*_...మానవసహాయం..._*
_(1989 మే చందమామ కథ)_
==================
*ఒకప్పుడు మలయ తీరంలో ఒక యోధాన యోధుడు ఉండేవాడు. అతని సాహస చర్యలూ, అద్భుత పరాక్రమమూ గురించి దేశదేశాల వాళ్ళు కథలు చెప్పుకునే వారు.*
*ఒకనా డతను సముద్ర తీరాన పచార్లు చేస్తుండగా, ఒక మహాకాయుడు సముద్రంలో నడుస్తూ అతని వైపు వచ్చాడు. ఆ మహాకాయుడు ఒడ్డుకు వచ్చాక యోధానయోధుడు అతణ్ణి పలకరించి, _“ఎవరు నువ్వు ? సముద్రం దాటి ఇటుగా ఎందు కొస్తున్నావు?"_ అని అడిగాడు.*
*_"నేను మహాకాయ ద్వీపం నుంచి వస్తున్నాను. మా రాజుగారు యోధాన యోధుడి కొక కబురు చెప్పమని పంపారు.''_ అన్నాడు ఆ మహాకాయుడు.*
*_"ప్రస్తుతం ఆ యోధుడు అడవికి వేటకుపోయి ఉన్నాడు. అతనితో ఏం చెప్పాలో చెబితే, రాగానే చెబుతాను.''_ అన్నాడు యోధుడు.*
*_"మహారాణిగారు ప్రసవించబోతున్నది. లోగడ ఆమె ఇద్దరు మగ పిల్లలను కన్నది. పురిటి లోనే ఆ ఇద్దరు పిల్లలనూ ఎవరో దొంగలు ఎత్తుకుపోయారు. ఈసారి పుట్టబోయే బిడ్డను కాపాడటానికి యోధాన యోధుడు రావాలని మా రాజుగారి కోరిక. వెనక బిడ్డలు పుట్టినప్పుడు రాజుగారి కోట లోపలా, వెలపలా కూడా బలమైన రక్షణలు ఏర్పాటు చేశారు. అయినా దొంగలు రానేవచ్చారు, పిల్లలను ఎత్తుకు పోయారు. వాళ్ళెవరో, ఎటుగా వచ్చారో, పిల్ల లేమయారో, కొంచెం గూడా తెలియ రాలేదు."_ అన్నాడు మహాకాయుడు.*
*_''సరే, యోధానయోధుడు తిరిగి వచ్చాక ఈ సమాచారం అతనితో చెబు తాను."_ అన్నాడు యోధుడు.*
*మహాకాయుడు అతని వద్ద శలవు పుచ్చుకుని సముద్రం లోకి వెళ్ళి పోయాడు.*
*మర్నాడు ఉదయం యోధానయోధుడు అదే ప్రాంతంలో పచార్లు చేస్తూ ఉండగా అతనికి ఎనిమిదిమంది బుడత మనుషులు పరిగెత్తే ఆటలాడుతూ కనిపించారు. అతను వాళ్ళను పలకరించి, _"ఎవరు మీరు? మీ రేం పని చేస్తారు?"_ అని అడిగాడు.*
*_''మేం బుడతలం. తలా ఒక పనీ చేస్తాం. నా మటుకు నన్ను చట్రాయి అంటారు. నేను చతికిలబడ్డానంటే న న్నెవరూ కదిలించలేరు,"_ అన్నాడు బుడతల్లో ఒకడు.*
*_"ఏదీ, కూర్చో చూస్తాం."_ అన్నాడు యోధానయోధుడు. చట్రాయి నేల మీద చతికిలబడ్డాడు. యోధానయోధుడు వాణ్ణి కొంచెం కూడా కదిలించలేక పోయాడు. అతను ఆశ్చర్యపడి మిగిలిన వాళ్ళ శక్తులను గురించి కూడా అడిగాడు.*
*ఒకడి పేరు దివ్యకర్ణి; వాడు సముద్రం అవతల మాట్లాడుకున్నా ఆలకించగలడు. మరొకడు దూరస్పర్శి; వాడు సముద్రం అవతల చీమ చిటుక్కుమంటే తెలుసుకో గలడు. నాలుగోవాడు మహాజ్ఞాని: వాడికి ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతున్నది తెలుస్తుంది. ఐదోవాడు లఘుహస్తి: వాడు కోడి పొదిగే గుడ్డును కోడికే తెలియ రాకుండా కాజెయ్యగలడు. ఆరోవాడు ఆరోహకుడు; వాడు ఈగలు పాకలేని నున్నని గోడలు కూడా ఎగబాకగలడు. ఏడోవాడు విలుకాడు; వాడు వంద రెక్కల పురుగులు ఎగురుతుంటే, వాటిలో కావాలన్న దాన్ని బాణంతో కొట్టగలడు. ఎనిమిదోవాడు దారుబ్రహ్మ: వాడి చేతి కొక కర్ర ఇస్తే, దానితో వాడు చెయ్య లేనిది లేదు.*
