*📿🏵️రామచరితమానసం🏵️📿*
*వాల్మీకి మహర్షి తన రామాయణ గాధను కుశలవుల చేత గానం చేయించి వెలుగులోకి తెస్తే, తులసీదాస పండితుడు 'శ్రీరామచరితమానసం' అన్న పేరుతో తాను రచించిన రామాయణాన్ని తానే వందలమార్లు ప్రవచించి తరించే అదృష్టానికి నోచుకున్నాడు.*
*వాల్మీకి రామాయణం ఆదికావ్యం. అందులో శ్రీరాముడిని మానవోత్తముడిగా, ఆదర్శప్రాయుడైన రాజుగా మాత్రమే చిత్రీకరించిన వాల్మీకి మహర్షి, శ్రీరాముడి పరబ్రహ్మ తత్త్వాన్ని అనుభవించి లిఖించే బృహత్కార్యం చేయడానికి ఎన్నో కల్పాల తరువాత మళ్ళీ తులసీదాసుగా జన్మించాడనీ, తులసీ రామాయణమైన శ్రీరామచరితమానస్ గ్రంథాన్ని రచించి ప్రవచించిన తరువాత పరమపదం పొందాడనీ ప్రతీతి.*
*ఇందుకు పరమశివుడు పార్వతీదేవితో చెప్పిన భవిష్యోత్తర పురాణంలోని ప్రతిసర్గ పర్వంలోని శ్లోకమే ప్రామాణికం.*
*వాల్మీకిస్తులసీ దాసః కలౌదేవీ భవిష్యతి ।*
*రామచంద్ర కథామేదం భాషాబద్ధం కరిష్యతి ॥*
*"పార్వతీ! కలియుగంలో వాల్మీకి కవి తులసీదాసుగా జన్మించి అప్పటి వ్యవహారభాష అయిన అవధి (హిందీ) భాషలో రామచంద్రుడి కథను తిరిగి రచిస్తాడు" అని ఈ శ్లోకార్థం.*
*అలాగే, వాల్మీకి ముఖతః రామాయణ గాథను వినలేకపోయిన హనుమంతుడు భవిష్యత్తులో ఆయన తులసీదాసుగా జన్మించి నప్పుడు తానాయన తులసీ రామాయణాన్ని వింటానని పలికి, అన్నట్లుగానే ఎన్నోమార్లు ఆయన ప్రవచనాలు విన్నాడు. ఆయన సహాయంతోనే తులసీదాసు బాలరాముడి దర్శనాన్ని పొందగలిగాడు కూడా!*
*ఆంజనేయుడి కృపతో పాటు, నిరంతరం 'శ్రీరామచరిత ''మనస్కుడై' ఉండే ఆ పరమశివుని కృప కూడా తులసీదాసుపై అపారంగా ప్రసరించింది. ఆయన కృప చేతనే రెండు అద్భుత దర్శనాలలో ప్రశ్నోత్తరాలుగా మహనీయుల ద్వారా శ్రీరామ చరితాన్ని తులసీదాసు వినగలిగాడు. అటుతరువాత పరమేశ్వరుని ఆదేశాన్ని అందుకుని శ్రీరామచరితమానస్ గ్రంథాన్ని రచించాడు. తులసీదాస పండితుడు. మొదటి అనుభూతిలో ఆయన కాకభూషుండి అనే ఒక కాకి సాక్షాత్తూ పక్షిరాజైన గరుత్మంతుడి సందేహాలు తీర్చి, తన స్వానుభవాలలో దర్శించిన శ్రీరామపరబ్రహ్మ తత్త్వాన్ని గురించి చెప్పడం విన్నాడు.*
*తులసీదాసు పొందిన మొదటి దివ్యదర్శనం*
*గృహస్థాశ్రమాన్ని పరిత్యజించి, తీర్ధయాత్రలు చేస్తూ ద్వారకా, పురీ, దామేశ్వరం, బదరీనాథ్ క్షేత్రాలు దర్శించిన తులసీదాసు మానససరోవర పవిత్ర స్థలాన్ని చేరుకుని అక్కడ సాధనలు చేస్తూండగా ఒకరోజు ఆయనకొక దివ్యమైన అనుభూతి కలిగింది.*
*అక్కడి నీలగిరి పర్వత శిఖరాన ఒక వృక్షఛాయలో ఆశీనుడై ఉన్న ఓ పెద్ద కాకి వద్దకు గరుత్మంతుడు వచ్చి వ్రాలడం చూశాడు తులసీదాసు. పరమేశ్వరుడు కొంతకాలం సజ్జన సాంగత్యం చేయమని నన్ను మీ వద్దకు పంపాడని తెలిపిన గరుత్మంతునితో కాకభూషుండి ఇలా పలికాడు:*
