Tuesday, April 1, 2025

*****వాట్సాప్ పై 19 ఏళ్ళ... కూతురు తండ్రికి జారీ చేసిన హుకుం .

 " నోరు ముయ్యి .. కొజ్జా మొఖం గాడా!....  ఎక్కువ మాట్లాడకు !...   కన్నావు కదా .. నా ఖర్చులకు డబ్బులు ఇవ్వాల్సిన భాద్యత నీది . అంత కంటే మించి ఏమి చేసినా సహించను . ఇప్పుడు వెంటనే కాబ్ కోసం 400  వెయ్యి. లేక పొతే చూడు  "
 ... వాట్సాప్ పై   19 ఏళ్ళ...  కూతురు తండ్రికి జారీ చేసిన హుకుం .

ఆమె చదివేది రాష్ట్రానికి నడి బొడ్డున ఉండే ఫైవ్ స్టార్ ప్రైవేట్ యూనివర్సిటీ లో.
" మా యూనివర్సిటీ లో ఒక్కోరు ఎలా బతుకుతున్నారు ? నాది ఒక బతుకేనా ? వెంటనే ఫలానా కారు  కొంటేనే   క్లాసులకు పోతాను . లేక పొతే లేదు " అని మొండికేసింది .
తండ్రి పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన పొలాల్ని అమ్మి డెబ్భై లక్షల కారు కొన్నాడు .
ఆ కారులో ఎప్పుడూ నాలుగురైదురుగుర్ని వేసుకొని "షీ కారు" చేస్తుంది .
 గంజాయి ... డ్రగ్స్ .. లిక్కర్ ..

తన కారు పై నిఘా ఉందని తెలుసుకొని ఇప్పుడు క్యాబ్ లో .

 డ్రగ్స్  కేసులో  పోలీస్ లకు చిక్కిన ఒకడు తన బాయ్ ఫ్రెండ్ .
 ఇప్పుడు ఇంకొకడు .

ప్రశ్నిస్తే అంతే సంగతులు . 
అమ్మ నిలదీస్తే .. లక్ష ముప్పై వేల రూపాయిల స్మార్ట్ ఫోన్ ... ఇంకా టీవీ పగలగొట్టింది . 
మరుసటి  రోజే..  లక్ష అరవై వేల ఫోన్ కొనిపించింది .
కని పెంచిన వారి ప్రేమను.. అడిగింది  కొనిపించే  స్థాయికి మార్చుకున్నతెలివితేటల ఆధునిక యువతి.

 
"నేను మీకంటే ముందు చనిపోతాను . ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చెయ్యాలి" అంటుంది . ఒకటి రెండు సార్లు ఆత్మ హత్యా ప్రయత్నం చేసింది .

ఇక్కడి దాక చదివారు కదా ?
ఇప్పుడు మీకేమనిపిస్తోంది ?
ఒక క్రైమ్ స్టోరీ చదివింత థ్రిల్లింగ్ గా ఉందా ?
"ఇది ఏ యూనివర్సిటీ ? 
రాష్ట్రం నడిబొడ్డున అన్నాడే కానీ ఏ రాష్టం అని రాయలేదేంటి ?
 అసలు అక్కడెక్కడో జరిగితే ఇతనికి ఆ విషయం ఎలా తెలిసింది ?
 పోస్ట్ లు వైరల్ కావాలంటే బాగా మసాలా ఉండాలి అని కథలు చెబుతున్నాడు... " అనుకొంటున్నారా ?

అయితే అభినందనలు . 

మీరు "డిజిటల్ డేజ్ పే రెంట్స్  క్లబ్" లోకి చేరినట్టే !

 పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అనేది పాత సామెత .

ఇది ... 
 కొత్త తరం తల్లితండ్రుల కథ !
మధ్య తరగతి తల్లితండ్రుల వ్యధ !

1 .  నలుగురిలో గొప్పగా ఉండాలి అనే ఆలోచన .
.2  .  పిల్లలకు ఉత్తమమయినదాన్నే ఇవ్వాలి అని పట్టుదల .. 
౩ . పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమి/ ఆస్తులు.
 4 . కడుపు చించుకొంటే కాళ్లపై పడుతుంది అనే భయం . 
5 . కన్న పేగు తీపి  ..
 ఇవీ ఈ క్లబ్ సభ్యుల్లో కామన్ గా కనిపించే లక్షణాలు .

