Tuesday, July 15, 2025

 *మానవ శరీరంలా మృదువుగా- మనిషిలానే దేవుడికి విగ్రహానికీ చెమటలు!... అంతు చిక్కని రహస్యాలకు నిలయమైన ఈ నరసింహుని ఆలయం ఎక్కడుందో తెలుసా?*

*హిరణ్యకశిపుడిని సంహరించడానికి నరసింహస్వామి స్తంభంలో నుంచి ఉద్భవించాడు. క్రూరుడైన హిరణ్యకశిపుడి వంటి రాక్షసుడికే నరసింహస్వామిని చూసి గుండె ఆగిపోయినంత పనైంది. ఇక భక్తుడైన ప్రహ్లాదుడికి కూడా భయంతో ఒళ్లంతా చెమటలు పట్టాయి. అలాంటి స్వామి ఇక్కడ విగ్రహరూపంలో ఉన్నప్పటికీ నేరుగా ఆయన్ని చూడటానికి కొంతమంది జంకుతుంటారు. బహుశా అందుకేనేమో ఈ ఆలయంలో స్వామివారిని భక్తులు ఉదయం వేళలో మాత్రమే దర్శించుకుంటూ ఉంటారు. ఆ ఆలయం ఎక్కడుందో, ఆ విశేషాలేమిటో ఈ కథనంలో చూద్దాం.*

*మల్లూరు శ్రీ నరసింహ స్వామి దేవాలయం భారతదేశం ఎన్నో ఆలయాలకు, ఎన్నో అద్భుతాలకు ప్రసిద్ధిగాంచిన దేశం. అలాంటి ఆలయాలలో ముఖ్యంగా చెప్పుకోవలసిన ఆలయం మల్లూరు శ్రీ నరసింహ స్వామి దేవాలయం.*

*మల్లూరు శ్రీ నరసింహ స్వామి దేవాలయం ఎక్కడుంది? వరంగల్ జిల్లాలోని ఖమ్మం - భద్రాచలం రహదారికి సమీపంలో ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూరులో ఈ ప్రాచీన నరసింహుని ఆలయం వెలసి ఉంది. ఎన్నో అంతు చిక్కని రహస్యాలకు నిలయమైన ఈ ఆలయాన్ని హేమాచల నరసింహస్వామి ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు, మరెన్నో అంతు చిక్కని రహస్యాలు! అవేమిటో తెలుసుకోవాలంటే ఆలయ చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకోవాలి.*

*ఆలయ చరిత్ర అత్యంత ప్రాచీనమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి కొండపై వెలసి ఉన్నాడు. నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం ప్రసిద్ధి చెందింది.*

*ఆలయ స్థల పురాణం మల్లూరు నరసింహస్వామి ఆలయ చరిత్రను చూసినట్లయితే ఆరవ శతాబ్దానికి పూర్వం ఈ ఆలయంలో దేవతలే నరసింహ స్వామిని ప్రతిష్టించినట్లుగా చెబుతారు. అయితే ఆరవ శతాబ్దంలో దిలీప కులకర్ణి అనే మహారాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఇక్కడ తవ్వకాలు జరిపారు. ఆ సమయంలో స్వామి వారు దిలీప మహారాజుకు స్వప్నంలో కనిపించి తవ్వకాలు జరుపుతున్న సమయంలో గునపం తగిలి తన నాభి వద్ద గాయమైందని, భూమి లోపల ఉన్న తన విగ్రహాన్ని తీసి భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేయాలని సూచించడంతో దిలీప మహారాజు స్వామి వారి విగ్రహాన్ని బయటకు తీయించి ఆలయాన్ని నిర్మింపజేశారు. అప్పటి నుంచి మహా మహిమాన్వితమైన స్వామి వారు అందరితో పూజలు అందుకుంటూ వెలుగొందుతున్నారు.*

