మిమ్మల్ని ఎలా #నమ్మాలి?
```````````````````` 24 సంవత్సరాల కవిత తన జీవితంలో అనేక సార్లు మోసపోయింది. చిన్నపుడు సెక్సువల్ అబ్యూస్ కి గురికావడం వల్ల జీవితం పట్ల తీవ్రమైన ద్వేషం. మనుషులను ఏమాత్రం నమ్మలేని పరిస్థితి. తల్లిదండ్రులు లేట్ వయస్సులో ఆమెను కనడం వల్ల కవితకు, ఆమె తల్లిదండ్రులకు జెనరేషన్ గ్యాప్. అందువల్ల ఆమె బాధ సరిగా వారికి అర్థం అయ్యేది కాదు. కవిత తల్లిదండ్రులిద్దరూ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నత స్థాయి ఉద్యోగులు. తల్లి ఆరోగ్య కారణాల వల్ల త్వరగా పదవీ విరమణ చేసింది. తండ్రి ఇంకా వర్క్ చేస్తున్నాడు. డబ్బుకు కొదవ లేకపోయినా కవిత తీవ్రమైన ఆత్మన్యూనతతో బాధ పడుతుంది. సమాజంలో కలవడానికి విపరీతమైన భయం. ఎవరినీ నమ్మలేదు. ఫలితంగా డిప్రెషన్ తో బాధపడుతూ రెండు మూడుసార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది. ఒక్కతే సంతానమైన కవిత అలా అయిపోవడం తల్లికి ఇష్టం లేదు. కవిత సమస్యకు ఒక శాశ్విత పరిష్కారం కావాలని తెలిసినా జాబ్ ఒత్తిడి మేరకు తాత్కాలికమైన పరిష్కారాలు మాత్రమే కవితకు ఇప్పించగలిగింది. పదవీ విరమణ చేసిన వెంటనే కవిత జీవితానికి ఒక పరిష్కారాన్ని కనుక్కోవాలని నిశ్చయించుకుంది. బంధువులను, స్నేహితులను సంప్రదించగా పెళ్లి చేస్తే అన్నీ సర్దుకుంటాయని అన్నారు. భర్త కూడా దాదాపు అదే అభిప్రాయం వ్యక్తపరిచాడు. కానీ కవిత తల్లికి ఆ పరిష్కారం నచ్చలేదు. ఈ స్థితిలో పెళ్లి చెయ్యడం వల్ల సమస్య తగ్గక పోగా కొత్తగా మరిన్ని సమస్యలలో ఇరుక్కునే అవకాశాలే ఎక్కువ అని భావించింది. ఈ క్రమంలో తన కూతురి సమస్యకు పరిష్కారం కోసం యూట్యూబ్ లో వీడియోస్ వెతుకుతుండగా నా వీడియోస్ తనకు కనిపించాయి. వెంటనే ఫోన్ చేసి అప్పోయింట్మెంట్ తీసుకుంది.మొదట కవిత తల్లి ఒంటరిగా కౌన్సిలింగ్ కి అటెండ్ అయ్యింది. ఆమె గురించి వివరించిన విషయాలలో ముఖ్యమైనది కవిత ఈ ప్రపంచంలో ఎవరినీ నమ్మను అంటుంది. మీరు కౌన్సిలింగ్ ఇస్తాను అంటున్నారు. మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలంటే మిమ్మల్ని నమ్మాలి కదా? ఆమె మిమ్మల్ని మాత్రం ఎలా నమ్ముతుంది? మీరు ఎలా కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతారు? అనడిగింది. దానికి నేను 'మొదట ఆ అమ్మాయిని ఒకసారి నా దగ్గరకు తీసుకురండి. ఒక్కసారి నాతో మాట్లాడించండి. తరువాతది అంతా నేను చూసుకుంటాను.' అన్నాను. 'ఆమె ఎవరినీ నమ్మదు సర్' అంది. 'ఆమె నమ్మదు సరే.. మీరు నమ్ముతున్నారా' అని అడిగాను. 'నేను నమ్ముతున్నాను.' అని సమాధానం ఇచ్చింది. 'అయితే ఆమెను తీసుకువచ్చే ప్రయత్నం చెయ్యండి.' అని చెప్పాను.
