*ధర్మో రక్షతి రక్షిత.....*
*"ధర్మో రక్షతి రక్షితః" అన్న నానుడి రామాయణంలోని ఒక శ్లోకంలోని పదం. మనుస్మృతిలో "ధర్మ ఏవహతో హన్తి ధర్మో రక్షతి రక్షితః" అని చెప్పారు. అంటే ధర్మం నాశనం చేసే వారిని అది నాశనం చేస్తుంది. రక్షించే వారిని అది రక్షిస్తుంది. ధర్మం సత్యం నాణేనికి బొమ్మ బొరుసు వంటివి. ధర్మం అంటే "ధ" అనే సంస్కృత ధాతువు నుండి వచ్చిన పదం. ధర్మం అంటే సత్కర్మల జ్ఞానం. ధర్మం అంటే నీతి, నైతికతతో జీవించడమే ధర్మం. ధర్మం సత్పురుషులను ఆశ్రయించే ఉంటుంది. విశ్వమును రక్షించేదే ధర్మం.*
*కృత యుగంలో ధర్మం నాలుగు పాదాలమీద, త్రేతా యుగంలో మూడు పాదాలు, ద్వాపర యుగంలో రెండు పాదాలు, కలియుగంలో ఒక పాదం మీద నడుస్తోంది అని పురాణాలు మహాభారతం చెపుతున్నాయి. నాలుగు పాదాలు అంటే ఏమిటి? అని ప్రశ్న తలెత్తుతుంది. సత్యం, దయ, తపస్సు దానం అనేవే నాలుగు పాదాలు. ఒకసారి పరీక్షిత్తు మహారాజు వేటకు* *వెళ్లిన సందర్భంలో, దూరంగా ఒక సంఘటన గోచరించింది. అప్పుడు ధర్మదేవత ఒంటి కాలుపై నడుస్తూంటే, కలి పురుషుడు వచ్చి కాలితో తన్నాడు. అప్పుడు ధర్మదేవత పడిపోయి రోదిస్తూ ఉంటే, భూమాత అక్కడికి వచ్చి "ధర్మ దేవత! ఎందుకు విచారిస్తున్నావు?" అని ప్రశ్నించింది. అప్పుడు ధర్మదేవత జరిగిన సంఘటన చెప్పింది. అంటే కలి ప్రభావం వల్ల మానవుల్లో ధర్మం నశించిపోతుంది! అని రాజు గ్రహించాడు. భాగవతం సప్తమ స్కంధంలో "సత్యము, దయ, శౌచము, శమము, క్షమ, దమము, భూత దయ" వంటి సుధర్మాలు మానవులకు సూచించ బడ్డాయి. కణాద మహర్షి "ధర్మము సర్వవిధాలుగా ఉన్నతిని కలుగచేస్తుందని, అదే మోక్షానికి తొలి మెట్టు" అని వ్యాఖ్యానించారు.*
*ఆశ్రమ ధర్మాలు:*
*ప్రతీవారు చతురాశ్రమ ధర్మాలు పాటించాల్సిందే.*
*1) బ్రహ్మ చర్యం:*
*వేదాధ్యయనం, గురువును ఆశ్రయించి జ్ఞానోపదేశం పొందడం, పెద్దలు చెప్పిన మాట వింటూ గౌరవించడం.*
*2) గృహస్థాశ్రమ ధర్మం:*
*అంటే ఏకపత్నీ వ్రతం, తల్లిదండ్రులు మీద దయతో ఉండడం సంతానాన్ని నైతికతతో, ధర్మబద్ధంగా పెంచడం.*
*3) వానప్రస్థానాశ్రమం:*
*భాధ్యతలు తీరిన తరువాత సత్కర్మలు ఆచరిస్తూ, నియమిత ఆహారం తీసుకొంటూ స్వార్థ చింతన వీడి, శక్తి మేరకు దానధర్మాలు చేస్తుండడం.*
*4) సన్యాసాశ్రమం:*
*వైరాగ్యంతో, అరిషడ్వర్గాలను వదిలించుకొని, సంసార తాపత్రయం లేకుండా దైవ చింతనతో శేష జీవితాన్ని ప్రశాంతంగా ఏ ఆశ్రమంలోనో గడపడం. గడచిన యుగాల్లో ఈ చతురాశ్రమ ధర్మాలు పాటించేవారు. ఈ కలియుగంలో తాపత్రయంతో, సంపాదనే ధ్యేయంగా ధర్మానికి తిలోదకాలు ఇస్తున్నారు. గృహస్థాశ్రమం స్వీకరించి మోక్షాన్ని పొందిన వారిలో అగస్త్యుడు, జరత్కారుడు, అత్రి వంటి మహర్షులు ఎందరో.*
*మనసుకు ప్రశాంతత కోసం:*
*ఒకసారి ధృతరాష్ట్రుడుకి ఎంతకీ నిద్రపట్టక, మనసు అల్లకల్లోలంగా ఉందని, విదురుడుని రప్పించి, విషయం చెప్పాడు. అప్పుడు విదురుడు బదులిస్తూ "మహారాజా! చోరులకు, కాముకులకు, అధర్మంగా ప్రవర్తించే వారికి ఇతరులను హింసించే వారికి, అసత్యాలు పలికే వారికి నిద్రపట్టక, మనసు నియంత్రణ ఉండదు." అని చెపుతూ "రాజా! ఆరోగ్యం, ఋణ బాధలు లేకపోవడం, దూర ప్రదేశాలకు వెళ్ళవలసిన పని లేకపోవడం, సత్పురుషుల సహవాసం, తన చేతిలోనే జీవనోపాధి, నిర్భయత్త్వంగా జీవించడం, ఈ ఆరు మానవులకు ఆరు సుఖాలు సుమా. ఇవి ధర్మం అనే ఆయుధాన్ని ధరించినప్పుడే సమకూరుతాయి. ధర్మాన్ని ఆశ్రం ఆశ్రయించిన వారికి ధనం, కీర్తి వంటి సంపదలు చేకూరుతాయి అంటూ ధర్మబోధ చేసాడు. చూసారా! మనం కూడా అధర్మంగా నడిస్తే కలిగే ఫలితం పొందే ఉన్నాం. కాబట్టి ఇకనుంచి ధర్మంగా జీవించాలనే ఆత్మవిశ్వాసంతో జీవిద్దాం.*
*┈┉━❀꧁గురుబ్యోనమః꧂❀━┉┈*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🦚📿🦚 🙏🕉️🙏 🦚📿🦚
No comments:
Post a Comment