🌴 🪴 🌴 🪴 🌴 🪴 🌴 🪴
_[తప్పులెన్నువారు… తమ తప్పులెఱుగరయా..!]_
➖➖➖➖➖ ✍️
*_దివ్యదర్పణం_*
==================
*అద్దాలు మనకు ఆకృతులను చూపిస్తాయి, కానీ మనస్వీయ అధ్యయనం మనకు ఏమి చూపిస్తుందో తెలుసా?*
********************
*ఒకానొకప్పుడు గురుకులంలో, ఒక ఆచార్యుడు తన శిష్యుని సేవకు చాలా ముగ్ధుడయ్యాడు. విద్యాభ్యాసం పూర్తి చేసి, ఆ శిష్యుడు వెళ్లిపోయేటప్పుడు, గురువు అతనిని ఆశీర్వదించి, ఒక దర్పణం(అద్దం) బహుమతిగా ఇచ్చాడు.*
*అది మామూలు దర్పణం (అద్దం) కాదు. వ్యక్తి యొక్క అంతరంగిక భావాలను ప్రతిబింబించగలిగే దివ్య దర్పణం.*
*గురువుగారి నుండి ఈ బహుమతిని స్వీకరిస్తూ, శిష్యుడు చాలా సంతోషించాడు. వెళ్లేముందు ఆ దర్పణ సామర్థ్యాన్ని చూడాలి అని అనుకున్నాడు.*
*ఆ దర్పణాన్ని పరీక్షించాలనే తొందరలో ముందుగా దాన్ని తన గురువుగారి వైపు తిప్పాడు.*
*శిష్యుడు ఆశ్చర్యపోయాడు. బంధనాలు, అహంకారం, కోపం మొదలైన ఎన్నో బలహీన గుణాలు గురువుగారి హృదయంలో స్పష్టంగా గోచరించటం ఆ దర్పణం చూపించింది.*
*’నాకు ఆదర్శమైన నా గురువుగారు చాలా లోపాలతో నిండి ఉన్నారు!' అని దీన్ని తలచుకుని చాలా బాధపడ్డాడు. బరువెక్కిన హృదయంతో దర్పణం తీసుకుని గురుకులాన్ని విడిచిపెట్టాడు కానీ దారి పొడవునా ఆ ఆలోచన మాత్రం అతని మనసును వదలలేదు. అతను తన గురువుగారు ఎటువంటి లోపాలు లేని ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా భావించాడు... కానీ ఈ అద్దం అదే గురువుగారి గురించి పూర్తిగా విభిన్నమైన విషయాన్ని వెల్లడించింది.*
*ఇప్పుడు తన చేతిలోకి ఇతరులను పరీక్షించే పరికరం వచ్చింది కాబట్టి, ఎవరు కనిపిస్తే వారిని పరీక్షించడం మొదలుపెట్టాడు.*
*తన ప్రాణ స్నేహితులను, ఇతర పరిచయస్తులలో చాలామందిని - దర్పణం వారి వైపు పెట్టి చూస్తూ వారిని పరీక్షించాడు.*
*ప్రతీ ఒక్కరి హృదయంలోనూ ఏదో ఒక దుర్గుణం కనిపించేది.*
*అతని అనుభవాలన్నీ చాలా బాధాకరమైనవిగా ఉన్నాయి. ఈ లోకంలో అందరూ ఎందుకు ఇంత చెడ్డవాళ్లుగా మారారు అని ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రతీ ఒక్కరూ అనిశ్చితంగా, రెండు రకాల మనఃప్రవృత్తులతో ఉన్నారు, ఎవరూ కళ్ళకు కనిపించినట్లుగా లేరు. ఈ నిస్సహాయ ఆలోచనలలో మునిగిపోయి, బాధాతప్త హృదయంతో, ఎలాగో ఇంటికి చేరుకున్నాడు.*
