Tuesday, April 1, 2025

 ఎవరు దాత?

కాలగర్భంలో కలిసిపోయే వారికి, చరిత్రలో నిలిచిపోయేవారికి ముఖ్యమైన తేడాల్లో ఒకటి- దాతృత్వం! స్వభావరీత్యా దాతలైనవారిని లోకం గౌరవిస్తుంది. ఆప్యాయంగా కొలుస్తుంది, ఆదర్శంగా భావిస్తుంది. అలనాటి శిబిచక్రవర్తి నుంచి మనం దానం ఏదైనా అందుకొన్నామా? కలియుగ డొక్కా సీతమ్మ పెట్టిన అన్నం ఎప్పుడైనా తిన్నామా? అయినా ఇప్పటికీ వారి గురించి చెప్పుకొంటున్నామంటే- వారి దానశీలతే అందుకు కారణం. ఈ లోకం ప్రత్యేకత ఏంటంటే- మనం చెప్పిన మంచి మాటలను బట్టి కాకుండా, చేసిన మంచి పనులను బట్టి మన గొప్పదనాన్ని అంచనా వేస్తుంది. కాబట్టి మనల్ని శాశ్వతంగా నిలబెట్టేవి శిలా విగ్రహాలు కావు- శీల స్వభావాలు!

పెట్టు బుద్ధిని పుట్టుబుద్ధిగా కలిగినవారు స్వభావరీత్యా మంచి దాతలవుతారు. శాస్త్రం ఆ స్వభావాన్ని గురించి చెబుతూ- శ్రియాదేయం, ప్రియా దేయం, భియాదేయం... అనే మూడు లక్షణాలను చెప్పింది. దానం చేయడంపట్ల ఒక అవగాహనతో తన స్తోమతకు తగినట్లుగా సంతో షంగా దానం చేయడాన్ని శ్రియాదేయం అంటారు. 'అలాంటి అవగాహన, స్తోమత రెండూ ఉండి కూడా- దాన సంకల్పం లేనివారు ఈ భూమికే భారం' అన్నాడు శృంగారనైషధంలో శ్రీనాథుడు. దానం చేయడంపట్ల ఆసక్తి, అవగా హన ఉన్నా- పదిమందీ దాన్ని గుర్తించాలనే యావ ఏమాత్రం కూడదంది మహాభారతం. ఎంతో ఇస్తున్నా- ఇంతే ఇవ్వగలిగానని సిగ్గుప డుతూ దానం చేయడం ప్రియాదేయమనే మాటకు తాత్పర్యం. ముఖ్యంగా పండితులకు ఇచ్చేటప్పుడు- వారికి ఇవ్వడానికి తనకో అవకాశం దక్కిందన్న కృతజ్ఞతాభావంతోను, వారి విద్వత్తుకు తగినంతగా ఇవ్వలేకపోతున్నామనే న్యూనతాభావంతోను దానం చేయడం ప్రియా దేయం అవుతుంది. ఆ రెండింటికన్నా ముఖ్యమైన మూడోది- భియాదేయం. అంటే భయపడుతూ దానం చేయడం. తాను చేస్తున్న దానంలో అక్రమంగా ఆర్జించిన సొత్తు లేశమైనా కలగలిసిపోయిందేమోనన్న భయంతో ఒకటికి రెండుసార్లు పరీక్షించుకోవాలి. అయాచితంగానో అన్యాయంగానో వచ్చి చేరిన సొత్తును కాకుండా న్యాయార్జితమైన సొమ్మునే దానం చేయాలని శాస్త్రం స్పష్టంగా చెప్పింది. కామ్యకవనంలో అరణ్యవాసం చేస్తున్న పాండవుల దగ్గరికి వేదవ్యాస మహర్షి వెళ్తాడు. ఆ సందర్భంలో 'అన్యాయంగా సంపాదించిన ధనాన్ని దానం చేయడం అవివేకం... దానివల్ల పుణ్యఫలం ఏ మాత్రం దక్కదు' అని ధర్మరాజుతో చెబుతాడు. అక్రమంగా ఆర్జించిన ధనాన్ని తెచ్చి దేవుడికిచ్చే వారంతా గ్రహించాల్సిన పరమసత్యాన్ని వ్యాసుడు ఆనాడే వెల్లడించాడు.
శ్రియాదేయం ప్రియాదేయం భియాదేయం... మూడింటినీ ఎరిగి, త్రికరణశుద్ధిగా దానం చేసినవారికి దానఫలం తప్పక లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. చేయడా నికి తగినంత స్తోమతను ఇచ్చినందుకు భగవంతుడికి, స్వీకరించడానికి తగిన యోగ్య తను కలిగినందుకు దానస్వీకర్తకు- దాత కృతజ్ఞుడై ఉండాలని బోధించాయి. అంతే కాదు, ఇచ్చాక... ఇచ్చినందుకు చింతించినా, ఇచ్చానని గర్వంగా ప్రకటించినా- దాన ఫలం దక్కదు సుమా... అంటూ భారతం ఆనుశాసనిక పర్వం హెచ్చరించింది. దాతలమని చెప్పుకోవడానికి మనకున్న అర్హతలేంటో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.

- ఎర్రాప్రగడ రామకృష్ణ

No comments:

Post a Comment