Thursday, December 11, 2025

 అవసానాలయం: కర్ణుడి నీచత్వం ఇదే!!!
కర్ణుడి పాత్ర గురించిన రహస్యాలు భీష్మపర్వంలోని చిట్టచివరి అధ్యాయంలో వ్యాసుడు చెబుతాడు. ఎందుకు? ఏమిటి?  ఎవరు? అనే కారణాలు  పక్కన పెడితే కర్ణుడిని అనవసరంగా తెలుగు వారు హీరోను చేశారు. భీష్మపర్వంలోని చివరిదైన ఈ ఒక్క అధ్యాయం చదివితే కర్ణుడు ఎంత దుష్టుడో తెలుస్తుందని ఆంధ్రవ్యాసుల వారు అనేవారు. 

మరణించే వ్యక్తితో ఎలా మెలగాలో తెలియని తీవ్రమైన మనస్సు ఉన్నవాడు కర్ణుడు. మహాభారతంలో కర్ణుడి జీవితంలో మూడు ఘట్టాలు అతి ముఖ్యమైనవి. మొదటిది శ్రీకృష్ణుడి సంవాదం. రెండోది కుంతీ సంవాదం. మూడవది భీష్ముడి అంపశయ్య మీద సంభాషణ. 
ఈ మూడింటిలోనూ చాలా భిన్నత్వం ఉంటుంది. శ్రీకృష్ణుడితో సంభాషణలో రాజకీయాలు ఉంటే, కుంతీ సంవాదంలో భావోద్వేగాలు ఉంటాయి. అందరూ తేలిగ్గా చూసిన భీష్ముడి సంవాదంలో ఏం ఉందో ఆంధ్రవ్యాసుల వారి దృష్టితో చూద్దాము. 
చాలా మందికి తెలియని సంగతులు భారతంలో చాలా ఉన్నాయి. వీటిలో అధికభాగం కర్ణుడికి లేనిపోని  మంచితనం ఆపాదించడం కోసం నిజాలు తొక్కిపెట్టినవే అధికం. ఉన్నదాన్ని వక్రీకరించడం, లేని దాన్ని జోడించడం చేసి మహాభారతాన్ని ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు చెబుతున్నారు. వ్యాసమహర్షి ఏం చెప్పాడో ఉన్నది ఉన్నట్టు చెప్పేవారు ఎవరూ లేరు. వ్యాసుడు చెప్పింది చెప్పినట్టుగా చదివి, దాన్ని అర్థం చేసుకొని, తరువాత ఏది నిజమో చదువరులు నిర్ణయించుకోవాలి. 
అయితే సంస్కృతాన్ని నాశనం చేసి, జనాలను వెర్రిపప్పలను చేసిన ప్రభుత్వాల పుణ్యమా అని విపరీతవాదనలతో రాజకీయపబ్బాలు గడుపుకొనేవారు, పుస్తకాలు అమ్మి సొమ్ము చేసుకొనేవారు, అభ్యుదయులం పేరుతో అవార్డులు గుంజుకొనేవారు అధికమయ్యారు. వీరికి వామపక్షులు, ఆంగ్లరాబందులు కూడా తోడయ్యాయి. 
 అర్జునుడు, కర్ణుడు బద్ధ శత్రువులు అని అనుకుంటారు. కానీ అర్జునుడు అసలు కర్ణుడిని లెక్క చేయడు. కర్ణుడిని అసహ్యించుకున్న వారిలో భీష్ముడు ప్రథముడు. రెండవ వాడు ద్రోణాచార్యుల వారు. చాలా మంది మహాభారతం కురుపాండవులు మధ్య జరిగింది అనుకుంటారు. అది పైపైన కనిపించే నిజం.  