*అప్పుడు తన తల్లిదండ్రుల గురించి ఆలోచించాడు. తన తండ్రికి సమాజంలో గొప్ప పేరుంది. తల్లి చాలా పవిత్రమైన స్త్రీగా, సాధ్విగా పరిగణించబడుతుంది. 'వాళ్ళని కూడా పరీక్షించాలి' అని అనుకుని, అతను తన తల్లిదండ్రులను కూడా ఆ దర్పణంతో పరీక్షించాడు. వారి హృదయాలలో కూడా కొన్ని చెడు గుణాలు ఉన్నాయి. వారు కూడా దుర్గుణాల నుండి పూర్తిగా విముక్తి పొందలేదు.. (నిరంతరం ఆ దర్పణంతో అందరినీ పరీక్షించండంలో ఆసక్తి చూపించిన అతనికి తనను తాను ఆ దర్పణంలో చూసుకోవాలన్న ఆలోచనే రాకపోవటం అసలైన వింత)*
*'ఈ ప్రపంచమంతా అసత్యం మీదే నడుస్తోంది', అని నిశ్చయించుకున్నాడు.*
*ఇప్పుడు శిష్యుడు తన మనసులోని అశాంతిని భరించలేకపోయాడు.*
*ఆ దర్పణం పట్టుకుని గురుకులం వైపు నడిచాడు. త్వరగా అక్కడికి చేరుకుని నేరుగా తన గురువుగారి దగ్గరకు వెళ్ళాడు.*
*గురువుగారు విషయం ఏమిటో ఊహించి, చూడగానే అతని మనస్సులోని వ్యాకులతను గ్రహించాడు.*
*శిష్యుడు తన గురువుతో వినయంగా ఇలా అన్నాడు - "గురుదేవా, మీరు నాకు ఇచ్చిన దర్పణం సహాయంతో, నేను ప్రతీ ఒక్కరి హృదయంలో అనేక రకాల లోపాలు ఉన్నట్లుగా నేను గమనించాను, నేను ఇంతవరకు ఒక్క లోపం కూడా లేని వ్యక్తిని ఎందుకు చూడలేదు?*
*మీలో, నా తల్లిదండ్రులలో కూడా నేను చాలా లోపాలను చూశాను అని చెప్పడానికి నేను చాలా చింతిస్తున్నాను. దీనితో నా మనసు చాలా కలతచెంది ఉంది."*
*గురువుగారు నవ్వుతూ శిష్యుని వైపు దర్పణం తిప్పాడు. శిష్యుడు దిగ్భ్రాంతి చెందాడు. అతని మనసులోని ప్రతీ మూలా కూడా కోపం, ద్వేషం, అహంకారం వంటి చెడు లక్షణాలతో నిండిపోయి ఉంది. అతని హృదయంలో స్వచ్ఛత ఏ మూలా కనపడలేదు.*
*గురువుగారు ఇలా అన్నారు - "నాయనా, ఇతరుల తప్పులను వెతకడానికి కాదు, నీ స్వంత తప్పులను చూసుకొని నీ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి నేను ఈ దర్పణం నీకు ఇచ్చాను.*
*ఇతరులలోని లోపాలను కనుగొనడంలో గడిపిన సమయాన్ని నీవు స్వీయ-అధ్యయనంలో గడిపిఉంటే, ఇప్పటికి నీ వ్యక్తిత్వం చాలా పరివర్తన చెందిఉండేది."*
*దర్పణంలో, మనం మన ఆకారాన్ని చూస్తాం, స్వీయ - అధ్యయనంలో మన అంతరంగాన్ని చూస్తాం.*
♾♾♾©
♾️♾♾♾♾♾
*ఎదుటివారి లోపాలను కాదు మనం చూడాల్సింది. మనలో లోపాలను మనమే చూసుకుంటూ, ప్రతీ అడుగులో, క్షణక్షణం వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడే మన వ్యక్తిత్వం వికసిస్తూ ఉంటుంది.*
➖➖➖➖➖➖✍️
._సర్వం శ్రీకృష్ణార్పణమస్తు_
🌷🙏🌷
🙏 _లోకాః సమస్తా సుఖినోభవన్తు!_🙏
*_{సేకరించి మీకు అందించినది : -వెలిశెట్టి నారాయణరావు 🙏}_*
🌴 🪴 🌴 🪴 🌴 🪴 🌴
No comments:
Post a Comment