Monday, July 14, 2025

 శ్రీరామకృష్ణ పరమహంస ప్రత్యక్ష శిష్యులైన స్వామి శివానంద మహరాజ్ శిష్యులు స్వామి రంగనాథానంద మహరాజ్
రమణమహర్షి గురించి వివరించిన తీరు ..
1936 లో నేను ( స్వామి రంగనాథానంద )
మొదటిసారిగా రమణాశ్రమం వెళ్ళాను .
మహర్షిని చూడటంతోనే భాగవతంలో శుకమహర్షి గురించి విన్నాము ; ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము అని అనిపించింది . మహర్షి పట్ల మనకు మమకారం కలిగితేనే చాలు ; అదే మనలను విముక్తులను చేస్తుంది .
అరుణాచల జ్యోతి స్థంభానికి మొదలు చివరలు అంచనా వేయడం ఎంత కష్టమో మహర్షి విషయం కూడా అంతే . ఇందులో సందేహానికి తావులేదు . మహర్షిని ప్రత్యక్షంగా చూచినవారు ధన్యులు . మహర్షి స్పర్శ , చూపు వలన మనము ఉద్దరింపబడతాము . ఇక్కడికి చేరాము అంటే మనకి కూడా ఏదో కొంత దైవానుగ్రహం ఉన్నది అని అనిపిస్తుంది .
ఒంటరిగా కూర్చుని ఉన్నా , భక్తుల ఉత్తరాలు చూస్తున్నా , పేపరు చదుపుతున్నా , కూరలు తరుగుతున్నా మహర్షి ఎప్పుడూ ఆత్మనిష్ఠలో ఉండేవారు . " అహం బ్రహ్మాస్మి " అనే ఉపనిషత్ వాక్యానికి ప్రత్యక్షస్వరూపులు మహర్షే .
వివేక చూడామణిలో
శంకరాచార్యులవారు చెప్పినట్లు .....
" కడు నిరుపేద , కాని అనందభరితుడు ;
వెనుక ఏ బలగమూ లేదు , కాని అనంత శక్తిశాలి ; ఇంద్రియ సంబంధమైన సంతృప్తి లేదు , కానీ ఎప్పుడూ సంతోషభరితుడే ; అనన్యసామాన్యుడే కాని అందరూ తనకి సమానులే అనుకుంటాడు . "
ఆశ్రమానికి చేరిన తరువాత నేను అక్కడ మూడు రోజులు ఉండి , మూడవ రోజున రైలులో వెళ్ళిపోతానని వారికి చెప్పాను . కాని ఆ విషయమే మరచిపోయాను . సరియైన సమయానికి మహర్షి నానైపు చూచి
" నువ్వు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనది ,
నీ కోసం బండిని ఏర్పాటు చేసాము " అని సెలవిచ్చారు . మామూలు మనిషిలాగ మాట్లాడారు కాని ఎంత ఉత్కృష్టులు , మహోన్నతులు .
" శ్రీకృష్ణుని గురించి వినే కొద్దీ ఎలా వినాలనిపిస్తుందో మహర్షి గురించి వింటున్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది . " ఇలా మహర్షి గురించి ఎంతని చెప్పగలం .... ?
తరువాత స్వామి రంగనాథానంద మహరాజ్ శ్రీరామకృష్ణ మఠం 13 వ అధ్యక్షులుగా , మఠంలో మరో వివేకానందుడిగా పేరు పొందిన మహాత్ములు .
వీరి ఆధ్వర్యం మరియు కృషితోనే హైదరాబాద్ లోని శ్రీరామకృష్ణ మఠం సొంతభవనం , అందులోనే వివిధ విద్యాసంస్థలు మొదలగునవి ఏర్పడ్డాయి .
భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మవిభూషణ్ పురస్కారం వీరికి ప్రకటిస్తే , అది తమ శక్తి కాదని శ్రీరామకృష్ణుల శక్తిఅని అందువలన తాము ఆ అవార్డుకు అర్హులం కాదని సున్నితంగా తిరస్కరించారు .

No comments:

Post a Comment