Monday, July 14, 2025

 2️⃣
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రామకథా రసవాహిని*


       *1.2. శ్రీరామతత్త్వము* 
                ➖➖➖✍️
```
ఒకానొక సమయమున పరీక్షిత్ మహారాజు శుకునకు నమస్కరించి, "స్వామీ! చాలాకాలమునుండియు నన్నొక సంశయము పీడించుచున్నది. దానిని తమరు తప్ప అన్యులు తీర్చలేరనియును నాకు తెలియును. తమరు వేరుగా తలంచక, ఈ దాసుని సంశయమును నిర్మూలము గావించుడు. అది యేమన, నేను మా వంశీయులలో ప్రప్రథమ నాయకుడైన మనువు మొదలు నేటి మా తాత తండ్రుల చరిత్రల వరకునూ వింటిని, పఠించితిని. ఎవరి చరిత్రలయందు చూచినను ఏదో ఒక మహర్షి రాజుల నాశ్రయించి యుండుటయును, మహాజ్ఞానవృద్ధులైన పండితులు రాజాజ్ఞలలో వారల దర్బారులలో కూడి యుండుటయును చేరియుండును. సర్వసంగపరిత్యాగులైన ఋషులును, లోకము మిథ్యము, బ్రహ్మసత్యమని గుర్తించిన పండితులును, రాజుల నాయించియుండుటలోగల అంతరార్థమేమియో! కారణము లేని కార్యము పెద్దలు తలంచరు, చరించరు. కాన, ఈ సంశయమును తీర్చి నన్ను ధన్యుని గావింపుమ”నగా, శుకులు నవ్వి, “రాజా! సరియైన ప్రశ్న గావించితివి. వినుము. మహనీయులైన ఋషులు, పవిత్రులైన పండితులు, నిజమైన లోకపాలకులు తాము గ్రహించిన సత్యములను, ఆచరించిన పవిత్ర కర్మలను, అందుకొన్న దైవానుగ్రహమును తోటి మానవుల కందించి లోక సుఖశాంతులు చేకూర్చవలెనను వాంఛతో పరిపాలనా దక్షులగు రాజులచెంత చేరి రాజుల కిట్టి ఉత్తమ మార్గముల చిత్తములందు చేర్చి శాసనరీతిగా జనరంజక మగు ధర్మకర్మలను నియమించుచుండిరి. ఆనాటి రాజులే మహాఋషులను ఆహ్వానించి, పండితులను పిలిపించి, రాజనీతిని తెలుసుకొని దానికి తగినట్లు శాసనములు నియమించెడివారు. ప్రజలకు ప్రభువే ప్రధాన రక్షకు డగుటచే ప్రభువు సర్వసుగుణ సంపన్నుడై సర్వధర్మ పరాయణుడై, సమస్త విద్యా పారంగతుడై యుండి ప్రజలయొక్క యోగక్షేమములను, పరిపాలనా విధానమును సక్రమమైన మార్గమున సలుపగలరనియును లోక సుఖ శాంతులనాశించి, "లోకాః సమస్తాః సుఖినో భవంతు" అను లక్ష్యముతో రాజులను చేరెడివారు. ఇంతియేకాదు. జనసుఖదాయకుడు, గోలోకవాసుడు అగు శ్రీమన్నారాయణుడు రాజవంశములందు జన్మించునను వార్త వేదశాస్త్రములందు సూచించుటచే, భగవద్దర్శనార్థమై అప్పటికప్పుడు రాజులను చేరుటకు వీలుగా నుండదనియును, చేరిననూ దైవానందమును మనసారా అనుభవించ సాధ్యముకాదనియును ఆలోచించి, కొందరు దివ్యదృష్టిగల మహనీయులు ముందుగానే ఆయా రాజుల కొలువు కూటములచేరి దైవరాకకై తపించుచుందురు. అట్టివారే వసిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, గర్గ, అగస్త్య ఇత్యాది మహర్షులు. వీరలకేమి కొదువ?! తగులు, విరాగులు