*"పక్షిరాజా! నా చరిత్ర ఏమని తెలుపను? ఇప్పుడిలా శ్రీరామ గాథను నాతోటివారికి వినిపించగలుగుతున్నానంటే అందుకు ఆ పరమేశ్వర కృపే కారణం. ఇప్పటికి వేయి జన్మల క్రితం నేను అయోధ్యలో జన్మించినా కూడా విష్ణుదూషణ చేస్తూ, సాటివారిని మోసగిస్తూ బ్రతికిన కుటిలుడిని. పేదవాడినైన నేను స్వార్థబుద్ధితో ఒక శివాలయ పూజారివద్ద శిష్యరికం చేసి, ధనసముపార్జన కోసం ప్రత్యేకమైన శివమంత్రాలు నేర్చుకుని గొప్పవాడినై, అవసరం తీరిపోయింది కనుక నా గురువైన పూజారిని అహంకారంతో దూషించి తీవ్రంగా అవమానించాను.*
*పరమ శాంతుడయిన నా గురువు నా దూషణ తిరస్కారాలను సహించి ఊరుకున్నా, శంకరుడు మాత్రం కోపించి, గురుసింద చేసిన నేను వెంటనే కొండచిలువగా మారుతాననీ, ఆ తరువాత వేయి నీచ జన్మలు ఎత్తుతాననీ నన్ను అశరీరవాణిగా శపించాడు. నేను భయంతో వణికిపోతూండగా నా గురువర్యుడు దయాళుడై నన్ను క్షమించమని ఆ పరమేశ్వరుడిని దీనంగా వేడుకున్నాడు. పరమశివుడు శాంతించి శాపం అనుభవించక తప్పదనీ, అయితే వేయి జన్మలెత్తినా నాకు జనన మరణ వేదనలు కలగవనీ, అన్ని జన్మలలోనూ గతమూ గుర్తు ఉంటుందనీ నన్ను ఆశీర్వదించాడు. ఆ స్మృతులలో జీవిస్తూ, పాప పరిహారం కోసం ప్రతి జన్మలోనూ శ్రీరామనామాన్ని నిత్యమూ స్మరించుకుంటూ ఉండమని ఆదేశించాడు. గరుత్మంతా! ఆ విధంగా పరమశివుని శాపం నాకు అనుగ్రహంగా పరిణమించింది.*
*నేను అటుతరువాత కొండచిలువగా మారి, అటుపిమ్మట మరెన్నో హీన జన్మలెత్తి. నా వేయవజన్మలో బ్రాహ్మణుడనై జన్మించి రామనామంలో రమించసాగాను. అదృష్టవశాత్తూ నాకు లోమశ మహర్షి దర్శనం ప్రాప్తించింది. నేను ఆయననెంతో కాలం భక్తిశ్రద్ధలతో సేవించాను. ఆయన ప్రసన్నుడై నాకు నిరాకార పరబ్రహ్మమంత్రం ఉపదేశించబోగా, నేను శ్రీరామ దర్శనం కలిగించే మంత్రాన్ని ఉపదేశించమని అర్ధించాను. నిరాకార మంత్రాన్నిస్తానని మునీంద్రుడూ, సాకార రామదర్శన మంత్రాన్ని ఉపదేశించమని నేనూ పట్టుబడుతూ పంతాలకుపోగా చివరకాయన కోపించి, వివేకం లేని కాకి రూపాన్ని పొందమని నన్ను శపించారు. వెంటనే ఈ కాక్ రూపాన్ని పొందిన నేను ఏమాత్రమూ చింతించక రెక్కలతో పైకెగిరి రామనామాన్ని జపించడం చూసి మహర్షి మెత్తబడ్డారు. మనస్సు మార్చుకుని నన్ను దగ్గరకు పిలచి నేనడిగిన రామమంత్రాన్నిచ్చి దానితో పాటూ ఇచ్ఛారూపం పొందగలిగేటట్లూ, ఇచ్ఛామరణము సంభవించేటట్లూ వరాలిచ్చి దీవించారు. అందుకే ఎన్ని కల్పాలు మారినా నేను మరణించక ఇరవై ఏడు కల్పాలుగా ఈ నీలగిరి పర్వతంపై నివసిస్తూ రామనామంలో రమిస్తున్నాను. శ్రీరాముడు ఏ త్రేతాయుగంలోనో అయోధ్యలో జన్మించినా నేనక్కడకు వెళ్ళి, ఆయన జన్మించిన సమయం మొదలుకొని ఆయన బాల్యావస్థ వరకూ ఆయన బాల చేష్టలు చూస్తూ కాలం గడుపుతాను. ఆ సమయాన ఆయన నాకు తన పరబ్రహ్మ తత్త్వాన్ని చూపుతారు.*
