*విశ్రాంత జీవనం*
*రచన - విజయారావు*
🌷"బజారుకు వెళ్లి కూరగాయలు కొంచం తీసుకుని రాగలరా?" కాఫీ కప్పు అందిస్తూ శ్రీమతి అడిగింది.
చూసే వారికి అది అభ్యర్థనలా కనిపించినా, అది ఆజ్ఞాపనే అన్న విషయం నాకు మాత్రమే తెలుసు.
"ఇవ్వాళ మంగళవారం కదా? రైతు బజారు సెలవు" కాఫీ త్రాగుతూ ఎలా తప్పించుకుందామా అని ఆలోచిస్తున్న నా మెదడుకు జవాబు మెరుపులా స్ఫురించింది.
"🌷రైతు బజారుకు సెలవైతే ఇంకెక్కడా కూరగాయలు దొరకవా?" శ్రీమతి కంఠం లోని తీవ్రతను గమనించాక ...
🌷చేయగలిగినదేమీ లేనప్పుడు కొండవలస లక్ష్మణరావు గారు ఏదో సినిమాలో, ' అయితే వాకే ' అన్నట్లు "సరే, ఆ సంచులు ఇలా ఇవ్వు" అంటూ ముఖాన ఒక వెర్రి నవ్వు పులుముకుని అయిష్టంగానే ఒప్పుకున్నాను.
"బజారులో ఎవరితో పడితే వారితో హస్కు వేస్తూ కూర్చోకుండా కూరగాయలు తీసుకుని వెంటనే ఇంటికి వచ్చేయండి. మీరు తెచ్చే కూరగాయలు చూసి వంట మొదలు పెడతాను" రెండు సంచులను అందిస్తూ కర్తవ్యాన్ని బోధించింది శ్రీమతి.
"ఇలా వెళ్ళి , అలా వచ్చేస్తాను, చూస్తూ ఉండు" అని లేని హుషారు తెచ్చుకుని బజారుకు బయలుదేరాను.
🌷ఆరు పదులు వయసు దాటినా కూడా కూరగాయలను ఎంచలేని నా అసమర్థతను శ్రీమతి ఎత్తి చూపి, ఎగతాళి చేస్తుందనే భయంతో, వీలున్నంత వరకు కూరగాయల బజారుకు ఒంటరిగా వెళ్లడానికి ఎప్పుడూ నేను సాహసించను. తప్పని సరై ఒంటరిగా బజారుకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తే మాత్రం ముందు బజారు అంతా ఒకసారి కలియ తిరిగి, కూరగాయలను ఎవరెవరు బాగా ఎంచి కొంటున్నారని అనిపిస్తుందో గమనించుకుని, వాళ్లను అనుసరించి, వాళ్ళు కొనుక్కునే కూరగాయలనే నేను కూడా కొంటూ ఉంటాను. మొత్తం మీద ఎలాగో ఒకలాగ తెచ్చుకున్న రెండు సంచులను కూరగాయలతో నింపేయగలిగాను. బరువయిన ఆ సంచులను జాగ్రత్తగా స్కూటర్ కి తగిలిస్తుండగా ...
"🌷ఎలా ఉన్నావ్?" ప్రశ్న వినిపించి వెనుకకు తిరిగి చూసాను. నాతో పాటే రిటైర్ అయిన ప్రసాద్ కనిపించాడు. మనిషి కొంచం చిక్కిపోయి ఉన్నాడు. అతను కూడా కూరగాయలు కొనడం పూర్తి చేసుకుని మోటార్ సైకిల్ తీయడానికి సిద్ధమవుతున్నాడు.
"బాగానే ఉన్నాను. సిగ్గు, పౌరుషం, ఆత్మాభిమానం అనే మాటలు మరచిపోయిన దగ్గర నుండి జీవితం చాలా ప్రశాంతంగా ఉంది" నవ్వుతూ జవాబిచ్చాను.
