Monday, July 14, 2025

 శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…
  నడిచే దేవుడు…పరమాచార్య పావన గాధలు…


             *ఢిల్లీలో ఉద్యోగం!*
                
```
సర్వవ్యాపకుడైన పరబ్రహ్మ, మానవాళిని అనుగ్రహిస్తూ, సాక్షాత్ సర్వేశ్వరుడుగా మనల్ని ఆశీర్వదిస్తున్న అవతారం శ్రీ శ్రీ పరమాచార్య స్వామివారు.  స్వామి వారు శుక మహర్షి స్వరూపులు.

స్వామివారే స్వయంగా వెళ్లి ఎందరినో ఆదరించిన సంఘటనలు కోకొల్లలు!

‘అంజలై’ అనే మహిళ పనిమనిషిగా జీవనం సాగించేది. పేదరికం వల్ల ఆమె ఎంతగానో కష్టాలు పడింది. ఆమెకు ఇద్దరు కుమారులు. 

1984లో భారతదేశ నలుచెరగులా నడిచి పుణ్యభూమిని పావనం చేసిన పరమాచార్య స్వామివారు తిరుగు ప్రయాణంలో ఈ ‘అంజలై’ నివసిస్తున్న గ్రామం మీదుగా వెళ్తున్నారు.

తన కుటుంబ పరిస్థితుల వల్ల తను ఎప్పుడూ స్వామివారి గురించి విన్నదీ లేదు, వారి మహిమలను అనుభవించినదీ లేదు. 

ఎవరో సామివారు తమ ఊరికి వచ్చారని, ఒకసారి అలా చూసి వెళదామని మహాస్వామి వారు మకాం చేసిన చోటుకు వచ్చింది. 

తనతో పాటు ఇద్దరు పిల్లలను కూడా వెంట తీసుకుని వెళ్ళింది. అప్పుడు స్వామివారి వద్ద ఎక్కువమంది లేకపోవడంతో, ఎటువంటి ఇబ్బంది లేకుండా పరమాచార్య స్వామివారి దర్శనం లభించింది.

ఆమె మహాస్వామి వారి భక్తురాలేమి కాదు, స్వామివారిని కేవలం చూడడానికే వచ్చింది కాబట్టి, స్వామి వారిని చూసి తెరిగివెళ్ళబోతోంది. 

మహాస్వామివారు సేవకుడితో, “ఆమె పేరేంటో ఆమెను అడుగు” అని చెప్పారు.

అత్యంత భక్తితో తన పేరు అంజలై అని, ఇళ్ళల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నానని, తనకు ఇద్దరు కుమారులని స్వామివారికి తెలిపి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యింది.

“ఆమెను పిలువు” అని అన్నారు స్వామివారు.

మరలా ఆమె వచ్చి స్వామివారి ముందు నిలబడగా, స్వామివారు ఆమెను, “నీ పేరు ‘అంజలై’ కదా?     అంటే నీవు దేనికీ భయపడవన్నమాట” అని అన్నారు. (తమిళంలో ‘అంజలై’ అంటే భయంలేకపోవడం అని అర్థం). 

స్వామివారి కరుణకు ఆశ్చర్యపోయి ‘అంజలై’ స్వామివారి యెడ భక్తి ప్రపత్తులు చూపుతోంది. 

మహాస్వామి వారు మరలా ఆమెను, “నీ రెండవ కుమారుడు ఢిల్లీలో పనిచేస్తున్నాడని చెప్పావా?” అని అడిగారు. 

ఈ ప్రశ్నకు తను ఉన్న పరిస్థితికి నవ్వే సమాధానం. చీర కొంగు పట్టుకుని, చిరిగిపోయిన సగం నిక్కరు మురికి చొక్కా వేసుకుని, ముక్కు కార్చుకుని రెండవ కుమారుడు ఆమె పక్కనే నించుని ఉన్నాడు. ఏమి సమాధానం చెప్పాలో తెలియక ‘అంజలై’ నిలబడి చూస్తోంది. 

మహాస్వామి వారు ఇదేమీ పట్టించుకోకుండా ఆమెను ఆశీర్వదించారు.