అసలు భారతంలో జరిగిన యుద్ధం పాండవులు - పాండవులు మధ్యనే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కర్ణుడికీ పాండవులకూ మధ్యన జరిగిన యుద్ధమే మహాభారతం. ఎందుకంటే కర్ణుడు అనేవాడు లేకపోతే కౌరవులు కుక్కిన పేనులా పడి ఉండేవారు. భీముడికి సమాన బలుడు దుర్యోధనుడు. అర్జునుడికి పోటీ తన పరివారంలో ఎవరూ లేరని కాళ్ళు మునగదీసుకు కూర్చున్న దుర్యోధనుడికి వెన్నుదన్నిచ్చి సర్వ నాశనానికీ కారణం అయిన వాడు కర్ణుడు. ఇదంతా భీష్ముడికి తెలుసు. కనుకనే దుర్యోధనుడి కంటే ఎక్కువగా కర్ణుడినే  భీష్ముడు అసహ్యించుకుంటాడు. దుర్యోధనుడు కూడా నిండు సభలో పలకలేని ఎన్నో దారుణమైన మాటలు కర్ణుడు పలుకుతాడు. 
ద్రౌపదిని అవమానిస్తూ వస్త్రాపహరణం సమయంలో ‘‘ప్రతీ స్త్రీకీ ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలు ఉండాలని కోరుకుంటుంది‘‘ అని అంటాడు. 
 దుర్యోధనుడి మెప్పుకోసం ఇలాంటి పనులు ఎన్నో చేశాడు. కనుకనే భీష్ముడు, ద్రోణుడు కర్ణుడిని అసహ్యించుకుంటారు. అంతేకాదు. యుద్ధం అనివార్యం అయ్యాక కౌరవ సేనలో  భీష్ముడికి సర్వసైన్యాధ్యక్షపదవి ఇచ్చి సైన్యంలో హోదాలు పంచేపని అప్పగిస్తారు. రథులు, అతిరథులు, మహారథులు అనే హోదాల్లో  కర్ణుడిని అర్ధ రథుడు అని భీష్ముడు సహేతుకంగా పేర్కొంటాడు. అంటే చిట్టచివరి హోదాలో సగం అన్నమాట. పాండవ సైన్యంలో రేలంగి లాంటి ఉత్తరకుమారుడు రథుడు. అతడి కంటే తక్కువ వాడు అన్నాడన్నమాట. 
(అభిశాపాచ్చ రామస్య బ్రాహ్మణస్య చ భాషణాత్  
కరణానాం వియోగాచ్చ తేన మేఽర్థరథో మతః)
భీష్ముడు ఈ మాట అనడం ఏమిటి వెంటనే ఆయన ప్రక్కనే ఉన్న ద్రోణాచార్యులవారు ‘‘ముమ్మాటికీ నిజమే.  వాడు అర్థరథుడే‘‘ అంటారు.
నిజానికి కర్ణుడు ఇద్దరు మహారథులకు సమానుడు. కానీ శాపాలు ఉంటాయి. వీరి మాటలతో కర్ణుడికి మహాకోపం వచ్చి భీష్ముడు చచ్చేవరకూ తాను యుద్ధరంగంలోనే అడుగుపెట్టనని అంటాడు. 
(నాహం జీవతి గాంగేయే యోత్స్యే రాజన్కథంచన।
హతే భీష్మే తు యోద్ధాఽస్మి సర్వైరేవ మహారథైః ॥)
అంతేకాదు. ఒక వేళ పాండవులను భీష్ముడే చంపేస్తే తాను సంన్యాసం తీసుకొని అడవులకు వెళతానని అంటాడు. అలాకాక పాండవులే భీష్ముడిని చంపేస్తే తాను ఒకే రథంతో యుద్ధం చేసి పాండవులను అందరినీ చంపేస్తానని శపథం చేసి వెళ్ళిపోతాడు. (ఆ రథం కారణంగానే చచ్చిపోతాడు.)  మొత్తం 18 రోజుల యుద్ధంలో ఇంతా చేసి కర్ణుడు అసలు 10 రోజులు యుద్ధరంగంలో అడుగే పెట్టలేదు. భీష్ముడు కిందపడ్డాక  11వ రోజు అడుగు పెడతాడు.
నిజానికి యుద్ధంమధ్యలో ఒక రోజురాత్రి శకుని, దుర్యోధనుడు కలిసి   కర్ణుడితో తమ సైన్యాన్ని అర్జునుడు నాశనం చేస్తున్నాడు. తాను రోజురోజుకూ బలహీనుడినైపోతున్నాను. ఇప్పటికైనా ప్రతిజ్ఞవిడిచి యుద్ధానికి రా అని పిలుస్తారు. కానీ కర్ణుడు ఇంకా భీష్ముడు బ్రతికే ఉన్నాడు కనుక రానని అంటాడు.  అలాగే భీష్ముడు పడిపోయాక, 11వ రోజున యుద్ధభూమిలోకి అడుగుపెడతాడు.
