Thursday, December 11, 2025

 🔱ఓం నమః శివాయ🔱:
*శ్రీ లలితో పాఖ్యానం*                         పరాశక్తికి తగిన వరుడు కామేశ్వరుడే అని తలచిన దేవతలు దేవి వద్దకు వెళ్ళి స్తుతిస్తారు.
కామేశ్వరుడు దేవి పరస్పర ఆకర్షితులౌతారు.
పరమేశ్వరి తన చేతిలో ఉన్న హారం ఆకాశంలోకి విసిరేస్తుంది. ఆ హారం కామేశ్వరుని కంఠంలో పడుతుంది. దేవతల ప్రార్ధనను మన్నించిన శ్రీహరి లలితాకామేశ్వరుల వివాహం చేస్తాడు.
(కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కందరా)
దేవతలు చెరుకు విల్లును, శ్రీహరి పుష్పాయుధాన్ని, వరుణుడు నాగపాశాన్ని, విశ్వకర్మ అంకుశాన్ని అగ్నిదేవుడు కిరీటాన్ని సూర్యచంద్రులు కర్ణాభరణాలను, మధురపాత్రను, కుబేరుడు చింతామణిని లక్ష్మీదేవి ఛత్రాన్ని చంద్రుడు వింజామరలను లలితాకామేశ్వరులకు బహుకరిస్తారు. బ్రహ్మ కుసుమాకరం అనే విమానాన్ని ఇస్తాడు.
దేవతలందరూ పరాశక్తిని పలువిధాలగా కీర్తిస్తారు. నారదుడు  నమస్కరించి, "తల్లీ, నీవు పరబ్రహ్మవు. సాధుజన రక్షనకే ఆవిర్భవించావు. భండాసురుడు ముల్లోకాలను హింసకు గురి చేస్తున్నాడు. దేవతలంతా భయభ్రాంతులై ఇక్కడే నివాసాలు ఏర్పరుచుకున్నారు. నీవు అభయమిస్తే వారు తమతమ గృహాలకు తిరిగి పోతారు."  అని విన్నవించుకుంటాడు. పరాశక్తి అభయముతో సంతుష్టులైన వారు తిరిగి గృహాలకు మరలి పోతారు.
****
మహాశంభుడి ప్రశంసలతో  లలితాదేవి సృష్టి కార్యక్రమం కొనసాగిస్తుంది.
ఎడమ నేత్రము నుండి చంద్ర తత్వంతో బ్రహ్మాండ లక్ష్మి,
కుడినేత్రము నుండి సూర్య తత్వంతో విష్ణు పార్వతి
మూడవనేత్రము నుండి అగ్ని తత్వంతో రుద్ర సరస్వతులు ఉద్భవిస్తారు. లక్ష్మి విష్ణులు, మరియు శివపార్వతులు, బ్రహ్మ సరస్వతులు దంపతులౌతారు. వారివారి సృష్టి కార్యం కొనసాగించమని ఆదేశిస్తుంది.
పొడవైన కేశాల నుండి అంధకారం, కనులలోనుండి సూర్యచంద్ర అగ్నులు, నుదుటి మీదనున్న ఆభరణం నుండి నక్షత్రాలు, పాపిటి గొలుసు నుండి నవగ్రహాలు, కనుబొమల నుండి, న్యాయశాస్త్రము, ఊపిరి నుండి వేదాలు,వాక్కు నుండి పద్య నాటకాలు, చిబుకము నుండి వేదాంగాలు, కంఠం మీదనున్న మూడు మడతల నుండి వివిధ శాస్త్రాలు సృష్టి చేస్తుంది.
వక్షస్థలం నుండి పర్వతాలు, మనసు నుండి చిదానందము, హస్తనఖముల నుండి విష్ణు దశావతారములు, అరచేతుల నుండి ఉభయసంధ్యలు అద్భవిస్తాయి.
హృదయం బాలాదేవి, ఙ్ఞానం  శ్యామలాదేవి, అహంకారం వారాహిదేవి, చిరునవ్వు విఘ్నేశ్వరుడు గా రూపు దిద్దుకుంటాయి.
