనితో ఇలా అంది:

”అయ్యా! నీవెన్నెన్నో పెద్ద పెద్ద మృగాల్నీ, జంతువుల్నీ వేటాడి ఉంటావు. నా లాంటి అల్ప ప్రాణిని చంపటం వల్ల నీకేం లాభం? పిడికిల్లో పట్టేంత కూడా లేని నన్ను చంపి తింటే నీ ఆకలి ఎలాగూ తీరదు. దయ చేసి నాకు ప్రాణభిక్ష పెట్టి నన్ను వదిలెయ్. అందుకు ప్రతిఫలంగా నేను నీకు అమూల్యమైన మూడు నీతి సూక్తులు చెప్తాను, అవి నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడా నికి, నీవు సంతోషంగా సుఖంగా జీవించడా నికి ఎంతగానో ఉపయోగపడతాయి." అంది.

ఆ వేటగాడు ఒక్కక్షణం అలోచించి ‘నిజమే ఈ పిచ్చుకని చంపటం వల్ల ఉపయోగంలేదు’ అనుకుని “సరే వదిలివేస్తాను ఆ నీతి సూక్తులు చెప్పు" అన్నాడు.

ఆ పిచ్చుక ఆ వెంటనే “అయ్యా! కానీ నాదొక షరతు. నేను మొదటి సూక్తిని నీ చేతిలో చెప్తాను. రెండవది నీ ఇంటి పైకప్పు పై కూర్చుని చెప్తాను. ఇక మూడవది చెట్టు కొమ్మ మీద కూచుని చెప్తాను”అంది. వేటగాడు సరేనన్నాడు.

ఆ పిచ్చుక వేటగాడి చేతిలో కూర్చుని మొదటి నీతి సూక్తినిలా చెప్పింది:

”ఎదుటి వ్యక్తి ఎవరైనాసరే, ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే, నీ అనుభవానికి (తర్కానికి) రానంత వరకు ఆ వ్యక్తినీ, ఆ మాటలను నమ్మకూడదు.” అని చెప్పి వేటగాడి చేతిలో నుండి ఎగిరి వెళ్లి ఇంటి పైకప్పు పైన కూర్చున్నది.

ఇంటి పైకప్పు మీది నుండి ఫక్కున నవ్వి ఇలా అంది..

“ఓరీ…మూర్ఖుడా నువ్వు నన్ను ఎవరనుకు న్నావు? నా కడుపులో అత్యంత విలువైన, బరువైన వజ్రం ఉంది. అది తెలుసుకోకుండా నువ్వు వదిలేశావు నన్ను.”

ఈ మాటలు విన్న వేటగాడు హతాశుడై తన దురదృష్టాన్ని తలచుకుని “అయ్యో! అంత విలువైన, బరువైన వజ్రాన్ని కోల్పోయానే, ఎంతటి మూర్ఖుడిని నేను” అని ఏడవటం మొదలుపెట్టాడు.

పిచ్చుక అంది “ఓరీ నీవు నిజంగానే మూర్ఖుడివి. ఇందాకే నీకు చెప్పాను కదా! ‘ఎదుటి వ్యక్తి ఎవరయినా సరే…ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే… నీ అనుభవానికి (తర్కానికి) రానంతవరకు ఆ వ్యక్తినీ, ఆ మాటల్నీ నమ్మకూడదు అనీ..”

“నీ పిడికిలంత కూడా లేని నేను, నా కడుపు లో బరువైన వజ్రం ఉందని చెప్తే ఎలా నమ్మేశావు? మూర్ఖుడా! సరే ఇక రెండో నీతి సూక్తి చెబుతా విను..”

“ వెనక్కి తిరిగి చూసుకుని గతంలో జరిగిపోయిన వాటిని గురించి ఎప్పుడు కూడా అలోచించి బాధ పడకూడదు.” అని చెప్పి ఎగిరి వెళ్లి చెట్టు కొమ్మ పైన కూర్చుంది.

ఆ వెంటనే ఆ వేటగాడు ఏడుస్తూ "నేను నిన్ను వదిలేసి వజ్రాన్ని పోగొట్టుకున్నాను, నువ్వు నన్ను మోసం చేసావు." అని అరుస్తున్నాడు.

ఆ పిచ్చుక వేటగాడిని చూస్తూ కూచుని ఉంది.

వేటగాడు కాసేపటికి తేరుకుని “ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకుని జరిగిపోయిన వాటి గురించి అలోచించి బాధ పడవద్దు” అని గుర్తు చేసుకుని..

“సరే! ఇప్పుడా మూడో సూక్తి ఏమిటో చెప్పు”అన్నాడు.

ఆ పిచ్చుక “ఎలాగూ నేను చెప్పిన మొదటి రెండు సూక్తులు నీ బుర్రకెక్కలేదు కదా? మూడోది చెప్పటం వల్ల ప్రయోజనం ఏంటీ?” అంటూనే...

“నీ మాటలు వినని, అర్థం చేసుకోని వారిపై ఎన్నడూ నీ శక్తినీ, విజ్ఞానాన్నీ, సమయాన్నీ వృథా చేసుకోవద్దు”అని చెప్పి ఎగిరి వెళ్ళిపోయింది.
🐦🐦🐦

No comments:

Post a Comment