Thursday, December 11, 2025

 ఒ ఫర్ ఓల్డేజ్! హెచ్ ఫర్ హోం!!
 రచయితలూ, కవులూ, కళాకారులూ, సంపాదకులూ, ఐఎఎస్, ఐపిఎస్..ఆఫీసర్లంతా ఆ ఓల్డేజ్ హోంలోనే ఉంటున్నారంటే...అక్కడే నన్ను కూడా జాయిన్ చేశాడు మా అబ్బాయి. 
 రెండుపార్కులు ఉన్నాయి. చిన్న సినిమా థియెటర్ ఉంది. లైబ్రరీ ఉంది. విశాలమైన ప్రాంగణం ఉంది. లెక్కలేనన్ని చెట్లున్నాయి. ఇరవై నాలుగ్గంటలూ మెడికల్ కేర్ ఉంది. ఆర్గానిక్ ఫుడ్ ఇస్తారు. ఇంతకంటే ఇంకేం కావాలి డాడీ? నెలకి నలభైవేలు చెల్లిస్తే నీ గురించి నువ్వు ఆలోచించనక్కరలేదు. నీగురించి అంతా వాళ్లే ఆలోచిస్తారు అన్నాడు అబ్బాయి. 
 పొద్దునపొద్దునే ఫిల్టర్ కాఫీ ఇస్తారు. తర్వాత రెండు టిఫిన్లు ఇస్తారు. ఆ తర్వాత రెండు కూరలూ, పప్పు, సాంబారుసహా లంచ్ ఉంటుంది. సాయంత్రం స్నాక్స్ ఇస్తారు. టీ ఇస్తారు. రాత్రి మీరు అన్నం తింటానంటే అన్నం...టిఫిన్ చేస్తానంటే టిఫిన్ పెడతారు. చాలదా? అడిగింది కోడలుపిల్ల. 
 సమాధానం ఏం చెప్పాలో తోచలేదు. ఏడవలేక, సన్నగా నవ్వాను. 
 పండగస్పెషల్స్ కూడా ఉంటాయట! రెండుపూట్లా రెండు ఫ్రూట్స్ కూడా ఇస్తారట! అసలు దాన్ని ఓల్డేజ్ హోం అనకూడదు. స్వర్గం అనాలి అన్నది కోడలు. 
 మీ రెండు అపార్ట్ మెంట్లూ రెంట్ కి ఇచ్చేస్తున్నాం. రెండిటిమీదా నెలకి డెబ్బయి వేలు అద్దె వస్తుంది. అందులో నలభైవేలు పోతే ఇంకా మీ దగ్గర ముప్పయి వేలు ఉంటాయి. ఆ డబ్బుతో మీ ఇష్టం. నెలనెలా ఎక్కడకి వెళ్లాలన్నా వెళ్లిరావచ్చు. చెప్పాడు అబ్బాయి.
 ఏ రకంగా చూసుకున్నా ఈ ఓల్డేజ్ హోం ఇటు మీకూ, అటు అమెరికాలో ఉంటున్న మాకూ సుఖం. ఇంకేం మాట్లాడకండి! రండి! జాయిన్ చేసేస్తాం అన్నది కోడలు. 
 ఓల్డేజ్ హోంలో నన్ను జాయిన్ చేసేశారు. 
 అటాచ్డ్ బాత్రూంతో ఓ రూమిచ్చారక్కడ. అందులోనే ఓ టేబుల్, ఇద్దరు విజిటర్స్ కూర్చొనేందుకు వీలుగా ఓ చిన్న సోఫా, సింగిల్ కాట్, టీవీ, అన్నీ ఉన్నాయి. హోటల్ రూంలా ఉందంతా. 
 లైబ్రరీకి వెళ్తే అన్ని పేపర్లూ ఉంటాయి. చదువుకోవచ్చు. కాదు, మనకంటూ ప్రత్యేకించి పేపర్ కావాలంటే వేస్తారు. దానికి ఎక్ స్ట్రా పేచెయ్యాలి. 
 హోంలో జాయినయి, పదిహేనురోజులయింది. మొదటివారం అంతా కొత్తకొత్తగా  గడచింది. రెండోవారం కొత్తదనం పోయింది. అలవాటయింది. ఇద్దరు ముగ్గురు స్నేహితులయ్యారు. ఒకాయన కమేడియన్ బ్రహ్మానందం బంధువట! మొన్న దీపావళికి ఈయన్ని చూసేందుకు ఆయనిక్కడకి వచ్చారట! వచ్చి, అందరికీ శాలువాలుకప్పి, సన్మానించారట! మరొకాయన లెక్చిరర్ గా పనిచేసి, రిటైరయ్యారు. భార్యపోయింది. కొడుకుల్లేరు. ఇద్దరు కూతుళ్లట! ఇద్దరూ ఆస్ట్ఱేలియాలో ఉంటున్నారట! దాంతో తప్పనిసరై తానిక్కడ ఉంటున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇంకొకాయన ఉన్నాడు. పాపం! అమాయకుడు. తన సెల్ ఫోన్ పనిచెయ్యట్లేదని మొన్న ఒకటే గోల! చూస్తాం, ఫోనిటు ఇవ్వు అంటే ఇవ్వడు. రిపేర్ షాప్ కి అతన్ని తీసుకుని వెళ్లాం. ఫోన్ పరిశీంచాడు రిపేరర్. దీనికేం? బ్రహ్మాండంగా ఉంది. పాడవలేదసలు అన్నాడు. ఆ మాటకు ఏడుస్తూ కూర్చున్నాడు మిత్రుడు. 
 పాడవకపోతే పిల్లలెందుకు ఫోన్ చెయ్యట్లేదంటాడు. పదేపదే అదే మాట!
 సమాధానం ఏం చెప్పాలి? 
 మరచిపోవడం పిల్లలకు అలవాటు. ఆ అలవాటుతో వాళ్లు తల్లిదండ్రుల్ని కూడా మరచిపోయారు. వదిలేయ్ అందామంటే...వినే స్థితిలో లేడతను. 
 భార్యపోతే భర్త బ్రతుకు బొడ్డాకులపాలే! నాలాగే అందరూ అనుకున్నాను. 
 ప్రముఖరచయిత్రి శ్యామలాదేవి కూడా ఇక్కడే ఉంటున్నారు. రూం నెంబర్ 27. చెప్పాడు ఓ మిత్రుడు. 
 శ్యామలాదేవి రచనలంటే నాకు చాలా ఇష్టం. నేను ఇంటర్మీడియెట్ నుంచీ ఆమె రచనలు చదువుతూ వస్తున్నాను. చెక్కిలిపై తాజ్ మహల్, సముద్రం మీద సంతకం, నడినింగిలో ఒంటరి జాబిలి...శ్యామలాదేవి నవలలు నాకు ఇష్టమైనవి. ఒకొక్కటీ రెండేసి కాపీలు కొని దాచుకున్నాను. అయినా పోయాయి. 
 శ్యామాలాదేవిని చూడాలనిపించింది. 
 దేవీ మేడం వాకింగ్ కి రారా? అడిగాను మిత్రుణ్ణి. 
 వస్తారు. కాని ఎవరితోనూ మాట్లాడరు. వాక్ చేసుకుని, అదిగో! ఆ బెంచ్ మీద కూర్చుని ఎటో చూస్తూ ఒంటరిగా గడుపుతారు అన్నాడు. 
 పలకరిస్తే పలుకుతారా? అడిగాను. 
 సన్నగా ఓ నవ్వు నవ్వి ఊరుకుంటారన్నాడు మిత్రుడు.
 శ్యామలాదేవి ఇక్కడ ఈ హోంలో ఉంటారన్న ఆలోచనేలేదు. ఆమెను చూసినా అందువల్లే గుర్తుపట్టలేకపోయి ఉండవచ్చు. శ్యామాలాదేవిని కలవాలనుకున్నాను. 
 శీతకాలం. సాయంత్రం అయిదున్నరకే చీకటిపడిపోయింది. చలిగాలికూడా వీస్తున్నది. 
 రూం నెంబర్ 27 కు చేరుకున్నాను. రూం తలుపు తెరచే ఉన్నది. లోనికి తొంగిచూశాను. కిటికీ దగ్గరగా కుర్చీలో కూర్చుని, తదేకధ్యానంతో బయటికి చూస్తున్నది శ్యామలాదేవి. 
 నమస్తే మేడం అన్నాను. మూడుసార్లు అదే మాట అన్నాను. మూడోమాటకి ఇటు తిరిగి నన్ను చూసిందామె. 
 ఏం కావాలి? అడిగింది. 
 నేను మీ అభిమానిని మేడం అన్నాను. 
 కమిన్ అందామె నవ్వుతూ. 
 కూర్చోండి అని సోఫా చూపించింది. కూర్చున్నాను. 
 నా పేరు చెప్పాను. హోంలో ఎప్పుడు జాయిన్ అయిందీ, ఎందుకు జాయిన్ అయిందీ చెప్పాను. మాటలు కలిపాను. అటు తిరిగీ, ఇటు తిరిగీ సంభాషణంతా ఓల్డేజ్ మీదికి వచ్చింది. 
 నడకరాని రోజుల్లో, నడవలేనిరోజుల్లో చేయిపట్టుకుని పిల్లల్ని నడిపించాం. ఇప్పుడు మనం నడవలేం. చేయిపట్టుకుని మనల్ని నడిపించాలనే ఇంగితం లేదు వాళ్లకి అన్నాను. 
 పావుగంటో అరగంటో మనతో గడపాలనే ఆలోచనేలేదు పిల్లలకి. ఎంతసేపూ బిజీబిజీబిజీ. ఎంతబిజీ లైఫ్ అయినా ఎప్పుడో నాడు మనం గుర్తుకు రాకుండాపోం. అప్పుడు మనకోసం చూస్తే...ఉంటామా? ఉండం కదా? అప్పుడేడ్చి ఏం ప్రయోజనం? అడిగాను. 
 ఈ తరానికి చరిత్రలూ, జ్ఞాపకాలూ అక్కరలేదు మేడం అన్నాను. 
 నిజమే అన్నది శ్యామలాదేవి. 
 పిల్లల ఆలోచనా విధానాల్లో మార్పులు రావాలి సార్ అన్నది.    
 విరిగిన వస్తువుల్ని జపాన్ లో బంగారంతో అతుకుపెడతారు. దానిని ‘కింత్సుగి’ అంటారు. ఒక చారిత్రాత్మకమైన వస్తువు దెబ్బతిన్నదంటే...దానిని పదిలంగా చూసుకోవాలన్నది జపనీయుల ఆలోచన. పగుళ్లూ, మరమ్మత్తులూ వస్తువు పోరాటానికీ, ప్రతిభకీ అద్దంపడుతుందన్నది వారి నమ్మకం. అందుకే బంగారంతో పగుళ్లను అతుకుపెట్టి, మరింత ప్రకాశవంతంచేస్తారు. గౌరవిస్తారు దానిని. 
 అక్కడ అలా ఉంటే...ఇక్కడ పగులినీ, ముడతనీ, ముసలితనాన్నీ ఒక లోపంగా పరిగణిస్తారు. ముసలితనంలోపంకాదు. దానిని దాచిపెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు.  
 ముఖమ్మీద ఏర్పడిన ప్రతిముడతా ఒక అనుభవం అని తెలుసుకోవాలి. అది జీవించిన జీవితానికి సాక్ష్యం అని అర్థంచేసుకోవాలి. 
 ముసలితనంలో నొప్పులు, ఒకనాడు మనం చేసిన పనులకు గుర్తు. ముసలితనం అనుభవానికీ, జ్ఞానానికీ చిహ్నం. ముసలితనం అన్నది సిగ్గుపడాల్సిన విషయం ఎంతమాత్రమూకాదు. అది చాలా అందమైనది. బంగారంపూత పూయదగ్గది. విలువైనది అన్నది శ్యామలాదేవి.   
 ఏదైనా రచయిత రచయితే! పాఠకుడు పాఠకుడే! ఇద్దరి మాటలకూ చాలా తేడాలు ఉంటాయి. 
 ఇప్పుడేమీ రాయట్లేదా మేడం? అడిగాను. 
 రాస్తున్నాను, రాయట్లేదు అన్నదామె. 
 నవ్వాను ఆ మాటకి. 
 అంటే డూయింగ్ నథింగ్ అన్నాను. 
 డూయింగ్ నథింగ్ అన్నది చాలా గొప్పమాట. గొప్ప కాన్సెప్ట్ అన్నది శ్యామలాదేవి. 
 దాని గురించి మీకు కొంచెం చెబుతాను, వినండి! బోరు అనిపిస్తే వెళ్లిపొండి అన్నది. 
 మీరు మాట్లాడుతుంటే బోరేంటి మేడం. చెప్పండి అన్నాను. 
 డచ్ లాంగ్వేజీలో ‘నిక్సెన్’ అంటే ఏమీ చేయకుండా ఉండడం. అదే డూయింగ్ నథింగ్. అయితే అది ఏమీ చేయకపోవడంకాదు. ప్రయత్నపూర్వకంగా ఎటువంటి లక్ష్యాన్నీ పెట్టుకోకుండా ఏమీ చేయకపోవడం అన్నదామె. 
 సాదాసీదాగా ఉండాలి. ఎటువంటి ప్రొడక్టివిటీ ప్రెషర్ పెట్టుకోకూడదు. లక్ష్యం అసలు ఉండకూడదు. మైండ్ ని దాని మానాన దాన్ని ఉంచాలి. అది ఏది ఆలోచిస్తే అది ఆలోచిస్తుంది. దానిని ఆలోచించుకోనివ్వాలి. మనం ఎంచక్కా కిటికీ నుండో, లేదంటే బయట ఏ బెంచీమీదో కూర్చుని, ఏదో దాన్ని చూస్తూ గడపాలి. దీన్నే నిక్సన్ అంటారన్నది శ్యామలాదేవి. 
 ఇటువంటిదే ‘వూ వేయ్ ’ కూడా. ఇది చైనీస్ ఫిలాసఫీ! దీని అర్థం, చర్యలేకుండా చర్య. అంటే ప్రయత్నంపూర్వకంగా గాకుండా, పనిచేసుకుంటూ పోవడం. ఫలితం కోసం వెర్రెత్తపోకూడదు. ఏదో ఒక ఫలితం వస్తుంది. దానిని అంగీకరించాలి. నీటిలా ప్రవహించమే ప్రధానం. అడ్డంకులువస్తాయి. అధిగమించాలి. దైవసంకల్పాన్ని అంగీకరించి, అందుకు అనుగుణంగా వ్యవహరించాలి అన్నది.  
 దీనివల్ల లాభం? అడిగాను. 
 ఒత్తిడి ఉండదు. మెదడుకి విశ్రాంతి లభిస్తుంది. ఆందోళన ఉండదు. భయాలుండవు. మనల్ని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. మూడ్ బెటర్ అవుతుంది. ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి అన్నది శ్యామలాదేవి. 
 అన్నట్టు అడగడం మరచిపోయాను. మీరేమైనా కాఫీ, బిస్కెట్...అంటూ ఎవరినో పిలవబోయింది. 
 వద్దు మేడం! ఏం వద్దు! మీరు చెబుతున్నది బాగుంది. చెప్పండి అన్నాను. 
 వూ వేయ్ వల్ల సృజనాత్మకత పెరుగుతుంది. స్నానంచేస్తున్నప్పుడో, నడుస్తున్నప్పుడో కలిగే గొప్పగొప్ప ఆలోచనలు అప్పుడు కూడా కలుగుతాయి. సమస్యలకు కొత్త పరిష్కారాలు లభిస్తాయి. రక్తపోటు తగ్గుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. అవగాహన, దయ, సానుభూతి కలుగుతాయి. శాంతిలభిస్తుంది. ఇంతకంటే ఇంకేం కావాలి? ప్రశ్నించింది శ్యామలాదేవి. 
 డూయింగ్ నథింగ్ అన్నది బద్ధకించడంకాదు. ఇది మనం ఉద్దేశపూర్వకంగా, స్వేచ్ఛగా ఎంపికచేసుకున్నది. దీనిని అలవాటు చేసుకుంటే...మానసికంగా, శారీరకంగా బాగుపడతాం. సృజనాత్మకత కూడా పెరుగుతుంది అన్నది. 
 దీనినే జపాన్ లో ‘ఫారెస్ట్ బాతింగ్’ అంటారు. ప్రకృతిమధ్యలో నడవడం, లేదంటే అక్కడ కూర్చుని విశ్రాంతి తీసుకోడంలో చాలా లాభాలు ఉన్నాయి. వాకింగ్ కి వచ్చి నేను చేసేదదే అన్నది శ్యామలాదేవి. 
 డూయింగ్ నథింగ్ అలవాటు చేసుకోండి! ఆత్మపరిశీలన పెంచుకోండి. భావోద్వేగాలు నియంత్రించుకోండి! నియంత్రించుకుంటే...పిల్లల్ని పల్లెత్తుమాటనరు. పిల్లలగురించి బాధపడరు అన్నదామె. అలాగే ఈ హోంలో సెలెబ్రిటీలు ఉన్నారా? లేరా? ఇక్కడి రూమ్స్, హోటల్ రూమ్స్ లా ఉన్నాయా? లేదా? ఫుడ్ బాగుందా? లేదా అన్న ఆలోచనలు కూడా రావు. మనం జీవించాలి. జీవిస్తున్నాం అంతే! అని నవ్విందామె. 
 వెళ్లొస్తాను మేడం అన్నాను. లేచి నిల్చుని, ముందుకు నడిచాను.
 సార్ పిలిచింది శ్యామలాదేవి. ఆగాను. అప్పుడామె చెప్పిందిలా.  
 ఇప్పుడు మనం ఉన్న ఈ స్థితి మన గమ్యంకాదు. ఇది ప్రారంభం మాత్రమే!! 
 అవును మేడం అన్నాను. నడుస్తూ ఆలోచనలోపడ్డాను. 
 ఋతువుల్నీ, వీచేగాలినీ, కాలాన్నీ మార్చలేం. కాకపోతే మనల్ని మనం మార్చుకోగలం. మార్చుకోవాలి అనుకున్నాను. 
-జగన్నాథశర్మ
(రవళిమాసపత్రిక సౌజన్యంతో...)

No comments:

Post a Comment