Sunday, July 13, 2025

 *యోగా తో ఆరోగ్య యోగాన్ని సాధన పద్దతిద్వారా పొందవచ్చు*

అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగ సాధకులు శుభాకాంక్షలు.
ఒక రెండు మూడు నిమిషాలు సమయం వెచ్చించి ఈ సందేశం చదవండి

సనాతన ధర్మం లో మన ప్రాచీన శాస్త్రజ్ఞులైన ఋషులు, ప్రకృతి పై లోతైన పరిశోధనలతో పాటు మనిషి శరీరధర్మములను నిశితంగా గమనించి  ప్రతి మనిషీ నిత్యజీవితములో ఆరోగ్యంగా  ఉండటానికి ఒక సమగ్రమైన నిత్యజీవన విధానం నిర్దేశించినారు. 
అందులో భాగంగా, వారు మనకు అందించిన విజ్ఞానమే యోగ శాస్త్రము. 
యోగము అనగా కలయిక అని అర్ధము. శరీరము, మనస్సు మరియు ఆలోచనలనల కలయిక విధానమే యోగము. ఇది యమ, నియమ, ఆసన, ప్రాణాయామ  ప్రత్యాహార, ధ్యాన, ధారణ  సమాధి అనే ఎనిమిది పురోగమన విధానాలుగా వుంటుంది. ఇవన్నీ అష్టాంగ యోగములు గా కూడా చెప్పుకుంటాము. 
ఇందులో ప్రాధమిక యోగము యమము అయితే అత్యున్నతమైనది సమాధి యోగము. సమాధి స్థితి లో మనిషి జన్మ పరిపూర్ణమై సిద్ధి పొందటం జరుగుతుంది.  
మొదటి నాలుగు, అనగా “యమ, నియమ, ఆసన, ప్రాణాయామ” యోగ విధానాలు దైనందిన జీవితములో ప్రతి ఒక్కరూ అభ్యాసము చేయవలసినవి. వీటి సాధన వలన సాధకుడు మంచి ఆరోగ్యముతో, మంచి ఆలోచనలతో ఎల్లప్పుడూ సుఖంగా వుంటాడు. 
*వీటిలోని “ఆసన” మరియు “ప్రాణాయామ” యోగ విధానములే నేటి కాలములో ఒక చికిత్సా విధానంగా “యోగా” గా బహుళ ప్రచారం పొందుతున్నాయి.*
*యమము, నియమము* అనేవి పది సామాన్య ధర్మాలు, ప్రతి మనిషీ  పాటించవలసినవి.అవి: 
1. *అహింస:*. ఇతరులు నాకు ఏమి చేస్తే నా శరీరానికి, మనసుకు బాధ కలుగుతుందో అది నేను ఇతరుల పట్ల చేయకూడదు.
2. *సత్యవాదం:* అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం, అబద్ధాలు చెప్పకపోవడం. 
3. *అస్తేయం:* ఒకరి వస్తువు తీసుకోకూడదు. తనకు ఉన్నదానితో తృప్తిపడటం.
4. *బ్రహ్మచర్యం:* నిరంతరం జిజ్ఞాస తో కొత్త విషయాలు నేర్చుకుంటూ వుండాలి, పవిత్రమైన జీవితం గడపాలి, త్రికరణములు (మనోవాక్కాయకర్మలు ) శుద్ధిగా ఉంచుకోవాలి.
5. *అపరిగ్రహం:* ఎంత అవసరమో అంతే సంపాదించడం,లేదా ఇతరులనుండి వారి అనుమతితో తీసుకోవడం.
6. *శౌచం:* శారీరక, మానసిక పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను పాటించడం. శరీరము మాదిరే మనసును కూడా ఎల్లప్పుడు నిర్మలంగా శుభ్రంగా ఉంచుకోవడం.
7. *సంతోషము:* ఉన్నదానితో తృప్తిపడటం, అసూయ, ద్వేషము ఉండకూడదు.
8. *తపస్సు:* స్వీయ క్రమశిక్షణ, ప్రతి పనిని శ్రద్దగా ఏకాగ్రతతో, నిష్కామబుద్ధితో, కర్తృత్వ భావనలేకుండా చేయడం.
9. *స్వాధ్యాయము:* శాస్త్రములు చదువుతూఉండాలి. ఏదో ఒక ప్రయోజనకరమైన కొత్త విషయం నేర్చుకుంటూ ఉండాలి.
10. *సమర్పణ లేదా అంకితం:* చేసే ప్రతి పనీ భగవంతుడి దయ తోనే చేయగలిగాము అనుకోవాలి. అహంకారభావన వదిలివేయాలి.   
ఇవన్నీ పాటిస్తూ “ఆసనములు”, “ప్రాణాయామము” చేయువారే  ప్రాధమిక స్థాయి లో *యోగులు* అవుతారు. మంచి ఆరోగ్యముతో దీర్ఘాయుష్కులుగా వుంటారు. 
“ప్రత్యాహార” యోగమునుండి మిగిలిన యోగములు (అంటే ప్రత్యాహార, ధ్యాన,  ధారణ, సమాధి) అభ్యాసం చేస్తే ముక్తి సాధకులయ్యే *ఉన్నత స్థాయి* యోగులవుతారు.
అందరం - యోగశాస్త్ర విజ్ఞానం పెంచుకుందాం, పంచుకుందాం. 
యోగా చేద్దాం. ఆరోగ్యంగా ఉందాం - అని, ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భముగా ప్రతిజ్ఞ చేద్దాం. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా వుందాము.

No comments:

Post a Comment