మరో నాలుగు రోజుల తరువాత ఆమె కవితను కౌన్సిలింగుకి తీసుకువచ్చింది. మొదట్లో కవిత నాతో అయిష్టంగా మాట్లాడింది. తరువాత క్రమ క్రమంగా విషయం అర్థం చేసుకుని కౌన్సిలింగుకి బాగా సహకరించింది. దాదాపు మూడు నెలల పాటు కౌన్సిలింగ్ నడిచింది. ఈ క్రమంలో కవిత ఒక్కతే కౌన్సిలింగుకి వచ్చేది. సమాజంలో మనుషుల మనస్తత్వాలను విశ్లేషించడం కోసం నాతో పాటు హైదరాబాద్ లోని అనేక ప్రాంతాలకు వచ్చింది. అనేక సామజిక పరిస్థితులలో మనుషులు వారి ప్రవర్తనను ఆమె అధ్యయనం చేసింది. మర్నాడు వాటి గురించి విశ్లేషిస్తూ చర్చించేది. క్రమంగా ఆమెలో భయం మాయమై, ఎంతో ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంది. రెగ్యులర్ కౌన్సిలింగ్ పూర్తయిన తరువాత ఒక యాడ్ ఏజెన్సీ లో విజువలైజర్ గా జాయినయ్యి చక్కగా జాబ్ చేయగలుగుతుంది. ఆమెలో వచ్చిన మార్పును చూసి తల్లి ఆశ్చర్య పోయింది. తరువాత ఒక సారి నన్ను కలసి ఇది ఎలా సాధ్య పడింది? కవిత ఎలా మిమ్మల్ని నమ్మింది? మీరు ఆమెకు ఎలా నమ్మకం కల్పించారు? అని అడిగింది.
నేనొక #ఎగ్జిస్టెన్షల్ సైకాలజిస్టుని. నా అప్రోచ్ విభిన్నంగా ఉంటుంది. నేను ఎక్కడా ఆమెను నమ్మించే ప్రయత్నం చెయ్యలేదు. ఆమెకు కూడా నమ్మొద్దని చెప్పను. ఈ ప్రపంచంలో ఎవరినీ నమ్మొద్దు. నన్ను కూడా నమ్మొద్దు. ఎప్పుడయితే నమ్ముతావో అప్పుడు మోసపోయే అవకాశం ఉంటుంది. వ్యక్తులను నమ్మొద్దు. కానీ వాళ్ళ స్థితిని అర్థం చేసుకో. వాళ్లకు మోసం చేసే అవకాశం నువ్వు ఇవ్వకు. నువ్వొక చాల మంచి వ్యక్తితో స్నేహం చేస్తూ ఎప్పుడూ ప్రైవసీ ఉండే ప్రాంతాలలో అతనితో మెలుగుతున్నావు అనుకో. అతను ఎంత మంచి వాడయినా ఏదో ఒక సమయంలో నీ మీద చెయ్యి వేసే అవకాశముంటుంది. అదే ఒక దుర్మార్గుడితో స్నేహం చేస్తూ ఎప్పుడూ అతనితో పబ్లిక్ లోనే మెలుగుతున్నావు అనుకో. అతను నీ మీద చెయ్యి వేసే అవకాశమే ఉండదు. ఇక్కడ నువ్వు మోసపోయేది ఒక వ్యక్తి మంచివాడు అని నమ్మడం వలన. అదే నువ్వు ప్రకృతిని, మనిషి సహజంగా ఉన్న ప్రవర్తనను అర్థం చేసుకుని ప్రైవసీలోకి వెళ్లకుండా ఉండడమే నిన్ను కాపాడింది. కాబట్టి నువ్వు నేర్చుకోవలసినది ఎవరిని నమ్మాలి అన్నది కాదు. నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలి అనేది మాత్రమే.
కౌన్సిలింగ్ అంటే నమ్మించడం కాదు. బోధించడం కాదు. మోటివేట్ చెయ్యడం కాదు. నాలుగు మంచి మాటలు చెప్పడం కాదు. నీతి వాక్యాలు చెప్పడం కాదు. అవన్నీ ఎక్కడ బడితే అక్కడ దొరుగుతాయి. అవి ఎవరైనా చెప్పగలుగుతారు. ఫేస్బుక్ ఒక్కసారి తెరిస్తే అనేక మోటివేషనల్ కోట్స్ దర్శనమిస్తాయి. అందరూ నీతిబోధలు చేస్తూనే ఉంటారు. ఏ సినిమా చూసిన చివర్లో నీతులు ఉంటాయి. వాటిని బోధించడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. కౌన్సిలింగ్ అంటే ప్రకృతిని అర్థం చేసుకునే విధంగా తయారు చెయ్యడం. సమాజాన్ని అర్థం చేసుకునే విధంగా తయారుచేయడం. మనుషులలో ఉన్న సహజమైన దుర్మార్గాన్ని తెలియజేసి అప్రమత్తంగా ఎలా ఉండొచ్చో అర్థం చేసుకునే లాగ చెయ్యడం తప్ప నమ్మించడం కాదు.
Source link - https://m.youtube.com/channel/UCuZGvJhMr90i2OrnYkR14Gg/community?lb=UgkxJVPbAKs7VLdd5ybunP2TK66aoEKTKZ5A
No comments:
Post a Comment