ఈ పదకండు రోజులూ యుద్ధం అయితే చేయడు కానీ కురుక్షేత్రానికి మాత్రం వచ్చి యుద్ధం ఎలా జరుగుతోందో గమనిస్తూ ఉంటాడు. యుద్ధం మొదలు కాబోయే ముందు పాండవ సైన్యాన్ని ఎవరు ఎన్ని రోజుల్లో నాశనం చేయగలరు అని దుర్యోధనుడు ప్రశ్నిస్తాడు. ద్రోణుడు ముసలి వాడ్ని కనుక నాకు నెల రోజులు పడుతుంది అంటాడు. అశ్వత్థామ 10 రోజులు అంటాడు. కర్ణుడు 5 రోజుల్లో నాశనం చేస్తాను అంటాడు. పక్కనే ఉన్న ద్రోణుడు పకపకా నవ్వి‘‘ యుద్ధానికి వస్తావు కదా, అర్జునుడు ధనుర్బాణాలు తీసుకొని శ్రీకృష్ణుడు తోలుతున్న రథంతో ఎదురు వచ్చాక నీకు తెలుస్తుందిలే‘‘ అంటాడు. 
ఇంత తీవ్రమైన భేదాలు ద్రోణ,భీష్మ - కర్ణులకు ఉంటాయి. 
అవసానకాలం గురించి మహాభారతంలో వర్ణించిన విశేషాలు పరిశీలిస్తున్న తరుణంలో మరణశయ్యపై ఉన్న భీష్ముడి ఘట్టం చాలా ముఖ్యమైన అధ్యాయం. కనుక కూలంకషంగా తెలుసుకుందాం. 
************
భీష్ముడు తన చావు చూసైనా పాండవులను చంపలేమని, వారిని జయించడం సాధ్యం కాదని తెలుసుకొని, బంధుమిత్ర సపరివారంగా, ఇతర రాజులతో సహా బ్రతికిపొమ్మని  దుర్యోధనుడిని బ్రతిమలాడుతాడు. తన మాటలు నమ్మమని, చనిపోయే ముందు సత్యం చెబుతున్నానని, నీతోపాటు సమస్త రాజవంశాలనూ నాశనం చేయవద్దని, పాండవులతో శాంతి చేసుకోమని, హితవు చెబుతాడు. దుర్యోధనుడు పెడచెవిన పెట్టి వెళ్ళిపోతాడు. భీష్ముడు బాధతో కళ్ళు మూసుకుని అంపశయ్య మీద యోగమార్గంలోకి వెళ్ళిపోతాడు. 
అప్పటి వరకూ అక్కడే ఉన్న రాజులు అంతా 11వ రోజు యుద్ధానికి సన్నద్ధం కావడానికి తమ గుడారాలకు వెళ్ళిపోతారు. 
భీష్ముడు మరణశయ్యమీద ఉన్నాడని కర్ణుడికి తెలిసి గుండెల్లో భయం ప్రవేశిస్తుంది. అందరూ వెళ్ళిపోయాక కర్ణుడు ఒంటరిగా భీష్ముడి దగ్గరకు వస్తాడు. 
మౌనంగా ఆయనకు  నమస్కరిస్తూ కన్నీళ్లతో, గొంతు వణుకుతుండగా భీష్ముడి పాదాల మీద పడతాడు. 
‘‘ఓ కురు శ్రేష్ఠా!  ఇప్పటి వరకూ  ద్వేషంతోనే నీవు చూసిన రాధ కుమారుడిని, నేను వచ్చి   నీ కళ్ళ ముందు ఉన్నాను‘‘ అని అంటాడు. 