*_"భేష్, ఒక ఓడ తయారు చెయ్యాలంటే, నీ కెంత కాలం పట్టుతుంది?''_ అని యోధానయోధుడు అడిగాడు.*
*_"నువ్వు ఒక్కసారి గుండ్రంగా తిరిగే టంత సేపు."_ అన్నాడు దారుబ్రహ్మ.*
*యోధానయోధుడు నిలబడినచోటనే ఒక్కసారి గుండ్రంగా తిరిగాడు. అతని వీపు సముద్రం కేసి ఉండే క్షణంలో దారుబ్రహ్మ ఒక కర్రపుల్లను సముద్రపు నీటి మీదికి విసిరాడు. యోధానయోధుడు మళ్ళీ సముద్రం కేసి తిరిగే సరికి ఒక పెద్ద ఓడ సిద్ధంగా ఉన్నది.*
*_"నేను సముద్రం మీద, మహాకాయుల దీవికి వెళ్ళబోతున్నాను. మీరంతా నా వెంట వచ్చి నాకు సహాయం చేస్తారా?"_ అని యోధానయోధుడు బుడతళ్ళను అడిగాడు.*
*_"సహాయం చేస్తాం. తూర్పు దేశాలలో మాకు తెలీని విషయం లేదు.''_ అన్నారు వాళ్ళు. యోధానయోధుడు ఎనిమిది మంది బుడతళ్ళనూ ఓడలో ఎక్కించు కుని ప్రయాణమై, త్వరలోనే మహాకాయులుండే దీవిని చేరాడు. మహాకాయుల రాజు, యోధానయోధుడు వచ్చినందుకు పరమానందం చెంది, అతనికి అతని అనుచరులకూ ఘనమైన స్వాగతం ఇచ్చాడు.*
*ఆయన యోధానయోధుడితో, _"మీరు సమయానికి వచ్చారు. ఇవాళే రాణి ప్రసవించింది. ఆమె ప్రసవించిన / మొదటి పిల్ల లిద్దరూ పుట్టినరోజు రాత్రే మాయమయారు. ఈ పిల్లవాడికి కూడా ఈ రాత్రే ప్రమాదం ఉన్నది."_ అన్నాడు.*
*_"మీ రేమీ భయపడకండి. నేనూ, నా అనుచరులూ ఈ రాత్రి మీ బిడ్డను కాపాడతాం. కాపాడలేని పక్షంలో మీరు నా తల తీసేయించవచ్చు."_ అన్నాడు యోధానయోధుడు.*
*రాజభవనంలో మంచి ఇనప పెట్టె లాటి గది చూసి, అందులో చంటిబిడ్డనూ, ఇద్దరు దాదులనూ ఉంచి, యోధాన యోధుడూ, అతని అనుచరులూ కాపున్నారు.*
*మహాజ్ఞాని యోధాన యోధుడితో. _"బిడ్డను కాపాడలేకపోతే నీ తల ఇస్తా ననటం పొరపాటయింది. ఈ బిడ్డను ఈ రాత్రి మనం కాపాడలేం. దొంగతనం జరిగి తీరుతుంది."_ అన్నాడు.*
*_"అలాగా! ఆ బిడ్డను ఎవరు ఎత్తుకు పోతారో చెప్పు.''_ అన్నాడు యోధుడు.*
*_"దొంగ ఈ రాజు చెల్లెలే ముందు పుట్టిన పిల్లలను కూడా ఆమే ఎత్తుకు పోయింది. ఈ అన్నా చెల్లెళ్ళ మధ్య బద్ధ శత్రుత్వం. చెల్లెలు మంత్రాలు నేర్చినది. అదృశ్య రూపంలో కోటలోకి ప్రవేశించి, పొగగూడు నుంచి రహస్యంగా గదిలోకి చెయ్యి చాచి బిడ్డలను కాజేసింది"_ అన్నాడు మహాజ్ఞాని.*
*ఆమాట వింటూనే చట్రాయి పొగగూడు కింది భాగంలో చతికిలబడి. "ఆ పొగ గూడు కుండా చెయ్యి పెట్టిందో, ఆ చేతిని మరి తీసుకోలేదు.”_ అన్నాడు.*
