“ యథా గురు - తథా శిష్య “
అది ఒక మున్సిపల్ హైస్కూల్ , మార్చి నెల ఎండాకాలం వస్తుంది అనేందుకు సూచికగా వేడి ఎక్కువగా వుంది , మధ్యాన్నం మూడు గంటలయ్యింది ... సైన్స్ మాస్టారు 9 తరగతి ‘ఏ ‘ సెక్షన్ లో ఫ్యాన్ క్రింద కుర్చీలో కూర్చొని వున్నారు . ఏ పాఠం చెప్పాలి అని ఆలోచిస్తూ సైన్స్ పాఠ్యపుస్తకం లోని పేజీ లను అటూ ఇటూ తిప్పుతున్నారు . హఠాత్తుగా కడుపులో నొప్పిమొదలయ్యింది ... నులునొప్పిలాగా మొదలయ్యి కొద్దిసేపట్లనో భరించలేనంతగా నొప్పి పెరిగింది . మాస్టారికి కళ్ళముందు అంతా మసకబారుతూ చీకటి అయ్యింది ... స్పృహతప్పి కుర్చీలోనే కుప్పకూలిపోయారు . పిల్లలు పెద్ద ఎత్తున మాస్టారు అని కేకవేసి తట్టిలేపటానికి ప్రయత్నించారు , మాస్టారు లేవలేదు . ఇంతలో కొద్దిమంది విద్యార్థులు స్టాఫ్ రూమ్ కి వెళ్లి ఇతర మాస్టర్లను , హెడ్ మాస్టర్ గారిని తీసుకు వచ్చారు . మాస్టారు స్పృహలో లేరన్న విషయాన్ని గ్రహించిన మిగిలిన మాస్టర్లు సమయాన్ని వృధాచేయకుండా వెనువెంటనే మాస్టార్ని , హెడ్ మాస్టర్ గారి కారు లో పక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రికి తీసుకువెళ్లిన వెంటనే స్పృహలోలేని సైన్స్ మాస్టర్ని డాక్టర్ పరీక్షించారు . తదుపరి హెడ్ మాస్టర్ గారిని పిలిచి “ సైన్స్ మాస్టారికి వచ్చింది 24 గంటల కడుపులో నొప్పి , ఇంకొక గంటలో చిన్న ప్రేగుకి రంద్రం పడుతుంది ... కాబట్టి అరగంటలో ఆపరేషన్ చేస్తేనే సైన్స్ మాస్టార్ని మనం కాపాడుకోగలం” అని చెప్పారు డాక్టర్ . ఇది విన్న హెడ్ మాస్టర్ గారికి కాలూచెయ్యి ఆడలేదు , ఏమిచేయాలో పాలుపోలేదు . డాక్టర్ చెప్పిన మాటలను గది బయట నిలబడిన మిగిలిన మాస్టర్లకు వివరించారు ... మనము ఏమిచేస్తే బాగుంటుంది అని అందరూ చర్చించి “ మాస్టారి భార్యకు ఫోన్ చేశారు ... కనెక్ట్ అవ్వలేదు , అందరూ వారి వారి ఫోన్ల నుండి ప్రయత్నించారు .... కవరేజీ ఏరియా లో లేదు కొద్దిసేపటి తర్వాత మరలా ప్రయత్నించండి అనే సమాధానమే వచ్చింది.
ఇంతలో నర్స్ వచ్చి డాక్టర్ గారు రమ్మంటున్నారని హెడ్ మాస్టర్ గారికి చెప్పింది . ఒక వైపు సైన్స్ మాస్టారి భార్య ఫోన్ కలవటం లేదు అన్న ఆందోళనతో ఉన్న హెడ్ మాస్టర్ , డాక్టర్ అడిగితే ఏమి చెప్పాలో అని ఆలోచిస్తూ డాక్టర్ దగ్గరకు వెళ్లారు . గదిలో ఉన్న డాక్టర్ కోపంతో ఉన్నారని గ్రహించిన హెడ్ మాస్టర్ గారు ఈ విధంగా చెప్పారు “ డాక్టర్ గారు , సైన్స్ మాస్టారి భార్య ఫోన్ కలవటం లేదు ... మేము బయటి వాళ్ళం కదా ...మీరేమో ఆపరేషన్ అంటున్నారు ... వాళ్ళ భార్య వచ్చేటంత వరకు ఏదైనా ఇంజక్షన్ లు ఇవ్వండి అని ప్ర్రాదేయపడ్డారు “ . ఇది విన్న డాక్టర్ లాభంలేదండి వెంటనే ఆపరేషన్ చేయాలి , ఇప్పటికే 20 నిమిషాలు సమయం వృధా అయ్యింది - ఇంకొక 40 నిమిషాలలో ప్రేగుకి రంద్రం పడుతుంది. అప్పుడు మనం ఏమి చేయలేము ... ఏమిచేసినా మనం ఈ 40 నిమిషాల లోపే చెయ్యాలి అని గట్టిగా చెప్పారు డాక్టర్. ఇదంతా జరుగుతుండగా నర్స్ వచ్చి హెడ్ మాస్టర్ కి కొన్ని కాగితాలిచ్చి సంతకం పెట్టమని చెప్పింది... ఏమిచేయాలో పాలుపోని స్థితిలో ఉన్న హెడ్ మాస్టర్ వాటిపై సంతకం పెట్టారు . 10 నిమిషాలలో బట్టలు మార్చి , ఆకుపచ్చ గౌన్ కప్పి సైన్స్ మాస్టార్ని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకువెళ్లి , టేబుల్ మీద పడుకోబెట్టారు . ఇంతలో సైన్స్ మాస్టారికి కొద్దిగా స్పృహవచ్చింది ... ఆపరేషన్ థియేటర్ లోని లైట్లు , మిగిలిన పరికరాలు తేరిపారా చూసారు . ఇక్కడ ఎందుకున్నానో అని ఆలోచనలో పడిన సైన్స్ మాస్టారికి పక్కనున్న నర్స్ “ జరిగిందంతా చెప్పింది “ . మాస్టారి మనస్సు లో ఆందోళన కలిగింది ... ఇంతలో డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లోకి వచ్చారు , కళ్ళు తెరిచి అటూఇటూ చూస్తున్న మాస్టారిని చూసి నవ్వి ‘ మాస్టారు నన్ను గుర్తుపట్టారా , మీ స్టూడెంట్ ని ... మీరు కార్పొరేషన్ స్కూల్ లో పనిచేసేటప్పుడు నేను అక్కడే చదివాను . గుర్తుకురాలేదా ? నన్ను మొద్దు అని తిట్టే వారు కూడా అని గుర్తుచేస్తూ డాక్టర్ నవ్వారు . మాస్టారికి ఇంకాగుర్తుకురాపోయే సరికి కొద్దిగా నొచ్చుకున్న డాక్టర్ , ఎలాగైనా మాస్టారికి గుర్తుకుతేవాలన్న పట్టుదలతో మాస్టారి చెవిలో ఈ విధంగా చెప్పారు “ మాస్టారు మీరు నాకు 10 వ తరగతి పరీక్షలలో బిట్లు చెప్పి , చీటీలు అందించారు ... నాకు జిల్లా ఫస్ట్ తెప్పించారు , గుర్తుకు వచ్చానా అని “.... అప్పటి వరకు గుర్తుకు రానిది , జిల్లా ఫస్ట్ అనగానే ఒక్కసారిగా బల్బు వెలిగినట్లుగా వెలిగింది ... “ అరేయ్ నువ్వట్రా అన్నారు మాస్టారు “.. అదిసరే నువ్వు ఇక్కడ ఏమిచేస్తున్నావు అని అడిగారు . మాస్టారు ఈ హాస్పిటల్ నాదే , మీకు ఆపరేషన్ చేయబోయేది నేనే అని చెప్పారు డాక్టర్. ఒక్కసారిగా మాస్టారు మౌనం వహించారు , ఆయన మదిలో ఆందోళన భయంతో కూడిన ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి . వీడు అసలే మొద్దు, నేను కాపీ లు ఇచ్చి - బిట్లు చెప్తే మార్కులు వచ్చిన వీడికి డాక్టర్ సీట్ ఎలావచ్చిందో , ఎలాచదివాడో ... అన్న సందేహాలు మాస్టారి మనస్సును తొలుస్తున్నాయి , అసలే అమ్మాయికి పెళ్లి కూడా చేయలేదు -అబ్బాయి ఇంకా సెటిల్ అవ్వలేదు . దేవుడా!! ఈ మాస్టర్లందరూ కలిసి నన్ను తీసుకు వచ్చి ఈ మొద్దోడి చేతిలో వేశారు , నా పెళ్ళాం పిల్లలు అన్యాయం అయిపోతారు అని మనస్సులోనే కుమిలిపోతున్నారు!! . ఆవేదనతో కుమిలిపోతున్న మాస్టారు , ఇక లాభంలేదు ఏదోఒకటి చేసి ఇక్కడినుండి బయట పడాలని నిశ్చయించుకుని , డాక్టర్ కి నొప్పితగ్గిపోయిందని చెప్పారు . అప్పుడు డాక్టర్ ‘ మాస్టారు మీకు ఇంకొక పావు గంటలో పేగుకు రంద్రం పడుతుంది ... వెంటనే ఆపరేషన్ చేయకపోతే చనిపోతారు అని అన్నారు. మాస్టారు ఏమి మాట్లాడకుండా ఆపరేషన్ బల్లమీదనుండి కిందకు దిగి ఒంటిమీద ఉన్న ఆకుపచ్చ గౌన్ నడుముకు చుట్టుకొని “ నువ్వు ఆపరేషన్ చేస్తే ఎటూ పోతాను , అనవవసరంగా వీడికి అప్పుడు కాపీ లు అందించి జిల్లా ఫస్ట్ తెచ్చాను ... అదే ఇప్పుడు నా ప్రాణం మీదకు తెచ్చింది అని బాధపడుతూ , కడుపులో విపరీతమైన నొప్పివున్నా కూడా పొట్టమీద చెయ్యి అదిమి పట్టి పరుగు పరుగునా ఆపరేషన్ గదినుండి బయటివచ్చేసారు సైన్స్ మాస్టారు !!
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఒకప్పటి డైరెక్టర్ , ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ అయిన ప్రొఫెసర్ డాక్టర్ పి. వేణుగోపాల్ గారికి ఒకసారి గుండె ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఆయన సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్ లను కాదని , తను శిక్షణ ఇచ్చిన తన స్టూడెంట్స్ ని తనకు ఆపరేషన్ చేయమని అడిగి , వారిచేతే గుండె ఆపరేషన్ చేయించుకున్నారు .
ఇది ఇద్దరు గురువుల కథ . ఒక గురువు విద్యార్థులకు సరిగా పాఠాలు నేర్పక , అక్రమ మార్గం లో మార్కులు తెప్పించారు ... అందుకు ఫలితంగా “ డాక్టర్ తన స్టూడెంట్ అని తెలియగానే భయంతో ఆపరేషన్ గదినుండి పరుగుతీస్తే ; మరొక గురువు క్రమశిక్షణతో విద్యార్థులకు బోధించి నైపుణ్యాలు నేర్పి , ధైర్యంగా ఆపరేషన్ గదిలోకి వెళ్లి తన విద్యార్థుల చేతే గుండె ఆపరేషన్ చేయించుకున్నారు .
మనం ఎటువంటి విత్తనాలు నాటితే , అటువంటి కాయలే వస్తాయి . అదే ‘యథా గురు - తథా శిష్య !’.
No comments:
Post a Comment