*_సాహిత్య మరమరాలు_*
=================
*సంస్కృత మహాకావ్యాలకు వ్యాఖ్యానం రచించిన మల్లినాథ సూరి గారి తండ్రేమో మహా పండితుడు. కానీ. ఈయన కుమారుడైన మల్లినాథ సూరికి మాత్రం విద్యాగంధం అబ్బలేదట. పెళ్లయ్యాక ఆయన జీవితం మారిపోయింది. ఓరోజు అత్తారింటికి వెళ్తే, పూజకు పూలు తెమ్మని కోరింది భార్య. ఎర్రగా మెరుస్తున్న మోదుగుపూలను తెచ్చాడు. ఈయనకు శాస్త్రజ్ఞానం లేదని గ్రహించి, ఈ శ్లోకం చెప్పింది భార్య..*
*_రూప యౌవన సంపన్నా, విశాల కులసంభవా_*
*_విద్యావిహీన శోభంతే, పాలాశ కుసుమం వృథా!_*
_(ఇదేమిటో సూరికి అర్థం కాలేదు. కానీ అసాధారణ ధారణ వల్ల పాదాలు గుర్తుపెట్టుకుని, ఊళ్లోని మరో పండితుడిని అర్థమడిగాడు. *‘అందము, యౌవనము కలిగి ఎంత మంచి వంశంలో జన్మించినా, విద్య లేకపోతే శోభించడనీ, అలాంటివాడు పూజకు పనికిరాని మోదుగుపువ్వు లాంటివాడనీ* అర్థం చెప్పాడాయన._
*తనకు చదువు లేదని భార్య ఎత్తిపొడిచిందని అర్థం చేసుకున్న సూరి ఎవరికీ చెప్పకుండా కాశీకి వెళ్లిపోయి, పన్నెండు సంవత్సరాల పాటు చదువుకుని, తిరిగి అత్తగారింటికి వచ్చి, వారి అరుగు మీద కూర్చున్నాడు. ఎవరో యాత్రికుడనుకుని ఇంట్లోకి భోజనానికి పిలిచారు. భార్యే వడ్డించింది. చారులో ఉప్పు లేదు. అప్పుడు సూరి–-*
*_చారు చారు సమాయుక్తం హింగు జీర సమన్వితం_*
*_లవణ హీన నరుచ్యంతే పాలాశ కుసుమం వృథా_*
_(చారు ఎంత కంటిగింపుగా ఉన్నా, ఇంగువా జీలకర్రా వేసినా, ఉప్పు లేకపోతే రుచిగా ఉండదు. అది పనికి రాని మోదుగు పువ్వుతో సమానం)_
*అని శ్లోకం చెప్పగానే.. _‘పాలాశ కుసుమం వృథా’_ మాట ఎక్కడో విన్నట్టుగా ఉందే అని ఆయన ముఖం వంక తేరిపార జూసి, అతిథి భర్తే అని గ్రహించి, మహాపండితుడై తిరిగి వచ్చినందుకు ఆమె పరమానంద పడిందని ఈ కథా సారాంశం.*
~~~~~~~~~~~~~~~
*_{ఫేస్బుక్ నుంచి సేకరణ: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా🙏}_*
No comments:
Post a Comment