Sunday, July 13, 2025

 *జిజ్ఞాసువుల ప్రశ్నలకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి సమాధానాలు:*


 *ప్ర : మంచి గురువును పొందడం ఎలా? శిష్యుడు గురువును పరీక్షించాలా?*  *గురువు శిష్యుని పరీక్షించాలా?*


 *జ:*   గురువును పరీక్షించగలిగే బుద్ధిశక్తి శిష్యుడికి ఉండడం సాధ్యం కాదు. గురువుల జ్ఞానం, ప్రవర్తన అంత తేలికగా అర్థం కాదు. పరీక్షించగలిగే తెలివే ఉంటే శిష్యుడు కాగలడా? 
ఏ కొద్దిమంది యోగ్యులైన వివేకవంతులు మాత్రమే, తమ విచక్షణతో సరియైన గురువును గ్రహించగలరు - స్వామి వివేకానంద వలె. కానీ గురువు మాత్రం శిష్యుని పరీక్షించాలి. మంత్ర గురువైనా, బ్రహ్మవిద్యా గురువైనా శిష్యుని స్థాయిని తెలుసుకొని,కుతూహలంతో ఆశ్రయించాడా, శ్రద్ధతో
నిష్కపటంగా ఉన్నాడా అనేది పరీక్షించాలి. ఇక, గురువు లభించాలంటే ఇష్టదైవాన్ని ప్రార్థించి, ధ్యానించి సరియైన గురువును ప్రసాదించమని వేడుకోవాలి. 
అదే  శిష్యుడి కర్తవ్యం. తనలో వినయం, నిష్కపటత్వం, ఉపదేశ నియమాలు పాటించడంలో
సంసిద్ధత వంటి శిష్య లక్షణాలు అలవరచుకోవాలి.
ఈశ్వరానుగ్రహం వల్లనే సద్గురువు లభిస్తాడు. అయితే గురువు శాస్త్రప్రమాణాలతో
బోధించేవాడు మాత్రమే కావాలి. ఇది శిష్యుడు ముందే గమనించుకోవాలి. ఎవరి బోధలో శాస్త్ర ప్రమాణం, తదను గుణవర్తన ఉంటాయో అతడే సరియైన గురువు.
 *'శ్రోత్రియం, బ్రహ్మనిష్ఠం'* అని ఉపనిషత్తు ఈ లక్షణాలనే ప్రకటించింది.
రోగి వైద్యుని ఎంచుకున్నట్లు శిష్యుడు కొంత అవగాహనతో 
గురువును పొందవచ్చు.


 *('ఋషిపీఠం' ప్రచురణ 'సమాధానమ్' పుస్తకం నుండి సేకరణ)*

No comments:

Post a Comment