శ్రీరమణీయం
"నాలోని గుణదోషాలను సరిదిద్దికునే విధానం ఏమిటి ?"
అందుకు ముందుగా అహంకారాన్ని వివేకంతో దాటాలి. గుణదోషాలను మనో విశ్లేషణ ద్వారా మార్చుకోగలం గానీ తాయత్తులు, విభూదులతో మార్చుకోవాలనుకోవటం వివేకంకాదు ! తన కూతురికి అత్తగారు లేకుండా ఉంటే బాగుంటుందని కోరుకునే తల్లి తన కోడలు మాత్రం తన మాట వినాలనుకుంటుంది. ఎవరి బలం అధికంగా ఉంటే వారి అహంకారం గెలవాలని చూస్తారు. బుద్ధికి ఆడ, మగ అని లేదు. మనసుకు వివేకం, విశ్లేషణ, సత్యదృష్టి ఉంటే ప్రతివ్యక్తి మనకు జీవితాన్ని నేర్పే గురువే అవుతాడు. జీవితంలోని అన్ని కోణాలను సన్మార్గంలోకి మార్చటం నిజమైన ఆధ్యాత్మికత అవుతుంది. అది మాత్రమే నిజమైన శాంతిని మనకి అందిస్తుంది. కేవలం పూజించే సమయంలోనే మనసును నిగ్రహించుకోవాలనుకోవటం అవివేకం. మన జీవితమంతా వివేకదృష్టితో ఉంటే తప్ప దైవాన్ని దర్శించటం కష్టం !
"శాస్త్రాల్లోని 'నీవు ఎలా ఉన్నా ముక్తుడవే ' అనే మాటను ఎలా అర్ధం చేసుకోవాలి ?"
ఈ ప్రశ్నకు శ్రీరమణమహర్షి సులభంగా అర్ధమయ్యేట్లు చెప్పారు. బొక్కెనలో విడిగా కనిపిస్తున్న నీటిని బావిలో కలపటం లాంటిదే. అదే జన్మరాహిత్యం అంటే. నీళ్ళలో మునిగివున్నంత వరకూ బొక్కెనలో ఉన్న నీటికి ప్రత్యేక ప్రతిపత్తిలేదు. కానీ నీటి నుండి బయటకురాగానే వాటిని బొక్కెనలో నీళ్ళు అంటామేగాని బావిలోనీళ్ళని అనం. వివేకంతో ఆలోచిస్తే బొక్కెన అనే పరిధి చేరినా ఆ నీళ్ళు బావినీళ్ళు కాకుండా పోతాయా ? నీవు ఎలా ఉన్నా ముక్తుడవే అనే మాటలోని ఆంతర్యం ఇదే. మన దేహపరిధిచేత మనసని అంటున్నా అది విశ్వమనసు (పరమాత్మ)లో భాగమే. ఈ అవగాహనతో కూడిన భావస్వేచ్ఛే మోక్షం !
No comments:
Post a Comment