Tuesday, April 1, 2025

 దేవుడు.

విశాఖపట్నం ఒకటో పట్టణంలో పాత పోస్టాఫీసు దగ్గరలో ఒక వ్యక్తి తనలో తాను మాట్లాడుకుంటూ తిరిగేవాడు. అతను మాట్లాడే భాష ఎవరికీ అర్ధమయ్యేది కాదు. ఏదో శూన్యంలోకి చూస్తూ సైగలు చేసేవాడు. పక్కన్న పడేసిన విస్తర్లలో దొరికింది తినేవాడు. గడ్డం బాగా పెరిగి, జుట్టు కూడా పెరిగి అట్టలు కట్టి వాసన వస్తుండేవాడు. అతను వదులైన బట్టలు వేసుకుని, అవి చిరిగిపోయి మాసిపోయి, మోకాళ్లదగ్గర కొట్టుకుపోయి, చెప్పుల్లేకుండా నడిచేవాడు. గోళ్లు బాగా పెరిగి వాటిలో మట్టి చేరి ఉండేది. స్నానం చేసేవాడు కాదు. బాగా నడవటం, తిండి తగ్గటం వలన సన్నంగా ఉండేవాడు. 

అతనలా వెళ్తూ ఉంటే, ఒక వ్యక్తి పక్కగా వెళ్లాడు. ఆ పక్కాగా వెళ్లిన వ్యక్తి నెత్తి మీద చెయ్యివేసి గాల్లోకి చూస్తూ ఒక నవ్వు నవ్వాడు అతడు. ఆ పక్కాగా వెళ్లిన వ్యక్తికి ఆరోజు మంచి జరిగింది. అతను సాయంత్రం మళ్లీ ఇతన్ని వెదుక్కుంటూ పోస్టాఫీసు కు వచ్చాడు. అక్కడే చెత్తకుండీలో విస్తర్లని ఏరుకుంటున్న అతన్ని చూసి చెయ్యి పట్టి తీసుకొచ్చి అక్కడే ఉన్న విక్టోరియా రాణి విగ్రహం దగ్గర కూర్చోబెట్టి అతనికి భోజనం కొనిచ్చాడు. ఆ వ్యక్తి మళ్లీ శూన్యంలోకి చూస్తూ మాట్లాడకుండా , రెండు ముద్దలు తినేసి, మరో రెండు ముద్దలు గాల్లోకి విసిరి ఆ ఎంగిలి చేత్తో ఇతని నెత్తిమీద చెయ్యి వేశాడు. అదింకెవరో చూసి ఏమిటని అడిగారు. నెత్తి మీద చెయ్యి వేయించుకున్న వ్యక్తి, ఇతడో గొప్ప వ్యక్తి, జ్ఞాని, సర్వసంగ పరిత్యాగి. ఇతని ఆశీర్వాదం వలన నాకీరోజు మంచి జరిగింది అని చెప్పాడు. దాంతో అతనూ ఇతని పక్కన కూర్చున్నాడు. అతను ఇంకా ఏదో తనలో తాను మాట్లాడుకుంటూ ఈ రెండో వ్యక్తి నెత్తి మీద చెయ్యివేసాడు. రోజులు గడిచాయి. జనం పెరిగారు. 

అతను అందరి మీద చెయ్యి వేస్తున్నాడు. శూన్యంలోకి చూస్తున్నాడు. ఎక్కువైన భక్తులు ఎండకి తాళలేకపోయారు. అతనికొక టెంటు వేశారు. చాప పరిచారు. పక్కన మట్టి కుండలో నీళ్లు, గ్లాసు పెట్టారు. బారికేడ్లు పెట్టారు. వరసలు కట్టారు. కొబ్బరికాయలు కొట్టారు. అతనికి బొట్లు పెట్టి వీళ్లు పెట్టుకున్నారు. ఏవేవో ప్రసాదాలు తెచ్చారు. అతనికి అరటిపళ్ళు ఇష్టమని గెలలు కట్టారు. అతనికివేవి అవసరం లేదు, శూన్యంలోకి చూస్తూ తనలోతను మాట్లాడుకుండేవాడు. అతను మాట్లాడేదాంట్లో ఏదైనా నిగూఢార్ధం ఉందేమోనని జనం పరికించేవారు. అతను ఆ టెంటులోంచి బయటికి నడవాలి అనుకున్న ప్రతిసారీ అక్కడి భక్తులు అతన్ని మెల్లిగా చెయ్యిపట్టుకుని తెచ్చి చాపమీద కూర్చోబెట్టేవాళ్ళు. ఈలోగా భక్తులు ఎక్కువయ్యారు. అతనికి తిరిగే స్థలం తక్కువైంది. అతనికేదో ఊపిరి సలపటం లేదు. పెనుగులాడాడు. మళ్లీ తెచ్చి కూర్చోబెట్టారు.

అతనికి కోపం నశించింది. రాయిచ్చుకు ఒక భక్తుడి నెత్తికి విసిరాడు. రక్తం ధారలైపారింది. భక్తులు పరుగులంకించుకున్నారు. పరిగెడుతున్నవాళ్లని మరిన్ని రాళ్లిచ్చుకు కొట్టాడు. పరిగెత్తినవాళ్లు పోలీసులతో వచ్చారు. అతనికి సంకెళ్లు వేశారు. అతను శూన్యంలోకి చూస్తూ తనలోతాను మాట్లాడుకుంటున్నాడు. పోలీసులు జడ్జి ముందు హాజరు పరిచారు. జడ్జి ఇతన్ని ఆసుపత్రిలో చేర్చమని ఆజ్ఞ వేశారు.

పోలీసులు ఒకటో పట్టణంనుండి మూడో పట్టణంలో ఉన్న ఆంధ్ర వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రి అయిన ప్రభుత్వ మానసిక ఆసుపత్రికి తీసుకువచ్చారు. అతన్ని చేర్చుకుని పరీక్షించారు. స్కిజోఫ్రీనియా అని నిర్ధారించారు. ఆరునెలలు వైద్యం చేశారు. అతను బరువు పెరిగాడు. జుట్టు దువ్వుకుంటున్నాడు. ఉతికిన బట్టలు వేసుకుంటున్నాడు. గడ్డం గీసుకున్నాడు. ఆసుపత్రి భోజనం తింటున్నాడు. శూన్యంలోకి చూడడం మానేశాడు. అతను చక్కగా హిందీ మాట్లాడుతున్నాడు. ఆసుపత్రిలోని రిహాబ్ విభాగంలో వండ్రంగిపని నేర్చుకున్నాడు. ఒకరోజు అతని ఇంటి అడ్రసు గుర్తువచ్చి డాక్టర్ కి చెప్పాడు. ఆసుపత్రివాళ్లు ఉత్తరం రాశారు. వాళ్ళింటివాళ్ళు నాలుగు రోజుల్లో బీహార్ నుంచి రైల్లో వచ్చారు. అతను తప్పిపోయి రెండేళ్లైందని వెదకని చోటు లేదని, ఆసుపత్రివాళ్లకి ధన్యవాదాలుచెప్తూ మందులు తీసుకుని డిశ్చార్జి తీసుకున్నారు. ఆ వ్యక్తి అందరికీ నవ్వుతూ వీడ్కోలు చెప్పాడు. ఈసారి నెత్తి మీద చెయ్యి వెయ్యకుండా అందరికీ షేక్హ్యాండ్ ఇచ్చి వెళ్లాడు. దేవుడు మనిషయ్యాడు. 

ఇది కల్పితం కాదు. నిజంగా జరిగింది.

No comments:

Post a Comment