Thursday, December 11, 2025

 చిన్న కథలు - పెద్ద అర్థాలు 
కథ : *ఆంటీ*
✍️ 
డా తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి 
----------------
ఉదయం ఆరు గంటలు కావొస్తున్నది. 
వాకిట్లో మొక్కల వద్ద పాదులు తీస్తూ...అగ్ర కొమ్మలు కత్తరిస్తూ తీరిక లేకుండా కనిపిస్తున్నారు తల్లి ముప్పై ఐదేండ్ల నాగలక్ష్మి... కూతురు పదిహేనేండ్ల శ్రావణి.
ఉన్నట్టుండి -
"ఆంటీ" పిలుపు వినబడింది.
పిలుపుకు తల్లికూతుళ్ళు ఇద్దరూ ఒక్కసారిగా ఎవ్వరన్నట్టుగా వెనక్కి తిరిగి చూసారు.
 
ఎదురుగా - ఇటీవలే పక్కింట్లోకి కొత్తగా అద్దెకు దిగిన సుమారు నలభై ఏండ్ల వయసున్న ఆవిడ నిలబడి ఉంది.
"ఎవ్వరినీ" అన్నట్టుగా తల్లీ కూతుళ్ళ భృకుటి ముడి పడింది.
"ఆంటీ...నా పేరు మంజుల ..మీ పక్కింట్లోకి కొత్తగా వచ్చాము. పరిచయం చేసుకుందామని వచ్చాను..నేను శారీస్ బిజినెస్ చేస్తాను. ఓన్లీ డిజైనర్ శారీస్. మీరు ఒకసారి వచ్చి నేను డిజైన్ చేసిన శారీస్ చూడండి" నాగలక్ష్మిని చూస్తూ చెప్పుకు పోయింది ఆవిడ.
ఆంటీ అనే పిలుపుకు నాగలక్ష్మికి  నచ్చలేదు. తల తిరిగినట్టు అయింది. చికాకు అనిపించింది. అయినప్పటికీ తమాయించుకుంటూ.. ఆమె తనకంటే పెద్దదిగా కనిపిస్తున్నప్పటికీ.." అక్కా అని పిలవండి " అని సూచించి -   సరే తప్పకుండా వచ్చి చూస్తాను" అంది.
"మర్చిపోకండి ఆంటీ" నాగలక్ష్మి సూచనని ఆమె ఏ మాత్రం లెక్క చేయలేదు. 
నాగలక్ష్మికి  కోపం వచ్చింది. కానీ ఏం అనలేక సరే అన్నట్టుగా తలాడిస్తూ తన పనిలో తన మునిగిపోయింది.
*****
సాయంత్రం -
పక్కింట్లో ఉండే తన స్నేహితురాలి కోసం వెళ్ళింది శ్రావణి. అక్కడే మంజుల నిలబడి ఉంది.
"మీ అమ్మ చీరలు చూడ్డానికి రాలేదు" శ్రావణిని చూడగానే గుర్తుకు చేసింది మంజుల.
"అమ్మకు పని ఉంది ఆంటీ" చెప్పింది శ్రావణి.
"ఆంటీనా ? నేను ఆంటీలా వున్నానా అక్కా అని పిలువు" వెంటనే చెప్పింది మంజుల.
ఆ మాటకు శ్రావణి ఆశ్చర్యపోయింది. మంజులను విచిత్రంగా అపాదమస్తకం చూసి ఇంటి లోపలికి నడిచింది.
*****
"కొందరు అంతే బేటా! వాళ్ళకన్నీ విచక్షణలు ఉంటాయి... కానీ తమకి తాము *బాలాకుమారి* అనుకుంటారు..." మంజుల గురించి మాట్లాడుతూ కూతురితో అంటున్నది నాగలక్ష్మి.
"అయినా ఈ ఆంటీ అంకుళ్ళ సంప్రదాయం ఏందీ ? 
తెలిసినోళ్లయితే  వరుసలు పెట్టి పిలుసుకోవాలి... కొత్తోళ్లయితే సారు... మేడంగారు అని పిలుసుకోవాలే" అక్కడే ఉన్న నాగలక్ష్మి భర్త  నలభై ఏండ్ల ఉపేందర్   విసుగ్గా అంటూ ఏదో పని మీద బయటకు నడిచాడు.
అంతలో - 
 చేతిలో సంచితో కాంపౌండ్ లోపలికి వస్తూ కనిపించింది మంజుల.
"అంకుల్ ఆంటీ ఉందా ? "ఉపేందర్ కనబడగానే అడిగింది.
ఉపేందర్ కు దిమ్మ తిరిగిపోయింది. అయినా ఏమీ అనలేకపోయాడు. ఉంది అన్నట్టుగా లోపలికి చేయి చూపిస్తూ తన దారిన తాను వెళ్ళిపోయాడు..
అప్పటికి మంజుల రాకను తల్లీకూతుర్లు గమనించారు.
"ఆంటీ... " పిలుస్తూ ఇంటి లోపలికి నడిచింది మంజుల.
ఆంటీ పిలుపు గురించి ఎప్పటిలా లోలోపల  అసహనం...  అభ్యంతరం... కలిగినప్పటికీ   చిరునవ్వు చిందిస్తూ 
"అక్కా అని పిలవండి" మళ్ళీ సూచించింది నాగలక్ష్మి.
కానీ మంజుల యధావిధిగా నాగలక్ష్మి మాటలు పట్టించుకోలేదు. "'చీరలు చాలా బావున్నాయి ఆంటీ" చెబుతూ వచ్చి అక్కడున్న సోఫాలో కూర్చుని, సంచిలోంచి ఒక్కో చీరలు బయట పెట్టడం మొదలెట్టింది.
అంతలో శ్రావణి స్నేహితురాలు అపర్ణ, ఆ పిల్ల తమ్ముడు వినీల్, వచ్చారు. ముగ్గురూ కలిసి అక్కడక్కడే తిరుగుతూ స్కూల్ ప్రాజెక్టు వర్క్ గురించి  అవి ఇవి చక్కబెట్టుకోసాగారు

