ఉపదేశ సారం-9
సరళ చింతనం .మోక్షదాయకం
ఆజ్యధారయా ప్రోతసా సమం।
సరళ చింతనం విరళత: పరం॥
రమణ మహర్షి రచించిన 30 శ్లోకాల "ఉపదేశ సారం " లోని ఏడో శ్లోకమిది. భగవంతునియందు భక్తిని కలిగించి, పెంపొందించే సాధనలలో శరీరంతో చేసే పూజ , వాక్కుతో చేసే జపం గురుంచి గత శ్లోకాలలో తెలిపిన రమణులు ..మనసుతో చేసే చింతనం ఎలా ఉండాలో ఈ శ్లోకం ద్వారా చెప్పారు . మధ్య మధ్య ఆటంకాలతో కొనసాగే విరళ చింతనం కన్నా నేతి ధారలా (ఆజ్య ధారయా ), నదిలో జలం ప్రవహించినట్టుగా (శ్రీతాసాం సమం ) ఏ ఆటంకాలూ లేకుండా అఖండంగా జరిగే సరళ చింతనం శ్రేష్టమైనదని దీని అర్ధం .
చింతనం అంటే ..మనలో ఆలోచనలన్నింటినీ ఒకే ఒక సద్వస్తువు పైకి ప్రవహింపజేయడమే . ఈ చింతననే ధ్యానం అని కూడా అంటారు. నిధిధ్యాసన అన్నా ఇదే . ఆధ్యాత్మిక సాధనల్లో అత్యంత విలువైనది చింతనం లేదా ధ్యానం విలువైనదేగానీ ...అంత సులువైనది కాదిది . జ్ఞానసాధనలో ఇది మూడో మెట్టు . మొదటిది శ్రవణం . రెండోది మననం . మూడోది చింతనం .
పరమాత్మతత్వంపై చింతనం చేయాలంటే ముందుగా సద్గురువు వద్ద కూర్చొని భక్తితో , శ్రద్ధతో ఏకాగ్రతతో శ్రవణం చేయాలి . ఏం శ్రవణం చేయాలి ? అంటే వేదాంత శ్రవణం చేయాలి. ఉపనిషత్తుల్లో నిక్షిప్తం చేసిన జ్ఞానాన్ని శ్రవణం చేయాలి . ఎందుకంటె ధ్యానానికి ముందు జ్ఞానం తప్పనిసరి . జ్ఞానం స్థిరమై సంపూర్ణంగా ఉన్నప్పుడే అది ధ్యానానికి సహాయకారి అవుతుంది . ఇలా స్థిరం , సంపూర్ణం కావాలంటే శిష్యుడు సాధన చతుష్టయ సంపన్నుడై శ్రవణం చేయాలి. గురువు శ్రోత్రియుడై , బ్రహ్మనిష్ఠుడై ఉండాలి . ఇలా శ్రవణం చేసి పొందిన ఆత్మజ్ఞానం స్థిరం కావాలంటే , శిష్యుడు దాన్ని మరలా మరలా మననం చేసుకుంటూ ఉండాలి . ఇలా శ్రవణ , మననాలైన తర్వాత ధ్యానం చేయాలి. శ్రవణ మననాలలో జీవుడు తానూ నిజంగా పరమాత్మనేనని , ఈ దేహ మనోబుద్ధులతో తాదాత్యం చెంది , వాటి వృత్తులను తనపై ఆరోపించుకుని , కర్తగా భోక్తగా వ్యవరిస్తున్నానని తెలుసుకుంటాడు . ఆ తాదాత్యాన్ని వీడి తాను తానుగా ఉండాలని తెలుసుకుంటాడు . అలా తెలుసుకున్న విషయాన్ని చింతనలో , ధ్యానంలో , "సోహం ( ఆ పరమాత్మను నేనే )" అని అనుభవపూర్వకంగా స్థిరీకరించుకుంటాడు . ఇదే ధ్యాన లక్ష్యం . అలాంటి అనుభవం వల్లనే జీవన్ముక్తి (మోక్షప్రాప్తి ) లభిస్తుంది . కనుక సరళ చింతనం ఉత్తమైనది అని మహర్షి భావం .
సాధనలలో పూజ కన్నా జపం , జపం కన్నా చింతనం , చింతనలో కూడా విరళ చింతనం కన్నా సరళ చింతనం అత్యుత్తమైనదని రమణులు చెప్పారు . కాబట్టి అన్ని సాధనలో వదలి ఆ సరళ చింతనమే సాగిద్దామనుకుంటే అది పొరబాటే . ఎందుకంటె ఈ సాధనాలన్నీ నిచ్చెన మెట్ల వంటివి . అన్నిటికన్నా పై నున్న మెట్టే పై అంతస్తులోకి చేరుస్తుందని తెలిసినా ...నిచ్చెనలోని అన్ని మెట్లనూ ఎక్కితే గానీ పై మెట్టును చేరుకోలేం కదా! భక్తి సాధన కూడా అంతే. ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ చివరిమెట్టు అనదగ్గ సరళ చింతనంలోకి ప్రవేశించాలి .
- by sri దేవిశెట్టి చలపతిరావు,
Sekarana from andhrajyoti .dt.21-1-2020
No comments:
Post a Comment