Wednesday, July 9, 2025

 *యమగండం / బ్రహ్మ రాత ( జాతీయo వెనుక కథ)* - డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూల్
*****************************
పురాణాల ప్రకారం యముడు నరకలోకపు అధినేత. రాత రాసేది బ్రహ్మ అయితే ముగించాల్సింది యముడే. యముని చూపు పడిందంటే స్మశానం వాకిలి తెరుచుకున్నట్లే. యమలోకం మరణానంతర చిరునామా. అటువంటి యముడి ద్వారా వచ్చే గండాన్ని యమగండం అంటారు. నేరుగా చెప్పాలంటే వాడు రాజయినా పేదయినా, పండితుడయినా నిరక్షరాస్యుడయినా భూమ్మీద ఆ రోజుతో నూకలు చెల్లిపోయినట్లే.   
"యమపాశం ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. యమగండాన్ని దాటడం అసాధ్యం" అంటారు పెద్దలు. ఈ జాతీయం రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 
ఒకసారి యమధర్మరాజు మహావిష్ణువును చూడడానికి వైకుంఠం పోయాడంట. వైకుంఠానికి ముందున్న ఒక చెట్టు మీద ఒక చిన్న పిట్ట కూర్చుని కిచకిచలాడుతా ఉంది. యముడు పోతూ పోతూ ఆ పిట్టను చూసి ఆశ్చర్యంగా ఒక్క క్షణం ఆగి తనలో తాను నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. ఆ వైకుంఠ ద్వారం దగ్గరే విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు ఉన్నాడు. అతను యముడు ఆ చిన్న పిట్టను చూసి నవ్వుకోవడం గమనించాడు. యముని చూపు పడిందంటే ఎవరికైనా చావు తలుపు తట్టినట్లే కదా. దాంతో ఆ అమాయకమైన చిన్న పిట్టపై గరుత్మంతునికి జాలి కలిగింది. యముడు విష్ణుమూర్తిని కలసి తిరిగి వచ్చేలోపు ఆ పిట్టను అతనికి అందనంత దూరం తీసుకుపోయి దాచేయాలి అనుకున్నాడు. వెంటనే ఆ పిట్టని తీసుకొని గాలిలోకి ఎగిరాడు. తన శక్తినంతా ఉపయోగించి సర్రున తారాజువ్వలా దూసుకుపోయాడు. పావుగంటలో వంద కిలోమీటర్ల దూరం చేరుకున్నాడు. అక్కడ ఒక మర్రిచెట్టు ఉంది. భద్రంగా ఆ పిట్టను చెట్టు తొర్రలో ఎవరికీ కనపడకుండా దాచి మరలా అంతే వేగంతో దూసుకొని వచ్చి వైకుంఠ వాకిలి చేరుకున్నాడు. ఏమీ ఎరుగని అమాయకునిలా ఒకవైపు నిలబడి చూడసాగాడు. 
కాసేపటికి విష్ణుమూర్తిని దర్శించుకున్న యముడు తిరిగి బయటకు వచ్చాడు. చెట్టు వైపు చూశాడు. పక్షి ఎక్కడా కనపడలేదు. ఎక్కడికిపోయిందా అని పరిశీలనగా చూస్తున్న యముని దగ్గరికి గరుత్మంతుడు వచ్చాడు. "ఏమి స్వామీ ఏదో వెతుకుతా ఉన్నారు. ఏంది సంగతి" అన్నాడు చిరునవ్వుతో. 
"ఏమీ లేదు. ఇంతకుముందు ఇక్కడ ఒక చిన్న పిట్ట ఉండింది కదా. అది ఇప్పుడు కనపడడం లేదు. ఎక్కడికి పోయిందా" అని చూస్తున్నా అన్నాడు. 
"ఏమి స్వామీ... ఆ పిట్ట ప్రత్యేకత" అన్నాడు గరుత్మంతుడు లోలోపల నవ్వుకుంటూ. 
"ఏమీ లేదు. బ్రహ్మ రాత ప్రకారం ఆ పిట్టకు ఇంకో పది నిమిషాల్లో యమగండం ఉంది. కానీ అది ఇక్కడ కాదు. వంద కిలోమీటర్ల దూరంలో ఒక మర్రిచెట్టు తొర్రలో ఒక పాము చంపి తినాలి. కానీ అది ఎలా సాధ్యం. ఇంకో పది నిమిషాల్లో ఆ పక్షి అంత దూరం ఎలా చేరుకోగలదు. దానికి అంత శక్తి ఎక్కడుంది. ఆ బ్రహ్మ రాత ఎలా నిజమవుతుంది" అన్నాడు. 
ఆ మాటలు వినగానే గరుత్మంతుని నోట మాట రాలేదు. దాన్ని తిరిగి కాపాడాలన్నా అక్కడికి పోవడానికి పావుగంట పడుతుంది. అంతలోపు అది పాముకు ఆహారంగా మారిపోతుంది. ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలబడిపోయాడు. ఇదీ కథ. 
యమగండం అంటే ఇదే. మరణం తప్పదు. తప్పించుకోవడానికి ఎన్ని ఎత్తులు వేసినా లాభం లేదు.  
*****************************డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూల్
*****************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.

No comments:

Post a Comment