Sunday, July 13, 2025

 బేతపూడి( రేపల్లె) ప్రముఖులు  :
       .................................
 *చేయెత్తి*జైకొట్టు*తెలుగోడా* 

అనే గేయాన్ని రచించి తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయిన ప్రముఖ కమ్యూనిష్ఠు నేత, శాసనసభ్యులు, కవి వేములపల్లి శ్రీకృష్ణ (1917 - 2000), ఈ గ్రామంలోనే జన్మించారు.
"డాక్టర్ కుడితిపూడి శ్రీరామకృష్ణయ్య" 1926 మార్చి 3వ తేదీన  బేతపూడి గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక, ఉన్నత, కళాశాల విద్యలను గుంటూరు జిల్లాలో పూర్తి చేసుకొని, 1949లో అన్నాదురై విశ్వవిద్యాలయం నుండి బి. ఎ (సివిల్) ఇంజనీరింగు డిగ్రీని పొంది, రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖలో వివిధ హోదాలలో 34 సంవత్సరాలు పనిచేసి 1983లో పదవీ విరమణ చేశారు. పదవీ విరమణానంతరం కూడా ఆయన విశిష్ట సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయనను 'ప్రత్యేక విధుల నిర్వహణాధికారి'గా నియమించి తెలుగుగంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బాధ్యతలను అప్పగించింది. 1984-90 సంవత్సరాల మధ్యకాలంలో వారు ఆ పదవిని ప్రతిభావంతంగా నిర్వహించి, ప్రజల మన్ననలను పొందారు.
1986లో గోదావరికి ఉధృతంగా వరదలొచ్చి, తీవ్రంగా దెబ్బతిన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని సాగునీటి వ్యవస్థ పునర్నిర్మాణ కార్యక్రమంలో ఆయన యొనర్చిన సేవలెంతో శ్లాఘనీయం, కోస్తా జిల్లాల మురుగు నీటి సమస్యను నిశితంగా పరిశీలించి, ప్రభుత్వానికి పరిష్కార మార్గాలను సూచిస్తూ ఒక సవివరమైన నివేదికను అందజేశారు. 1989లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారకరామారావు గారికి నీటిపారుదల సలహాదారుగా నియమించబడి, ఆయన మన్ననలను పొందారు. 1990-92ల మధ్యకాలంలో భారత ప్రభుత్వ అటవీ, పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో, నదీలోయ ప్రాజెక్టులకు సంబంధించి, "ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ కమిటీ"లో సభ్యుడిగా పనిచేశారు. 1995లో కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల డ్రైనేజీ బోర్డు చైర్మన్ గా పనిచేసి, మురుగు నివారణకు ఎన్నో సూచనలిచ్చారు. 1997-98 నుండి 2002 మార్చి 20వ తేదీన కాలధర్మం చెందేవరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం సభ్యుడిగా పనిచేశారు
సాధించిన ఘనకార్యాలు :

తుంగభద్ర ప్రాజెక్టు ఎగువ కాలువ క్రింద పంట నమూనాలో మార్పులు చేసి, ఆహారోత్పత్తి గణనీయంగా పెంచటానికి విశేషకృషి చేశారు. సమతులన జలాశయాల ప్రక్రియను అమలులో పెడుతూ, సుబ్బరాయసాగర్ ముచ్చుకోట జలాశయాలకు రూపకల్పన చేశారు. అనంతపురము జిల్లా తాడిపత్రి తాలూకాలోని పంటభూమికి నేరుగా సాగునీటి నందించకుండా, ఊట కాలువల ద్వారా భూగర్భ జలాల్ని అభివృద్ధి చేసి, తద్వారా ఎత్తిపోతల పథకాల ద్వారా గణనీయమైన విస్తీర్ణంలో ఆయకట్టు అభివృద్ధికి తోడ్పడ్డారు. తుంగభద్ర ఎగువ కాలువ పధకం క్రింద అదనంగా ఒక లక్ష ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించటానికి 10.7 టి.ఎం.సి.ల నిల్వ సామర్థ్యంతో పెన్నా-అహోబిలం సమతులన జలాశయానికి రూపకల్పన చేశారు.
అనంతపురం పట్టణానికి, 729 గ్రామంలో శివారు గ్రామాలకు త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. అనావృష్టి ప్రాంతాలైన కడప, నెల్లూరు జిల్లాలకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించటానికి, 'గాలేరు-నగరి - సుజల స్రవంతి' పథకానికి రూపకల్పన చేశారు.

(నీటిపారుదల శాఖ నిపుణులు చెరుకూరి వీరయ్య గారి జ్ఞాపకాల్లో నుంచీ సేకరణ)

దొడ్డపనేని ప్రసాద్

No comments:

Post a Comment