ఆరోజు నుండి అంజలైకి మహాస్వామి వారిని తలుచుకునే భాగ్యం కలిగింది. తన రెండవ కుమారుని గురించి స్వామివారు అడిగిన ప్రశ్న గురించి ఏమీ ఆలోచించకుండా, అందులో ఉన్న నిగూఢార్థాన్ని గురించి పట్టించుకోకుండా కేవలం స్వామివారిపై అనన్య భక్తితో జీవిస్తోంది.

ప్రతి రోజూ స్నానానంతరం తన చిన్ని గుడిసె నుండి బయటకు వచ్చి, ఆకాశం వైపు చూసి కర్పూర హారతి ఇస్తోంది. కనీసం తన ఇంటిలో మహాస్వామి వారి చిత్రపటం ఉంచుకోవడానికి కూడా తను అర్హురాలు కాదని నిశ్చయించుకుని, స్వామివారి సర్వవ్యాపకత్వాన్ని స్మరించి, ఎందరికో అర్థమవ్వని జ్ఞానం, స్వామివారు అన్నిటా ఉన్నాడనే విషయాన్ని అర్థం చేసుకుని ఆకాశానికి హారతి ఇస్తోంది.

“నీవు దేనికీ భయపడవన్నమాట” అనే ప్రశ్నతో ఆమె జీవితంలో సమస్యలను ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించారు పరమాచార్య స్వామివారు.

అంజలై అన్ని సమస్యలను ఏ భయం లేకుండా ఎదుర్కొని జీవితం సాగిస్తోంది. ఇరవైఅయిదు సంవత్సరాల తరువాత అంటే ఇప్పుడు 2008లో శ్రీ పెరియవా ఆరాధనా ఉత్సవం ఊరేగింపు ఆమె ఉంటున్న గ్రామానికి వచ్చినందుకు చాలా సంతోషపడింది. 

పెరియవా మనల్ని వదిలి వెళ్లలేదని రథ యాత్రలో అక్కడున్న అందరికీ చెబుతోంది. మహాస్వామి వారిని సరిగ్గా అర్థం చేసుకున్నవారే ఇలా చెప్పగలరేమో! 

ఇప్పుడు ఈ రథ యాత్రలో స్వామివారే ఇక్కడకు వచ్చారు.

దాదాపు ఇరవైఏడేళ్ళ వయస్సున్న ఒక యువకుడు సంవత్సరం వయస్సున్న ఒక పిల్లాణ్ణి ఎత్తుకుని ఆమె పక్కన నిలబడి ఉన్నాడు. ఊర్లో దేవునికి పిల్లవాడి పుట్టువెంట్రుకలు ఇవ్వడానికి వచ్చాడు. ఆ యువకుడు అంజలై రెండవ కొడుకు, ఆ చిన్నపిల్లాడు ఆమె మనవడు.

“ఢిల్లీలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిత్వ కార్యాలయంలో అధికారిగా పని చేస్తున్నాను. మా బాబు తలనీలాలు సమర్పించడానికి ఇప్పుడు మా ఇలవేల్పు గుడికి వెళ్తున్నాము” అని ఇరవైఅయిదేళ్ళ క్రితం పరమాచార్య స్వామివారు మాట్లాడిన అంజలై రెండవ కుమారుడు అక్కడున్నవారితో చెబుతున్నాడు.

పరమాచార్య స్వామివారు ఆరోజు ఆ మాటలను అన్నప్పుడే ఢిల్లీలో అతని ఉద్యోగం నిర్ణయం అయిపోయింది. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. 

అంజలై అక్కడే ముకుళిత హస్తాలతో, కళ్ళ నీరు కారుస్తూ, పరమాచార్య స్వామివారి సరజ్ఞత్వాన్ని అర్థం చేసుకుని నిలబడిపోయింది. ✍️```
*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*
```
#KanchiParamacharyaVaibhavam # “కంచిపరమాచార్యవైభవం”🙏
.     సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

No comments:

Post a Comment