విద్యా క్లబ్బులు .. గబ్బులు ! 

 కొత్త తరం తల్లి  తండ్రుల కోసం నేడు  విద్యా క్లబ్బులు వెలుస్తున్నాయి .
 విద్యా సంస్థ అనే పదానికి బదులు "విద్యా క్లబ్బు" అని వాడాను .
ఇది సరి పోక పొతే...  "సిన్ సిటీ" .. "పార్టీ విల్లే".. " వైస్ వర్సిటీ ".. "వ్యసన విద్యాలయం" " పాపాల నరకం "అని పేర్లు పెట్టుకోవచ్చు .

స్కూల్ దశ నుంచి...  యూనివర్సిటీ...  దాక ఫైవ్ స్టార్ .. సెవెన్ స్టార్ హోటల్స్ ను తలదన్నే విద్యా సంస్థలు .
తల్లితండ్రి ఆస్తులను పిల్లల చదువు  పేరుతొ కొల్లగొట్టే దుకాణాలు .

 పది నుంచి  అయిదు వందల  ఎకరాల స్థలం .. రాజ భవనాల్లాంటి బిల్డింగ్ లు .. కోట్లాది రూపాయిల మార్కెటింగ్ .. ప్రకటనలు .. అసలు ఆ లెక్కే   వేరు 

భారత దేశంలో ఇప్పుడు మొత్తం 972 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ అంటే వివిధ దేశాలనుంచి విద్యార్థులు ... అధ్యాపకులు  వస్తారు... అనుకునేరు . 
నేతి బీరకాయ లో నెయ్యి ఉంటుందేమో కానీ వీటిలో ఇంటర్నేషనల్ అంటూ  ఏమీ ఉండదు  . 

నిలువు దోపిడీ !
ఫీజు ... నెలకు ముప్పై వేల నుంచి రెండు  లక్షల దాక ఉంటుంది . 
జనాభాలో కనీసం పది శాతానికికూడా  నెలకు ఇంత జీతం రాదు .
చాలా మంది  పూర్వీకుల ఆస్తులు అమ్మి పిల్లల్ని ఇందులో  చేర్పిస్తారు  .

"నాణ్యమయిన విద్యా అందివ్వాలంటే ఖర్చు తప్పదు కదా ?" అని ఎవరైనా అడగొచ్చు .
పైన చెప్పిన ప్రైవేట్ యూనివర్సిటీ లో...  అయిదు మహా అంటే పది శాతం ఫాకల్టీ కి మాత్రమే తగినంత విద్యార్హతలు ఉంటాయి .
 మిగతా వారిది బోగస్ డిగ్రీ లు . 

అక్కడంతా కులం కంపు . 

పొట్ట ను కట్ చేసి ఓపెన్ చేసినా అక్షరం ముక్క రాని వారు అక్కడ ప్రొఫసర్స్ గా చెలామణి అవుతున్నారు . 

ఇంటర్నేషనల్ స్కూల్స్ లో పరిస్థితి బిన్నం .
 అక్కడి టీచర్స్ గలగలా ఇంగ్లీష్ మాట్లేడేస్తారు . 
అంతకు మించి ఏమీ  వుండదా? అంటే . మోడల్స్ తరహాలో డ్రెస్సులు . వాటి కోసం మానేజ్మెంట్ ప్రత్యేక అలవెన్సు లు ఇస్తుంది . వారు చెప్పే పాఠాలు సున్నా . ఒకరిద్దరు టీచర్స్ పాఠాలు చెప్పినా రాత్రంతా నీలి చిత్రం చూసిన కుర్రాళ్ల ద్రుష్టి ఎక్కడుంటుందో ప్రత్యేకంగా చెప్పాలా ?  . వాటర్ బాటిల్ లో ఓడ్కా కలుపుకొని తాగి క్లాసులో జోగే పిల్లలు ఎంతో మందో !  

ఈ విద్యా క్లబ్బుల్లో...  సిరి గల మా రాజులు  సీట్ కొని తమ పిల్లలని చేర్పిస్తారు .
ఇక్కడే మధ్య తరగతి బిల్డ్ అప్ తల్లితండ్రుల పిల్లలు 
బిల్డ్ అప్ అనేది అమ్మా-  అబ్బా నుంచి జెనెటిక్ గా వచ్చి ఉంటుంది .
 చేతిలో సెల్ ఫోన్ . 
ఒంట్లో హార్మోన్స్ . 
చుట్టూరా స్నేహితులు .. అంటే పీర్ ప్రెషర్ ..
 ఇక చూసుకో నా సామి రంగా !