*స్వామివారిని చూడాలంటే ధైర్యం కావాల్సిందే! గర్భాలయంలో స్వామివారి మూర్తిని చూడాలంటే కాస్తంత గుండె ధైర్యం కావాల్సిందే! నరసింహ స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువైనట్టుగా చెబుతారు. అందుకు నిదర్శనంగా స్వామివారి ప్రతిమ మెత్తగా ఉంటుందని, మనం చూపుడువేలుతో విగ్రహం తాకితే, శరీరం లాగా సున్నితంగా లోపలికి వెళుతుందని అభిషేకం చేసే అర్చకులు చెబుతుంటారు. అలాగే స్వామివారి విగ్రహానికి చాతి పై వెంట్రుకలు కూడా ఉండడం చూడవచ్చు. నిత్యం స్వామివారిని నువ్వులనూనెతో అభిషేకించడం ఇక్కడి విశేషం.*

*నాభి నుంచి స్రవించే ద్రవం మనుషుల్లా స్వేదం! నరసింహస్వామి వారి విగ్రహానికి మనుషులకు వచ్చినట్టే చెమట కూడా వస్తుందట! అలాగే తవ్వకాలు జరిపినప్పుడు నరసింహ స్వామి వారి నాభి వద్ద గాయం కావడం వల్ల అందులో నుంచి ఒక ద్రవం ఎప్పుడూ స్రవిస్తూనే ఉంటుందంట! అయితే పూజారులు ఆ ద్రవం స్రవించకుండా చేయడానికి అక్కడ చందనం పెడతారు. ఈ చందనాన్ని ప్రతి శని, ఆది, సోమవారాలలో భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. సంతానం లేమితో బాధపడే వారికి ఈ చందనంతో సంతానం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.*

*చింతామణి జలధార ఇక్కడ నరసింహ స్వామివారి పాదాల నుంచి నిత్యం ఒక జలధార ప్రవహిస్తూ ఉంటుంది. దానినే చింతామణి జలధారగా పిలుస్తారు. చల్లగా ప్రవహించే ఔషధ గుణాలతో కలిసిన ఈ నీరు తాగిన వారికి ఎన్నో రోగాల నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రతీతి. అన్ని కాలాలలోనూ నిరంతరాయంగా ఈ చింతామణి జలధార ప్రవహిస్తుంది. రుద్రమదేవి ఒకసారి తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ చింతామణి జల ధార నీటిని తాగిందని, ఆ తర్వాత ఆమె అనారోగ్యం బారి నుంచి బయటపడిందని అంటారు.*

*విదేశాలకు కూడా! అనేక రోగాలను పోగొట్టే చింతామణి జలధార నీటిని భక్తులు విదేశాలలో ఉన్న తమ వారికి కూడా పంపిస్తూ ఉంటారు.*

*చీకటి పడితే భయమే! ఉదయమంతా భక్తులతో సందడిగా కనిపించే నరసింహుని కొండ పై భాగం, పొద్దుపోయిన తరువాత నిశ్శబ్దంగా మారిపోతుంది. ఆ సమయంలో కొండపైకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు. చీకటి పడిన తరువాత స్వామివారు కనిపించే తీరు వేరుగా ఉంటుందనీ, రాత్రి సమయాల్లో అప్పుడప్పుడు కొండపై నుంచి సింహ గర్జనలు వినిపిస్తూ ఉంటాయని స్థానికులు చెబుతుంటారు. సింహరూపంలో స్వామివారు అక్కడ తిరుగాడిన ఆనవాళ్లు కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు. ఈ కారణంగానే స్వామివారిని కేవలం ఉదయం వేళలో మాత్రమే దర్శించుకుంటూ ఉంటారు.*

*ఔషధాల నిలయం మల్లూరు ఆలయ పరిసరాలలోని అటవీ ప్రాంతంలో ఔషధ మొక్కల వనాన్ని పెంచుతున్నారు. నియమ నిష్ఠలతో స్వామివారిని సేవించాలేగాని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.*

*ప్రకృతి రమణీయతతో, ఎన్నో విశేషాలతో ఉన్న మల్లూరు ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శిద్దాం తరిద్దాం.*

*ఓం నమో నారసింహాయ నమః*

*ముఖ్య గమనిక :-*
*పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.*

*┈┉┅━❀꧁ హరే కృష్ణ ꧂❀━┅┉┈*
        *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🦚🛕🦚 🙏🕉️🙏 🦚🛕🦚

No comments:

Post a Comment