మంజుల తన చీరల గురించి చెప్పడం మొదలెట్టింది.
"ఈ చీర ఇక్కత్ పోచంపల్లికి మోడరన్ ఫినిషింగ్ ఇస్తూ తయారు చేసింది ఆంటీ 
"ఈ చీర చూడండి ఆంటీ... ఫాన్సీ జార్జెట్ కు బెనారస్ బోర్డర్ ఇస్తూ కేటలా పీసులా తయారు చేసాను"

నాగలక్ష్మికి కంపరగా ఉంది. ఒకవైపు ఆమె చెప్పింది వింటూ మరోవైపు తనను తాను సంభాళించుకోసాగింది. అట్లా ఎంతోసేపు ఉండలేకపోయింది.కాసేపటి తర్వాత నెమ్మదిగా పెదవి విప్పింది.
"అన్నీ బాగున్నాయి ఆంటీ... కాపోతే రేట్లు చూసి చెప్పండి"
 నాగలక్ష్మి నుండి వెలువడ్డ ఆంటీ అనే పిలుపు మంజులను సూటిగా వెళ్లి తగిలింది. అందుకే ఓ ఐదారు క్షణాలు నాగలక్ష్మిని కన్నార్పకుండా చూసింది.
"చెప్పండి ఆంటీ" మళ్ళీ అంది నాగలక్ష్మి.
అందుకు మంజుల ఇబ్బందిగా ఓ చిరునవ్వు నవ్వి-
"మంజుల అని పిలవండి పర్వాలేదు" అంది.
"మీరు మాత్రం నన్ను అక్క అనే పిలవండి. ఎందుకంటే అక్క అనే పిలుపులో ఎంతో ఆప్యాయత ఉంది... ఆంటీ అంకుల్ అని పిలుస్తుంటే మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది "మొహమాటం లేకుండా వెంటనే చెప్పింది నాగలక్ష్మి.
"సరే.. ఆం... " అంటూ మళ్ళీ ఆంటీ అనబోయి "అక్కా" అంది మంజుల.
సరిగ్గా - 
అదే క్షణంలో... గేటు శబ్దం అయింది. ఎవరన్నట్టుగా బయటకి తొంగి చూసింది నాగలక్ష్మి.
"మా ఆవిడ ఉందా ఆంటీ" గేటు దగ్గరే నిలబడి నాగలక్ష్మి చూడగానే అడిగాడు దాదాపు 50 ఏళ్ల వరకు ఉన్న మంజుల భర్త యుగంధర్.
 "ఓర్నీ నువ్వు కూడా ఇంతేనా" మనసులో అనుకుంటూ వెంటనే ఏం మాట్లాడలేదు నాగలక్ష్మి. కాగా మంజుల మాత్రం అంతలోనే లేచి గుమ్మం దాకా వచ్చి -  "ఆంటీకి చీరలు బాగా నచ్చాయి రేట్లు అడుగుతుంది చెప్పి వస్తాను" అంటూ భర్తకు చెప్పుకుంది .
నాగలక్ష్మికి అరికాలు మంట నెత్తికెక్కినట్టు అయింది. 
యుగంధర్ వెళ్లిపోయాడు.
మంజుల మళ్లీ మాటల్లోకి దిగుతూ... చీరల గురించి మాట్లాడబోయింది.. అంతలో వాళ్ళ ఓనర్ నుండి ఫోన్ వస్తే - " ఓనరాంటీ  నేను నాగలక్ష్మి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను"అని చెప్పుకుంది.
నాగలక్ష్మికి ఈసారి కోపం చికాకు అసహనం వంటి ఏ భావనలు కలగలేదు. కాలనీలో అందరికంటే చిన్నదైన  ఓనర్ పిల్ల ముప్పై ఏండ్ల  యామినిని కూడా ఆంటీ అని పిలుస్తుంటే....ఒక్కటి మాత్రం స్పష్టంగా అర్థమైంది...
"వీళ్లంతా  చికిత్స లేని ఒక రకమైన మానసిక లోపంతో బాధ పడుతున్నారు" అని.

___________________________

No comments:

Post a Comment