Tuesday, April 1, 2025

 *పరిపూర్ణ జీవిత ఘట్టం ‘రామాయణం’* 

*భారతీయుల జీవితంలో రామాయణం ఒక అవిభాజ్యమైన అంతర్భాగం. త్రేతాయుగం నాటి ఇతివృత్తం. ఇన్ని వేల సంవత్సరాలుగా రామాయణం జాతి హృదయంలో ఉండడానికి కారణం ఏమిటి? రాముడు భగవంతుడు, శక్తిమంతుడు, దండం పెడితే కోరిన కోరికలు సిద్ధిస్తాయి, పుణ్యం వస్తుంది, మోక్షం వస్తుంది. ధైర్యం వస్తుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి విశ్వాసాలను పక్కన పెడితే... రామాయణంలోని ప్రతి ఘటన భారతీయ పౌరుల వ్యక్తిత్వాలపై ప్రత్యక్ష పరోక్ష ముద్ర వేస్తూనే ఉంది. మన అంతశ్చేతనలో గాఢంగా రామాయణంలోని పాత్రల ముద్రలుంటాయి.*

*అన్నదమ్ములు ఎలా ఉండాలో రామ లక్ష్మణ భరత శతృఘ్నులను చూస్తే తెలుస్తుంది. ఒక గర్భాన జన్మించకపోయినా, అన్నదమ్ముల అనుబంధాన్ని చాటారు. తల్లిదండ్రులపట్ల ఉండాల్సిన గౌరవం, వారియెడ చూపించాల్సిన ప్రేమ, ఆప్యాయతలను స్వయంగా ఆచరణలో చూపిన పితృవాక్య పరిపాలకుడు*
*శ్రీరాముని ఆదర్శం గోచరిస్తుంది.*

*అలాగే సద్గురువు మాటను, బాటను అనుసరించడం సదా అనుసరణీయం అని చాటుతుంది రామాయణం. స్నేహధర్మం ఎలా ఉండాలో చెబుతుంది. ఏకపత్నీవ్రతుడుగా, భోగభాగ్యాలను వదులుకుని అరణ్యవాసం చేయాల్సివచ్చినా, సీతాపహరణతో నెచ్చెలిని దూరం చేసుకున్నా, ఎన్ని కష్టాలు ఎదురైనా వెరువని ధీరోధాత్తునిగా నిలబడిన ఆ శ్రీరాముణ్ణి మన జీవితానికి మార్గదర్శిగా చూపుతుంది రామాయణం. స్వచ్ఛమైన ప్రేమను, దాంపత్య అన్యోన్యతను నేటి తరానికి తెలియజేస్తోంది ఈ ఉద్గ్రంథం!*

*అందుకే రాముని వంటి కొడుకు, రాముని వంటి అన్న, రాముని వంటి భర్త, రాముని వంటి మిత్రుడు, రాముని వంటి వీరుడు, రాముని వంటి రక్షకుడు, రాముని వంటి రాజు, రాముని వంటి దేవుడు నభూతో నభవిష్యతి అనవచ్చు. మరి ఒక పరిపూర్ణ జీవిత అనుభవసారం రామాయణ గ్రంథం ప్రతి ఇంట్లోనూ ఉండాలి. ప్రతీ ఒక్కరూ చదివి, సంపూర్ణ వ్యక్తిత్వంతో సంపూర్ణ జీవితం ఎలా గడపాలో అర్ధం చేసుకోవాలి, ఆచరించాలి.*

*┈┉┅━❀꧁జై శ్రీ రామ్꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🌷🛕🌷 🙏🕉️🙏 🌷🛕🌷

No comments:

Post a Comment