*శ్రీరామ! నీ నామమేమి రుచిరా…!*
*పరమాత్మ 'రామ' నామంతో అవతరించాడు. ఆయనకి కొత్తగా పెట్టిన పేరు కాదిది. ఆ మాటకొస్తే ఆయన కొత్తగా పుట్టినవాడా? ఎప్పుడూ ఉన్నవాడే. శాశ్వతమైన సచ్చిదానంద తత్త్వమే అవతరించడమనే లీలాకార్యాన్ని వెలార్చినప్పుడు, ఆయన నామం కూడా అవతరించింది. ఎంత చక్కని పేరు!*
*వేదాలలో తారకమని చెప్పబడిన దివ్యమంత్రమిది. ర-అ-మ = రామ. మూడక్షరాల ఈ నామంలో అనిర్వచనీయమైన శబ్దశక్తి ఉంది. అందుకే సదాశివుడు సైతం సదా జపించే పరమ మంత్రమిది. ఓంకారంలోని మూడక్షరాలు (అ,ఉ,మ) రామలో మూడక్షరాలై విస్తరించాయేమో! అందుకే ప్రణవానికి తారకమనే పేరు. అదే వ్యవహారం రామనామానికి కూడా.*
*సారసారతర తారక నామము...*
*పేరిడి నిన్ను పెంచినవారెవరే... (త్యాగయ్య)*
*'రామ' శబ్దానికి 'ఆనంద స్వరూపుడు' అని అర్థం. రమణీయమైన వాడు రాముడు. ఆనందమే అందం. రంజింపచేసే సర్వలక్షణాలు స్వామిలో ఉన్నాయి. రూపం, చరిత్ర, మహిమ, తత్త్వం... అన్నీ రమణీయాలే. అన్ని రమణీయతలూ ఒకే చోట సమకూరడం అరుదు. ఆ అరుదైన స్వరూపమే రాముడు.*
*అందుకే 'రామ' నామం స్మరించేవారికి అన్ని రమణీయ లక్షణాలు చేకూరుతాయి.*
*రాముడు సంహరించినది రావణుని. రావణుడు - ఏడుపుకి ప్రతీక, బిగ్గరగా ఏడ్చినవాడు, ఏడిపించినవాడు 'రావణుడు'. కైలాసగిరిని మోయాలని సాహసించినపుడు శివుని కాలి బొటనవేలు తాకిడికి, ఆ కొండకింద చేతులు నలిగినప్పుడు భయంకరంగా ఏడ్చాడట పౌలస్త్యుడు. ఆ 'రావం' విని జంతుజాలాలు భయంతో ఏడ్చాయి. దానితో అతడి పేరు సార్థకమయింది.*
*ఎప్పుడూ ఏదో కొరతని, కోరికనీ మిగుల్చుకొని మనసును రగుల్చుకునే అజ్ఞానలక్షణమే ఏడుపు. ఆ స్వభావానికి ప్రతీక రావణుడు. దానికి పూర్తి విరుద్ధం రామం. ఆనందస్వరూపమిది.*
*పది ఇంద్రియాలతో అజ్ఞానపూరితుడై దుఃఖించే జీవుని వేదనను తొలగించాలంటే పరమాత్ముడైన అనందధామునికే సాధ్యం.*
*అందుకే రాముడు దుఃఖనాశకుడు. రావణాంతకుడు. ఆనందప్రాప్తికి హేతువు - రామతత్త్య ధ్యానమే. విశ్వానికి కారణమైన పరంజ్యోతి సూర్య, చంద్ర, అగ్నుల ద్వారా జగతికి తన ప్రకాశాన్ని అందిస్తున్నదని మన శాస్త్రాల వివరణ.*
*యదాదిత్య గతం తేజో జగద్భాసయతేఽఖిలమ్*
*యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ తత్తేజోవిద్ధి మామకమ్ (గీత)*
*'సూర్యునిలో, చంద్రునిలో, అగ్నిలో ఉన్న ఏ తేజస్సు ఈ జగతిని భాసింపజేస్తోందో అది నా (పరమాత్మ) తేజస్సేనని తెలుసుకో” అని శ్రీకృష్ణుని వచనం.*
*విశ్వానికి మూలమైన మూడు తేజస్సుల ఏక స్వరూపమే 'రామ'. ర - అగ్నిబీజం. అ - సూర్యబీజం, మ - చంద్రబీజం. అగ్నిసూర్య చంద్రబీజాల ఏకస్వరూపమైన పరమ తేజస్సు రామ. విశ్వ కారణమైన తేజోనిధానం కనుకనే విశ్వంలో అందరికీ పనికివచ్చే విష్ణు నామమైంది.*