అంకుశం నుండి సంపత్కరీదేవిని, పాశం నుండి అశ్వారూఢదేవి, కపోలాల నుండి నకులేశ్వరి, కుండలిని శక్తి నుండి గాయత్రిని సృష్టిస్తుంది.
చక్రరాజ రధానికి ఉన్న ఎనిమిది చక్రాల నుండి ఎనిమిది మంది దేవతలు పుడుతారు.
తొమ్మిదవ ప్రాకారం, బిందు పీఠంలో తల్లి ఆసీనురాలై ఉంటుంది.
చివరకు చక్రరాజ రథ సంరక్షక దేవతలను సృష్టిస్తుంది.
లలితాదేవి సృష్టి కార్యం పూర్తి చేసి పతి శివకామసుందరుని శివచక్రం సృష్టించమని వేడుకుంటుంది.
ఆయన చేసిన హూంకారం నుండి 23 మంది శివచక్ర దేవతలు పుట్టుకొస్తారు.
ఈ విధంగా శక్తిసేన సృష్ఠి కార్యక్రమం పూర్తి చేసిన తల్లి, పదహారు మంది మంత్రులలో ముఖ్యురాలైన  శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది. ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రిణీ దేవి అని కూడా అంటారు. చక్రరాజ రథం నుండి సృష్టింపబడ్డ రథాలలో ఒకటైన ఏడుపర్వాలు కలిగిన గేయచక్రరథం మీద శ్యామలాదేవి అధిరోహించి లలితాదేవికి కుడి పక్కన ఉంటుంది. (గేయచక్ర రధారూఢ మంత్రిణీ పరి సేవితా)
అదే విధంగా వరాహములచేత లాగబడుతున్న కిరిచక్రరథం మీద అధిరోహించిన వార్తాళీ దేవిని పన్నెండుమంది దండనాథులకు సేనాధిపతిగా నియమిస్తుంది. ఆమెను వారాహి దేవి, దండనాథదేవి అని కూడా అన్నారు. లలితాదేవి తన కనుబొమల నుండి గద సృష్టించి దండనాథ దేవికి ఇస్తుంది. (కిరి చక్ర రధారూఢ దండనాథా పురస్కృతా).
శక్తిసేనను సంపూర్ణంగా కూర్చుకున్న లలితాదేవి భండాసురుని మీద యుద్దానికి బయల్దేరుతుంది. ఆమె అంకుశం నుండి  సంపత్కరీ దేవి తనతో పాటు పుట్టిన అనేక ఏనుగుల సమూహంతో  లలితాదేవి వెనకనే ఉంటుంది.  అమ్మ తన గజయూధమునకు సంపత్కరీదేవిని అధికారిణిగా నియమించింది. పాశం నుండి వచ్చిన అశ్వారూఢాదేవి అపరాజిత అశ్వం ఎక్కి  గుర్రాల సమూహముతో కూడి, లలితాదేవి ముందర ఉంటుంది. యుద్దభేరి మోగిస్తూ లలితాదేవి శక్తిసేనతో సాగిపోతున్నది. దండనాథదేవి తన రథం మీద నుండి దిగి వజ్రఘోషం అన్న సింహం మీద కూర్చుంటుంది.
సైన్యం లలితాదేవి ద్వాదశనామ స్తోత్రం చేస్తూ సాగుతుంది. గేయచక్రరథం మీద ఉన్న మంత్రిణీదేవిని ఆమె అనుచరులు షోడశనామకీర్తన చేస్తూ సాగుతారు.
మంత్రిణీదేవి హస్తం మీద ఉన్న పక్షి నుండి చేతిలో ధనుస్సు ధరించి ధనుర్వేదుడు అవతరిస్తాడు. "మాతా! ఇది చిత్రజీవం అనే ధనుస్సు. ఇది అక్షయతూణీరం. అసుర సంహారానికి వీటిని ఉపయోగించు." అని ఆమెకు అందచేస్తాడు.
****
లలితాదేవి వార్తాళీదేవి, శ్యామలాదేవిని సేనానాయకులగా నియమించిన తరువాత చేసిన హూంకారం లోనుండి 64000000 మంది యోగినులు, అంత మందే భైరవులు, లెక్కలేనంత శక్తిసేన పుట్టుకొస్తారు.

ఆమె నుండి ఉత్పన్నమైన నాలుగు సముద్రాల ఘోష రణభేరిగా, మరిన్ని వాద్యవిశేషాలు వెన్నంటగా భండాసుర వధకు రణరంగానికి బయలు వెడలింది.
కిరిచక్ర రథం నుండి దిగి వజ్రఘోషం అన్న సింహాన్ని అధిరోహించిన దండనాథ దేవిని సేన ద్వాదశనామాలతో స్తోత్రపాఠం చేస్తుంది.
పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ
తథా సమయాసంకేతా వారాహీ పోత్రిణీ తథా
వార్తాళిచ మహాసేన ప్యాఙ్ఞా చక్రేశ్వరీ తథా
అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ 
ద్వాదశకం యూనే
అన్న స్తోత్ర గానం చేస్తూ బయలుదేరుతారు.
గేయచక్రరథంలో బయలు దేరిన మంత్రిణీ దేవి యుద్దకవాతు వాయిద్యాలు మోగిస్తుంది. ఆమె సేన చక్కగా అలంకృతులై  వీణ మొదలైన వాయిద్యాలతో గానం చేస్తూ కొనసాగుతారు.
మంత్రిణీ దేవిని, సంగీతయోగినీ, శ్యామా, శ్యామలా, మంత్రనాయికా, మంత్రిణీ, సచివేశానీ, ప్రధానేశీ, కుశప్రియా, వీణావతీ, వైణికీ, ముద్రిణీ, ప్రియకప్రియా, నీపప్రియా, కదంబవేశ్యా, కదంబవనవాసినీ, సదామలా అనే పదహారు నామాలతో ఆమెననుసరిస్తున్న సేన షోడశనామ స్తోత్రపాఠం చేస్తుంది, ( ఈ స్తోత్రము పఠించిన వారు ముల్లోకాలు జయించ గలరు.). ఆమె చేతిలో ఉన్న చిలుక పిల్ల నుండి ధనుర్వేదం ఆవిష్కరింపబడింది.
నాలుగు చేతులు, మూడు తలలు, మూడు కన్నులు కల వీరుడు ఆమెకు నమస్కరించి, "తల్లీ, భండాసురునితో యుద్దానికి బయల్దేరుతున్నావు. చిత్రజీవమనే ఈ ధనస్సు స్వీకరించు. అక్షయ బాణంలా ప్రకాశిస్తుంది." అని చెప్పి దనుస్సును, రెండు అమ్ములపొదులను శ్యామలాదేవికి ఇస్తాడు. ఆమెకు యంత్రిణి, తంత్రిణి అనేవారు చెలికత్తెలగా ఉంటారు. వారు చిలుకను, వీణను ధరించి ఆమె వెంట బయల్దేరుతారు.
స్తోత్రపాఠాలు గానాలతో సైన్యం అనుసరిస్తూండగా నాలుగు చేతులలో చెరుకుగడ, బాణాలు, శూలము, అంకుశము ధరించిన లలితాదేవి కదన రంగంలోకి బయలు దేరుతుంది. రథము మీద తెల్లటి గొడుగులతో, విజయ మొదలైన పరిచారికలు చామరాలు వీస్తుండగా దేవతా స్త్రీల సంగీత వాయిద్యాలతో, బ్రహ్మాది దేవతల స్తోత్రాలతో, కామేశ్వరీ మొదలైన శక్తులు పాదాలు సేవిస్తూ కదిలి వస్తారు.
ఇక్కడ తల్లిని పంచవింశతి (ఇరవైఐదు) నామాలతో కీర్తిస్తారు.
సింహాసనేశి లలితా మహారాఙ్ఞీ వరాంకుశా
చాపినీ త్రిపురా చైవ మహాత్రిపురసుందరీ
సుందరీ చక్రనాథా చ సామ్రాఙ్ఞీ చక్రిణీ తథా
చక్రేశ్వరి మహాదేవీ కామేశీ పరమేశ్వరీ
కామరాజప్రియా కామకోటిగా చక్రవర్తినీ
మహావిద్యా శివానంగా వల్లభా సర్వపాటలా
కులనాథామ్నాయనాథా సర్వామ్నాయనివాసినీ
శృంగారనాయికా చేతి పంచ వింశతి నామభిః ( ఈ నామాలు పఠించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని హయగ్రీవుడు చెప్తాడు)
ఈ విధంగా లలితాదేవి శక్తిసేనతో భండాసురుని వధించాలన్న ఉత్సాహంతో బయలు దేరుతుంది.
(భండసూర వధోద్యుక్తా శక్తిసేనా సమన్వితా)
చక్రరాజ రధేంద్రి అయిన లలితాదేవి కదన రంగానికి బయలు దేరింది.
***
ఆ రథము తొమ్మిది అంతస్థులు కలిగి ఉంటుంది.
అది తొమ్మిది అంతస్థుల రథము. వాటినే నవావరణాలు అంటారు. వాటిలో నాలుగు శివ ఆవరణాలు, ఐదు శక్తి ఆవరణాలు ఉంటాయి. వాటిని చక్రాలు అని కూడా అంటారు.
బిందు......సర్వానందమయ చక్రం
త్రికోణ.....సర్వసిద్ధి ప్రద
అష్ట కోణ.....సర్వ రోగ హర
అంతర్దశార.....సర్వ రక్షక
బహిర్దశర......సర్వార్ధ సాధక
చతుర్దశార.....సర్వసౌభాగ్యదాయక
అష్టదళ.........సర్వ సంక్షోభన
షోడశ దళ......సర్వాశాపరిపూరక
భూపుర త్రయం......త్రిలోక మోహన
శ్రీ చక్ర ప్రధమ ఆవరణ అయిన భూపుర త్రయ త్రిలోక మోహన చక్రంలో
 అధి దేవతగా త్రిపురాదేవి, యోగినీదేవతగా ప్రకట యోగినితో సహా అణిమాది సిద్ధులు, బ్రాహ్మీ మొదలుకొని అష్టమాతృకలు, సర్వసంక్షోభిని మొదలైన దశముద్రా శక్తులు ఉంటాయి.
అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండే,మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వవశంకరీ, సర్వోన్మాదినీ, సర్వమహాంకుశే, సర్వఖేచరీ, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహన చక్రస్వామినీ, ప్రకటయోగినీ
రెండవదైన షోడశ దళ సర్వాశాపరిపూరక చక్రంలో
త్రిపురేశి అధిదేవతగా గుప్తయోగిని యోగినీదేవతగా  కామాకర్షిణీ మొదలగు షోడశ ఆకర్షణా దేవతలు ఉంటారు.
కామాకర్షిణీ, బుద్ధ్యాకర్షిణీ, అహంకారాకర్షిణీ, శబ్దాకర్షిణీ, స్పర్శాకర్షిణీ, రూపాకర్షిణీ, రసాకర్షిణీ, గంధాకర్షిణీ, చిత్తాకర్షిణీ, ధైర్యాకర్షిణీ, స్మృత్యాకర్షిణీ, నామాకర్షిణీ, బీజాకర్షిణీ, ఆత్మాకర్షిణీ, అమృతాకర్షిణీ, శరీరాకర్షిణీ,సర్వాశాపరిపూరక చక్రస్వామినీ, గుప్తయోగినీ,
మూడవదైన అష్టదళ సర్వసంక్షోభణ చక్రం అధి దేవత త్రిపురసుందరి, యోగినీ దేవత గుప్తతరయోగిని తో కూడి అనంగ కుసుమా మొదలుకొని అష్ట దేవతలు ఉంటారు.  ఇంకావుంది...     

No comments:

Post a Comment