5️⃣4️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*రెండవ అధ్యాయము*
*సాంఖ్యయోగము.*
అసత్యమైన శరీరములు నశిస్తాయి. సత్యమైన ఆత్మ నశించదు. ఈ ఆత్మను ఎవరూ నాశనం చేయలేరు. అత్మ ఎవరినీ చంపదు. ఎవరి చేతిలోనూ చావదు. అలా భావించే వాడు అజ్ఞాని. ఎందుకంటే ఆత్మకు చావు పుట్టుకలు, వృద్ధిక్షయములు, ఉండటం ఉండకపోవడం లేవు. ఈ విషయం తెలుసుకున్న జ్ఞాని ఆత్మ మరణిస్తుంది అని ఎలా అనుకుంటాడు? మానవుడు చినిగిన వస్త్రములను వదిలిపెట్టి కొత్త వస్త్రములను ఎలా ధరిస్తాడో, జీవుడు కూడా శిధిలమైన ఈ శరీరమును వదిలిపెట్టి కొత్త శరీరమును ధరిస్తాడు. ఈ ఆత్మను కత్తులు, బాణములు, అస్త్ర శస్త్రములు ఏమీ చేయలేవు. నీరు, అగ్ని, వాయువు క్షయింప జేయలేదు. ఆత్మను ఎవరూ కళ్లతో చూడలేరు. చేతితో తాకలేరు. మనసుతో చింతించలేరు.
పోనీ, నీవు అనుకున్నట్టు, ఈ ఆత్మకు జనన మరణములు ఉన్నాయని నీవు అనుకున్నా దానికీ చింతించనవసరం లేదు. పుట్టినవాడు చావడం, చచ్చిన వాడు పుట్టడం సహజమైన ప్రక్రియ. దీని కోసరం ఏడవడం ఎందుకు, ఎందుకంటే ఈ దేహములు పుట్టకముందు, చచ్చిన తరువాత ఎవరికీ కనపడవు. కేవలం జనన మరణముల మధ్య మాత్రమే ఏదో ఒక ఆకారంలో అందరికీ కనపడతాయి. కాబట్టి అశాశ్వతములైన ఈ శరీరముల కొరకు శోకించడం వృధా! కొంతమంది ఈ ఆత్మ తత్వమును ఆశ్చర్యంగా చూస్తారు. మరి కొంత మంది వివిధరకాలుగా వర్ణిస్తారు. వింతగా వింటారు. కాని చాలామందికి ఈ ఆత్మ గురించి ఏమీ తెలియదు. చెప్పినా అర్ధం కాదు. కాబట్టి అర్జునా! అన్ని జీవులలో ఉన్న ఈ ఆత్మను గురించి శోకించడం అర్థంలేని పని. కాబట్టి, నీ స్వధర్మము ధర్మంగా యుద్ధము చెయ్యడం. అది చెయ్యి, ఎందుకంటే స్వధర్మ ఆచరణను మించిన ధర్మం మరొకటి లేదు. ధర్మయుద్ధం అంటే స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది. ధర్మయుద్ధములో మరణించినవారికి స్వర్గము ప్రాప్తిస్తుంది. ఈ అదృష్టము ఒక్క క్షత్రియులకే పరిమితము. ఆ అదృష్టాన్ని వదులుకోకు. యుద్ధములో చస్తే వీరస్వర్గము. పారిపోతే పిరికిపంద అనే అప్రతిష్ట. పైగా నరకానికి పోతావు. పైగా యుద్ధంలో పారిపోయిన పిరికిపందవని లోకులు నీగురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. నీ శత్రువులు నిన్ను హేళన చేస్తారు. దానికన్నా చావడం నయం. నీ వంటి వీరుడు శూరుడు ఇటువంటి అపకీర్తిపాలు కావడం తగునా!
