Thursday, December 11, 2025

 @ బతికున్నట్టేనా....@

రవ్వంత గాలి పీల్చి 
ఓ గ్లాసుడు నీళ్లు తాగి 
మూడు పటలా తింటున్నావు కదా
నువ్వు బ్రతికున్నట్టేనా? 

*******

ఎప్పుడైనా 
పక్షుల్ని పలకరించావా 
లేలేత చిగురుల సంభాషణ విన్నావా 

పసిపిల్లల 
ముఖాల్లోని కాంతి
నీ హృదయం లోకి ప్రయాణించిందా 

అసలు ....
నువ్వు బ్రతికున్నట్టేనా 

****

రైతు ...
భూమిపై చేస్తున్న 
సౌందర్యాత్మక చేవ్రాలు గమనించావా 

సముద్రాల నుంచి 
వానని మోసుకొస్తున్న 
మేఘాల రాగం ఆలకించావా

మొక్క ...
పుష్పిస్తున్నప్పటి 
పురిటి నొప్పుల చిత్రం 
నువ్వు గీయగలవా

చెప్పూ...
నువ్వు బతికున్నట్టేనా

*******

ఎప్పుడైనా ఎవరికైనా 
హృదయం అందించావా 

బాధతో బరువెక్కిన 
మిత్రుని భుజంపై చేయి వేసి 
బ్రతుకును తేలిక చేసావా 

పక్కింట్లో 
మొన్న మరణించిన మనిషిని 
స్మశానం వరకు సాగనంపావా

అయ్యో .....
నువ్వు బతికున్నట్టేనా

- సుంకర గోపాలయ్య 
('మా నాయిన పాట' నుండి)M

No comments:

Post a Comment