ఈ మాటలు విన్న భీష్ముడు తన యోగావస్థలో నుంచీ మెల్లగా బయటకు వస్తూ మృదువుగా కనురెప్పలు తెరచి తన చుట్టూ ఉన్న రక్షక భటులను వెళ్ళిపోమంటాడు. అందరూ వెళ్ళిపోయి కేవలం వారిద్దరే మిగులుతారు. ఎవరూ లేరని తెలుసుకొని వెంటనే కొడుకును కౌగిలించుకున్న తండ్రిలా కర్ణుడిని ఒక చేత్తో అక్కున చేర్చుకున్నాడు. కంఠం నుంచీ అత్యంత ప్రేమ వర్షిస్తుండగా మెల్లగా మాట్లాడతాడు.
‘‘రా, రా, నాయనా. నీవ్వు నిరంతరం నన్ను సవాల్ చేసే నా ప్రత్యర్థివి. చావు కోసం ఎదురు చూస్తున్న నన్ను చూడడానికి  నీవు నా దగ్గరకు రాకుండా ఉంటే నిస్సందేహంగా తప్పు చేసినవాడివి అయ్యేవాడివి. నీవు కుంతీ సుతుడవు. రాధేయుడవు కావు. అధిరథుడు నీ తండ్రికాదు. ఇదంతా నాకు నారదుడు చెప్పాడు. వ్యాసుడు కూడా చెప్పాడు. 
సందేహం లేకుండా ఇదంతా నిజమే.  
న చ ద్వేషోస్తి మే తాత త్వయి సత్యం బ్రవీమి తే (నిజం చెబుతున్నాను. నాకు నువ్వంటే ద్వేషం లేదు నాయనా) 
నీకున్న  తీవ్రత్వాన్ని తగ్గించడానికే నేను  పరుషమైన పలుకులు మాట్లాడేవాడాను. నువ్వు నిష్కారణంగా పాండవుల మీద చెడునే ఎప్పుడూ మాట్లాడే వాడివి.  నువ్వు ప్రపంచంలోకి పాప సంభవుడవుగా వచ్చావని పదేపదే రెచ్చగొట్టే నీచుల సంపర్కం వల్ల నీవు ఉత్తములను ద్వేషిస్తూ వచ్చావు. మనుషుల బుద్ధి కూడా నీచుల సాంగత్యం వల్ల ఈర్ష్య వల్ల ద్వేషించేవారిగా మారిపోతుంది. కనుకనే నేను నిన్ను తూలనాడాల్సి వచ్చింది. నీ వీరత్వం మీద నాకు అనుమానం లేదు. దానాలు చేయడంలో, నీ బ్రాహ్మణ ప్రియత్వం మీద సందేహంలేదు. 
నీకు సాటి రాగలిగిన వాడు ఎవడూ లేడు. అర్జునుడూ, కృష్ణుడు కూడా నీకు సాటిరాలేరు. కానీ కులభేదభయం చేత నేను కఠినంగా పలకాల్సి వచ్చింది. సూర్యనందనా పాండవులు నీ సోదరులు.  నువ్వు ఏం చేస్తే నేను సంతోషిస్తానంటే,  పాండవులతో నువ్వు  ఏకం అయినప్పుడు చాలా సంతోషిస్తాను. ఈ నరమేధం నాతో అంతకానీ. భూమండలం మీద ఉన్న రాజులందరూ ప్రాణాలతో ఉండనీయి‘‘ అని కోరాడు.
కర్ణుడు ఆయన చెప్పింది అంతా విని ‘‘ నేను కుంతీసుతుడనే, సూత సుతుడను కాను. నన్ను కుంతీదేవి విడిచిన తరువాత సూతుడు పెంచాడు. నేను దుర్యోధనుడు ఇచ్చిన సంపదను అనుభవించాను. ఇప్పుడు అతడి నమ్మకాన్ని వమ్ము చేసే సాహసం చేయలేను. వాసుదేవుడు పాండవుల వైపు ఏ విధమైన దృఢమైన మద్దతుతో ఉన్నాడో నేను కూడా నా భార్యా పిల్లలూ, నా సంపద, నా పరివారం, నా కీర్తీ, నా శరీరం కూడా దుర్యోధనుడికే అర్పించాను. ఇక చావంటావా? క్షత్రియుడు రోగంతో చచ్చిపోకూడదు. సుయోధనుడి కోసమే నేను పాండవులను అవమానిస్తూ వచ్చాను. ఈ గతి దుర్గతికి పోతోందని నాకు తెలుసు. దీన్ని ఆపడం ఎవరి వల్లా కాదని కూడా తెలుసు. భూమి నాశనానికి  శకునాలు చూపిస్తున్నాయని  మీరే అన్నారు. నాకు తెలుసు అర్జునుడు కృష్ణుల జంటను జయించడం భూమి మీద ఎవరి వల్లా కాదని. (విజయిష్యే రణే పాండూనితి మే నిశ్చితః మనః )అయినా వారితో పోరుకే నేను సిద్ధం. నేను యుద్ధంలో అర్జునుడిని పడగొట్టాలి, ఇదే నా లక్ష్యం. నేను పోరాడతాను. ఇది నా తుది నిర్ణయమైనా నిన్ను నేను క్షమించమని కోరుతున్నాను. నేను తమ పట్ల ఏమైనా కఠినమైన పలుకులు పలికినా, చేయరాని పనులు కోపవశాత్తూ చేసినా, చపలత్వంతో చేసినా నన్ను క్షమించు‘‘ అని కోరాడు.