అర్జునా! యుద్ధములో చస్తే వీరస్వర్గము, బతికితే రాజ్యభోగములు. కాబట్టి యుద్ధం చెయ్యి జయాపజయములు, లాభనష్టములు, సుఖదుఃఖములను సమానంగా భావించి యుద్ధం చెయ్యి. నీకు ఎటువంటి పాపమూ రాదు. అర్జునా! ఈ సమత్వ బుద్ధిని ఇప్పటి వరకూ జ్ఞాన దృష్టితో చెప్పాను. ఇప్పుడు కర్మదృష్టితో చెబుతాను. దీనినే నిష్కామ కర్మ అంటారు. ఈ నిష్కామ కర్మ పూర్తిగా చేయనవసరం లేదు. ఎంత చేస్తే అంతే ఫలితం వస్తుంది. ఈ నిష్కామ కర్మలో నిశ్చయమైన బుద్ధి ఉంటుంది. ఇతరులలో ఇది ఉండదు. వారు ప్రాపంచిక విషయముల వెంట పరుగెడుతుంటారు.
వారు వేదములలో చెప్పబడిన యజ్ఞయాగములు చేస్తూ స్వర్గసుఖముల కొరకు పాకులాడుతుంటారు. శాశ్వతమైన ఆనందము నిచ్చే అత్మతత్వమును తెలుసుకోడానికి ప్రయత్నించరు. వేదములలో సత్వరజస్తమోగుణములతో చేసే యజ్ఞయాగముల గురించి చెప్పబడింది. నీవు వాటి మీద ఆసక్తి చూపవద్దు. పరమాత్మయందు నీ మనసు లగ్నం చెయ్యి. పెద్ద జలాశయము నిండా నీరు ఉండగా, చిన్న గుంటలో ఉన్న నీటితో ఏమి లాభము. బ్రహ్మజ్ఞానముతో పోలిస్తే వేదవిజ్ఞానము అత్యంత స్వల్పము. వేదములలో చెప్పబడిన విషయములను అర్థం చేసుకొని ఆచరించాలి కానీ అజ్ఞానంతో ఆచరించకూడదు.
అర్జునా! నీకు నీ కర్తవ్య కర్మచేయడానికే అధికారం ఉంది. దాని ఫలితముల యందు అధికారము లేదు. అలాగని కర్మలు చేయడం మానకూడదు. కాకపోతే ఆ కర్మలను ఫలాపేక్ష లేకుండా నిష్కామంగా చేయాలి. ద్వంద్వముల యందు సమత్వం కలిగి ఉండాలి. దీనినే యోగము అంటారు. ఈ సమత్వ బుద్ధి ఉన్నవాడు పుణ్యపాపములు ఈ లోకములోనే వదిలేస్తాడు. వాడికి ఎటువంటి కర్మఫలములు అంటవు. ముక్తికి ఇదే మార్గము. కాబట్టి అర్జునా! మోహం వదిలిపెట్టు. ద్వంద్వములను సమానంగా చూడు. మనస్సును, ఇంద్రియములను అదుపులో పెట్టుకో. మనస్సును ఆత్మయందు లగ్నం చెయ్యి పరమానందం పొందు. ఇటువంటి వాడిని స్థితప్రజ్ఞుడుఅంటారు. అటువంటి వాడు దు:ఖములకు కుంగి పోడు సుఖములకు పొంగిపోడు. వాడికి దేనిమీదా ఆసక్తి ఉండదు. భయము, కోపము ఉండవు. దేని మీద మమత మమకారం ఉండదు. అనుకూల, ప్రతికూల పరిస్థితులలో సమంగా ఉంటాడు. దేనికీ చలించడు. అతడికి రాగద్వేషములు ఉండవు. అతడే స్థితప్రజ్ఞుడు. అతడు బయట ప్రపంచములో తిరుగుతున్నపుడు తాబేలు తన అంగములను తనలోకి ముడుచుకున్నట్టు, ఇంద్రియములను, మనస్సును తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. పరమాత్మ యందు తప్ప దేని మీదా ఆసక్తి చూపడు.
