*ఎవరు గురువు?*
జ్ఞానసాధనకు తొలి సోపానం గురువు. పుట్టుకతో వచ్చిన నిర్మల హృదయం సద్గురువు బోధనలతోనే సుస్థిరత పొందుతుంది. విష్ణుశర్మ సుదర్శన మహారాజు తనయులకు పంచతంత్రాన్ని బోధించి జన్మతః వచ్చిన మూర్ఖత్వాన్ని పోగొట్టాడు. పరిపూర్ణ జ్ఞానాన్ని పొందటానికి ఆరుగురు గురువులను పెద్దలు సూచించారు. వారెవరంటే- విద్యపట్ల ప్రేరణ కలిగించేవాడు, మహోన్నతుడిగా ఎదగడానికి తగిన సూచనలు చేసేవాడు, అమృతతుల్యమైన మాటలతో అలరింపజేసేవాడు, ధర్మాధర్మాల పట్ల సునిశిత జ్ఞానం కలిగినవాడు, శిక్షణ నిచ్చేవాడు. బోధన చేసేవాడు. వారసత్వంగా ఐశ్వర్యాన్ని పొందవచ్చు. విజ్ఞానం గురువు సన్నిధిలో మాత్రమే లభిస్తుంది.
గురుశిష్యులది పరమాత్మ, జీవాత్మల సంబందం. శిష్యున్ని తనంతవాడిగా తీర్చిదిద్దినవాడే నిజమైన గురువు అంటాడు వేమన. తత్వజ్ఞానాన్ని బోధించే గురువుకన్నా ఏదీ అధికం కాదంటుంది విశ్వసారతంత్ర. ఒకసారి పార్వతి గురువు ప్రశస్తి గురించి శివుణ్ని ప్రశ్నిస్తుంది. విద్యాబలం, ధనబలం, సకల భోగభాగ్యాలున్నా కూడా గురు కృప లేనివారు అధోగతి పాలవుతారని చెబుతాడు. పరమేశ్వరుడు. జ్ఞానార్డిగా శిష్యుడు గురువునెలా సమీపించాలో ముండకోపనిషత్ చెబుతుంది. దర్పాన్ని విడిచి ప్రశాంతమైన చిత్తంతో వెళ్లాలి. కోర్కెల నుంచి విరక్తుడవ్వాలి. అలాంటి ఉత్తమ శిష్యుడికి గురువు బ్రహ్మవిద్యను బోధిస్తాడు.
అజ్ఞానమనే సముద్రం నుంచి దాటిస్తాడు. గురువును ఆశ్రయించాల్సిన పద్ధతి, ప్రశ్నించాల్సిన విధానం వివేక చూడామణి చక్కగా వివరించింది. తల్లి, తండ్రి, సద్గతి అంతా గురువే. పరమేశ్వరు డికి మనిషిపై ఆగ్రహం కలిగితే గురువు కాపాడతాడు. గురువుకే కోపం వస్తే ఇంకె వరు కాపాడతారని కులార్ణవ రహస్యం ప్రశ్నిస్తుంది. గురువు మనసు గుర్తించి శిష్యుడు నడచుకోవాలి. సీతా స్వయంవరానికి వెళ్లిన రామలక్ష్మణులు ధనుర్యాగశాల చూడటా నికి వెళ్లి చాలా సమయం గడుపుతారు. ఆలస్యం చేసినందుకు కోపగిస్తాడేమోనని భయపడి విశ్వామిత్రుణ్ని సమీపించి క్షమించమంటూ పాదాభివందనం చేస్తారు.
మంత్రం, తీర్థం, దైవం, జ్యోతిషుడు, వైద్యుడు, గురువు వీరిపట్ల అపారమైన నమ్మక ముంటేనే ఫలితం కనిపిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. రామకృష్ణ పరమహంసపైన వివేకానందుడికి తొలిదశలో నమ్మకం కలగలేదు. శిష్యుడి మనసు తెలిసినప్పటికీ సమయం వచ్చేవరకూ మామూలుగానే ప్రవర్తించేవాడు గురువు. ఒకరోజు నరేంద్రుడు పాదసేవ చేస్తుండగా రామకృష్ణ పరమహంస తన పాదాన్ని నరేంద్రుడి భుజంపై వెడ తాడు. ఆ సమయంలో నరేంద్రుడికి లోకమంతా తలకిందులైనట్లనిపించి బిగ్గరగా అరు స్తాడు. కొంత సేపటికి రామకృష్ణుడు పాదాన్ని తీసి నరేంద్రుణ్ని అనుగ్రహిస్తాడు. ఈ సంఘటనతో గురువు మీద అపనమ్మకం తొలగి నరేంద్రుడికి జ్ఞానోదయం అవుతుంది. గురువును సంపూర్ణ నమ్మకంతో ఆశ్రయించాలి. ఆయన అనుగ్రహం పొందాలి.
No comments:
Post a Comment