*అందరూ ఎవరి స్థానాల్లో వారు కూర్చున్నారు. అర్ధరాత్రి దాటాక దివ్యకర్ణి. _"మహాకాయమహారాజు చెల్లెలు తన కోట నుంచి బయలుదేరుతున్నది. మొదట దొంగిలించిన పిల్ల లిద్దరినీ జాగ్రత్తగా చూసుకోమని తన నౌకర్లతో అంటున్నది."_ అన్నాడు.*
*_"ఆమె తన ఇంటికప్పు గుండా పైకి వస్తున్నట్టున్నది. ఆమె ఇంటికి ద్వారాలూ, గవాక్షాలూ లేవు. ఆమె కోట గోడలు గాజు లాగా నున్నగా ఉన్నాయి."_ అన్నాడు దూరస్పర్శి.*
*కొంచెం సేపయాక దివ్యకర్ణి. _"రాక్షసి వచ్చేసింది! కాపలావాళ్ళకు కనపడకుండా కోటలోకి జొరబడింది."_ అన్నారు.*
*మరి కొద్ది క్షణాలలో పొగగూడు లోంచి ఒక నల్లని చెయ్యి కిందికి దిగి రాసాగింది. అది కంటపడగానే చట్రాయి చప్పన ఆ చేతిని పట్టేసుకున్నాడు. చెయ్యి తీవ్రంగా పెనుగులాడింది. కాని ప్రయోజనం లేకపోయింది. చివరకు చెయ్యి ఊడి వచ్చేసింది. చట్రాయి ఆ చేతిని గదిలోకి లాగేశాడు. యోధుడూ, మిగిలిన బుడతళ్ళూ, దాదులూ ఆత్రంగా ఆ చేతి చుట్టూ మూగి ఆశ్చర్యంగా చూడ సాగారు.*
*వాళ్ళందరూ ఆ సందడిలో ఉన్న సమయంలో రాక్షసి తన రెండో చేతిని గదిలోకి పెట్టి, ఉయ్యాల తొట్టెలో ఉన్న పిల్లవాణ్ణి కాజేసి తీసుకుపోయింది.*
*దాదులు ఉయ్యాల తొట్టెకేసి తిరుగుతూనే. _''అయ్యో, బిడ్డ !''_ అన్నారు.*
*_"మనం ఓడలో ఎక్కి పారిపోవటం మేలు. తెల్లవారగానే ఈ రాజు మన తలలు తీసేస్తాడు."_ అన్నారు బుడతళ్ళు.*
*_''ఎందుకు పారిపోవటం? ఆ రాక్షసి వెన్నంటిపోయి, రాజుగారి ముగ్గురు బిడ్డలనూ తీసుకొద్దాం."_ అన్నాడు యోధానయోధుడు.*
*అందరూ కోట బయటికి వచ్చి, తమ ఓడలో రాక్షసి ఉండే తీరానికి చేరారు. ఆరోహకుడు లఘుహస్తిని తన భుజాల మీద ఎక్కించుకుని గబగబా కోట గోడ ఎక్కేసి, లఘుహస్తిని కోటలో దించాడు. లఘుహస్తి లోపలి నుంచి మహాకాయ మహారాజు కొడుకులను ముగ్గురినీ ఆరోహకుడికి వరసగా అందించాడు. అందరూ ఓడలో మహాకాయుల దీవికి తిరిగివచ్చారు.*
*వారింకా చేరకముందే రాక్షసి పిల్లలు మాయం కావటం తెలుసుకుని ఓడను వెంబడించి రాసాగింది. ఆమె ఎంత దూరంలోకి వచ్చినదీ దూరస్పర్శి ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాడు. చూపు మేరలోకి రాగానే విలుకాడు, బాణం వదిలి, ఆమె నుదుట ఉన్న ఒక్క కంటినీ కొట్టేశాడు. ఆ దెబ్బతో ఆ రాక్షసి చచ్చి సముద్రంలో పడిపోయింది.*
*తెల్లవారగానే మహాకాయ మహారాజు పురిటిగదికి పరిగెత్తుకుంటూ వచ్చి, తన ముగ్గురు పిల్లలనూ చూసి ఆశ్చర్యంతో మూర్చపోయినంత పని చేశాడు. ఆయన వారం రోజులపాటు తన అతిథులకు బ్రహాండమైన విందులు ఏర్పాటు చేసి, వారి ఓడ అంతా బహుమానాలతో నింపేసి, యోధాన యోధుణ్ణి, బుడతళ్ళనూ సాగనంపాడు.*
----------------------
*_{సేకరణ: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*
No comments:
Post a Comment