"🌷భలే మాట్లాడుతావ్ నువ్వు. పద, అలా కాఫీ త్రాగుతూ కబుర్లు చెప్పుకుందాం" అంటూ ప్రసాద్ కూడా మనస్పూర్తిగా నవ్వాడు.
ఇద్దరమూ కలిసి పక్కనే ఉన్న కాఫీ స్టాల్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాము.
"సర్వీస్ లో ఉన్నప్పుడు ఒకరితో మాట పడాలంటే మనస్సు ఒప్పుకునేది కాదు. రిటైర్ అయిపోయిన తరువాత ఏదీ పట్టించుకోకుండా ఉంటేనే ప్రశాంతంగా జీవించగలమని జ్ఞానోదయం అయ్యింది" మళ్ళీ నవ్వాను.
🌷"అదృష్టవంతుడివి, సమయానుకూలంగా నీ మైండ్ సెట్ ను మార్చుకోగలిగేవు. మనస్తత్వాన్ని మార్చుకోలేని నా లాంటి వారు ఇప్పుడు ప్రతి విషయం లోనూ మనస్తాపానికి గురి కావలసి వస్తుంది" ప్రసాద్ గొంతులో బాధను గమనించాను.
🌷"ఈ వయసులో ఆర్థిక భద్రతతో పాటు మనశ్శాంతి, ఆరోగ్యము కూడా మనకు చాలా ముఖ్యము" గీతోపదేశం చేస్తున్న ఫీలింగ్ పెట్టాను.
"ఏం చేస్తాం చెప్పు. రిటైర్ అయిపోయిన తరువాత ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతూ ప్రతి విషయమూ పట్టించుకోవడంతో, ఉద్రేకాలు వాటంతట అవే పెరిగి పోతున్నాయి" అంటూ నవ్వాడు ప్రసాద్.
"ఉద్యోగం చేస్తున్నన్ని రోజులూ ఆందోళనకు గురయ్యి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాము. ఇప్పుడు కూడా ఆందోళన చెందడం ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు"
"🌷ఇష్టానుసారం ఇంట్లో వాళ్ళు ప్రవర్తిస్తుంటే వాళ్లను నియంత్రించే ప్రక్రియలో వాళ్లనుండి వస్తున్న తీవ్ర ప్రతిఘటనలను జీర్ణించుకోలేక మనస్తాపానికి తరచూ గురి కావలసి వస్తుంది" ముఖ్య కారణం వివరించాడు ప్రసాద్.
"🌷మంచి, చెడూ, వివరించడం వరకే ఇంటి పెద్దగా మన బాధ్యత. పిల్లలు పెద్దవాళ్ళైపోయారు, వాళ్ళను ఇంకా మన కట్టు దిట్టాలలో ఉంచాలని అనుకోవడం అవివేకం. నెమ్మ నెమ్మదిగా వాళ్ళే అన్నీ నేర్చుకుంటారు" ఒక విధమైన నిర్లిప్తతతో చెప్పాను.
"అనుభవాలే పాఠాలు నేర్పుతాయని ఊరుకుంటే ఈ లోపల జరుగవలసిన నష్టం జరిగిపోతుంది కదా?" సందేహం వెలిబుచ్చాడు ప్రసాద్.
"నిజమే! ఇంట్లో వాళ్ళు చేయబోయే పనుల వలన కుటుంబానికి ఏ విధమైన నష్టమూ కలుగకూడదనే ఆంక్షను విధించి కొన్ని జాగ్రత్తలు చెప్పడం అవసరమే" స్నేహితుని అభిప్రాయాన్ని నేనూ బలపరిచాను.