అర్జునా! ఇది అందరికీ సాధ్యం కాదు. ఇంద్రియములను, మనసును అదుపులో పెట్టుకోవడం చాలా కష్టం. ప్రాపంచిక విషయములు, కామవాంఛలు ఇంద్రియములను తమ వంకకు లాగుతాయి. మనసు ఇంద్రియముల వెంట వెళుతుంది. బుద్ధి నిస్సహాయంగా మిగిలి పోతుంది. దీనికి ఒకటే మార్గము. ధ్యానంలో కూర్చుంటే ఇంద్రియములను, మనసును నిగ్రహించవచ్చును. అప్పుడు అతని బుద్ధి స్థిరంగా ఉంటుంది. సాధారణంగా బయట ప్రపంచములో తిరుగుతున్నపుడు ఎన్నో వస్తువులను, విషయాలను, మనుషులను చూస్తుంటాము. మనసు వాటి మీద లగ్నం అవుతుంది. ఆ ఆసక్తి కోరికగా మారుతుంది. ఆ కోరికలు తీరకపోతే కోపం వస్తుంది. కోపంలో ఏమి చేస్తున్నాడో తెలియని మోహం ఆవరిస్తుంది. అప్పుడు మానవుడు విచక్షనా జ్ఞానం కోల్పోతాడు. బుద్ధి పనిచెయ్యడం మాని వేస్తుంది. సర్వనాశనం అవుతుంది. అదే మనసును మన వశంలో ఉంచుకుంటే ఈ విపరీతపరిణామములు సంభవించవు. మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. మనస్సు ప్రసన్నంగా ఉంటే దు:ఖములు నశిస్తాయి. అప్పుడు బుద్ధి పరమాత్మయందు లగ్నం అవుతుంది. మనస్సు ప్రసన్నంగా లేకపోతే బుద్ధి నిశ్చయంగా ఉండదు. అటువంటి వాడికి శాంతి, సుఖము ఎలా కలుగుతాయి. ఎందుకంటే, బుద్ది అనే చుక్కాని లేకపోతే పడవ అనే మనస్సు గాలి వాటుకు కొట్టుకొని పోతుంది. కాబట్టి మనస్సు స్థిరంగా ఉంటే, బుద్ధి స్థిరంగా ఉంటుంది. ఆత్మసాక్షాత్కారం పొందిన యోగి మనస్సు ఎల్లప్పుడూ వెలుగులో ఉంటుంది. అటువంటి వాడికి ప్రాపంచిక విషయములు అంధకారంతో సమానము. ప్రాపంచిక విషయములలో తిరిగే వ్యక్తికి ఆత్మజ్ఞానము అర్థం కాక, అంధకారంలో ఉన్నట్టు ఉంటుంది. ఎలాగైతే ఎన్ని నదులు సముద్రంలో కలిసినా, సముద్రము నిశ్చలంగా ఉంటుందో, స్తితప్రజ్ఞునికి బయట ప్రపంచంలో తిరుగుతున్నా ప్రాపంచిక విషయములు అతనిలో ప్రవేశించినా అతని మనస్సు, బుద్ధి నిశ్చలంగా ఉంటాయి. ఏ కోరికలూ అతనిని ప్రభావితం చేయలేవు. కోరికలు విడిచిపెట్టినవాడు, శాంతిని పొందుతాడు. అలా శాంతిని పొందడమే బ్రాహ్మీస్థితి అంటారు. మరణించే సమయంలో ఈ బ్రాహ్మీస్థితిలో ఉన్న వాడికి మరలా జన్మ లేదు. అతడు మోక్షమును పొందుతాడు.
ఇది ఇప్పటి వరకు మనం చదువుకున్న అర్జున విషాద యోగ, సాంఖ్య యోగముల సారాంశము. ఇంక కర్మయోగములోనికి ప్రవేశిద్దాము.
ఉపనిషత్తులయొక్క, బ్రహ్మవిద్యయొక్క, యోగశాస్త్రము యొక్క సారమయిన భగవద్గీతలో, సాంఖ్య యోగము అను రెండవ అధ్యాయము సంపూర్ణము.
*ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్*
(సశేషం)
*🌹యోగక్షేమం వహామ్యహం🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P139
No comments:
Post a Comment