దీనికి భీష్ముడు ‘‘సరే దారుణమైన శత్రుత్వంతో ఉన్న ఈ యుద్ధాన్ని నువ్వు ఆపలేకపోతే పోరాడడానికే అనుమతిస్తున్నాను. స్వర్గం కోరి యుద్ధం చెయ్యి (యుధ్యస్వ స్వర్గకామ్యయా). క్రోథం అహంకారం లేకుండా లేకుండా యథాశక్తి యథోత్సాహంతో నీ రాజుకు సేవచేసుకో. క్షత్రియులకు ధర్మయుద్దం కంటే సంతోషమైంది లేదు. నేను చాలా కాలం పెద్ద ఎత్తున శాంతి కోసం ప్రయత్నించాను కానీ ఆ ప్రత్నాలు నా వల్ల సఫలం కాలేదు. నీతో సత్యం చెబుతున్నాను కర్ణా. న చైవ శకితః కర్తుం, యతో ధర్మస్తతో జయః‘‘ అని భీష్ముడు అన్నాడు. 
కర్ణుడు ఆయనకు  మరోసారి అభివాదం చేసి రథం ఎక్కి తొలిసారి యుద్ధంలో పాల్గొనడానికి 11 వ రోజున దుర్యోధనుని గుడారానికి వెళ్ళాడు. 
********
కుంతీదేవితో జరిగిన సంవాదం, శ్రీకృష్ణుడితో జరిగిన చర్చలు గమనిస్తే భీష్ముడితో జరిగిన చరమకాలసంభాషణ చాలాచిన్నది. కానీ ఆ రెండింటితో పోలిస్తే ఇది చాలా ముఖ్యమైంది. కర్ణుడిలోని నీచత్వం బయటపెట్టే సంభాషణ ఇది. 
ఆధునిక కాలంలో అవసానసేవలను హాస్పీస్ రూపంలో ఆధునిక వైద్యులు అందిస్తున్న విధానాన్ని పరిశీలించడానికి భీష్మపర్వంలోని ముఖ్యంగా ఈ రెండు అధ్యాయాలు తీసుకున్నాం. నిజానికి భీష్ముడు అప్పుడే చనిపోలేదు. మహాభారతం మొత్తం మీద అతిపెద్ద పర్వమైన శాంతిపర్వం మొత్తం భీష్ముడిదే. అందులోనే విష్ణుసహస్రనామావళి ఉంది. అంత్యకాలంలో భీష్ముడు చేసిన ముకుందస్తోత్రరాజం ఉంది. ఈ పర్వం పరిశీలిస్తే మనం మరిచిపోయిన మానవత్వం గుర్తుకు వస్తుంది. ఒకప్పటి హిందువులు ఎంత ఉన్నతులో, నేటి ఆంగ్ల విద్యాపిశాచపీడితులో తెలుస్తుంది. శాంతి పర్వంలో భీష్ముడిని చూడడానికి వెళ్ళిన శ్రీకృష్ణుడు ‘‘తాతా రాత్రి నీకు నిద్ర సరిగ్గాపట్టిందా?‘‘ అని అడుగుతాడు. నేడు ఆసుపత్రికి పలకరింపులకు వెళ్ళేవారు ఎంతమంది ఈ విధమైన ప్రశ్నలు వేస్తున్నారో గమనించుకోండి. 