"🌷నిన్న మొన్నటి దాకా ఏ విషయంలో నైనా నన్ను సంప్రదించి నా సలహాలు, సూచనలు తీసుకోకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయని నా కుటుంబ సభ్యులు, నేను రిటైర్ అయిన తరువాత నుండీ ఏం చెప్పినా, 'అబ్బా ఊరుకోండి, మీకేం తెలియదు' అనే కొత్త పల్లవిని ఎత్తుకోవడం మొదలు పెట్టారు. నా మేధస్సు , నా ఆలోచనా విధానం మీద అంతవరకూ వాళ్ళకున్న నమ్మకం ఒక్కసారిగా ఏమైపోయిందో అనే అనుమానం నా మెదడును ఇప్పటికీ దొలుస్తూనే ఉంది" స్నేహితుని మాటలలో తనకు అంతకు ముందు ఇంట్లో వాళ్ళు ఇచ్చిన గౌరవం ఇప్పుడు ఇవ్వడం లేదనే భావం తొంగి చూసింది.
"🌷ఈ వయసులో నిన్ను ఇబ్బంది పెట్టకుండా మీ ఇంట్లో వాళ్ళు తమ నిర్ణయాలను తామే స్వతంత్రంగా తీసుకోగలుగుతున్నారంటే నువ్వు ఆనందించాలి. ఎల్ల వేళలా మన వారిని మనము కాపు కాస్తూ ఉండలేము. అలాగే మన వాళ్ళు కూడా ఎప్పుడూ మన మీద ఆధారపడి జీవించి ఉండడం మంచిది కాదు. మీ ఇంట్లో వాళ్ళ ప్రవర్తనలలో వచ్చిన మార్పు వలన నీ మెదడుకు విశ్రాంతి దొరికి తద్వారా నీ ఆరోగ్యం కూడా కొంత బాగుపడే అవకాశం ఉంది" మరక కూడా ఒకందుకు మంచిదే అన్న ప్రకటనను గుర్తు చేసుకుని చెప్పాను.
🌷"అయితే నేనిప్పుడు ఏం చేయాలంటావ్?" ఆత్రుతగా అడిగాడు ప్రసాద్.
"నేటి రోజులలో మన ఆరోగ్యాన్ని పరిరక్షించు కోవడానికి మనమే బాధ్యతలకు ఒక గీత గీసుకుని, వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి, ఎవరి విషయాలలోనూ జోక్యం చేసుకోకుండా జీవించగలిగితే మంచిది. అలా చేయడం వలన మనము దగ్గర లేకపోయినా మనవాళ్ళెలా జీవించగలుగుతారో మనకు తెలిసే అవకాశం దొరుకుతుంది. మన ప్రమేయం లేకపోయినా మన వాళ్ళు తమ జీవితాలను సరైన పద్ధతిలో జీవిస్తుంటే ఆనందించాలి. ఒక వేళ వాళ్ళు ఇబ్బందుల పాలైతే వాళ్లకు సహాయం చేసి మన అవసరం వాళ్ళకుందనే సత్యాన్ని తెలియపరచాలి" నా మనసుకు తోచిన సలహా స్నేహితునికి ఇచ్చాను.
"🌷నీ ఆలోచన బాగుంది. ఎప్పటి నుండో నా శ్రీమతి పుణ్య క్షేత్రాలు తిరిగి వద్దామని కోరుతుంది. కొన్నాళ్ళ పాటు మేము అలా ఊర్లన్నీ తిరిగి వస్తాము" ఆనందంగా చెప్పాడు ప్రసాద్.
చాలా కాలం తరువాత మిత్రులిద్దరమూ కలుసుకుని మనసు విప్పి మాట్లాడుకోవడం వలన సమయం గమనించుకోలేదు. చేతి గడియారం చూసుకుంటే బజారుకు వచ్చి అప్పుడే రెండు గంటలు దాటిపోయినట్లు అర్థమయ్యింది. ఇంటికి వెళ్ళిన తరువాత శ్రీమతి చదవబోయే తిట్ల దండకం గుర్తొచ్చి స్నేహితునికి వీడ్కోలు పలికి గబ గబా స్కూటర్ స్టార్ట్ చేసాను.
"ఇలా వెళ్ళి అలా రావడం అంటే రెండు గంటల సమయం అని అర్థమా?" ఇంటి గుమ్మంలోనే ఉరిమింది ఇంటి ఇల్లాలు.
మల్లేష్ రావు,
జగ్గంపేట.
No comments:
Post a Comment