అయిన ఈ ఋషులు రాజులచెంత చేరి వ్యర్థ ప్రసంగములు గావించుటకై వారి కొలువుకూటముల చేరలేదు. లేదా, వారి కానుక లందుకొనుటకుకానీ, తలభారపు బిరుదులను తగిలించుకొనుటకుకానీ, ప్రభువులను చేరలేదు. విశ్వనాథుని దర్శనమునకును, ధర్మరక్షణ దీక్షకును లోకపాలురను చేరిరి. వేరు కారణము లేవియును లేవు. ఆనాటి రాజులుకూడను దైవచింతనాతత్పరులై, ప్రజాపరిపాలనకు తగిన మార్గములను పండితులవలనను, ఋషులవలనను తెలిసికొని తమకు తామే ఆశ్రమములకు వెళ్లుటయో, లేదా వారలను రాజభవనములకు రప్పించుటయో జరిపించి, ఆలోచించెడివారు. ఆనాడు స్వార్థరహితులగు ఋషులు, అధికార వాంఛరహితులగు పండితులు రాజులకు సలహాదారులుగా నుండుటచే ఆనాడు తిండి గుడ్డలకుకానీ, తీర్థ గృహములకుకానీ, ఎట్టి కొరతయూ లేక, నిత్య కల్యాణము పచ్చతోరణములతో ప్రజాక్షేమమే ప్రభువు దేహముగను, ప్రభువే ప్రజల గుండెగను తలంచి, స్మరించి, వారించి, తరించిరి” అని శుకులు మహర్షుల చర్యలను, వాంఛలను నిర్ద్వంద్వముగ నిండుసభలో గంటవలె మ్రోయించెను. చూచితిరా! మహనీయులు ఏ పని చేసినను, ఎవరితో చేరినను లక్ష్యము దైవతత్త్వముపై నుండుటచే సర్వకర్మలు, ధర్మరూపమును ధరించి, లోకమును ఉద్దరించెను; పారాయణములు సలుపువేళ, పఠనము గావించువేళ, లక్ష్యమును దైవభావమున చేర్చి, కథలోని వంకరలను వంటిలోనికి చేర్చక, నిశ్చల నిష్ఠతో, నీతి నిజాయతీలను మదియందుంచి కర్తవ్యమును నిర్వర్తించవలెను.

ధర్మసంరక్షణార్ధమై అవతరించు దైవము, సమస్త ప్రాకృత లీలలను సాధారణ మానవునివలె చేయుచుండును, చేయవలెను. కారణము - ఆదర్శము నందించుటకు, అనుభూతులు కలిగించుటకు. లీలలు చూచుటకు సామాన్యమైనటువంటివిగా కంటికి కనిపించినను అందులోని రసము, సరసము, సౌందర్యము, పుష్టి విశ్వమును మోహింపజేయును. హృదయముల పరిశుద్ధపరచును. మనసులు మరపించును, మధురత్వమును అందించును. ప్రాకృతములుగా కనిపించు తన లీలలన్నియును అప్రాకృతములే, మాననీయములే, దివ్యములే, రామచరిత్ర వ్యక్తి చరిత్ర కాదు, విశ్వచరిత్రమనియే చెప్పవచ్చును. రాముడు సమష్టిస్వరూపుడు, సర్వవ్యాపకుడు. రామచరిత్ర కొంతకాలము మాత్రమే జరిగెనని తలంచరాదు. ఆద్యంతరహితమయిన చరిత్ర. రామేచ్చ లేక చీమైనను కుట్టదు, ఆకైనను రాలదు. ప్రకృతియందలి పంచ భూతములు రామేచ్ఛవలననే, తమతమ కర్తవ్యములను నిర్వర్తించుచున్నవి. దృక్ గోచరమగు సమస్త వస్తు జాలములందు గల ఆకర్షణ శక్తియే ఆ రామచంద్రుడు. ప్రకృతి ఆకర్షణచేతనే లోకము జరుగుచున్నది. ఆకర్షణే లేకున్న ప్రకృతే లేదు. అనగా రాముడు లేకున్న లోకమే లేదు.✍️```
     
🙏 *శ్రీ రామ రక్ష సర్వజగద్రక్ష*

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment