*@ రాదు..కాదు..లేదు..@30
తేది: 13/07/2025
""""""""""""""""""""""""""""""""""""
"రాదు.... కాదు... లేదు... అన్న మాటలు నా డిక్షనరీలో
లేవు తన కుడిచేతి వేళ్లను ఉత్తుత్తి తుపాకీలా మడిచి,
గిరగిరా తిప్పి, కణతకు ఆనించి, రజినీకాంత్ స్టయిల్లో గాల్లోకి
శాల్యూట్ కొడుతూ అంటున్నాడొక విద్యార్థి ఇది ఆబడిలో
పిల్లల సరదా ఆట...
టీచర్ పనిగట్టుకుని వాళ్లకది నేర్పించింది
ఎందుకంటే... అదొక ముఖ్యమైన పాఠం మరి
'నాకు రాదు. నాకు వీలు కాదు. నాకు టైం లేదు'...
ఎంత సునాయాసంగా అనేస్తుంటామో ఈ మాటల్ని. 'రాదన్న
పని రాజా పని' అని నానుడి. ఇక, అవునంటే కాదనడంలోని
మజానే వేరు. ఉందని ఊబిలో పడడం కన్నా, లేదని
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అని మురిసిపోయే వాళ్ల
సంగతి సరేసరి. 'లేకపోతే, వచ్చని చెప్పి గంపెడు పనిని
నెత్తికెత్తుకుంటామా?' అని లౌక్యం ఒలకబోసే వారి గురించి
చెప్పేదేముంది? పని తప్పించుకోవడానికి చెప్పే సాకులది
ఒకరకం అయితే, 'నాకు ఎప్పటికీ రాదు. నావల్ల కాదు. నేను
చేయలేను' అనుకుంటూ మనల్ని మనం కన్విన్స్
చేసుకుంటామే, అదే అసలు ప్రమాదం... కుంగుబాటుకు,
నిరాశా నిస్పృహలకు మూలం. కొత్త విషయాలు
నేర్చుకోవాలన్నా, కొత్తపని చేపట్టాలన్నా 'నాకెందుకు రాదు?
నావల్ల ఎందుకు కాదు? నేనెందుకు చేయలేను? అని
ప్రశ్నించుకోవడం అత్యవసరం. సరిగ్గా అలాంటప్పుడే జూడీ
గార్లాండ్ పాట గుర్తొస్తుంది.
'ఎక్కడో ఇంద్రధనుసుకు ఆవలగా నీలిపిట్టలు
ఎగురుతున్నాయి. కువకువలాడే నీలిపిట్టలు ఇంద్రధనుసును
దాటి పైకెగిరిపోతున్నాయి. మరి, నేనెందుకని? ఓ!
నేనెందుకని ఎగరలేను?'
'వై కాంట్ ఐ?' అన్న చిన్నారి డొరోతీ ప్రశ్న అందించిన
స్ఫూర్తి, ఆ పాటని మిలీనియం గీతంగా మార్చింది. స్ఫూర్తి
ఎక్కడో కాదు, మన చుట్టూనే ఉంటుంది. మనం
గ్రహించాలంతే. అది ఎగిరే నీలిపిట్ట కావచ్చు, తాను నేసిన
పట్టుదారాలు మీదనే, పదే పదే జారిపడే సాలీడు కావచ్చు.
స్కాటిష్ యోధుడు కింగ్ బ్రూస్ గురించి విన్నారా? స్వేచ్ఛా
పోరాటంలో ఆరుసార్లు ప్రయత్నించి, ఓడిపోయి, నిరాశా
నిస్పృహలతో కుంగిపోయి, ఒక పాడుబడ్డ గుడిసెలో దాక్కుని
ఉంటాడు. అక్కడ ఒక సాలీడు పైకి ఎగబాకడానికి ఆరుసార్లు
ప్రయత్నించి, విఫలమై, మళ్లీ ఏడోసారి ప్రయత్నిస్తుంది.
గమ్యం చేరుకుంటుంది. 'సాలీడు పాటి పట్టుదల నాకు
లేదా?' అనుకున్న కింగ్ బ్రూస్ శక్తులన్నీ కూడగట్టుకుని
ప్రయత్నిస్తాడు విజయం సాధిస్తాడు...
'మొదటిసారి
గెలవలేకపోతే మళ్లీ మళ్లీ ప్రయత్నించు' అన్న హితోక్తి
అప్పుడే పుట్టింది
'ట్రయల్ అండ్ ఎర్రర్' అన్నది మానవాళి
మనుగడకే మూలసూత్రం అదే లేకపోతే మానవ పురోగతి
సాధ్యమయ్యేదేనా?
అందుకే, ఒకసారి విఫలమైనా ప్రయత్నించండి. మళ్లీ
ప్రయత్నించండి. స్ఫూర్తి, ప్రేరణ మన చుట్టూ ఉన్నంతగా,
మనలోనూ ఉంటాయి. అందుకు అడ్డుపడే
'రాదు, కాదు,లేదు'
లాంటి మాటలను తీసి, చుట్టచుట్టి,
ఏబంగాళాఖాతం లోకో విసిరికొట్టండి...!*
No comments:
Post a Comment