*"ఒకసారి ఆయన నాతో ఆడుకుంటూ పెద్దగా నోరు తెరచి ఏడుస్తూండగా నేనాయన నోట్లో నుండి గర్భంలోకి వెళ్ళిపోయి విశ్వంలోని అన్ని బ్రహ్మాండాలనూ దర్శించి బయటకు వచ్చాను. ఆ సరబ్రహ్మ తత్త్వానికి విస్తుపోయి చూద్దును గదా, బాలరాముడు ఏడుస్తూ, తల్లివద్దకు పరుగెడుతున్నాడు. మరొకసారి ఆయనిచ్చిన తీపి పదార్థాలు గ్రహించక నేను ఎగిరిపోతే, నేను ఎగిరినంత దూరమూ ఆయనా అనుసరించి వచ్చాడు. ఇటువంటి ఆ సామలీలలు చూసాక 'కావు! కావు!' (రక్షించు, రక్షించు) అని ఈ డాక్టరూపం నాకెంతో ప్రియమైపోయింది. నాయనా గరుత్మంతా! నీవిక్కడికి వచ్చిన కారణం నాకు తెలుసు. మహావిష్ణు పూర్ణావతారుడైన రాముడు నాగపాశాలకు కట్టుబడి నీ సాయం వలన వాటి నుండి విడివడటం నీకు వింతగా తోచింది కదూ! తన రామాయణంలో నీ పాత్ర ఉండటానికై అది రామచంద్రుడే చేసిన లీల నాయనా! ఆయనెవరి సాయం తీసుకున్నా అది వారి కీర్తి పెంచటానికి మాత్రమే!" అంటూ భక్తిపరవశుడయ్యాడు కాకభూషుండి...*
*గరుత్మంతుడితో పాటూ తానూ శ్రీరామచరితాన్ని విన్న తులసీదాసు ఆ విషయాలను హృదయంలో పదిలంగా నిక్షిప్తం చేసుకున్నాడు. అటుతరువాత కాశీకి తిరిగివచ్చి ఆంజనేయుడిని ప్రసన్నం చేసుకుని ఆయన ఆదేశంపై చిత్రకూట పర్వతంపై ధ్యానం చేసుకుంటూ ముద్దులొలికే బాలరాముడి దర్శనం చేసుకోగలిగాడు తులసీదాసు.*
*తులసీదాసు పొందిన రెండవ దివ్యదర్శనం*
*నిరంతరం శ్రీరామనామంలో రమిస్తున్న తులసీదాసుకి తన డెబ్బై అయిదవ ఏట ప్రయాగ స్నానం చేసి వస్తూండగా యాజ్ఞవల్క్య భరద్వాజుల సంభాషణ వినిపించింది. ఆ మహర్షులను దూరం నుండే దర్శిస్తూ యాజ్ఞవల్యముని భరద్వాజుడికి తెలిపిన శ్రీరామ చరిత్రమంతా విన్నాడు. తులసీదాసు సతీదేవి తన పతి అయిన శంకరుడు పరబ్రహ్మగా భావించే శ్రీరాముడిని పరీక్షించాలని తలచి, ఒకసారి సీతావియోగంలో ఉన్న ఆయన ఎదుటికి సీత రూపం ధరించి వచ్చింది. శ్రీరాముడు వెంటనే గంభీరంగా 'అమ్మా సతీ! శంకరుడు లేకుండా నీవిలా అరణ్యాలలో సంచరించటం మంచిది కాదు. త్వరగా ఆయన వద్దకు వెళ్ళు' అని మందలించటంతో సిగ్గుపడి వెళ్ళిపోతూండగా ఆమెకు ఏవైపు చూసినా ఆ వైపున శ్రీరాముడి దివ్యమూర్తి కనిపించి ఆయన సాక్షాత్తూ పరబ్రహ్మమే అన్న సత్యం అవగతమైనది.*
*పార్వతీదేవి ఆ విషయం గుర్తుచేసుకొని తనకు శ్రీరామ చరితాన్ని వినిపించమని అడుగగా పరమేశ్వరుడు స్వయంగా ఆమెకు తెలిపిన ఆ గాథను యాజ్ఞవల్క్యుడు భరద్వాజుడికి వివరించాడు.*
*తులసీదాసు పరమేశ్వరాదేశంపై అయోధ్యకి వెళ్ళి తన అనుభూతులతో శ్రీరామాయణ గాథను రచించి, కాశీకి తిరిగి వచ్చి శివుని ఆదేశానుసారం దానిని ప్రజల ముందు ప్రవచించసాగాడు. మొదట్లో ఈ గ్రంథం విమర్శలకు గురైనా, సాక్షాత్తూ ఆ కాశీ విశ్వేశ్వరుడే తన సమక్షంలో ఉంచిన రచనలన్నింటిలోనూ తులసీ రామాయణానికి అగ్రస్థానాన్ని ఇచ్చి, 'సత్యం శివం సుందరం' అంటూ గ్రంథం మొదటి పుటలో తన చేవ్రాలు ముద్రించి, 'సత్యం! ఇది సత్యం' అని పలుకడంతో అందరికీ శ్రీరామపరబ్రహ్మతత్త్వం అవగతమైనది.*
*┈┉┅━❀꧁జై శ్రీరామ్꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🕉️🙏🕉️ 🙏🕉️🙏 🕉️🙏🕉️
No comments:
Post a Comment