స్కూల్ దశలోనే రోజుకు అయిదారు గంటలు స్మార్ట్ ఫోన్ పై .. వీడియో గేమ్స్ .. నీలి చిత్రాలు .. బూతుల రీల్స్ .. చాటింగ్ .. ఆన్లైన్ బెట్టింగ్ .

కాలేజీ దశకు వెళ్ళేటప్పటికి ఇది...  ముదిరి .. గ్రూప్ సెక్స్ . డ్రగ్స్ ..గంజాయి .. ఫాన్స్ ఓన్లీ అప్  .. దాకా ఎదుగుతుంది .

కన్నపేగు తీపి ని ఎలా కాష్ చేసుకోవాలో వీరికి తమ సీనియర్స్ ట్రైనింగ్ ఇస్తారు   
బ్లేడ్ తో చేయి కోసుకోవడం .. నిద్ర మాత్రలు మింగడం .. ఫ్యాన్ కు చున్నీ తగిలించడం ..  టీవీ లాంటి ఖరీదయిన వస్తువులు పగలగొట్టడం ..  తల్లి తండ్రి  రహస్యాలు {  లంచం తీసుకోవడం లాంటివి } బయటపెడుతాను అని బ్లాక్ మెయిల్ చేయడం .. ఇవన్నీ ఒక పద్ధతిలో సాగి పోతాయి .

సప్త సముద్రాల కవతల ఏకాంత దీవి...   మర్రి చెట్టు తొర్రల్లో ఇవన్నీ  జరగడం లేదు . 
నేడు కాస్త అటు ఇటుగా ప్రతి మూడు కొంపల్లో ఒకదాని లో జరిగే అడ్డగోలు బాగోతమే ఇది . 

ముదిరి పాకాన పడేదాకా "మా పిల్లలు ఇలాంటి వారు కాదు . చాల మంచి వారు" అనుకోవడం ప్రతి తల్లితండ్రి చేసే పొరపాటే .
ఏమి పెట్టి పెంచుతున్నారు ?

ఐపీఎల్ క్రికెట్ ఎంజాయ్ చేస్తున్నారా ?
అందులో వందల  కొద్దీ ప్రకటనలు . 
అవేంటో గమనించారా ?
రాజశ్రీ , విమల్ , కమల పసంద్.. షారుఖ్ ఖాన్ . అజయ్ దేవగన్ ..గుట్కా ప్రకటనలు
 2003 పొగాకు చట్టాన్ని అపహాస్యం చేస్తూ పాన్ మసాలా పేరుతో సర్రోగేట్  ప్రకటనలు .

గుట్కా సంస్కృతి ఉత్తరాదిని ఎప్పుడో కమ్మేసింది . 
హీరో గుట్కా తింటే ఉత్తరాది ఆడియన్సు కు బాగా నచ్చుతాడని సుకుమారంగా  పుష్ప చేత గుట్కా తినిపించిన కాలం ఇది .

గుట్కా తింటే నోటి కాన్సర్ గ్యారెంటీ  .. 
ముంబై ఆసుపత్రికి కి వెళ్లినా  గుండెపోటు ప్రమాదం తప్పించుకోవడం అంత వీజీ కాదు .

జియో హాట్ స్టార్ లో దంచి కొట్టిన ప్రకటనలు...  డ్రీం 11 , పోకర్ బాజి , మై 11  సర్కిల్ ..  బెట్టింగ్ అప్స్ .

బుర్రలోకి ఏమి వెళుతుందో అదే నీవు .

నలబై పై బడిన వయసులో తమాయించుకోడం సులభం . 
15 - 25  ఏళ్ళ వయసు వారి సంగతి ?
గుట్కా తినమని...  బెట్టింగ్ చేయమని బ్రెయిన్ వాష్ చేస్తుంటే తట్టుకోగలరా ?

ఎంజోయ్మెంట్ అంటే తాగడం .. గంజాయి .. సంభోగం...  అని నేటి తరం నమ్ముతోంది అంటే ఎవరిది పాపం ?