*✤ మనలో వాక్కు - అగ్ని స్వరూపం. దృష్టి (శరీరం) – సూర్య స్వరూపం. మనస్సు - చంద్ర రూపం. ఈ త్రికరణాలలో ప్రసరించే ఆత్మచైతన్యమే రాముడు.*
*✤ మూలాధారం నుండి సహస్రారం వరకూ ఉన్న ఏడు చక్రాలలో - క్రింది చక్రాలు అగ్ని మండలం. ఆపైన సూర్యమండలం. అటుపై చంద్ర మండలం. మొత్తంగా మనలోని కుండలిని ఈ మూడు మండలాల స్వరూపం. ఈ స్వరూపమే రామనామం, అందుకే రామనామ జపం. మనలో తేలికగా కుండలినీశక్తిని జాగృతపరచగలిగే శక్తి కలిగినది. అర్థం రీత్యా చూసినా, శక్తి ప్రకారం గమనించినా ఎన్నో లోతులు గలది కనుకనే రామనామం భవతారకమయింది.*
*✤ యోగులందరూ ఏ పరతత్త్వాన్ని చేరి బ్రహ్మానందాన్ని అనుభవిస్తారో ఆ తత్త్వమే రాముడు - అని శాస్త్రాలు సెలవిచ్చాయి.*
*రమస్తే యోగినోనర్తే*
*సత్యానందే చిదాత్మని*
*ఇతి రామ పదేనాసౌ*
*పరబ్రహ్మాభి ధీయతే ||*
*యోగులు తమ సాధనలకు చివర(సిద్ధి)గా ఏ సచ్చిదానందతత్త్వంలో రమిస్తారో (ఆనందిస్తారో)- ఆ పరబ్రహ్మమే 'రామ' నామం ద్వారా చెప్పబడుతున్నాడు.* *నిజమైన అందమూ, ఆనందమూ ఆ పరమాత్మయే కదా! ఆనందోబ్రహ్మేతి వ్యజానాత్ (ఉపనిషద్వాక్యం)*
*ఆ పరబ్రహ్మైక్యాన్ని ప్రసాదించే శక్తి కలిగిన కారణంగా రామనామం మోక్షమంత్రంగా కీర్తించబడుతోంది.*
*✤ సత్-చిత్-ఆనందం... అనే మూడు స్థితులు ర- అ-మ... లో ఉన్నాయి. అంతేకాదు బ్రహ్మవిష్ణురుద్రులు ఈ మూడక్షరాలుగా ఏకమై, త్రిమూర్త్యాత్మకుడైన పరమాత్మ రాముడై భాసిస్తున్నాడు. అందువలననే -*
*'శివుడవో, మాధవుడవో, కమలభవుడవో… ఎవరని నిర్ణయించిరిరా!...' అన్నారు త్యాగరాజస్వామి.*
*'సర్వమతములకు సమ్మతమైన' పేరుగా త్యాగరాజు ఈ తారకమంత్రాన్ని కీర్తించారు. మోక్షాన్నిచ్చే మంత్రాన్ని 'తారకమంత్రం' అంటారు. రామనామం అటువంటి తారకం, అందుకే ఈ మంత్రాన్ని పొందిన వెంటనే 'తథ్యంబిక పుట్టుట సున్న! తారక మంత్రము కోరిన దొరకెను' అని పరవశించాడు రామదాసు.*
*మనలో ప్రాణశక్తిని జాగృతపరచే మహిమగల ఈ నామం భారతీయాత్మ. ఆర్తులను కాపాడే సౌజన్యమూ, ధూర్తుల్ని దునుమాడే వీరత్వమూ మేళవించిన నిజమైన నాయకుడు శ్రీరాముడే. పేరుకు తగ్గట్టే ఆయన 'నడలు'లో (నడతలు-ప్రవర్తన) హెుయలు ఉంది. వాటిని తలచితే చాలు ఒళ్ళు పులకించి, మనసు మహదానందంతో పరవశమవుతుంది.*
*'హెుయలు మీర, నడలు గల్గు సరసుని సదా కనుల జూచుచును పులకశరీరులై ‘ఆనంద పయోధి నిమగ్నులై' యశమునార్జించిన ఎందరో మహానుభావులు! వాల్మీకిని మొదలుకొని ఎందరో ఋషులు ఎన్నో భాషల్లో కవులు, వాగ్గేయకారులు శ్రీరాముని గుణగానం చేస్తూనే ఉన్నారు, ఉంటారు.*
*రామనామాన్ని జపించి, రామమూర్తిని ధ్యానించి, రామచరిత్రను అధ్యయనం చేసిన వారికి 'అంతా రామ మయమే’! అంటే ‘ఆనందమయమే’!.*
*┈┉┅━❀꧁జై శ్రీరామ్꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🛕🚩🛕 🙏🕉️🙏 🛕🚩🛕
No comments:
Post a Comment