3️⃣
_మహాకవి బమ్మెర పోతనామాత్య_
*☀️శ్రీమద్భాగవత కథలు☀️*
(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)
_________________________
*మందారమకరందం*
భాగవతం భావగతం. తెలుగువారి పుణ్యపేటి బమ్మెరపోతన్న తెలుగుదనానికీ, తెలుగు భాషా ధనానికీ వేనవెలుగులు తొడిగిన మహాకవి. సంస్కృత, తెలుగు పదబంధాలకు అన్యోన్యమైన, అనితర సాధ్యమైన, మదురాయమానమైన భవ్యదాంపత్యాన్ని ‘పౌరోహిత్యం’ చేసి తెలుగువారు గర్వించే మహాభాగవతాన్ని తెలుగు భాషాభిమానులకు అందించిన సుహృత్తు! మనశ్శాంతి కోసం వ్యాసులవారు భాగవతాన్ని సంసృతంలో రచించారు. భాగవతంలోని మొదటి ఘట్టం శ్రీకృష్ణ నిర్యాణం, భారతంలో చివరి ఘట్టమూ శ్రీకృష్ణ నిర్యాణమే కద. ఇది ఒక వైచిత్రి!
అయితే భారతీయ భాషలలో వచ్చిన భాగవతాలన్నీ మన పోతన్నగారి భాగవతం తర్వాత వచ్చినవే! తెలుగు భాగవతం పోతన్నగారి చేతులో ఎన్నెన్నో చక్కదనాలను సంతరించుకుంది. వ్యాస భాగవతం కంటే విశేషమైన ప్రాచుర్యాన్ని, అభిమానాన్ని తెలుగునాట పొందింది. ఒక్క పోతన్న గారు, రామదాసు, త్యాగరాజు, అన్నమయ్య, క్షేత్రయ్య, వేమన, ఈ నాటికాలంలో ‘మందర రామాయణ’ కావ్యనిర్మాత వాసుదాసు, విశ్వనాథ, కాళోజీ, సినారె ప్రభృతులు చాలు మన తెలుగు వైభవ వైజయంతిని చాటడానికి! ఈ మహానుభావుల ప్రభావమే తదితర కవి పండితులకు ప్రేరణ కల్గించిందనిపిస్తోంది. భాగవతం చదవకపోయినా పరవాలేదు. కనీసం రోజూ ‘భాగవతం’ ‘భాగవతం’ అనుకుంటూంటే చాలు ఎప్పటికైనా ‘బాగు అవుతాం’ అంటారు! ఇది నిజం.
భాగవత పురాణానికి ‘పురాణరత్నం’ అనే ప్రశస్తి ఉంది. ‘‘పురాణం’’ అంటే ఎంత పాతదైనా ఎప్పటికప్పుడు నవీకృతం అయ్యే లక్షణం కలదన్నమాట! ఇందులో కథలన్నీ నవనవోన్మేషాలే కథల ద్వారా ధర్మబోధ చేయడం తెలుగు గృహాలలో కన్పించే చక్కని పద్ధతి. తాతగారో, బామ్మగారో, అమ్మో , నాన్నో కథలు చెప్పి పిల్లల్ని రంజింపచేయడం ఒక సంస్కారం. ఆ క్రమంలో భాగవతంలోని ఎన్నో పద్యాలు మనకు చిన్నప్పుడే కంఠస్థం అయినాయి. భక్తితత్వప్రధానమైన భాగవతం భగవంతుని పొందడానికి తొమ్మిది మార్గాలను చెప్పింది. అవి శ్రవణం, కీర్తనం, విష్ణోఃస్మరణం, పాదసేవనం!,
అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, అత్మనివేదనమ్. ఈ తొమ్మిది భక్తి మార్గాలను కథల రూపంలో అందించే చక్కని ప్రయత్నమే ఈ జ్వాలా నరసింహారావుగారి భాగవత కథోపనిషత్తు!
పోతన్న గారి భాగవతమే ఈ రమ్యరచనకు మూలం. బ్రహ్మ రుద్రాదులు కూడా నాకు భాగవతం తెలుసు అనజాలరట! అంతటి నిగూఢమైన శాస్త్రం భాగవతం. ఎందరెందరో మహానుభావులు పోతన భాగవతాన్ని తమదైన శైలిలో వివరించారు. డాక్టరేట్లుదీనిపై సాధించారు. కానీ పదిమందికీ-ముఖ్యంగా ఇంటికీ, వంటకీ, బడికీ, గుడికీ పరిమితమయ్యే పెక్కుమందికీ-పసిబాలురకు, విద్యార్థులకు, గృహిణులకు, పామరులకు అనుభూతమయ్యే శైలిలో ప్రచురితమైన ‘భాగవతం’ చాలా స్వల్పం.
