*వాళ్లెవరో ప్రాణాయామం చెయ్యమన్నారు.. అతను చేస్తున్నాడు.. శ్వాస లోతుగా తీసుకో.. దాన్ని పూరక అంటారు.. కొన్ని క్షణాలు ఆపు.. దాన్ని కుంభక అంటారు.. చెప్పుకుంటూ పోతున్నాడు... రేచక, శూన్యక వరకూ! "నువ్వు శ్వాస తీసుకునేటప్పుడు ముక్కుల దగ్గర ఓ దీపం పెట్టినా అది కదలకూడదు.." అని టెక్నిక్ చెబుతున్నారు గురువు గారు! సరేనని తలూపాడు శిష్యుడు.*
*కోరిక, చర్య, ఫలితం, సఫరింగ్.. ఇదీ మాయ యొక్క సీక్వెన్స్! ప్రాణాయామం చేస్తే జబ్బులు తగ్గుతాయట.. మైండ్ కామ్ అవుతుందట.. ఓ కోరిక ఉదయించింది! మొదలుపెట్టాడు. యోగా సెంటర్లో జాయిన్ అయ్యాడు, చేస్తున్నాడు.. ఫలితం వచ్చినట్లు ఉంది, రానట్లూ ఉంది.. ఇదంతా నా భ్రమేమో అనుకున్నాడు. ఈ ప్రాణాయామం నాకు సెట్ అయ్యేది కాదనుకున్నాడు.. ఆపేశాడు..! కోరిక అనే మాయ మబ్బులా కమ్ముకుని అతని క్షణికమైన సాధనతో రమించి, మబ్బులు రూపం మార్చుకున్నట్లు రూపం మార్చుకుని.. చివరకు నిరాశతో చెల్లాచెదురైంది..!!*
శ్వాసంటే.. ప్రక్రియ కాదు.. పూరకం, కుంభకం, రేచకం, శూన్యక చేసేదంతా ప్రాణాయామం కాదు. అది జిమ్‌లో థ్రెడ్ మిల్ మీద నడుస్తూ.. కాళ్లని సాగదీస్తూ, వంచుతూ చేసేలాంటి భౌతిక చర్య కాదని ఏ సాధకుడు చెప్పగలుగుతాడు?
"నేను చేస్తున్నట్లు చేయి.. మొదట నన్ను గమనించు" అని గురువు గారు శిష్యుడిని ఎదురుగా కూర్చోబెట్టుకుని డిమాన్‌స్ట్రేట్ చేస్తుంటాడు. శిష్యుడు చూస్తుంటాడు, గురువు గారు ఎంతసేపు శ్వాస తీసుకున్నారు, ఎంత సేపు ఆపారు, ఎంత సేపు రేచకలో ఉన్నారు.. క్షణాలు లెక్కలు వేసుకుంటూ ఉన్నాడు. "అమ్మో గురువు గారికి చాలా సాధన ఉందే, ఇంతసేపు బిగపట్టడం నా వల్ల అవుతుందా" అనుకున్నాడు. ఆ గురువు గారి ఆ శ్వాసని యాత్రికంగా చేస్తున్నారా.. విశ్వంలో కలిసిపోతున్నారా అన్నది శిష్యుడికీ తెలీదు. అలా కలిసిపోతేనే ఆత్మా, పరమాత్మ అనబడే విశ్వమూ ట్రాన్సెండెంట్ అవుతాయని చాలామంది గురువులకూ తెలీదు. జిమ్‌లో ఇన్‌స్ట్రక్టర్ల మాదిరే చాలామంది గురువులూ!
"ప్రాణాయామం చేస్తే కర్మలు దహించుకుపోతాయి.." అని ఎవరో టివిలో ఓ ప్రబోధకుడు చెబుతున్నారు. ఆశ పుట్టుకొచ్చింది.. కర్మల్ని దహించుకుందామనే ఆశ! ఆ ఆశ, ఆ కోరిక అహం ప్రేరేపితమైనదని తెలీదు. ఆశ కొద్దీ చేసే ప్రతీ పనీ అంచనానీ, అంచనా తారుమారైనప్పుడు నిరాశనీ పెంచుతుందని తెలీదు. కర్మ దహనం అంటే.. ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకూ స్కూల్లో చదువుకునే సిలబస్ లా అనిపిస్తుంది.. ఎందుకంటే మనం అలాంటి క్లాసులే కదా దాటుకుని వచ్చింది!!
