Sunday, April 7, 2024

తత్ + త్వం + అసి. తత్ త్వం లను విశ్లేషణ చేయాలి

 *తత్ + త్వం + అసి. తత్ త్వం లను విశ్లేషణ చేయాలి*
*(1) తత్ - త్వం* :- పరమాత్మ లేదా బ్రహ్మం లేదా ఈశ్వరుడు - దీనిని తత్ అనే పదం ద్వారాను; జీవాత్మ లేదా ఆత్మ లేదా జీవుడు - *దీనిని త్వం అనే పదం ద్వారాను సూచిస్తున్నారు. తత్ అంటే అది. దూరంగా ఉన్నది అనే భావనలో అది అంటాం. అది అంటే మనకు తెలియని పరమాత్మ అని. త్వం అంటే నీవు. అంటే ఎదురుగాఉన్న జీవుడు అని* -
ఇలా చెప్పబడుతున్న *తత్ – త్వం* లను పరిశోధించి చూడాలి. ఎందుకు? బ్రహ్మం - ఆత్మ; లేదా ఈశ్వరుడు – జీవుడు; లేదా పరమాత్మ - జీవాత్మ ఈ రెండూ వేరువేరా - ఒక్కటేనా? అనే విషయం తేలటానికే పరిశోధన.
*అద్వైత సిద్ధాంతం జీవేశ్వరులకు భేదం లేదు అని. పరమాత్మ జీవాత్మలకు బేధం లేదు - ఒక్కటే అని. అసలు ఉన్నదొక్కటే ఏకం - రెండవదేదీ లేదు, అద్వయం అని ఆ పరమాత్మను గూర్చి శ్రుతులు నొక్కి చెబుతున్నవి*. 
*అద్వైతం ఎందుకు? జీవేశ్వరులకు భేదం లేదని ఎందుకు తెలుసుకోవాలి? తత్త్వమసి వాక్యాన్ని ఎందుకు విశ్లేషించాలి? ఇంతకూ జీవేశ్వరులు ఒక్కటైతే మనకేం? వేరైతే మనకేం? జీవేశ్వరులు వేరువేరైతే జీవుడెప్పుడూ ఈశ్వరుడికి వేరుగా నుండి ఈ సంసార జననమరణచక్రంలో ఇరుక్కోవాల్సిందే. జీవేశ్వరులిద్దరూ ఒక్కటే ఐతే జీవుడు ఈశ్వరుడే అయి శాశ్వతానందంలో ఉండిపోతాడు. కనుకనే ఈ పరిశోధన - తత్త్వబోధలో - యావత్ పర్యంతం జీవేశ్వరయో భేదబుద్ధి తిష్ఠతి తావత్ పర్యంతం జనన మరణ రూప సంసారో న నివర్తతి. “ఎంతకాలం జీవేశ్వర భేదబుద్ధి ఉంటుందో అంతకాలం జీవుడు సంసార జననమరణ చక్రంలో పడి పుడుతూ - చస్తూ దుఃఖాలు పొందుతూ ఉండాల్సిందే” అని చెప్పటం జరిగింది. జీవేశ్వర భేద బుద్ధి నశిస్తే ఇక సంసార బంధం లేదు. జన్మలేదు. చావు లేదు. అద్వయ ఆనంద స్వరూపుడిగా ఉండిపోవటమే; అందుకే తత్ - త్వంల  పరిశోధన జరగాలి*. 
*(2)* మరి శ్రుతులు ఏం చెబుతున్నాయి? రెండూ ఒక్కటేనని ఏకత్వాన్ని గూర్చి చెబుతున్నాయి. తత్ - త్వం - అసి 'అది నీవే ఐ ఉన్నావు' అని మహావాక్యం. (సామ వేదాంతర్గత చాందోగ్యోపనిషత్తు లోనిదీ వాక్యం) 'అది నీవే ఐ ఉన్నావు' అని అన్నంతమాత్రాన ఎలా కుదురుతుంది? జీవుడికి శరీరం ఉపాధి. ఈశ్వరునికి జగత్తు ఉపాధి. 
జీవుడికి బంధం ఉన్నది. (మృత్యువు) ఈశ్వరునికి బంధం లేదు (నిత్యం). 
జీవుడు అశుద్ధుడు. (దుఃఖంతో) ఈశ్వరుడు శుద్ధుడు (నిత్యానందం).
జీవుడు అజ్ఞాని (పరిమితం) ఈశ్వరుడు జ్ఞాని (అపరిమితం). 
ఇలా ఇద్దరిలో పరస్పర విరుద్ధ ధర్మాలున్నాయి గదా! మరి ఇద్దరు ఎలా ఒక్కటవుతారు? ఏకత్వం ఎలా సంభవం? ఉపాధుల దృష్ఠితో చూస్తే రెండూ వేరు వేరే. అయితే ఉపాధులు శాశ్వతం కాదు. అజ్ఞానం శాశ్వతం కాదు. కనుక వాటిని తొలగించి చూస్తేనో - నశించిపోయే వాటిని దృష్టి పథం నుంచి తొలగించి ఉన్న అసలు తత్వాన్ని చూస్తేనో - రెండూ ఒక్కటే. 
:

*Ref* : Viveka Chudamani of Sri Adi Sankaracharya. 
                                                                            🪷⚛️✡️🕉️🪷

No comments:

Post a Comment