జనమేజయుడు అద్భుతమైన ప్రశ్నవేస్తాడు. భీష్ముడు ఒంటినిండా బాణాలు గుచ్చుకొని మరణవేదనల పడుతున్నా వాటిని ఏ యోగశక్తి ద్వారా భరించాడు అని ప్రశ్నిస్తాడు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. నేడు అమెరికా వైద్యులు కూడా పాలియేటివ్ కేర్ లో యోగా థెరపీ ద్వారా నొప్పి తగ్గించే విధానాలు అవలంబిస్తున్నారని తెలిసి ఆశ్చర్యం వేస్తోంది. 
అన్నిటికీ మించి యుద్ధం ముగిసి ధర్మరాజు రాజు అయ్యాక శ్రీకృష్ణుడు అద్భుతమైన సలహా ఇస్తాడు. భీష్ముడు ఇంకా శరశయ్య మీద బ్రతికే ఉన్నాడు. ఆయన దగ్గర సకల వేదసారం ఉంది వెళ్ళితెలుసుకో అని అంటాడు. ధర్మరాజు వెళ్ళి తన ప్రశ్నలతో సకల శాస్త్రాల సారాన్ని భీష్ముడి నుంచీ తెలుసుకుంటాడు. ఆ రోజున ధర్మరాజు ప్రశ్నించకుంటే మనకు విష్ణుసహస్రనామ వచ్చేది కాదు. పరిపూర్ణ హిందువు కావాలంటే వేదాలు చదవక్కర్లేదు. యజ్ఞాలు చేయనక్కర్లేడు. 
గంగా నది నీళ్ళు మూడు గుక్కలు తీసుకొని, భగవద్గీతలో కనీసం పావు శ్లోకం అయినా చదివి, కనీసం మూడు నామాలైనా విష్ణుసహస్రనామావళిలో చదువుకుంటే చాలు. అటువంటి వాటిలో రెండు భీష్ముడికే చెందినవి. ఒకటి గంగ, రెండు విష్ణుసహస్రనామావళి.
ఆంధ్రవ్యాసుల వారు ఇదే చెప్పేవారు. ఆసుపత్రులలో ఉన్న బంధువులను చూడడానికి వెళ్ళడం అంటే ఒక పిక్ నిక్ ప్రోగ్రాం గా మారిందని విమర్శించేవారు. నేడు వృద్ధాశ్రమాల్లో దిక్కులేని చావు చస్తున్న వారి దగ్గర జీవిత సారం ఉంటుంది. వారు జీవితాంతం వరకూ సంపాదించిన అనుభవాల సారం ఉంటుంది. దానిని మించిన ఆధునికవిజ్ఞాన శాస్త్రం మరొకటి లేదు. తాతా బాగున్నావా అని ఆప్యాయంగా పలకరించితే వారు అందించడానికి సిద్ధంగా ఉంటారట. కానీ పశువుల్ని కబేళాలకు తోలుతున్నట్టు మానవసంబంధాలు మారిపోయాయని ఆంధ్రవ్యాసుల వారు విమర్శించేవారు. 
సామాజిక మాధ్యమానికి ఉన్న పరిమితుల కారణంగా శాంతి పర్వం మొత్తం ఆంధ్రవ్యాసుల వారు విశ్లేషించినది వ్రాయలేము కనుక కేవలం ఈ రెండు అధ్యాయాలు రేపు ఆధునిక వైద్యవిధానంలో హాస్పీస్, పాలియేటివ్ కేర్ కోణంలో విశ్లేషిద్దాము.    
మహాభారతంలో శరశయ్యఘట్టం ఆధునిక వైద్య ప్రపంచం ఎలా అర్థం చేసుకుందో తెలుసు కోవడానికి రేపటి దాకా ఆగండి.
అవసానాలయాలలో మరణం కోసం వేచి చూస్తూ కేన్సర్ పేషంట్లు ఉన్నారు. వారిని దేవతలు సంరక్షిస్తున్నారు. వారికి మతం లేదు. కులం లేదు. వారికి కేవలం చావు మాత్రమే సత్యం.

No comments:

Post a Comment