నాసినా పుటల నుండి ప్రాణవాయువు లోతుగా శరీరమనే క్షేత్రంలోకి.. నీటిలా క్రమక్రమంగా ప్రవహిస్తుంటే.. విశ్వమంతా దేహంలోకి, కాన్షియస్‌నెస్‌లోకి చొచ్చుకొస్తూంటుంది. ఆ చొచ్చుకు రావడాన్ని, ఆ లోతైన శ్వాసని తీసుకోవడాన్ని ఎవరు ఎలా చూస్తారో వారికి ఆ భగవత్ శక్తి అలా కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది శరీరంలోని జబ్బులు తగ్గుతున్నట్లు భావిస్తారు, రోగగ్రస్థ మానసిక స్థితితో విశాలమైన విశ్వశక్తిని పరిమితమైన దృక్కోణంతో అర్థం చేసుకునే స్థితి. కొందరు ఎక్కడో చదివి ఉంటారు.. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం.. అన్నీ కలిసి కుంఢలినీ యాక్టివేట్ అవుతుందని! లోపలికి వెళుతున్న ప్రాణశక్తితో పాటే ఆ కుంఢలినీ యాక్టివేట్ చేసుకోవాలనే కోరికా మనస్సుని నిండిపోయి.. ఆ విశ్వశక్తిని సాక్షీభూతంగా చూసే ప్రజ్ఞ మాయమవుతుంది.
కుంభక అంటే.. గాలిని ఆపడం అనుకుంటారు. అది శివతత్వం, శూన్యత.. అదే క్వాంటమ్ ఫీల్డ్! నేను రాసింది ఇది చదివాక ఇప్పుడు మీకు కొత్త లేబుల్, ఇంట్రెస్టింగ్‌గా అనిపించే కొత్త పేరు పుట్టుకొచ్చింది.. శ్వాసని నిలిపినప్పుడు ఇక శివుడు నాతో ఉన్నాడనే భ్రమలోకి వెళతారు. శూన్యత అంటే ఆలోచన కాదు, లేబుల్స్‌తో, జ్ఞానంతో మనస్సుని నింపుకోవడం కాదు.. ఏ భావనా లేని స్థితి!!
శ్వాస బయటకు వెళుతుంటే.. వ్యాకోచించే కప్ప సరస్సులో తన ఉనికిని విస్తరించుకుంటున్నట్లు ఉంటుంది. విస్తరించుకుని, విశ్వంలోకి కలిసిపోవడం.. ఇదీ చదవగానే అలా ఊహించుకుంటారు. అందుకే అక్షరాలు మూగబోతాయి, అక్షరాలు అనుభూతిని చెల్లాచెదురు చేస్తాయి. ఈ అక్షరాలే, గురువులు అనబడే వాళ్లు చెప్పే మాటలే శిష్యులు ఆధ్యాత్మికంగా ఎదగకుండా సంకెళ్లని నిర్మిస్తాయి.
ప్రాణాయామం అంటే యోగా సెంటర్లలో నేర్పించేది కాదు.. ప్రాణాయామం అంటే జబ్బుల్ని తగ్గించేది కాదు... ప్రాణాయాయం అంటే మనస్సుని స్థిమితం చేసేది కాదు.. ఇలాంటి అన్ని కోరికలను జయించి విశ్వంలో కలిసిపోయేది.. కలిసిపోయేలా చేసేది. ఇది పదిసార్లు చదివినా అర్థం కాదు.. వంద రకాల కామెంట్లు రాసినా మైండ్ లెవల్‌లోనే రమిస్తునట్లు! తనను తాను కోల్పోయి సాధన చేసే సాధకుడికే ఇది హృదయాంతరాళాల్లోకీ వెళుతుంది.
⦁ నల్లమోతు శ్రీధర్.
No comments:
Post a Comment