మన జ్వాలా నరసింహారావుగారు ఈ కొఱతను గుర్తించారు. పోతన్న గారిని శ్రద్ధాభక్తులతో ఉపాసించారు. భాగవతాన్ని ఆద్యంతాలు అవలోడనం చేశారు. కథలు, కథలుగా చెబితే సామాన్యులకు చెవికెక్కుతుందని ఆలోచించారు. భాగవతాన్ని కథల మాద్యమంలో, చక్కని వాడుక భాషలో చెక్కారు. ఆ విధంగా కథల రూపంలో మనకు ఇలా లభ్యమౌతున్న భాగవత మహాపురాణమే అయినా, ఇందులో కధాసూత్రం తెగలేదు. ద్వాదశ స్కంధాలుగా వున్న భాగవతంలో ఏ స్కంధంలో ఏ ఏ విశేషాలున్నాయో సూచ్యా సూచ్యంగా ప్రస్తావిస్తూనే తన రచనను సాగించారు. తెలుగులో ఇంకొక విలక్షణమైన గ్రంథం.
జ్వాలాగారు సాహసి. రచనమో, వచనమో, యోగమో, ప్రయోగమో. వాదమో, ‘గోష్ఠీరంజకమో’ వారికి అచ్చివచ్చిన ఇచ్చకాలు! ఇంతకుమునుపే 24వేల శ్లోకాలతో అజరామరమైన, వాల్మీకి మహర్షి ప్రణీతమైన శ్రీ రామాయణాన్ని, మహానుభావులు, శ్రీరామానుగ్రహ సంపన్నులు, ఆంధ్రవాల్మీకి బిరుదవిరాజితులైన శ్రీ వాసుదాస స్వామివారు తెలుగులో యధామూలంగా శ్లోకానువాదం చేసి, తామే ‘‘మందరం’’ అనే పేరుతో ప్రతి పద్యానికి తాత్పర్యాలను అనుగ్రహించి ప్రచురించిన విషయం తెలుగు వారికి తెలిసిదే కదా! అదే ‘మందరరామాయణాన్ని’ ‘మందరమకరందం’ పేరుతో వనం జ్వాలా నరసింహారావుగారు షట్కాండ యుక్తంగా రచించి ‘అనువక్త’ ‘వాచవి’ అయినారు. ప్రతిఫలాపేక్ష రహితంగా తన మందరమకరంద రామాయణ గ్రంథాలను చదువరులకు ఉచితంగా వితరణ
చేస్తున్నారు. ఇది వారి తండ్రిగారు శ్రీనివాసరావు గారు శ్రీ వైకుంఠం నుండి పుత్రునికిచ్చిన ప్రేరణ,
మంగళాశాసనమే అన్పిస్తోంది. అస్తు!
జ్వాలా నాకు ఆత్మీయులు, స్నేహితులు, సహవాసులు, సహోధ్యుగులు, విశేషించి శ్రీ సీతారామ శ్రీచరణ సంబంద బంధువులు. ఆంధ్రాంగ్ల భాషలను సవ్యసాచిత్వంతో సాహిత్య వ్యవసాయమో, సాపేక్ష పౌరోహిత్యమో చేయగల సమర్థులు.ఇప్పటికే శ్రీ రామాయణాన్ని రచించి, రుచి చూపించిన ‘వాచవి’ గనుక ఇలాగే శ్రీ మహాభారతాన్ని సంక్షిప్త సుందరంగా అనువక్తవ్యం చేయాలని ఆకాంక్షిస్తున్నాను.
చివరగా-
‘‘నిగమములు వేయి చదివిన సుగమంబులు గావు...సుగమంబు భాగవతమను నిగమంబు’’
-పోతన్న
*శ్రీరామ - రామానుజ దాసుడు*
*చిలకపాటి విజయరాఘవాచార్యులు*
పూర్వ కార్యదర్శి, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ పరచార పరిషత్
విజయవాడ.
(సశేషం)
*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*
(రచన: శ్రీ వనం జ్వాలా నరసింహారావు)
No comments:
Post a Comment