మీడియా వారి చేతిలో .. 
ప్రభుత్వాలు వారి చేతిలో ! 

నీకు...  నీ బిడ్డ కు అండ ఎవరు ?

నువ్వే .

 బతుకు బస్టాండ్ అయిపోకుండా ఉండాలంటే ..
 1 . స్కూల్ లోనో కాలేజీ లోనో పిల్లని చేర్చే ముందు .. అక్కడికి ఒక సారి వెళ్ళండి .  అక్కడి విద్యార్థులు రోజుకు ఎన్ని గంటలు మొబైల్ పై గడుపుతున్నారు ? గాంజా .. గుట్కా .. బెట్ట్టింగ్ ఇంకా  ఏమేమి నడుస్తున్నాయి చూడండి .
 తెలుసుకోండి .
 విశ్వామిత్రుడు అయినా అలాంటి వాతావరణంలో ఉంటే చెడి పోడా?  ఆలోచించండి .

2 . విద్యా సంస్థ విలువను అక్కడి ఫాకల్టీ బట్టి .. వారు నేర్పే విలువలను బట్టి అంచనా వెయ్యండి .

3 . పిల్లలు చెడుదారి పట్టితే పోలీస్ సాయం తీసుకోండి . పరువు పోతుందని భయపడకండి . ధైర్యంగా ముందుకు రండి . విద్యా సంస్థ బాగోతం బయట పెట్టండి . పోలీస్ కేసు పెట్టండి . మీ బిడ్డ తో సావాసం చేసి చెడకొడ్తున్న పిల్లల పై వారి తల్లితండ్రులపై కేసులు పెట్టండి . సోషల్  మీడియాలో  వారి పేర్లు బహిర్గతం చెయ్యండి . కేసులు పెట్టడానికి నిరాకరిస్తే పోలీస్ ల ను న్యాయస్థానాలకు లాగండి .

4 .. "ఈ కాలం పిల్లలు .. ఏమీ చేయలేము" లాంటి నిరాశ నిస్పృహ మాటలొద్దు . పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్ ఇస్తే వారి బతుకు నాశనం కావడం గ్యారెంటీ అని అందరికీ చెప్పండి .

దేశం కోసం గాంధీ కొల్లాయి కట్టాడు .
 భగత్ సింగ్ ఉరి కంభం  ఎక్కాడు . 
బోస్ జలాంతర్గామి లో వేల మైళ్ళు పయనించాడు .

 అంత అక్కరలేదు .

మీరు రోజుకు నలుగురికి ఈ మాటలు చెప్పండి .

1 . సెల్ ఫోన్ మీ పిల్ల చేతిలో టైం బాంబు . అలాగే వదిలేస్తే కొంప మొత్తం నాశనం . వెంటనే సెల్ ఫోన్ లాగెయ్యండి .
2 . జంక్ ఫుడ్ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది . ఇంట్లో వండితే వంట . బయట నుంచి ఆర్డర్ ఇస్తే పెంట .
3 . విద్యా సంస్థలు మీ స్టేటస్ సింబల్స్ కావు . విలువలతో కూడిన విద్యను మీ పిల్లలకు అందించండి . 
ఇదేదో కాలక్షేపం కబుర్లు కావు . నిజ జీవిత వాస్తవం . 
ఇప్పుడు నిద్రలేవకపోతే వగచినా పట్టించుకొనేవారు వుండరు .

అప్పుడు కూడా నీ దౌర్భాగ్యాన్ని సొమ్ము చేసుకొనేందుకు .. డీ అడిక్షన్ సెంటర్స్ ఊరూరా  పెట్టేస్తున్నారు . 
కాదోయి ఏది బిజినెస్ కు అనర్హం .

లక్షల్లో ఖర్చు పెట్టినా ఇసుమంత ప్రయోజనం  ఉండదు .

  పిల్లల్ని కన్న పాపానికి జైల్లో చిప్పకూడు తినే దౌర్భాగ్యాన్ని...  కోరి డబ్బిచ్చి...  కొని  తెచ్చుకోవద్దు .
 డబ్బు పలుకుబడి మెండుగా వారి చేతిలో సామాన్యుడు   ప్రతి రోజు ఏప్రిల్ ఫూల్ అవుతున్నాడు . 
ఇందుకోసం ప్రత్యేకంగా అల్ ఫూల్స్ డే అవసరమా ??

No comments:

Post a Comment